చలో విజయవాడకు సిద్ధం
మచిలీపట్నంఅర్బన్: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించని పక్షంలో మార్చి 2న చలో విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి రాజీ పడబోమని, ప్రభుత్వానికి సత్తా చూపిస్తామని ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రమాదేవి హెచ్చరించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలనే డిమాండ్‌తో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. రైతు సంఘం నాయకులు శీలం నారాయణరావు, సీఐటీయూ నాయకులు చంద్రపాల్, బూర సుబ్రహ్మణ్యం, కరీముల్లా, గంగాధర్, జయరావు, సీహెచ్ శ్రీహరి తదితరులు దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీల సేవలు చేస్తూ కనీస వేతనం మాత్రమే కోరుతున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ అనవసర ఖర్చులు చేస్తోందని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అంగన్‌వాడీల వేతనాల పెంపునకు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వానికి సాష్టాంగ దండాలు పెట్టారు. దీక్షలో పార్వతి, గోపిలక్ష్మి, కృష్ణవేణి, రాణి, కస్తూరి, గీత, దేవకన్య తదితరులు పాల్గొన్నారు.


