గాల్లో దీపంలా మహిళా రక్షణ లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, ఎక్కడ చూసినా మహిళలు, చిన్నారులపై దాడులు, లైంగికదాడులు జరుగుతున్నాయని విజయవాడ మేయర్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా అధ్యక్షురాలు రాయన భాగ్యలక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని నెహ్రు చారిటబుల్ ట్రస్టు వైస్ చైర్‌పర్సన్ దేవినేని సుధీర, డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గలతో కలిసి రాయన భాగ్యలక్ష్మి కేక్‌కట్ చేశారు. జాతీయ స్కేటింగ్ క్రీడాకారిణి నిహారిక, కూచిపూడి కళాకారిణి లహరి, కంప్యూటర్ స్పెషలిస్ట్ అరుణలను ఘనంగా సత్కరించారు.
అనంతరం రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో మహిళా సాధికారత అమలుకావడం లేదన్నారు. గత ప్రభుత్వం అన్ని పథకాల్లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చిందని, మహిళను ఇంటి పెద్దగా పెట్టిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామని మోసపూరిత హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ఆడబిడ్డ నిధి ఊసే లేదని, తల్లికి వందనంలో కోత పెట్టారని, పెన్షన్‌లు కొత్తవి ఇవ్వకపోగా, ఉన్న వాటిలో 5 లక్షలు తొలగించారని మండిపడ్డారు. నారీశక్తి పథకం ఎప్పుడు ఇస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. డెప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ మహిళా పక్షపాతి ప్రభుత్వంగా వైఎస్ జగన్ పాలన చేశారన్నారు. మహిళలకు ప్రాధాన్యం ఇచ్చి పదవులు ఇచ్చినట్లు తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం మహిళలను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు..
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఆయన సత్కరించిన అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్లలో ఏ పథకం అందించిన, ఏ కార్యక్రమం చేసినా మహిళలకే ప్రాధాన్యం ఉండేదన్నారు. కూటమి వచ్చిన తర్వాత మహిళలపై అరాచకాలు పెరిగాయన్నారు. కూటమి నేతలే మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళలకు రక్షణ కావాలన్నా, సాధికారత, భద్రత రావాలన్నా.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని దేవినేని అవినాష్ అన్నారు. కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ పరిశీలకురాలు బండి నాగేంద్ర పుణ్యశీల, జిల్లా పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు ఇందుపల్లి సుభాషిణి, రాష్ట్ర మహిళా విభాగం నేత కొమ్మన స్వప్న, అబ్బిరెడ్డి లక్ష్మి, శ్రావణి, తదితరులు పాల్గొన్నారు.
● రాష్ట్రంలో మహిళలపై
దాడులు పెరిగిపోయాయి
● సంక్షేమ పథకాలు
ఇస్తానని మోసం చేశారు
● ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ మహిళా
అధ్యక్షురాలు, విజయవాడ మేయర్
రాయన భాగ్యలక్ష్మి
● జిల్లా పార్టీ కార్యాలయంలో
ఘనంగా మహిళా దినోత్సవం
సాధికారత ఏది?