సువర్ణ శిఖరాన భక్తిశ్రద్ధలతో ముగిసిన క్రతువు
అభిషేకానికి పవిత్ర జలాలను బంగారు గోపురం వద్దకు తీసుకెళ్తున్న అర్చకులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా సాగింది. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా క్రతువు జరిగింది. కుంభాభిషేకం వేళ తులసీవనం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయ ప్రాంగణం, ప్రసాదాల విక్రయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. మరో వైపున అమ్మవారి దర్శనానికి విచ్చేసే మార్గంలోని బంగారు గోపురం వీక్షించే ప్రాంతం, క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి కుంభాభిషేకాన్ని వీక్షించారు. కుంభాభిషేకాన్ని పురస్కరించుకుని అమ్మవారి ఆలయాన్ని వివిధ వర్ణాల పుష్పాలతో, మామిడి తోరణాలతో, అరటి చెట్లతో అందంగా అలంకరించారు.
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మూడు రోజులుగా జరుగుతున్న కుంభాభిషేక మహోత్సవం ఆదివారంతో ముగిసింది. ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో మంటప పూజలు, మూలమంత్ర హవనం నిర్వహించారు. అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఉదయం 9గంట లకు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, సీపీ రాజశేఖరబాబు, చైర్మన్ రాధాకృష్ణ, దుర్గగుడి ఆలయ ప్రధాన అర్చకులు ఎల్. దుర్గాప్రసాద్, అర్చకులు, వేద పండితులు అమ్మవారి బంగారు కలశం వద్దకు చేరుకున్నారు. బంగారు కలశానికి విజయేంద్ర సరస్వతి స్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం సుముహూర్తమైన 9.34 గంటలకు పవిత్ర నదీ జలాలు, సముద్ర జలాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు.
అమ్మవారికి మహా నివేదన సమర్పించిన అనంతరం ఆలయం వెలుపలకు విచ్చేసిన స్వామిజీ నేరుగా ఆలయ ప్రాంగణంలోని కళావేదిక వద్దకు చేరుకుని భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆలయాల్లో జరిగే విశేష పూజల వల్ల ఫలితాలు, భగవంతుడికి, భక్తుడికి మాధ్యమంగా ఉండేవి ఆలయాలేనని, యువ త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. వారంలో రెండు రోజుల పాటు యువతకు, కాలేజీ విద్యార్థులకు ప్రత్యేక దర్శన సమయం ఇవ్వాలని స్వామిజీ ఆకాంక్షించారు. అనంతరం ఈవో, చైర్మన్, ట్రస్ట్‌బోర్డు సభ్యులతో పాటు అధికారు లు, సిబ్బందికి స్వామిజీ ప్రసాదాలను అందించారు.
పూర్ణాహుతి
నిర్వహిస్తున్న అర్చకులు
విజయేంద్ర సరస్వతి స్వామి చేతుల
మీదుగా అభిషేకం
దుర్గమ్మవారికి స్వామిజీ ప్రత్యేక పూజలు
ఆలయ ప్రాంగణంలో అనుగ్రహ భాషణం
భక్తజనంతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి


