అవనిగడ్డలో జనసేన వర్సెస్ టీడీపీ
కోడూరు: అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నేతల మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ తీరును ఎండగడుతూ కోడూరు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇంతటితో ఆగకుండా బుద్ధప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారికి టీడీపీ నేతలు కూడా మరోసారి శంకుస్థాపన చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఏం జరిగిందంటే..
కోడూరులోని తొమ్మిదో వార్డు ఎస్సీకాలనీలో ఎన్ ఆర్‌ఈజీఎస్ కింద రూ.22లక్షల నిధులతో బీటీ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను బుద్ధప్రసాద్ సోమవారం ఉదయం జనసేన పార్టీ నేతలతో కలిసి ప్రారంభించారు. ఇది జరిగిన అరగంటకే మండల టీడీపీ నేతలు మళ్లీ అదే రహదారికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కాలనీలోని గ్రామస్తులతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు.
ఒంటెద్దు పోకడలకు నిరసనగానే..
అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా బుద్ధప్రసాద్ పెట్టుకున్నారని ఆ పార్టీ మండలాధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు విమర్శించారు. కూటమి పొత్తు ధర్మాన్ని బుద్ధప్రసాద్ విస్మరిస్తూ ఒంటెద్దు పోకడగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీలోని నేతలను కూడా జనసేనలో చేర్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో తమ ఇష్టమొచ్చినవారికే పనులను అప్పగిస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు అచ్చెన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌చంద్రబోస్, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ఆదేశాల మేరకే బుద్ధ ప్రసాద్ శంకుస్థాపన చేసిన రహదారి తాము కూడా శంకుస్థాపన చేసినట్లు శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
జనసేన కౌంటర్‌గా..
రహదారికి టీడీపీ నేతలు కూడా శంకుస్థాపన చేయడంతో మండల జనసేన నేతలు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో వారు కౌంటర్‌కు దిగారు. సోమవారం సాయంత్రం మరోసారి రహదారి నిర్మాణ ప్రాంతానికి వెళ్లి బుద్ధప్రసాద్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. రహదారి నిర్మాణాన్ని టీడీపీ నేతలు కావాలనే అడ్డుకుంటున్నారని, నియోజకవర్గంలో మద్యం, రేషన్, బుసక, ఇసుక దందా మొత్తం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతుందంటూ జనసేన పార్టీ మండలాధ్యక్షుడు మర్రే గంగయ్య విమర్శించారు.


