పన్ను పాట్లు! | - | Sakshi
Sakshi News home page

పన్ను పాట్లు!

Mar 11 2026 8:56 AM | Updated on Mar 11 2026 8:56 AM

● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బకాయిలు రూ.700 కోట్లు ● వ్యాపారాలు లేక అనుకున్న ఆదాయం రాని వైనం ● ఆర్థిక సంవత్సరాంతం కావటంతో వసూళ్లకు ప్రభుత్వం ఒత్తిడి ● బకాయిల విషయంలో గందరగోళం ● తలలు పట్టుకుంటున్న అధికారులు

వాణిజ్య పన్నుల శాఖ అధికారులపై బకాయిల బండ

సమయమంతా కాన్ఫరెన్స్‌లకే..

ఆ బకాయిలు ఎలా?

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ‘ఉమ్మడి కృష్ణాజిల్లాలో వ్యాపారుల నుంచి బకాయిలు వేగంగా వసూలు చేయండి’ అంటూ వాణిజ్యపన్నుల శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు గడిచిన 15ఏళ్లుగా ఉన్న బకాయిలు మొత్తం వసూలు చేసి తీరాలంటూ అధికారులకు కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆదేశాలు రావటంతో వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిల్‌ కార్యాలయాల్లో అధికారులు ఈ బకాయిల వసూళ్లపైనే దృష్టి సారించాలని ఆదేశించటంతో ప్రస్తుతం ఉన్న పనులన్నీ నిలిపివేసి అధికారులందరూ దీనిపైనే పని చేస్తున్నారని ఆ శాఖ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

రూ.700 కోట్ల బకాయిలు..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ–1 డివిజన్‌, విజయవాడ–2 డివిజన్‌, విజయవాడ–3 డివిజన్‌ పేర్లతో మూడు ప్రధాన కార్యాలయాలు పని చేస్తున్నాయి. వాటి పరిధిలో సుమారుగా రెండు జిల్లాల్లో 17 సర్కిల్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటిన్నింటి నుంచి ప్రభుత్వానికి సుమారుగా రూ.700 కోట్లు బకాయిలు ఉన్నట్లు తెలిసింది. దాంతో కమిషనర్‌ కార్యాలయం నుంచి ఏరోజుకారోజు నివేదికలు అడుగుతూ అధికారులపై ఒత్తిడి పెడుతున్నారని నాయకులు వివరిస్తున్నారు. దాంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఆయా సంస్థలను పట్టుకునే పనిలో బిజీబిజీగా పని చేస్తున్నారని నాయకులు చెబుతున్నారు.

ఆదాయం లేకనే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వ్యాపారాలు పూర్తిగా పడిపోయాయి. అటు పరిశ్రమల నుంచి ఉత్పత్తి సైతం దిగజారింది. అలాగే వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చే ఆదాయం సైతం కానరావటంలేదు. వివిధ వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల నుంచి ఆదాయ పన్నుల శాఖకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోవటంతో దానిని ఏదో విధంగా భర్తీ చేసేందుకు బకాయిలపై పడినట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో వాణిజ్య శాఖ నుంచి భారీ ఆదాయం వస్తోందంటూ ఊదరకొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో వచ్చిన ఆదాయానికి సైతం గతి లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యనిస్తున్నారు. దీంతో కమిషనర్‌ కార్యాలయం నుంచి బకాయిలు వసూలు చేసి పడిపోయిన ఆదాయాన్ని దీని ద్వారా భర్తీ చేయాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు పదేపదే ఒత్తిడి పెడుతున్నారని ఆ శాఖలో వినిపిస్తున్నాయి.

మరింత ఒత్తిడి..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తోంది. ఈ 20 రోజుల్లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఆదాయం చూపించాలంటూ రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. గత ఏడాది ఇదే సమయంలో జీఎస్‌టీ నిబంధనల్లో లేని అడ్వాన్స్‌ పన్నులు వసూలు చేసి కొంత ఆదాయం చూపించారు. కానీ ఈ ఏడాది మాత్రం ఏదో విధంగా ఆదాయాన్ని చూపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ తాపత్రయపడుతోంది. ఆ క్రమంలో 20 రోజుల్లో అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలని, బకాయిల గురించి ఒత్తిడి తీసుకురావటంతో అధికారులు లబోదిబోమంటున్నారు.

ఉన్నతాధికారులు పదేపదే కాన్ఫరెన్స్‌ల పేరుతో సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఆ శాఖలో పని చేస్తున్న అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కొక్కస్థాయి అధికారి వేరువేరుగా కాన్ఫరెన్స్‌లు పెట్టడంతో బకాయిల వసూళ్లకు ఎక్కడ అవకాశముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలతో వ్యాపారాలు జరగక ఆదాయం పడిపోతే తమపై ఒత్తిడి పెట్టడం ఏమిటంటూ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు ఈ కాన్ఫరెన్స్‌లతో ఉన్న పుణ్యకాలమంతా అయిపోతుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలో బకాయిల పేరుతో ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయినవి సైతం బయటకు తీసి వసూలు చేయాలంటూ కమిషనర్‌ కార్యాలయం ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా జీఎస్‌టీకి ముందు కొనసాగిన వ్యాట్‌ విధానంలో ఉన్న బకాయిలు చాలా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దానికి తోడు చాలా వ్యాపార సంస్థలు ఇచ్చిన చిరునామాల్లో లేవు. అలాగే బకాయిలు ఉన్న అనేక సంస్థలు దివాలా తీశాయి. కొన్ని సంస్థల వ్యక్తులు చనిపోయిన వారి పేర్లతో వ్యాపారాలు చేసి మోసగించినవి అందులో కనిపిస్తున్నాయి. వాటికి తోడు చాలా వరకూ న్యాయస్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇటువంటి అన్ని కలిపి భారీగా బకాయిలు ఉన్నాయంటూ కమిషనర్‌ కార్యాలయం చెప్పటంతో స్థానిక డివిజన్‌, సర్కిల్‌ కార్యాలయాల్లోని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement