‘సాంకేతిక’తో భక్తులకు భద్రత
కుంభాభిషేకాన్ని
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో ఈ నెల 6 నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్న కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా, అద్భుతంగా నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కుంభాభిషేకం మహోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లపై మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సమన్వయ సమావేశం జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, ఆలయ ఈవో వీకే శీనానాయక్ తదితరులు సమావేశంలో కుంభాభిషేక కార్యక్రమాలపై చర్చించారు.
సామాన్యు భక్తులకు పెద్ద పీట
కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ కుంభాభిషేకానికి మొదటి రెండు రోజులు లక్ష మంది చొప్పున, మూడో రోజున 1.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలన్నారు. క్యూతో పాటు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన పాయింట్లలో తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, శానిటేషన్ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగతో పాటు పులిహోర వంటివి అందించాలని ఆదేశించారు. జల్లు స్నానాల ఏర్పాట్లతో పాటు సెక్టార్ల వారీగా అధికారులు, సిబ్బంది బృందాలను నియమించాలని సూచించారు. వైద్య సేవల శిబిరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సమన్వయ శాఖల అధికారులు, సిబ్బందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. క్యూఆర్ కోడ్ ఫీడ్ బ్యాక్ వ్యవస్థను క్రియాశీలకం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సీపీ రాజశేఖరబాబు మాట్లాడుతూ భక్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈవో వీకే శీనానాయక్.. కుంభాభిషేక విశిష్టత, మూడు రోజుల ప్రత్యేక కార్య క్రమాలు, భక్తులకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. మార్చి 6న యాగశాలలో ఉదయం 8 గంటలకు జరిగే యాగశాల ప్రవేశం దగ్గర నుంచి 8వ తేదీన ఉదయం 9:34 గంటలకు ప్రధాన ఆలయ ప్రాంగణంలో జరిగే కుంభాభిషేకం క్రతువు వరకు కార్యక్రమాలను వివరించారు. పవిత్ర కార్యక్రమం కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీస్వామి కరకమలములతో జరుగుతుందన్నారు. మూడు రోజులు ఉచిత దర్శనాలు ఉంటాయని, అంతరాలయం దర్శనం, ఆర్జిత సేవలను రద్దు చేస్తామని ఈవో వీకే శీనానాయక్ వివరించారు. సమావేశంలో విజయవాడ ఆర్డీఓ టి.వి.సతీష్, ఆలయ ఈఈలు ఎల్.రమ, కోటేశ్వరరావు, అడిషనల్ డీసీపీ జి.రామకృష్ణ, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.


