అధికారులకు సైతం...?
సాక్షి నెట్‌వర్క్: నగరంలో అధికార పార్టీకి చెందిన నేతలు అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. ప్రభుత్వం పరిశీలించి ఇవ్వాల్సిన అనుమతులను అధికార పార్టీకి చెందిన నేతలు ముడుపులు పుచ్చుకుని ఏ అనుమతి అయినా ఇచ్చేస్తున్నారనే ఆరోపణలు నగరంలో బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికార కూటమి నేతలు నదురు బెదురు లేకుండా మాకేమిటిలే అన్నట్టుగా ముడుపుల కోసం తెగబడుతున్నారు. నగరంలో పలు ప్రాంతాల్లో ఒక సంస్థ ప్రత్యేకంగా స్క్రీన్‌లను ఏర్పాటు చేసి వాణిజ్య ప్రచారాలను అందిస్తోంది. వాటిపై తీవ్రంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మద్దతుతో అనధికార వ్యాపారాలను నిర్వహిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
మా ఆర్ట్స్ పేరుతో స్క్రీన్‌లు
నగరానికి చెందిన మా ఆర్ట్స్ అనే సంస్థ నగరంలో వాణిజ్య ప్రకటనల కోసం పలు స్క్రీన్‌లను ఏర్పాటు చేసింది. వివిధ వాణిజ్య సంస్థల నుంచి డబ్బులు తీసుకుని ఆ సంస్థలకు చెందిన వీడియోలను అందులో ప్రచారం చేస్తోంది. ఈ తరహా స్క్రీన్‌లు నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద రెండు బందరు రోడ్డులోని మరికొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిని ఏర్పాటు చేయటానికి నగరపాలక సంస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలాగే వీటికి సంబంధించి నగర పాలకసంస్థకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎటువంటి అనుమతి లేకుండా అనధికారికంగా వాటిని ఏర్పాటు చేసి వ్యాపార సంస్థల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై నగరంలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజా ప్రతినిధులకు భారీ ముడుపులు?
నగరంలోని మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులను చెల్లించి అనధికారికంగా స్క్రీన్‌లను ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువలనే అంత బహిరంగంగా వాటిని ఏర్పాటు చేసి వ్యాపారాలను నిర్వహిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దానికి తోడు వాటిపై అధికార పార్టీకి చెందిన నేతలెవరూ నోరు మెదపకపోవటం సైతం అదే కారణమని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
అనుమతులు లేకుండా స్క్రీన్‌లు
ఏర్పాటు చేసి వాణిజ్య ప్రచారాలు
నగరంలో పలు చోట్ల
అనధికార స్క్రీన్‌లు
వీఎంసీ నుంచి ఎటువంటి
అనుమతులు లేవంటున్న అధికారులు
ఎటువంటి పన్నులు చెల్లించకుండా
వాణిజ్య ప్రచారాలపై పలువురు
ఆగ్రహం
పేదలు తోపుడు బండి పెడితేనే తీసేసే
వీఎంసీ ఇప్పుడు ఎందుకు
మీనమేషాలు ?
అధికార పార్టీకి చెందిన నేతలకు భారీ
ముడుపులు చెల్లించినట్లు ప్రచారం
పేదలు రోడ్లపై పెట్టే తోపుడు బండిని సైతం తీసివేసే నగరపాలకసంస్థ అధికారులు ఇంత పెద్ద స్థాయిలో స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తే వాటిని తీయటానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నగరంలో ఇటువంటి స్క్రీన్‌లు ఏర్పాటు చేయటం లేదా ఇతర వ్యాపార ప్రకటనల నిమిత్తం అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒక సీనియర్ అధికారి చెబుతున్నారు. ఆ సంస్థ నుంచి వచ్చే ప్రతిపాదనను కౌన్సిల్‌కు పంపించటం, అక్కడ ఆమోదం తెలిపిన తరువాత నిర్ణీత రుసుం నగరపాలకసంస్థకు చెల్లించిన తరువాత వాటికి అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. అయితే నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధుల ఒత్తిడి కారణంగా కొంతమంది అధికారులు సైతం ముడుపులు తీసుకొని వాటి వైపు చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


