సిబ్బంది అనుచిత ప్రవర్తనతో ఆలయ ప్రతిష్టకు దెబ్బ
దుర్గగుడి ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది తీరు, కాంట్రాక్టర్ల వ్యవహార శైలి ఆలయ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. మహా మండపం నాల్గో అంతస్తులో సమావేశంలో నిర్వహించగా, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఆలయ స్థానం దిగజారుతోంది..
ఈవో మాట్లాడుతూ వివిధ సేవల కాంట్రాక్టర్ల ప్రవర్తనతో దేవస్థానానికి అపకీర్తిని కలుగుతోందన్నారు. కొబ్బరి కాయలు కొట్టే చోట, క్లోక్‌రూమ్, చెప్పుల స్టాండ్‌ల వద్ద అదనపు వసూళ్లు, పార్కింగ్ కాంట్రాక్టర్ దురుసు ప్రవర్తనతో ఆలయంలో ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్నారు. భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అసంతృప్తి ఆర్‌టీజీఎస్ ద్వారా నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్తోందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఇంద్రకీలాద్రి ర్యాంకింగ్ వెనుకబడిపోతోందన్నారు. భక్తుల రద్దీ సమయాల్లో వారు ఒత్తిడిలో ఉంటారని, వారిని గద్దించడం, విసుక్కోవడం వంటివి చేయకూడదని సూచించారు. భక్తుల పట్ల ప్రవర్తనలో మార్పు రాకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో ఏసీ రంగారావు, ఏఈవో వెంకటరెడ్డి, చంద్రశేఖర్, తిరుమలేశ్వరరావు ఇతర ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.


