రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

Feb 28 2026 7:15 AM | Updated on Feb 28 2026 7:15 AM

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది

ఇబ్రహీంపట్నం: ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో తండ్రీ కొడుకులు రాక్షస పాలన సాగిస్తున్నారని, మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే, తెలుగు అకాడమీ మాజీ చైర్‌ పర్సన్‌ నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. జోగి రమేష్‌ ఇంటిని చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్‌, సతీమణి జోగి శకుంతలమ్మ, కుటుంబ సభ్యులను శుక్రవారం లక్ష్మీపార్వతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటిపై జరిగిన దాడిని జోగి రమేష్‌ ఆమెకు వివరించారు.

ప్రజా స్వామ్యమా.. రాక్షస రాజ్యమా?

అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా, లేక రాక్షస రాజ్యమా అని ప్రశ్నించారు. నిరంకుశ పాలనకు కూటమి ప్రభుత్వం ఒక నిదర్శనం అన్నారు. మాస్‌ లీడర్లు అయిన జోగి రమేష్‌, అంబటి రాంబాబు ఇళ్లపై దాడికి పాల్పడ్డారని వెల్లడించారు. వీరిని భయపెట్టి బయటకు రాకుండా చేయాలన్నది చంద్రబాబు, లోకేష్‌ లక్ష్యం అన్నారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం అని ఒక ప్రత్యేక రాజ్యాంగం కొనసాగిస్తున్న మంత్రి నారా లోకేష్‌ భవిష్యత్‌ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలని హితవు పలికారు. స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నానని చెప్పుకుంటున్న లోకేష్‌కు ఏబీసీడీలు కూడా క్రమ పద్ధతిలో రాయడం రాదని ఎద్దేవా చేశారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగంలో రౌడీయిజం, గృహ దహనాలు వంటివి ముఖ్యమైన కార్యక్రమాలా అని ప్రశ్నించారు. కులం మతం రాజకీయాలు చూడకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

అన్నీ అక్రమ కేసులే..

జోగి రమేష్‌పై పెట్టిన కేసులు ప్రతి ఒక్కటి అక్రమమే అని లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో అక్రమాలకు కొదవలేదన్నారు. నాయకుల ఇళ్లపై పెట్రోల్‌, యాసిడ్‌ బాంబులతో దాడి చేయడం వంటివి గతంలో ఎన్నడు చూడలేదని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో పోలీసు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండి పడ్డారు. ప్రజాసొమ్ము దోపిడీ చేసి విదేశాల్లో దాచుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. జెడ్పీ వైస్‌ చైర్‌ పర్సన్‌ గరికపాటి శ్రీదేవి, పలువురు నాయకులు పాల్గొన్నారు.

తెలుగు అకాడమీ మాజీ చైర్‌ పర్సన్‌

నందమూరి లక్ష్మీ పార్వతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement