చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని రాజకీయ పార్టీల తరఫున బూత్‌స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోడౌన్‌కు వేసిన తాళం, సీల్‌ను పరిశీలించి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు సజావుగా ఉన్నదీ, లేనిదీ విచారించారు. అనంతరం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 1,769 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాలకు బూత్‌స్థాయి ఏజెంట్లను ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నియమించుకోవాల్సి ఉందన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు వారికి సంబంధించిన నియోజకవర్గాల వారీగా బూత్‌స్థాయి ఏజెంట్లను వెంటనే నియమించి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. డీఆర్వో కె. చంద్రశేఖరరావు, మార్కెటింగ్ ఏడీ ఎల్. నిత్యానందం, రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్‌దాదా, పంతం గజేంద్ర, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
‘పది’ విద్యార్థులకు ఉచిత ప్రయాణం
మచిలీపట్నంటౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా ప్రజా రవాణా అధికారి కె. వెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్ష ఉన్న రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నట్లు తెలిపారు. బస్ పాస్‌తో సంబంధం లేకుండా ఏ రూట్‌లో వెళ్లే బస్సుకై నా ఉచిత ప్రయాణం వర్తిస్తుందన్నారు. విద్యార్థి హాల్ టికెట్ చూపిస్తే అల్ట్రా పల్లెవెలుగు, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చన్నారు. అన్ని ఆర్టీసీ డిపోల్లోని సిబ్బందికి అవగాహన కల్పించేందుకు గేట్ మీటింగ్స్ నిర్వహించి, నోటీసు బోర్డులో సమాచారం ఉంచినట్టు తెలిపారు.
గోసంరక్షణ పథకానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన డి. వెంకటరావు, చిన్నమ్మ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు సోమవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి గోసంరక్షణ పథకానికి రూ. 1.45లక్షల విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఏఈవో వెంకటరెడ్డి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేష వస్త్రాలను అందించారు.
బాణసంచా తయారీలో నిబంధనలు పాటించాల్సిందే
కృత్తివెన్ను: అనుమతులు లేకుండా బాణసంచా తయారీ కేంద్రాలు నిర్వహించినా, అనుమతులు పొంది తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం ఆయన కృత్తివెన్ను మండలంలోని పలు బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బందితో కలిసి విస్తృతంగా తనిఖీలు చేశారు. మండలంలోని పడతడిక, చినగొల్లపాలెం, నిడమర్రు గ్రామాలలో బాణసంచా తయారీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. తయారీ కేంద్రాలలో సరైన లైసెన్సులు, ఫైర్ సేఫ్టీ ఎక్విప్‌మెంట్, నిల్వ పరిమితులు ఉన్నాయో లేదో తనిఖీ చేశారు. శిక్షణ పొందిన వ్యక్తులే పని చేస్తున్నారా, బాలకార్మికులు ఉన్నారా తదితర వివరాలను ఆరా తీశారు. ఆయనతో పాటు బందరు ఆర్డీవో కె. సాంబశివరావు, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఏసురత్నం, తహసీల్దార్ శశి కుమార్ తదితరులు ఉన్నారు.


