ఘాట్‌రోడ్డుపై నో పార్కింగ్‌ జోన్‌ ! | - | Sakshi
Sakshi News home page

ఘాట్‌రోడ్డుపై నో పార్కింగ్‌ జోన్‌ !

Mar 11 2026 8:56 AM | Updated on Mar 11 2026 8:56 AM

● కనకదుర్గనగర్‌ వైపు అధికారుల చూపు ● క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌, ఆలయ ఈవో

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి ఘాట్‌రోడ్డులో వాహనాల పార్కింగ్‌ నియంత్రణకు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు, దుర్గగుడి ఈవో శీనానాయక్‌ ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు సోమవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఘాట్‌రోడ్డును నో పార్కింగ్‌ జోన్‌గా ప్రకటించే అవకాశాలున్నట్లు అధికారుల పర్యటనలో తేటతెల్లమైంది. దుర్గగుడిపై నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవానికి హోంమంత్రి అనిత హాజరైన రోజున ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్‌ వద్ద మంత్రి కాన్వాయ్‌ సుమారు పది నిమిషాల పాటు నిలిచిపోయింది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సైతం వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అధికారులు పరిశీలన..

ఈ నేపథ్యంలో సోమవారం సీపీ రాజశేఖరబాబు, ఏడీసీపీ జి.రామకృష్ణ, వెస్ట్‌ ఏసీపీ దుర్గారావులతో పాటు ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ ఓం టర్నింగ్‌ నుంచి ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రం వరకు ఉన్న వాహనాల పార్కింగ్‌ను పరిశీలించారు. దేవస్థాన భద్రతా, ఘాట్‌రోడ్డుపై వాహనాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆలయ అధికారులతో చర్చించారు. ఘాట్‌రోడ్డుపైకి ఎవరి వాహనాలు పడితే వారివి అనుమతించకుండా ప్రోటోకాల్‌ ఉన్న వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు. అంతకు ముందు సీపీ రాజశేఖరబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement