పాల కల్తీ టెస్టింగ్ కిట్ల కొరత
వారంలో కిట్‌లు వస్తాయి
లబ్బీపేట(విజయవాడతూర్పు): రాజమండ్రిలో కల్తీపాలు తాగి ఐదుగురు మృత్యువాత పడటంతో పాటు పలువురు తీవ్ర అస్వస్థతకు గురైన నేపథ్యంలో విజయవాడలో ఫుడ్ కంట్రోల్ అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా 13 ప్రాంతాల్లో లూజు పాలు విక్రయిస్తున్న వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. వాటిని పరీక్షల కోసం హైదరాబాద్ లేబొరేటరీలకు పంపించారు. ఆ రిపోర్టులు వచ్చేందుకు వారం రోజులు పడుతుందని, ఆ ఫలితాల ఆధారంగా ఏదైనా కల్తీ ఉంటే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
టెస్టింగ్ కిట్ల కొరత
పాలలో కల్తీ గుట్టును సత్వరమే తెలుసుకునేందుకు అవసరమైన టెస్టింగ్ కిట్‌లు ప్రభుత్వం వద్ద అందుబాటులో లేని దయనీయ స్థితి నెలకొంది. దీంతో ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించినా ఆయుధాలు లేని సైనికుల మాదిరిగా మారారు. అవి కల్తీ అయ్యాయో లేదో తెలుసుకోవటానికి వారం రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. వాస్తవంగా కిట్స్ ఉంటే ప్రాథమికంగా అప్పుడే తెలుసుకోవచ్చు, మరిన్ని ఫలితాల కోసం లేబొరేటరీలకు పంపుతారు. కానీ కిట్‌ల కొరతతో కేవలం శాంపిల్స్‌ను సేకరించి, వాటిని ల్యాబ్‌లకు పంపించడం మాత్రమే చేస్తున్నారు.
తనిఖీలు ఇలా...
నగరంలో కొత్తపేట, వన్‌టౌన్, విద్యాధరపురం, గాంధీనగర్, కృష్ణలంక, పటమట, ఫన్‌టైమ్స్ రోడ్డు, కరెన్సీనగర్, గురునానక్ కాలనీ ప్రాంతాల్లో లూజుగా అమ్ముతున్న గేదె పాల శాంపిల్స్‌ను సేకరించారు. పటమట, కొత్తపేట ప్రాంతాల్లో లూజుగా విక్రయిస్తున్న ఆవు పాల శాంపిల్స్‌ను సైతం సేకరించారు. ఆయా శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని విమ్టా లేబొరేటరీకి పంపారు. రాజమండ్రిలో డీ ఫ్రిజ్‌లో పెట్టిన పాలలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయినందుకు ఆ దిశగా కూడా అధికారులు దృష్టి సారించారు.
రాజమండ్రి ఘటన నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో పాల శాంపిల్స్‌ను సేకరించారు. వాటిని హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించాం. టెస్టింగ్ కిట్‌లు అందుబాటులో లేవు. వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ప్రజలు పాలు కొనుగోలు చేసేటప్పుడు ప్యాకెట్‌లపై తేదీని చూసి కొనుగోలు చేయాలి.
–బి.శ్రీనివాసరావు, ఫుడ్ కంట్రోల్ అధికారి


