ఓపెన్‌ డీల్‌! | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ డీల్‌!

Mar 4 2026 7:17 AM | Updated on Mar 4 2026 7:17 AM

తొలి రోజే దందా బట్టబయలు

ఒకరి బదులు మరొకరు ‘ఇంటర్‌’ పరీక్షలు రాయడానికి ఒప్పందం పాస్‌ చేయిస్తామంటూ అభ్యర్థుల నుంచి నిర్వాహకుల వసూలు తొలిరోజే ముగ్గురిని పట్టుకున్న అధికారులు

అధికారుల హస్తం!

ఇంటర్‌ ఓపెన్‌ పరీక్షల్లో కొన్ని స్టడీ సెంటర్ల నిర్వాహకులు దందాకు పాల్పడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సెంటర్ల నిర్వాహకులు పరీక్షలు పాస్‌ చేయిస్తామంటూ ‘డీల్‌’ కుదుర్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి బదులు మరొకరిని పరీక్షలు రాయించడానికి పంపుతున్నారు. దీనికి నిదర్శనం పరీక్షల మొదటి రోజే అధికారులు ముగ్గురిని పట్టుకోవడం. అక్రమార్కుల దందా బట్టబయలైనా సంబంధిత శాఖ అధికారుల్లో స్పందన కానరావడం లేదు. దీనిలో ఉన్నతాధికారులకూ భాగముందనే ఆరోపణలు వస్తున్నాయి.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇంటర్‌ ఓపెన్‌ పరీక్షల్లో పలు స్టడీ సెంటర్ల నిర్వాహకులు ‘డీల్‌’ కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహిస్తున్న ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు పలు స్టడీ సెంటర్లు ‘ఓపెన్‌’గా దందాకు పాల్పడుతున్నాయి. లక్షలాది రూపాయలను దండుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. మాస్‌ కాపీయింగ్‌, ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాసేందుకు నిర్వాహకులు ఒప్పందాలు కుదర్చుకొని లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి దందాలకు సంబంధించి పలు స్టడీసెంటర్ల నిర్వాహకులు బహిరంగంగానే వీటిపై డీల్స్‌ మాట్లాడుకొని వసూళ్లకు తెగిస్తున్నారని పలువురు విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నెల 2వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రారంభమయ్యాయి. 13వ తేదీ వరకూ జరుగుతాయి.

జిల్లాలో పరీక్ష రాస్తున్న 1,288 మంది..

ఇంటర్‌ ఓపెన్‌ కోర్సులకు ఎన్టీఆర్‌ జిల్లాలో ఈ ఏడాది సుమారుగా 1,288 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. వీటికి సంబంధించి జిల్లాలో 11 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రధానంగా జిల్లాలో సుమారుగా 30కు పైగా వివిధ స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా పరీక్షలకు హాజరుకావాలని భావించే విద్యార్థులు అధిక శాతం మంది ఆయా స్టడీ సెంటర్లను ఆశ్రయించి డబ్బులు చెల్లిస్తుంటారు. వాటి నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి అడ్మిషన్లు కడుతుంటారు. స్టడీసెంటర్లు తప్పనిసరిగా తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడా పూర్తి స్థాయిలో తరగతులు జరిగిన దాఖలాలు లేవు.

పాస్‌ గ్యారెంటీ పేరుతో దందా..

ఇంటర్మీడియెట్‌ పాస్‌ గ్యారెంటీ పేరుతో ఆయా స్టడీ సెంటర్ల నిర్వాహకులు కొందరు.. అధికారులతో కుమ్మకై దందాలకు పాల్పడుతున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకొని కొన్ని సబ్జెక్ట్‌లు రాయకుండా పాస్‌ చేయిస్తామని, మీకు బదులు వేరే వ్యక్తులతో పరీక్ష రాయిస్తామంటూ డీల్‌ కుదుర్చుకొని అక్రమ దందాలకు పాల్పడుతున్నారు. వీరు కొన్ని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతుంటారని ప్రచారం జరుగుతోంది. నగరానికి చెందిన ఒకరిద్దరు ప్రముఖ స్టడీ సెంటర్ల నిర్వాహకులు, చక్రం తిప్పుతుంటారని, లక్షలాది రూపాయాలు వసూళ్లకు పాల్పడటంతో పాటు అధికారులను సైతం ప్రభావితం చేస్తుంటారని వినవస్తోంది.

ఇలాంటి దందాలకు కొన్ని ప్రత్యేక కేంద్రాలు

ఈ పరీక్షల దందాకు ప్రత్యేకంగా కొన్ని కేంద్రాలను అక్రమార్కులు ఎంచుకుంటున్నారు. విజయవాడ నుంచి 50, 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆ కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయిస్తుంటారు. విజయవాడకు చెందిన పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నందిగామ, జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసే కేంద్రాలకు హాజరవుతుంటారు. వీటిలో అక్రమాలు జరుగుతాయనే ప్రచారం ఉంది. దీన్ని తొలి రోజు జరిగిన పరీక్ష నిజం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ఏడాది ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలను నాటి డీఈవో చాలా వరకూ నిలువరించారు. జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల్లో ఉన్న కేంద్రాల్లో ఏదో ఒక బృందం తనిఖీ చేసే విధంగా చూడటంతో పరీక్షలు సజావుగా జరిగాయి. దాదాపు పరీక్ష ఫలితాలు పది శాతం కన్నా తక్కువ వచ్చాయంటే ఎగ్జామ్స్‌ చక్కగా జరిగినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ ఏడాది అధికారులు మారడంతో అక్రమార్కులు తమ దందాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా తొలి రోజు ముగ్గురు బయట వ్యక్తులు లోపలకు వచ్చి పరీక్ష రాస్తున్నారంటే ఆ శాఖలోని అధికారుల హస్తాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తొలి రోజు నిర్వహించిన ఇంగ్లిష్‌ పరీక్షకు సంబంధించి అక్రమార్కులు చేపట్టిన దందా బట్టబయలైంది. పరీక్ష రాయాల్సిన ముగ్గురు అభ్యర్థుల కోసం వేరే వ్యక్తులు హాజరు కావడం జిల్లాలో సంచలనం సృష్టించింది. నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం రూమ్‌ నంబర్‌ నాలుగులో పరీక్ష రాస్తున్న విద్యార్థిని గమనించిన ఇన్విజిలేటర్‌ అనుమానంతో ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో అప్పుడే వెళ్లిన ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అతనిని పరిశీలిచి అసలైన అభ్యర్థి కాదని నిర్ధారించింది. అతనిపై నందిగామ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేసి పోలీసులకు అప్పగించారు. అలాగే నందిగామలో శ్రీ విద్య ఉన్నత పాఠశాలలో ఇద్దరు అభ్యర్థుల బదులు వేరే వ్యక్తులు పరీక్ష రాయడానికి రావడంతో పరీక్ష గదిలో ముందుగానే పసిగట్టి వారిని నిలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement