నాణ్యత లేని గుడ్లతో నిండా మునిగిన పట్టు రైతులు రెండేళ్లలో 80 నుంచి 12కు చేరిన రైతుల సంఖ్య ‘చల్లపల్లి’లో కనుమరుగవుతున్న పట్టు పరిశ్రమ
యాజమాన్య పద్ధతులే కారణం
చల్లపల్లి: కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలివోలు గ్రామానికి చెందిన చీడేపూడి లంకలో సొసైటీ కింద దళితులు పొలాలు సాగుచేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 80 మంది రైతులు 92 ఎకరాల్లో పట్టు పురుగుల పెంపకాన్ని చేసేవారు. రూ.15వేల నుంచి రూ.20వేల పెట్టుబడితో కేవలం రెండు నెలల వ్యవధిలో ఎకరాకు రూ.50వేల నుంచి రూ.70వేల వరకూ లాభాలు పొందేవారు. రెండేళ్లుగా సంబంధిత శాఖ అధికారులు ప్రయివేటు వ్యక్తుల నుంచి పట్టు గుడ్లను కొని సరఫరా చేయడంతో నాణ్యత లోపించి పట్టు గూళ్లు తయారు కాకముందే పురుగులు చనిపోతున్నాయని ఈ ప్రాంత రైతులు వాపోతున్నారు. మార్కెట్‌లో వీటిని ఎవరూ కొనకపోవడంతో తీవ్రంగా నష్టపోయినట్లు చెబుతున్నారు.
తగ్గుతున్న సాగు
ఈసారైనా లాభాలు రాకపోతాయా అని రైతులు ఆశపడటం, ఎన్నిసార్లు చెప్పినా అధికారులు అవే నకిలీ గుడ్లను పంపించడంతో రెండేళ్లలో ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకూ నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయామని రైతులు వాపోతున్నారు. క్రమంగా పట్టుసాగుచేసేవారి సంఖ్య రెండేళ్లలో 80 నుంచి 12 మంది రైతులకు చేరింది. పట్టు సాగుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ పూర్తిగా అంతరించిపోయినట్లేనని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ స్పందన లేక, అధికారుల నిర్లక్ష్యం కారణంగానే పట్టుపరిశ్రమ ఈ దుస్థితికి చేరిందని ఆరోపిస్తున్నారు.
లాభాలతో కళకళలాడుతుండే పట్టు పరిశ్రమ రెండేళ్లుగా వెలవెలబోతోంది. అధికారులు నాణ్యతలేని పట్టు గుడ్లును సరఫరా చేయడం, గూళ్లు తయారయ్యే దశలో పురుగులు చనిపోవడంతో ‘చల్లపల్లి’ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు తరచూ.. అవే గుడ్లను సరఫరా చేయడంతో రైతులు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. చివరికి పట్టు పురుగుల పెంపకంపై రైతులకు ఆసక్తి తగ్గుతోంది.
నాణ్యతలేని పట్టు గుడ్లు ఇస్తున్నామనేది రైతుల అపోహ మాత్రమే. ఆరోగ్యకరమైన ఆహారం అందించకపోవడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడంతో పట్టు పురుగులు చనిపోతున్నాయి.
–ఐ.శ్రీనివాసరావు,
ఉమ్మడి కృష్ణాజిల్లా సెరికల్చర్ అధికారి


