లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో ప్రజల నుంచి 90 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. వృద్ధులు, నడవలేని వికలాంగుల వద్దకు ఆమె స్వయంగా వెళ్లి ఫిర్యాదులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్య అడిగి తెలుసుకుని, దానిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత ఎస్‌హెచ్‌ఓలకు ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో అత్యధికంగా భూ, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలపై 57 ఫిర్యాదులు అందాయి. ఇతర ఫిర్యాదుల్లో కుటుంబ తగాదాలపై 2, వివిధ మోసాలపై 4, మహిళా సంబంధిత నేరాలపై 6, దొంగతనాలపై 3, ఇతర వివిధ సమస్యలపై 18 ఫిర్యాదులు అందాయి.
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
చల్లపల్లి: స్నానానికని వెళ్ళి చున్నీతో ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం కృష్ణాజిల్లా చల్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చల్లపల్లి నారాయణరావునగర్‌కు చెందిన కె.వెంకటకృష్ణయ్య, దేవిప్రియల కుమార్తె కీర్తి (13) స్థానిక హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. ఉదయం స్కూలుకు వెళ్ళిన కీర్తి మార్గంమధ్యలో తనకు నెలసరి రావటంతో ఇంటికి తిరిగి వచ్చింది. పంచాయతీలో స్వీపరుగా పనిచేస్తున్న తల్లి దేవిప్రియ పని ముగించుకుని ఇంటికి వచ్చింది. స్కూలుకు ఎందుకు వెళ్ళలేదని అడగటంతో తనకు కడుపు నొప్పిగా ఉందని కీర్తి చెప్పింది. స్నానం చేసి వస్తే ఆసుపత్రికి వెళదామని తల్లి కూతురుని స్నానానికి పంపింది. కీర్తి ఎంతసేపటికీ బయటకు రాకపోవటంతో తలుపులు తెరచి చూడగా కీర్తి చున్నీతో ఉరి వేసుకుని కనిపించింది. అది చూసి కంగుతిన్న దేవిప్రియ కేకలకు స్థానికులు వచ్చి కీర్తిని హుఠాహుటిన చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలిక కీర్తి మృతి చెందినట్లు చెప్పారు. ఎస్‌ఐ డి.దుర్గాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కీర్తి క్రమశిక్షణతో, టీచర్లతో ఎంతో వినయంతో నడచుకునేదని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.


