విజయవాడరూరల్: కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల హ్యాండ్‌బాల్ టోర్నమెంట్ మంగళవారం విజయవాడ రూరల్ మండలం నున్న వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రాంగణంలో విజయా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీడ్) లో ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ టోర్నమెంట్‌ను నాకౌట్–కమ్–లీగ్ విధానంలో నిర్వహిస్తున్నారు. కృష్ణా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న వివిధ కళాశాలల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ నరెడ్ల సత్యనారాయణరెడ్డి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో విజయా బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.ఉదయ్‌కుమార్, కృష్ణా యూనివర్సిటీ సెలెక్షన్ కమిటీ సభ్యులు మేజర్ మన్నె స్వామి, డి.హేమచంద్ర రావు, వికాస్ బీపీడ్ కళాశాల ప్రిన్సిపాల్ సరేష్, లెక్చరర్లు డి.రత్నబాబు, జి.విజయ్ పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): కాకినాడ లో బుధవారం నిర్వహించనున్న వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ విస్తృత సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను ఎస్సీ నాయకులు విడుదల చేశారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా గల అంబేడ్కర్ విగ్రహం వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ మెంబర్ కాలే పుల్లారావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముదిగొండ ప్రకాష్, కార్యదర్శి గుడిశె శ్యాంబాబు, ఉమ్మడి కృష్ణాజిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు పోలిమెట్ల శరత్ బాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కామెళ్ల కోటేశ్వరరావు(జోజి), సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడు గజ్జల నాగ సురేంద్ర, గొర్రుముచ్చు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుందని తెలిపారు. వైఎస్ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు రూపొందించనున్న కార్యాచరణలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ఎస్సీ విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇంటర్ పరీక్షలకు
805 మంది గైర్హాజరు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియెట్ పరీక్షలకు మంగళవారం 805 మంది గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాపితంగా 98 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్మీడియెట్ పరీక్షలు జరిగాయి. అందులో భాగంగా ఆయా కేంద్రాల్లో 33,003 మందిని కేటాయించారు. అందులో 32,198 మంది విద్యార్థులు హాజరయ్యారు. మిగిలిన 805 మంది గైర్హాజరైనట్లు అధికారులు ప్రకటించారు.


