పెనుగంచిప్రోలు: బ్లేడ్ బ్యాచ్ దాడిలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన స్థానిక మునేరు అవతల మామిడి తోటలో శుక్రవారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం, వడ్లమూడి గ్రామానికి చెందిన పాల పోలురాజు తన బంధువులతో కలిసి శ్రీతిరుపతమ్మ వారి చిన్న తిరునాళ్లకు వచ్చారు. అందరూ మునేరు అవతల మామిడి తోటలో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి 12–30 గంటల నుంచి ఒంటిగంట సమయంలో భార్యతో ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చిన అతనిని గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నెట్టటంతో కింద పడిపోయాడు. ఈ క్రమంలో తన చేతికి ఉన్న బ్రాస్‌లెట్, బంగారు గొలుసు ఇవ్వమన్నాడు. ఇవ్వకపోవటంతో బ్లేడ్‌తో గొంతు కింద, తలపై దాడి చేసి గాయపరిచాడని పోలు రాజు తెలిపాడు. దాడి చేసిన వ్యక్తిని బలవంతంగా నెట్టటంతో పారిపోయాడన్నారు. తరువాత తన వారికి చెప్పటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తికి తొలుత 108 వాహనంలో తిరునాళ్ల వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరం వద్ద, అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. పోలురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అర్జున్ తెలిపారు.


