నకిలీ గుప్పు.. గుప్పు | - | Sakshi
Sakshi News home page

నకిలీ గుప్పు.. గుప్పు

Feb 28 2026 7:09 AM | Updated on Feb 28 2026 7:09 AM

నకిలీ

నకిలీ గుప్పు.. గుప్పు

మార్కెట్లో విచ్చలవిడిగా నకిలీ సిగరెట్ల దందా తక్కువ ధర.. భారీగా వ్యాపారం విదేశీ సిగరెట్లతో ప్రభుత్వాదాయానికి గండి చోద్యం చూస్తున్న ఫుడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు!

చట్టంలో లొసుగులతో..!

వాణిజ్య పన్నుల శాఖకు భారీగా గండి

పొగ తాగడమంటేనే ఆరోగ్యానికి హాని కరం. ఇక నకిలీ సిగరెట్లు తాగితే శరీరంలో అవయవాలకు దెబ్బే. ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా జోరుగా సాగు తోంది. సిగరెట్‌ తాగేవాళ్లు బ్రాండా.. నకిలీదా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీన్ని అరికట్టాల్సిన ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్‌ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): మార్కెట్‌లో నకిలీ సిగరెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో నకిలీ సిగరెట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యానికి మరింతగా తూట్లు పొడుస్తుంటే మరోవైపు విదేశీ సిగరెట్లతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి సైతం భారీగా గండి పడుతోంది. ఈ వ్యాపార లావాదేవీలు కొంతమంది అధికారులకు మంచి ఆదాయ వనరులుగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

విచ్చలవిడిగా..

నకిలీ సిగరెట్ల వ్యాపారానికి బెజవాడ అడ్డాగా మారుతోంది. విజయవాడ కేంద్రంగా చుట్టుపక్కల జిల్లాలకు సైతం సరఫరా అవుతున్నట్లు ఒకరిద్దరు అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. గతేడాది విజయవాడ వన్‌టౌన్‌, భవానీపురం పోలీస్‌స్టేషన్ల పరిధుల్లో ఉన్న గొల్లపూడి, భవానీపురం, పాతబస్తీలోని పలు ట్రాన్స్‌పోర్టు గోడౌన్లలో రూ.2 కోట్ల విలువైన నకిలీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటనలు తెలిసిందే. విదేశీ సిగరెట్లకు సంబంధించి రాయనపాడులోని ఒక గోడౌన్‌లో భారీగా సరుకును కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. వీటితో పాటుగా కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ నకిలీ, విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అధికారికంగా దాడులు చేసి స్వాధీనం చేసుకున్న ఘటనలు మాత్రమే.

వారం తర్వాత మళ్లీ మామూలే

నగరంలో ఎక్కడైనా ఏదైనా ఘటన జరిగినప్పుడు నకిలీ సిగరెట్ల వ్యాపారులు వారం పాటు లావాదేవీలను నిలిపివేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ మాములుగానే ఈ అక్రమ దందా కొనసాగుతున్నట్లుగా స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఈ దందా కొందరు అధికారులకు తెలిసే జరుగుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. భవానీపురం, పాతబస్తీలో ఈ వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నట్లు, పది మంది నిర్వహిస్తున్నట్లు పోలీసు అధికారులు అనధికారికంగా చెబుతున్నారు.

బ్రాండ్ల కంటే తక్కువ ధర

నకిలీ సిగరెట్లు, విదేశీ బ్రాండ్లు నగరంలో విచ్చలవిడిగా విక్రయాలు జరగడానికి కారణం అవి మాములు బ్రాండ్ల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉండటమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఏమీ చెల్లించకపోవడం, అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా దందా చేస్తుండటంతో తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.

నకిలీ సిగరెట్ల దందాకు సంబంధించి అదుపు చేయాల్సిన బాధ్యత పుడ్‌ సేఫ్టీ కంట్రోల్‌ శాఖకు ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇటీవల న్యాయస్థానంలో ఓ కేసు విచారణలో ఇలాంటి ఆదేశాలు వచ్చాయని అధికారులు తెలుపుతున్నారు. నకిలీ సిగరెట్లను అదుపు చేయాల్సిన పుడ్‌ సేఫ్టీ అధికారులు సైతం ముడుపుల మత్తులో ఉన్నరానే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ దిశగా ఇప్పటి వరకూ దాడి చేసిన సంఘటన ఒకటి లేదు. దీంతో నకిలీ సిగరెట్ల వ్యాపారం జోరుగా జరుగుతోంది.

ఆయా ప్రాంతాల్లో నకిలీ సిగరెట్ల వ్యాపారులపై కొంతమంది అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నా.. చట్టంలో లొసుగులతో తప్పించుకుంటున్నారని కొంతమంది అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ ఆయా అక్రమార్కులపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టినప్పుడు సరైన వాదన లేకపోవడం, సెక్షన్లలో లొసుగులతో వారు తప్పించుకుంటున్నారు. దీనికి తోడు సరుకును సైతం యథావిధిగా బయటకు తెచ్చుకుంటున్నారని తెలుస్తోంది.

నకిలీ సిగరెట్లతో పాటుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే సిగరెట్ల దందాతో ప్రభుత్వ శాఖలకు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. సరైన నిఘా లేక అక్రమార్కులు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా సిగరెట్ల దందాపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు స్పష్టమైన సమాచారం ఉన్నా ఆ దిశగా కన్నెత్తి చూసిన పాపాన పోవడం లేదు. ముఖ్యంగా అధికారులకు వివిధ స్థాయిల్లో ముడుపులు వెళ్లడంతో ఈ దందా విచ్చలవిడిగా జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

నకిలీ గుప్పు.. గుప్పు 1
1/1

నకిలీ గుప్పు.. గుప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement