breaking news
Wanaparthy District Latest News
-
మా కళ్లముందే మారిన చరిత్ర..
మా చిన్నతనంలో మదనాపురం ఒక పెద్ద వ్యాపారకేంద్రంగా ఉండేది. ముంబై, మద్రాస్, గుజరాత్ వ్యాపారులు ఇక్కడ రైస్‌మిల్లులు ఏర్పాటు చేశారు. అయితే సాయుధ పోరాటం తీవ్రమవడంతో గ్రామస్తుల సహకారం లేక వారు మిల్లులను వదిలి వెళ్లడం నేను ప్రత్యక్షంగా చూశా. కర్నూలు, మద్రాస్ వెళ్లేవాళ్లు మదనాపురం రైలు దిగి ఇక్కడి టంకశాలలో కరెన్సీ మార్చుకునేవారు. నాడు కరెన్సీ మార్పిడి సాగిన ఆ టంకశాల భవనమే నేడు పోలీస్స్టేషనన్గా మారింది. సెప్టెంబర్ 17 అనగానే నాటి సాయుధ పోరాట జ్ఞాపకాలు, ఈ సరిహద్దు టంకశాల కథలే మా కళ్లముందు మెదలుతాయి. – టీకే కురుమన్న, విశ్రాంత ఉపాధ్యాయుడు, మదనాపురం ● -
మారేడుపల్లి..
సాయుధ సమరంలో మదనాపురం: 1947, ఆగస్టు 15న దేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరిగినా.. నైజాం ఉక్కుపాదం కింద నలిగిన తెలంగాణ గడ్డపై విముక్తి భానుడు ఉదయించలేదు. భరతమాత ఒడిలోకి నాటి నైజాం రాజ్యాన్ని విలీనం చేసేందుకు తెలంగాణ పల్లెపల్లెనా సాయుధ పోరాట జ్వాలలు ఎగిసిపడ్డాయి. రైతులు, కూలీలు, సామాన్య ప్రజలు ఆయుధాలు చేతబట్టి నిజాం సైన్యం, రజాకార్లను ఎదుర్కొన్న సాయుధ సమరంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మారేడుపల్లి (నేటి మదనాపురం) ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. ● మదనాపురం అసలు పేరు మారేడుపల్లి. సాయుధ పోరాటానికి ముందు ఈ ప్రాంతం వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా వెలుగొందింది. ముంబై, గుజరాత్, చైన్నె, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం వ్యాపారులు ఇక్కడ నివాసాలు ఏర్పర్చుకొని బియ్యం (రైస్ మిల్లులు), నూనె మిల్లులను నెలకొల్పారు. నాటి వ్యాపార సామ్రాజ్యమంతా వారి గుప్పిట్లోనే ఉండేది. అయితే 1948 చివరి నాటికి గ్రామీణ ప్రాంతాల్లో సాయుధ పోరాటం తీవ్రస్థాయికి చేరింది. భూస్వామ్య విధానం, నిజాం అణచివేతకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఉద్యమించడంతో వ్యాపారులకు స్థానికంగా మద్దతు కరువైంది. రజాకార్ల అరాచకాలు, ప్రజాగ్రహం మధ్య తాము మనుగడ సాగించలేమని గ్రహించి 1948, సెప్టెంబర్ 17 విలీన ప్రక్రియకు ఆరు నెలల ముందే తమ మిల్లులు, ఆస్తులను ఉన్నఫలంగా వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. విలీనం పూర్తయిన అనంతరం వారు తిరిగొచ్చి తమ స్థిరాస్తులను స్థానికులకు విక్రయించి వెళ్లారని చరిత్ర చెబుతోంది. నాడు వ్యాపారానికి ప్రధాన కేంద్రం రైస్, నూనె మిల్లులు ఏర్పాటు.. భిన్న రాజ్యాల కరెన్సీ మార్పిడి కేంద్రం తెలంగాణ విమోచన దినోత్సవ ప్రత్యేక కథనం -
శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి
వనపర్తి: వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి కోరారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సాయుధ దళ పోలీసు కార్యాలయంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథుడి నిమజ్జన కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలు కూడా పోలీసుశాఖకు సహకరిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ గిరిబాబు, జిల్లా పోలీసు కార్యాలయ ఏఓ సునంద, సీఐ సుగంధ రత్నం, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు మంజునాథ్‌రెడ్డి, పర్వతాలు, నరేష్, ఎస్ఐలు హరిప్రసాద్, హృషికేష్, స్వాతి, రజిత, హిమబిందు, రిజర్వ్ ఎస్ఐలు వినోద్, మొగ్దుంబారీ, ట్రాఫిక్ ఎస్ఐ సురేందర్ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు అమరచింత: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్ తెలిపారు. ఆగస్టులో సీపీఎం నాయకులు డీఎంఆర్ఎం ఆస్పత్రిలో వైద్యసేవలు అందడం లేదని ఫిర్యాదు చేయడంతో బుధవారం స్వయంగా పరిశీలించేందుకు వచ్చి ఫిర్యాదుదారులను ఆస్పత్రికి పిలిపించి మాట్లాడారు. అలాగే రోగులతో మాట్లాడి వసతులు, వైద్యసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎంఆర్ఎం ఆస్పత్రి పీహెచ్సీగా అప్‌గ్రేడ్ అయినందున 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేవిధంగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రికి కేటాయించిన సిబ్బంది వెంటనే విధుల్లో చేరేలా చూస్తామన్నారు. రాత్రివేళలో వైద్యం అందించేందుకు స్టాఫ్ నర్స్ అందుబాటులో ఉంటుందని.. సమస్య తీవ్రతను డ్యూటీలో ఉన్న వైద్యుడికి వివరించి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదని.. ఆస్పత్రి వద్దనే 108, 104 వాహనాలు అందుబాటులో ఉంటాయని వినియోగించుకోవాలని సూచించారు. కార్మికులపై పనిభారం తగ్గించాలి వనపర్తిటౌన్: కార్మికులపై పని భారాన్ని తగ్గించి రూట్ సర్వే ఆధారంగా సమయాలను కేటాయించాలని, అలవెన్స్‌లను 80 శాతం పెంచి అమలు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిపో అధ్యక్షుడు ఏజీ కృష్ణ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికుల సమస్యల పరిష్కారం, గతంలో అంగీకరించిన అంశాల అమలును కోరుతూ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విన్నర్ పథకం కింద నియమితులైన ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలతో పాటు ఉద్యోగుల బకాయిలను చెల్లించాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారందరికీ పోస్టింగ్‌లు ఇవ్వాలని, ఉద్యోగ భద్రతపై కమిటీ, విలీన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర అధ్యక్షుడు వీరాంజనేయులు కార్మికులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో రీజియన్న్ అధ్యక్షుడు కృష్ణయ్య, కార్యదర్శి వెంకటయ్య, సహాయ కార్యదర్శి ఎండీ ఖయ్యూం, కార్యదర్శి సి.నాగేశ్వర్, ఉపాధ్యక్షుడు నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రైస్‌మిల్లులపై విజిలెన్స్ దాడులు ఆపాలి
వనపర్తి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైస్‌మిల్లులపై ఉద్దేశపూర్వకంగా నిర్వహిస్తున్న విజిలెన్స్ దాడులను వెంటనే ఆపాలని రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఎంబీ ఫంక్షన్హాల్లో జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షురాలు ధనలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా రైస్ మిల్లర్ల సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న మిల్లింగ్ ఛార్జీలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల నాటి నిబంధనలనే నేటికీ అమలు చేయడం సరికాదని, మారిన పరిస్థితులు, పెరిగిన ధరలకు అనుగుణంగా మిల్లింగ్ చార్జీలు, సీఎంఆర్ నిబంధనలను సవరించి మిల్లర్లకు ఏళ్లుగా చేస్తున్న అన్యాయాన్ని అరికట్టాలని, అందుకు మిల్లర్లు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నిబంధనల ప్రకారం సీఎంఆర్ వందశాతం చెల్లించిన వారిపై ఫెనాల్టీ, వడ్డీని రద్దు చేయాలన్న మిల్లర్ల డిమాండ్ల సాధన కోసం సంఘటితంగా పోరాటం చేస్తూ మిల్లులను షట్‌డౌన్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సమయంలోనే మిల్లర్లు ఐక్యంగా పోరాటంలో పాల్గొని తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవాలని కోరారు. వరికోతల సమయంలో అధికార, విపక్షం అనే తేడా లేకుండా ధాన్యం దించుకోవాలని ఒత్తిడి చేసే నాయకులు రోడ్డెక్కిన మిల్లర్ల సమస్య ఏమిటని అడిగిన దాఖలాలు లేవని అసహనం వ్యక్తం చేశారు. రైస్‌మిల్లర్లు అంటే దోపిడీ దొంగలుగా సమాజంలో చిత్రీకరించడం సరికాదని.. సీఎంఆర్ ఒప్పందాన్ని సవరించాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాంతంపై అభిమానం చూపుతున్నారని, అదేవిధంగా మిల్లర్లపై జరుగుతున్న దాడులను ఆపి ఆదుకోవాలని కోరారు. మిల్లర్లంతా ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు సోళీపురం శేఖర్‌రెడ్డి, కట్ట సుబ్బయ్య, నరేందర్, సంపత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్, గద్వాల, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతోనే ‘సర్’ విజయవంతం
వనపర్తి: ఎస్ఐఆర్ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా కొనసాగేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, పత్రాల సమర్పణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నో మ్యాపింగ్ లేదా అనామలీస్ నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు నోటీసులో పేర్కొన్న తేదీల్లో తప్పనిసరిగా విచారణకు హాజరై సంబంధిత పత్రాలను సమర్పించాలని.. వివరాలు పరిశీలించి తుది ఓటరు జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరయ్యేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు తమస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ఎలాంటి అపోహలకు తావులేకుండా ప్రజలకు సరైన సమాచారం అందించాలని సూచించారు. ఇటీవల రెండు దఫాలు నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు ప్రచార కార్యక్రమంలో ఫారం–6, 7, 8కు సంబంధించి 2,177 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఆయా దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిశీలించి పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ రంజిత్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
సైనిక చర్యకంటే ముందే విలీనం..
వనపర్తి రాజమహల్వనపర్తి: సెప్టెంబర్ 17 అంటేనే నిజాం పాలనలో ఉన్న అప్పటి హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనమైన రోజుగా అందరికీ తెలుసు కానీ.. నిజాం సార్వభౌమాధికార పరిధిలోని సామంతరాజుగా ఉన్న వనపర్తి మూడవ రాజా రామేశ్వర్రావు అంతకంటే ముందే తన సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం లిఖించని చరిత్ర. వందేళ్ల క్రితమే.. వనపర్తి సంస్థానం చివరి రాజు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించిన ప్రముఖుల్లో ఒకరుగా పేరొందారు. స్వాతంత్య్రం అనంతరం సంస్థానాలను భారత యూనియన్‌లో విలీనం చేస్తున్న విషయం తెలుసుకొని ముందస్తుగానే అప్పటి పాలకులతో విలీన ఒప్పందానికి సిద్ధం కాగా.. నిజాం పాలకులు వనపర్తి సంస్థానాధీశులపై గుర్రుగా ఉంటూ బందీని చేసేందుకు ప్రయత్నించారు. ఆయన అప్పటికే భారత ప్రభుత్వ రక్షణలో ఉండటంతో నిజాం సర్కారు సైన్యం వెనుదిరినట్లుగా ఇక్కడి వారు కథలుగా చెప్పుకొంటారు. ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ రాష్ట్రం సైతం ఇండియన్ యూనియన్‌లో విలీనమైన తర్వాత ఆయన భారత ధౌత్యవేత్తగా ప్రభుత్వ ప్రతినిధిగా సేవలందించారు. అనంతరం కేంద్ర మంత్రిగా మహబూబ్‌నగర్ తొలి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికై భారత విదేశాంగ మంత్రిగా సేవలందించారు. కానీ ఈ విషయాలు ఎక్కడా చరిత్రలో లిఖించలేదు. ఇప్పటికీ ఇంకా వనపర్తిలో ఆయన నెలకొల్పిన రాజారామేశ్వర్ ట్రస్ట్‌లో కొంత సమాచారం భద్రపర్చడంగమనార్హం. భారత ప్రభుత్వంలో తనకున్న పలుకుబడితో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను వనపర్తికి తీసుకొచ్చి ఈ ప్రాంత యువత కోసం సాంకేతిక విద్యాలయానికి తన రాజమహల్‌ను దానంగా ఇచ్చి ఆయనతో ప్రారంభోత్సవం చేయించారు. ఇప్పటికీ ఇంకా రాజ భవనంలోనే కృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది. -
చార్జీల మోత వద్దు..
సామ్యానుడిపై పెనుభారం.. కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు విధించడం శోచనీయం. డిజిటల్ పేమెంట్లు అలవాటు చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు రూ.రెండు వేల దాటి చెల్లింపులు చేస్తే ఛార్జీలు విధిస్తామని చెప్పడం దారుణం. ప్రస్తుతం సామాన్య ప్రజలు సైతం విద్యుత్ బిల్లులను యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. ఛార్జీల మోత సామాన్యుడి నడ్డి విరిచేలా తయారవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఛార్జీల అమలును ఉపసంహరించుకోవాలి. – విజయరాములు, సీపీఐ జిల్లా కార్యదర్శి, అమరచింత గద్వాల: డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడిన సామాన్యులపై యూపీఐ చార్జీల భారం పడనుంది. రూ.2 వేల వరకు యూపీఐ లావాదేవీలకు ఎలాంటి ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) ఉండదు. ఆపై జరిగే కొన్ని రకాల చెల్లింపులపై కనిష్టంగా రూ.12 నుంచి గరిష్టంగా రూ.300 వరకు చార్జీలు విధించనున్నారు. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంపై జనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో వివిధ రకాల లావాదేవీలు నెలకు సుమారు రూ.2,500–3,000 కోట్ల మేర జరుగుతున్నట్లు అంచనా. వీటిపై ఎస్ఎస్టీ, సీఎస్టీ తదితర పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే రూ.200–300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాల అంచనా. అయితే కొత్త చార్జీలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు సులభతరం కావడంతో నగదు అవసరం తగ్గిందని కొందరు చెబుతుండగా, అదనపు చార్జీల నేపథ్యంలో మళ్లీ నగదు చెల్లింపుల వైపు మళ్లే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. ‘నగదు వద్దు.. డిజిటల్ ముద్దు’ అంటూ చెప్పి ఇప్పుడు భారం వేయొద్దు యూపీఐ చార్జీల వడ్డనపై వినియోగదారులు, వ్యాపారుల్లో భిన్నాభిప్రాయాలు ఎండీఆర్ అమలుతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వానికి రూ.20 కోట్లకుపైగా ఆదాయం -
కార్మికులపై నిర్బంధం తగదు
వనపర్తి రూరల్: సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపడుతున్న ఆందోళనలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ నిర్బంధాన్ని ప్రయోగించడం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ అన్నారు. కార్మికులపై నిర్బంధ చర్యలను వ్యతిరేకిస్తూ సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కార్మికులతో కలిసి సామూహిక నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. 8, 9 తేదీల్లో అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, గ్రామపంచాయతీ, మున్సిపల్, ఆర్టీసీ, విద్యుత్, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టు, భవన నిర్మాణ, హమాలీ కార్మికుల సమస్యలు ఆయన డిమాండ్ చేశారు. హమాలీ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు పుట్టా ఆంజనేయులు, అధ్యక్షుడు ఆర్ఎన్ రమేష్, కార్యదర్శి మండ్ల రాజు, బొబ్బిలి నిక్సన్, సునిత, బాలగౌడ్, రాజు, రాము, బుచ్చమ్మ, కవిత, గిరిజ, తిరుపతమ్మ, సుమతి, ఇందిర, అరుణ, హరికృష్ణ, శ్రీనివాస్, హనీఫ్, జయమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు. -
చిన్నన్న రహస్య భేటీ..?
● హైదరాబాద్ శివారులో అసమ్మతి నేతలతో.. ● మీడియాకు దూరంగా ఉంటూనే మాజీలను ఏకం చేసేపనిలో ఉన్నారా..? వనపర్తి: మాజీ మంత్రి, తాజా మాజీ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి గోపాల్పేట మండల కాంగ్రెస్‌పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం వేదికగా చేసిన వ్యాఖ్యలను అధిష్టానం సీరియస్‌గా తీసుకొని ఆయనపై వేటు వేయడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం విధితమే. కాగా కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న ఆయన మరోసారి రాష్ట్రస్థాయి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, పార్టీ అసంతృప్తు నేతలు కొందరితో రహస్య సమావేశం నిర్వహించి వారిని ఏకం చేసి అధిష్టానం వద్దకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవిలో మరొకరిని నియమించడంతో స్వగ్రామంలో ఉంటూ పొలం పనులు చేసుంటూనే.. పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదనే మనోవేదనతో ఉన్న వారిని ఒకేచోట చేర్చే యోచనతో ఈ సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. 2004లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వనపర్తి వేదికగా 40 మంది ఎమ్మెల్యేలను ఏకం చేసిన ఘటనను గుర్తు చేసేలా చిన్నన్న పెద్ద ప్లాన్‌లోనే ఉన్నట్టున్నారని పార్టీలో ఆయన సీక్రెట్ మీటింగ్ ఓ చర్చ లేవనెత్తేలా చేసింది. మీడియాకు దూరంగా ఉంటూనే.. మీడియాతో మాట్లాడటానికి విముఖత చూపిస్తూనే వ్యవసాయ క్షేత్రం నుంచే ప్రత్యర్థుల ఊహకందని విధంగా స్కెచ్ వేసి అధిష్టానానికి స్థానిక విషయాలను తెలియజేస్తూ.. తన మునుపటి వైభవాన్ని దక్కించుకొని తన క్యాడర్లో సన్నగిల్లుతున్న నమ్మకాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సన్నిహితులు చర్చించుకుంటున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏమిటని మీడియా వారు ప్రశ్నిస్తే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.. ఏదైనా ఉంటే పిలిచి వెల్లడిస్తానంటూ దూరంగా ఉంటూనే తన ప్లానింగ్‌ను సీక్రేట్‌గా అమలు చేస్తున్నారనే గుసగుసలు స్థానికంగా వినిపిస్తున్నాయి. రహస్య సమావేశానికి వనపర్తి నియోజకవర్గం నుంచి కొందరు ముఖ్యులు హాజరైనట్లుగా తెలుస్తోంది. కానీ ఎవరూ సమావేశ విషయాలు బయట పడకుండా జాగ్రత్తలు పాటిస్తుండటం గమనార్హం. తాజాగా పార్టీ అధిష్టానంపై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో పదవికి దూరమైన సంఘటన.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, 2023 ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలతో టికెట్ దూరమైన సందర్భాన్ని పార్టీ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డినే చిన్నన్న తొలి ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారం కోసం వాల్‌రైటింగ్ రాసినట్లు పలు వేదికలపై చెప్పినా.. ఆయనకు పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నా స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రెండోసారి ఘాటు వ్యాఖ్యలతో చేటు.. ఢిల్లీకి పయనమవుతున్నారా..? పార్టీ, ప్రభుత్వానికి అంటిముట్టనుట్టుగా ఉంటున్న వారిని ఏకం చేసి అందరితో కలిసి ఢిల్లీకి పయనమై తమ వాదనలను అధిష్టానం వద్ద బలంగా వినిపించేందుకు చిన్నన్న సీక్రెట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందరి మద్దతుతో తమ వాదనలు బలంగా వినిపించేలా తీర్మానం చేసుకున్నట్లు సమాచారం. -
నచ్చితే నజరానా.. ప్రశ్నిస్తే పనిష్మెంట్!
పాలన సూపర్ అంటే చాలు.. నజరానాగా కీలక పోస్టుల్లో నియామకం.. మీ వెనుకే ఉంటాం అంటే అందలం.. ప్రశ్నిస్తే మాత్రం పనిష్మెంట్.. పాలమూరు యూనివర్సిటీలో బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల్లో ఇటీవల జరుగుతున్న చర్చ ఇది. విశ్వవిద్యాలయ పరిపాలనలో ముఖ్య భూమిక వహిస్తున్న వారు సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష ప్రదర్శిస్తూ.. అనుభవం లేకున్నా తమ అనుకూల వర్గానికి కీలక పోస్టులు కట్టబెట్టడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది రెండు (రెగ్యులర్, కాంట్రాక్ట్) గ్రూప్‌లుగా చీలిపోగా.. అంతర్గత వార్ ముదిరినట్లు సమాచారం. పాలకుల ఏకపక్ష వైఖరి, అసమర్థ నిర్ణయాలతో పీయూలో పాలనగాడి తప్పిందనే విమర్శల నేపథ్యంలో ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే.. పాలమూరు యూనివర్సిటీలో అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆరుగురు ప్రొఫెసర్లు పిండి పవన్‌కుమార్, కిషోర్‌కుమార్, నూర్జహాన్, జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రకిరణ్‌కు అనుభవం ఉంది. వీరిలో ప్రొఫెసర్ చంద్రకిరణ్‌కు తప్ప.. మిగతా ఐదుగురు సీనియర్లకు ఏ రకమైన కీలక బాధ్యతలు ఇవ్వకుండా మొండిచేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రిజిస్ట్రార్‌గా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రొఫెసర్ మధుసూదన్‌రెడ్డికి పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు వీసీ ఓఎస్డీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒక్కరికి 2, 3 బాధ్యతలు.. యూనివర్సిటీ పరిధిలోని ఎనిమిది ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఏకంగా ఐదింటిని కాంట్రాక్ట్ అధ్యాపకులతో భర్తీ చేయడం.. ఒక్కరికి రెండు, మూడు పోస్టుల చొప్పున ఇవ్వడం.. ప్రొఫెసర్ హోదాలో ఉన్న సీనియర్లను కీలక బాధ్యతల నుంచి తప్పించడం, నామమాత్రపు పోస్టుల్లో నియమించడం విమర్శలకు తావిస్తోంది. రెగ్యులర్ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని కాదని.. కాంట్రాక్ట్ అధ్యాపకులకు ప్రాధాన్యమివ్వడంపై విద్యార్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పటి నుంచే దూరం.. వీసీగా శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత రిజిస్ట్రార్‌గా చెన్నప్పను నియమించారు. ఆయన కొన్ని నెలలకే ఆ బాధ్యత నుంచి తప్పుకొన్నారు. ఈ క్రమంలో ఓయూ ప్రొఫెసర్‌గా ఉన్న రమేష్‌బాబును తీసుకొచ్చి రిజిస్ట్రార్‌గా నియమించారు. ఇది యూనివర్సిటీలోని రెగ్యులర్ అధ్యాపకులను మనస్తాపానికి గురిచేసినట్లు సమాచారం. పీయూలో సీనియర్లుగా ఉండి, గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వారిని సైతం పక్కనబెట్టడంతో ఆ రోజు నుంచే పలువురు వీసీతోపాటు రిజిస్ట్రార్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, ఒకే సామాజిక వర్గానికి చెందిన వారిని దగ్గర ఉంచుకుని పీయూ పాలనా యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని నాన్–టీచింగ్, దిగువ స్థాయి ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. వీసీ, రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు.. పీయూలో చోటుచేసుకుంటున్న పరిణామాల క్రమంలో వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా రెగ్యులర్ అధ్యాపకులు వారిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు అనుకూలంగా ఉన్న వారితో ఒకలా, లేని వారితో మరోలా వ్యవహరిస్తున్నారని.. చాలా సమయం వీసీ చాంబర్ ఎదుట నిలబెట్టడం వంటివి చేస్తున్నారని కొందరు రెగ్యులర్ ప్రొఫెసర్లు బాధను వెళ్లగక్కారు. నచ్చకుంటే అన్నింటా తలదూర్చడమే కాకుండా అగౌరవ పరుస్తున్నారని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే పీజీ సెంటర్లకు బదిలీ చేస్తామని సైతం బెదిరిస్తున్నట్లు అధ్యాపక వర్గాల్లో చర్చ జరుగుతోంది. పాలమూరు యూనివర్సిటీలో ఇష్టారాజ్యంగా పాలన సీనియర్లు, రెగ్యులర్ అధ్యాపకులపై వివక్ష 8 ప్రిన్సిపాల్ పోస్టుల్లో ఐదింట కాంట్రాక్ట్ లెక్చరర్లే.. ఆరుగురు ప్రొఫెసర్లలో ఒక్కరికే కీలక బాధ్యతలు అనుభవం ఉన్నా.. మిగతా వారికి మొండిచేయి అందరికీ ప్రాధాన్యం ఇస్తాం పోస్టుల కేటాయింపులో రెగ్యులర్ వారితో పాటు అందరికీ ప్రాధాన్యత ఇస్తాం. ఎవరు ఎక్కువ తక్కువ కాదు. భవిష్య త్లో భర్తీ చేసే పోస్టుల్లో రెగ్యులర్ వారికి మరిన్ని పోస్టులు కల్పిస్తాం. ప్రస్తుతం పోస్టులు కేటాయించిన వారు పూర్తిస్థాయిలో పనిచేస్తే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుంది. కాంట్రాక్టు సిబ్బందికి అదనంగా ఉన్న బాధ్యతలను తగ్గిస్తాం. – రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్ అధికారాలు కేంద్రీకృతం కావద్దు పీయూలో వివిధ పోస్టులు ఒకే చోట కేంద్రీకరణ కావద్దు. కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రాధాన్యత ఇస్తూ రెగ్యులర్, సీనియర్లు, అనుభవం ఉన్న వారి సేవలను యూనివర్సిటీలో వినియోగించుకోవాలి. కానీ ఒక్కరికే, రెండు, మూడు పోస్టులు ఇస్తే ఎలా అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతుంది. అందరికీ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. – రాము, ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు, పీయూ -
వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు
వనపర్తి: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు అన్నిశాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని నల్లచెరువు ట్యాంక్‌బండ్‌ను సందర్శించి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పట్టణంలో ఎన్ని మండపాలకు అనుమతులు ఇచ్చారు.. నల్లచెరువు వద్దకు నిమజ్జనానికి ఎన్ని విగ్రహాలు వచ్చే అవకాశం ఉందనే వివరాలను పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 300 విగ్రహాల నిమజ్జనం జరిగే అవకాశం ఉందని వివరించారు. నిమజ్జనం రోజున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భారీ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన క్రేన్లను ముందుగానే సిద్ధంగా ఉంచాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గజ ఈతగాళ్లను విధుల్లో ఉంచాలని, వారికి తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు అందించాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో ఆటంకం కలగకుండా ఆ శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్, పోలీస్, మున్సిపల్ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. 25వ తేదీ నాటికి టౌన్‌హాల్ ప్రారంభించాలి.. పాత మార్కెట్‌యార్డులో నిర్మించిన టౌన్‌హాల్‌ను కలెక్టర్ పరిశీలించారు. మిగిలిన పనులు వేగంగా పూర్తిచేసి 25వ తేదీలోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని పుర కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలను సమకూర్చాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. కలెక్టర్ వెంట పుర కమిషనర్ నిరంజన్, విద్యుత్, పోలీసుశాఖ అధికారులు ఉన్నారు. -
కేఎల్‌ఐకి పాలమూరు నీరు
నాగర్‌కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నీటిని కేఎల్ఐ ఆయకట్టుకు అనుసంధానించే మరో మార్గం అందుబాటులో ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి కేఎల్ఐ పరిధిలోని ఎల్లూరు రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేలా గతంలోనే ఏర్పాటు చేసిన ఇంటర్‌లింక్ స్లూయిస్ ఇందుకు ఉపయోగపడనుంది. నార్లాపూర్–ఎల్లూరు రిజర్వాయర్లను జంట జలాశయాలుగా పరిగణించేలా ఈ అనుసంధానం ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దీన్ని వినియోగంలోకి తీసుకొస్తే పీఆర్ఎల్ఐ ద్వారా నార్లాపూర్లోకి వచ్చే నీటిని ఎల్లూరుకు మళ్లించి.. అక్కడి నుంచి కేఎల్ఐ పరిధిలోని ఇతర రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. పీఆర్ఎల్ఐలో ఒక పంపును రోజంతా నడిపితే సుమారు 0.3 టీఎంసీ నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసే అవకాశం ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో సుమారు 4 టీఎంసీల నీరు ఉన్నట్లు అంచనా. రిజర్వాయర్‌లోకి మరింత నీటిని తీసుకొచ్చే అవకాశం ఉండటంతో.. అవసరమైనప్పుడు ఇంటర్‌లింక్ ద్వారా ఎల్లూరుకు తరలించవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు. నార్లాపూర్ నుంచి స్లూయిస్ ద్వారా నీటిని ఎల్లూరులోకి విడుదల చేసి.. అక్కడి నుంచి సింగోటం, జొన్నలబొగడ, గుడిపల్లి రిజర్వాయర్లకు ఎత్తిపోసే అవకాశం ఉంది. గుడిపల్లి నుంచి కేఎల్ఐ కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయవచ్చు. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్‌కు మళ్లించే అవకాశం ఇంటర్‌లింక్ స్లూయిస్‌తో రోజూ 800 క్యూసెక్కుల వరకు తరలింపునకు వీలు కేఎల్ఐ పరిధిలో పెరగనున్న నీటి లభ్యత.. ఆయకట్టుకు ప్రయోజనం -
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్
కొత్తకోట: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి.. రైతులు, ప్రజలను మోసం చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. శనివారం కొత్తకోట చౌరస్తాలో పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతు దీక్షలో ఆమె పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తయిందని సంబురాలు చేసుకుంటుందని.. ఈ వెయ్యి రోజుల్లో రైతులకు, సామాన్య ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో హామీలు వర్షంలా కురిపించిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. రూ. 2లక్షల రుణమాఫీని అర్హులైన ప్రతి రైతుకు అమలు చేయకుండా, కొందరికే పరిమితం చేసి చేతులు దులుపుకొన్నారని ఆరోపించారు. రైతుభరోసా సకాలంలో అందక, పంటలకు అవసరమైన విద్యుత్ సరఫరా లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొడంగల్‌కు విద్యుత్ సరఫరా చేస్తూ.. ఇతర ప్రాంతాల రైతులకు ఎందుకు కోతలు విధిస్తున్నారని నిలదీశారు. నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం.. రాజకీయ ప్రచారాలు, సంబురాలకే పరిమితమైందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ మాటలు ఎక్కువగా చెప్పారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకుమించి మాటలకే పరిమితమవుతున్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి, గిట్టుబాటు ధరల కల్పనకు ప్రాధాన్యం ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం మున్సిపాలిటీలోని 7వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నంది నర్సయ్య, జాతీయ కోఆప్షన్ సభ్యుడు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, డోకూర్ పవన్‌కుమార్ రెడ్డి, అయ్యవారి ప్రభాకర్‌రెడ్డి, కొండ ప్రశాంత్‌రెడ్డి, కొమ్ము భరత్ భూషణ్, రాజవర్దన్‌రెడ్డి, కౌన్సిలర్ గాయత్రి సత్యంసాగర్, దాబా శ్రీను, నరేంద్రగౌడ్ పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదా కల్పిస్తాం..
కోడె దూడలకు డిమాండ్ వ్యవసాయ అనుబంధమైన పశు పోషణలో ఈ ప్రాంత రైతులు ప్రగతి సాధిస్తున్నారు. నల్లమల తూర్పు పశు సంపదకు తెలంగాణతోపాటు ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక రాష్ట్రంలో మంచి డిమాండ్ ఉంది. కర్నూలు, గుంటూరు, నెల్లూరు, అనంతపూర్, రాయచూర్‌తోపాటు కోస్గి, కొడంగల్ రైతులు దశాబ్దాల కాలంగా మేలుజాతి కోడెలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు ఈ ప్రాంతంలో ఉంటూ పశువులను పరిశీలించి నచ్చిన వాటిని కొనుగోలు చేసేవారు. ప్రతిఏటా దీపావళి తర్వాత జరిగే కురుమూర్తి జాతరలోనూ నల్లమల పశువులను అమ్ముతారు. అటవీ ప్రాంతంలో రాళ్లు, రప్పలు, ఎత్తైన గుట్టలు, లోయ ప్రాంతంలోనూ నడిచే శక్తి ఉంటుంది. కాళ్ల గిట్టలు గుర్రం గిట్టలను పోలి బలంగా ఉండటంతో బాగా నడుస్తాయి. అటవీ మేతతో దృఢంగా ఉండడం, 20– 25 ఏళ్లపాటు వ్యవసాయ పనులు చేసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల వీటిపై ఆసక్తి చూపుతారు. రోగ నిరోధక శక్తి కలిగి ఉండి పాలు సైతం బాగా ఇస్తాయి.నైపుణ్యం కలిగిన పశువులు.. మన్ననూర్ గిత్తగా గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. వ్యవసాయ పనుల్లో ఈ పశువులు మంచి నైపుణ్యం ప్రదర్శిస్తాయి. ఎంత కష్టమైన పనులైనా చేస్తాయి. 35 ఏళ్లుగా పశువుల వ్యాపారం చేస్తున్నా. ఈ ప్రాంత రైతుల నుంచి దూడలు కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతా. వివిధ కారణాలతో పశుజాతి తగ్గడంతో వ్యాపారం కూడా తగ్గింది. నల్లమల పశువులకు నాటు పశువులుగా గుర్తింపు ఉంది. – హన్మంతు, పశువుల వ్యాపారి, తూర్పు పొడజాతి గోవు సంఘం అధ్యక్షుడు నల్లమల పొడజాతి మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదా కల్పిస్తాం. ప్రత్యేకమైన మచ్చలపై పరిశోధన చేయిస్తాం. ఇక్కడ సంతానోత్పత్తి కేంద్రం ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. నల్లమల పశువులకు మంచి డిమాండ్ ఉంది. ఈ జాతి పశువులను సంరక్షించేందుకు ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని నల్లమలకు గుర్తింపు తెస్తాం. – వంశీకృష్ణ, ఎమ్మెల్యే, అచ్చంపేట -
మచ్చలే మకుటంగా.. నల్లమల రాజసం
అచ్చంపేట: నల్లమల గిత్తగా పేరొందిన తూర్పు పొడ జాతి పశువులకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఒంగోలు గిత్తకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. తెలంగాణలో నల్లమల ప్రాంతంలోని మన్ననూర్ గిత్తకు ప్రత్యేక హోదాకు నోచుకోలేకపోతోంది. రాష్ట్రానికి గర్వకారణమైన ఈ జాతికి అరుదైన గౌరవం ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రాంత పశువుకు గౌరవం కల్పించేందుకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ 2025 మే నెలలో అమ్రాబాద్ మండలం మాచారం వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లారు. తెలంగాణ బ్రాండ్‌గా తూర్పు పొడ జాతి పశువులు లోతట్టు ప్రాంతంలో మేలురకం పశు సంపద అమ్రాబాద్ గిత్తకు వందేళ్లకుపైగా చరిత్ర 500 మంది రైతులు.. 20 వేల పశువుల పెంపకం 2020లో ప్రత్యేక పశువుగా గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం కోసం ఎదురుచూపు -
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి.. గోపాల్పేట: కరెంటు కోతలతో పంట పొలాలకు నీరు పారడంలేదని పలు గ్రామాల రైతులు గోపాల్పేట విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో 18 గంటల కరెంటు వచ్చేదని.. ఇప్పుడు 12 గంటలు కూడా సరిగ్గా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాగా, విద్యుత్ ఏఈ సుధాకర్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులోకి రాలేదు. ఏడీఈకి ఫోన్ చేయగా.. సానుకూలంగా స్పందించి కరెంటు సరఫరా చేయడంతో రైతులు శాంతించారు. వనపర్తి రూరల్: వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ కూడా సరఫరా కావడం లేదంటూ శనివారం రైతులు ఆందోళనకు దిగారు. వనపర్తి మండలం నాచహళ్లి, కిష్టగిరి, పెద్దగూడెం తండా, సవాయిగూడెం గ్రామాల రైతులు నాచహళ్లి గ్రామ శివారులోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట పెబ్బేరు – వనపర్తి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో పంటలకు సరిపడా నీరందక ఎండిపోతుండటంతో పాటు బోరుమోటార్లు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల ఇబ్బందులను వెంటనే తీర్చాలని డిమాండ్ చేశారు. రైతుల ధర్నాతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న విద్యుత్ ఏఈ చంద్రశేఖర్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాణిక్యం, రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవరెడ్డి, డేగా మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, రవిప్రకాశ్‌రెడ్డి, టీకే నాయక్, కిష్టగిరి సర్పంచ్ పద్మ వెంకటేశ్, నారాయణ, శంకర్‌నాయక్, బాలకృష్ణ, మహేశ్, అంజి, రూప్లానాయక్, గోవిందు నాయక్, తులసి, రామకృష్ణ, శ్రీను, ఆనంద్ పాల్గొన్నారు. నాచహళ్లిలో ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు -
డిండి ప్రాజెక్టు పనులు నిలిపివేయాలి
కందనూలు: డిండి ప్రాజెక్టు పనులను నిలిపివేయాలని ఉమ్మడి పాలమూరు జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. శనివారం జిల్లాకేంద్రంలోని గాంధీ పార్కులో జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్యాంప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జల సాధన సత్యాగ్రహ దీక్షకు రైతులు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజేందర్‌రెడ్డి, రాఘవాచారి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు పాలమూరు ప్రాజెక్టులు, రైతుల సమస్యలు గుర్తుకురావడం లేదా అని ప్రశ్నించారు. నల్లగొండకు నీటి తరలింపు పేరుతో పాలమూరు రైతులకు అన్యాయం జరుగుతున్నా ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. డిండి ప్రాజెక్టుతో పాలమూరు రైతులు, గ్రామాలు నష్టపోయే పరిస్థితిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎర్రవల్లి, గోకారం, ఉల్పర, అజిలాపూర్ గ్రామాలను ముంపునకు గురిచేసే చర్యలను నిలిపివేయాలని కోరారు. జల సాధన సత్యాగ్రహ దీక్షకు తెలంగాణ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ కోదండరాం ఫోన్లో సంఘీభావం తెలిపారు. పాలమూరు జిల్లా రైతాంగం నీటి హక్కుల కోసం పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటం న్యాయమైనదని ఆయన పేర్కొన్నారు. రైతుల హక్కులు, పాలమూరు ప్రాంతానికి న్యాయం జరిగేలా విధాన మండలిలో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు శశిధర్‌రెడ్డి, లక్ష్మణ్‌గౌడ్, సదానందం, జంగయ్య, చెన్నకిష్టయ్య, బెక్కెం జనార్దన్, తిమ్మప్ప, శ్రీనివాస్‌నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎగువ జలకళ.. దిగువ వెలవెల!
పెద్ద చెరువు బోసిపోతుంది.. భూత్పురు కాల్వ ద్వారా వచ్చే సాగునీటితో అమరచింత పెద్ద చెరువు నిండి అలుగు పారేది. ఈసారి కాల్వకు సాగునీరు విడుదల చేస్తున్నా ఎగువలో ఉన్న రైతులు దిగువకు నీరు వెళ్లకుండా తూములను మూసివేసి, నీటిని తమ తమ గ్రామాలకు మళ్లించుకుంటున్నారు. దీంతో అమరచింత పెద్ద చెరువు నీరులేక బోసిపోయింది. బోరుబావులు కూడా రీచార్జి కావడం లేదు. పంటలు ఎండుముఖం పడుతున్నాయి. – లక్ష్మీనారాయణ, రైతు, అమరచింత లష్కర్‌తో పర్యవేక్షణ.. మక్తల్ మండలం నుంచి నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల వరకు విస్తరించి ఉన్న భూత్పురు కాల్వ వెంట లష్కర్లు నిత్యం పర్యవేక్షణ చేస్తున్నారు. 32 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట ముగ్గురు లష్కర్లు మాత్రమే ఉన్నారు. తూముల షట్టర్లు ధ్వంసం చేశారని తెలుసుకున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నిత్యం కాల్వకు 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నాం. – బాలకృష్ణ, ఏఈ, ఇరిగేషన్‌శాఖ అమరచింత: భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో చివరి ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎగువన ఉన్న రైతులు కాల్వ తూముల షట్టర్లను పగులగొట్టి సాగునీటిని తమ తమ గ్రామాలకు తీసుకెళ్తుండటంతో దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. భూత్పురు రిజర్వాయర్ నుంచి అమరచింత, ఆత్మకూర్ మండలాలకు సాగునీరు అందించే భూత్పురు కాల్వ వెంట ఆయకట్టు రైతులు నిత్యం తిరగాల్సిన దుస్థితి నెలకొంది. 32వేల ఎకరాల ఆయకట్టు.. భూత్పురు రిజర్వాయర్ ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో మక్తల్, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాలు ఉండగా.. మొత్తం 35 గ్రామాల్లోని 32వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రతి వర్షాకాలంలో జూరాల ప్రాజెక్టుకు వచ్చే వరద నీటిని భూత్పుర్ రిజర్వాయర్‌కు.. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని వదులుతున్నారు. ఈసారి గత జూలైలో ప్రధాన ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేశారు. అయితే చివరన ఉన్న అమరచింత పెద్ద చెరువు, పిన్నంచర్ల గ్రామ చెరువుల్లోకి సాగునీరు చేరుకోలేకపోవడంతో ఆయా గ్రామాల రైతులు ఆవేదనకు గురవుతున్నారు. ఏడాది పొడవునా కేవలం ఒకే ఒక పంటను పండించుకునే రైతులకు ఈసారి సాగునీరు వస్తుందని ఆరుతడి పంటలను సాగుచేసుకున్నారు. తీరా కాల్వ ద్వారా సాగునీరు రాకపోవడం.. నీటిని ఎగుమ గ్రామాల రైతులు మళ్లించుకుని వెళ్తున్నారా అనే విషయాన్ని తెలుసుకునేందుకు అమరచింత, పిన్నంచర్ల గ్రామాల రైతులు నిత్యం నర్వ మండలం నాగిరెడ్డిపల్లి, యాంకి గ్రామాల వరకు కాల్వ వెంట వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భూత్పురు రిజర్వాయర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు ఎగువన ఎడమ కాల్వ తూముల షట్టర్ల ధ్వంసం మూడు నెలలుగా నీరు పారుతున్నా నిండని చెరువులు అమరచింత, పిన్నంచర్ల రైతులకు తప్పని సాగునీటి కష్టాలు -
పకడ్బందీగా సర్ ప్రక్రియ
గోపాల్పేట: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని అదనపుక లెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. శనివారం గోపాల్పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చేపట్టిన సర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రచార దినోత్సవం సందర్భంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చే పౌరులకు అవసరమైన సమాచారం అందించాలని బీఎల్ఓలకు సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలను నిబంధనల మేరకు నిర్వహించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో నమోదు కావాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం వనపర్తి రూరల్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన విప్లవ నాయకుడు సీతారాం ఏచూరి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.బాల్‌రెడ్డి అధ్యక్షతన సీతారాం ఏచూరి 2వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జూలకంటి మాట్లాడుతూ.. సామాజిక అసమానతలు లేని సమాజం కోసం ఏచూరి చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. విద్యార్థి దశలోనే ఢిల్లీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని.. దేశంలో మతోన్మాద శక్తులు పెరుగుతున్న సమయంలో లౌకిక శక్తుల ఐక్యత కోసం ఏచూరి నిరంతరం కృషి చేశారన్నారు. ప్రతిపక్షాల ఐక్యత, ఇండియా కూటమి ఏర్పాటుకు కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజలకు విద్య, వైద్యం, ఉపాధి కల్పించే విధానాల కోసం కమ్యూనిస్టులు నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, రాజు, లక్ష్మి, గోపి, ఉమా పాల్గొన్నారు. ప్రసాదాల విక్రయ వేలం రూ.61 లక్షలు చిన్నచింతకుంట: కురుమూర్తి స్వామి ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాల విక్రయ హక్కులు రూ.61.01 లక్షలకు వేలం పలికింది. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం ఆలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయానికి బహిరంగ, సీల్డ్ కవర్ వేలం నిర్వహించారు. ఈ వేలంలో హన్వాడ మండలం కాకర్లపాడుకు చెందిన వెంకటయ్య రూ.61,00,111కు లడ్డు, పులిహోర విక్రయ హక్కులను దక్కించుకున్నారు. అదేవిధంగా విద్యుత్ అలంకరణ పనులను అమరచింతకు చెందిన ప్రవీణ్ రూ.3,49,999కు, రంగులు వేసే పనులను తిర్మలాపురానికి చెందిన ప్రవీణ్ రూ.3.65 లక్షలకు దక్కించుకున్నారు. -
ఆందోళనలో రైతులు..
భూత్పురు కాల్వ నీటిని మళ్లించుకునే యత్నంలో భాగంగా నీరు ముందుకు వెళ్లకుండా తూముల షట్టర్లను పగులగొట్టి మూసి ఉంచుతుండటంతో చివరి ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. అమరచింత మండలంలోని ధర్మపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూముతో పాటు మస్తీపురం గ్రామానికి సాగునీటిని మళ్లించే తూమును గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టడంతో సమస్య జటిలంగా మారింది. మూడు నెలలుగా కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేస్తున్నా సమీప చెరువులకు సైతం నీరు చేరకపోవడం ఏమిటని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. 32.5 కి.మీ. పొడవునా ఉన్న కాల్వ వెంట అడుగుకో పంపుసెట్ ఏర్పాటు చేసుకుని పొలాలకు సాగునీటిని మళ్లించుకుని వెళ్తున్నా అరికట్టే వారే కరువయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
లోతట్టు అభయారణ్యంలో..
నల్లమల లోతట్టు అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో ఉండే మేలుజాతి పశువులకు వందేళ్లకుపైగా చరిత్ర ఉంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని మద్దిమడుగు, ఇప్పలపల్లి, మారడుగు, ఉడిమిళ్ల, చిట్లంకుంట, వంకేశ్వరం, పదర, లక్ష్మాపూర్, తిర్మలాపూర్, ఉప్పునుంతల, మాధవానిపల్లి, అమ్రాబాద్, మన్ననూర్, వటువర్లపల్లి, దోమలపెంట గ్రామాలతోపాటు మల్లాపూర్, అప్పాపూర్, ఈర్లపెంట, మేడిమొల్కల, ఆగర్లపెంట, పుల్లాయిపల్లి, సంగండిగుండాలు చెంచుపెంటల్లో ఈ పశుజాతి ఉంది. ఈ గ్రామాల రైతులు వ్యవసాయంతోపాటు పశుపోషణ ప్రధాన వృత్తిగా ఎంచుకుని పనిచేస్తున్నారు. నల్లమల ప్రాంతంలో మేలుజాతి పొడ పశువులు మన్ననూర్ గిత్తగా నామకరణం.. 2016 డిసెంబర్ 27న అమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్(బికె)లో ఈ ప్రాంత రైతులు, తెలంగాణ జీవవైవిధ్య సంస్థతోపాటు వాన్సన్ స్వచ్ఛంద సంస్థ తూర్పుజాతి పశు ప్రదర్శన ఏర్పాటు చేసింది. అదేవిధంగా పశు పెంపకందారుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ రోజు నల్లమల అటవీ ప్రాంతంలోని పశుజాతికి మన్ననూర్ గిత్తగా నామకరణం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామని అప్పటి సీఎం కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఒక్కో రైతుకు 100 నుంచి 300 వరకు పశువులు ఉండేవి. 50 వేలకుపైగా పశువులు ఉన్న ఈ ప్రాంతంలో ప్రస్తుతం 20 వేలకు తగ్గిపోయింది. ఇది వరకు నల్లమల అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా పశువులను మేపుకొనే వారు. అటవీశాఖ నిబంధనలు, అభ్యంతాల వల్ల పశుగ్రాసం కొరత ఏర్పడింది. పశు పోషణ భారంగా మారి చాలామంది ఆ వృత్తిని వదులుకుంటున్నారు. -
పటిష్ట నిఘాకే సీసీ కెమెరాలు : ఎస్పీ
వనపర్తి: ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు నేరాల నియంత్రణ, నేరస్తుల కదలికలపై పటిష్ట నిఘా, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. నేను సైతం, కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, వివిధ సంస్థలు, దాతల సహకారంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 412 సీసీ కెమెరాలు, మరమ్మతు చేయించిన పాత కెమెరాలను కలుపుకొని మొత్తం 2,221 సీసీ కెమెరాల యూనిట్‌ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, ముఖ్యమైన ప్రదేశాల్లో నిత్యం నిఘా కొనసాగనుందని, కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయడంతో అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలు, నేరాలకు సంబంధించిన ఘటనలను గుర్తించడం నిరంతర ప్రక్రియలో భాగమవుతుందన్నారు. స్మార్ట్ పోలీసింగ్.. సేఫ్ వనపర్తి లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఎస్పీ శాలువాలతో సత్కరించారు. సమాజ హితం కోసం భవిష్యత్‌లోనూ ఇలాంటి సామాజిక భాగస్వామ్యం కొనసాగాలని పిలుపునిచ్చారు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి.. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణలో జరుపుకోవాలని ఎస్పీ సునీతారెడ్డి సూచించారు. శుక్రవారం నిర్వహించిన శాంతి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉత్సవాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉందని, ప్రతి ఒక్క గణపతి మండపం జ్ట్టి ఞట://ఞౌ జీఛ్ఛిఞౌట్ట్చ .్టటఞౌ జీఛ్ఛి.జౌఠి.జీ ుఽ లింకుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మండపాల్లో ఎట్టి పరిస్థితుల్లో డీజేలు ఏర్పాటు చేయరాదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, ఓడీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, జిల్లాలోని ఎస్సైలు, పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ మతాల పెద్దలు, రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు లోక్ అదాలత్
వనపర్తిటౌన్: జిల్లాలోని కోర్టుల్లో శనివారం నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు. సివిల్, వివాహ సంబంధిత కేసులు, మోటారు ప్రమాద క్లెయిమ్స్, చెక్‌బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకోవడంతో డబ్బు, సమయం ఆదా అవుతాయని.. ఏళ్లుగా పరిష్కారం కాని కేసులు పరిష్కరించుకోవచ్చని సూచించారు. సమర్థవంతంగా ప్రజాపాలన దినోత్సవం వనపర్తి: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టరేట్ ఆవరణలో వేడుకల నిర్వహణకు అవసరమైన వేదిక, కుర్చీలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, అధికారులు, ఆహ్వానితులు హాజరయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అందరికీ ఆహ్వానాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్‌శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ప్రతి శాఖకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, సీపీఓ హరికృష్ణ, ఆర్డీఓ సుబ్రమణ్యం పాల్గొన్నారు. కేంద్ర బృందం తనిఖీ మదనాపురం: మండలంలో జల్ సంచయ్.. జల్ భాగీదారి పథకంలో భాగంగా చేపట్టిన నీటి నిల్వ పనులను శుక్రవారం కేంద్ర బృందం ప్రతినిధి అమన్సోన్ పరిశీలించారు. గతేడాది వివిధ గ్రామాల్లో నిర్మించిన ఫాంపాండ్స్, ఇంకుడుగుంతలు, గట్లపై తవ్విన ట్రెంచెస్ తదితర నీటి సంరక్షణ నిర్మాణాల వివరాలను అధికారులు ఆనన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన వర్క్ఐడీల ఆధారంగా మండలంలోని అజ్జకొల్లు, తిరుమలాయపల్లి, రామన్న్పాడు, మదనాపురం, నెల్విడి, నర్సింగాపురం, కొన్నూరు, దుప్పల్లి, ద్వారకానగర్, గోపన్పేట్ గ్రామాల్లో పర్యటించిన బృందం 22 ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీచేసి నిర్మాణాల నాణ్యతను, వినియోగాన్ని సమగ్రంగా పరిశీలించింది. వారి వెంట ఏపీఓలు వీబీ జయరామ్, బాలయ్య, ఈసీ ముఖీద్, సాంకేతిక సహాయకులు (టీఏలు) సౌమ్య, జ్యోతి, భరత్, రాఘవేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది ఉన్నారు. -
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాల నిర్వహణ
వనపర్తి: వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతికమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్వాహకులు మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్‌శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సరఫరాకు నాణ్యమైన, ప్రమాణాలకు అనుగుణమైన తీగలను మాత్రమే వినియోగించాలని.. సంబంధిత శాఖ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో కూడా ముందుగానే విద్యుత్ సరఫరా, ఇతర అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల్లో డీజేలు నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వినియోగించాలని.. అధిక శబ్ధంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, ఆస్పత్రుల్లోని రోగులకు ఇబ్బందులు కలగకుండా శబ్ధ పరిమితులు తప్పనిసరిగా పాటించాలన్నారు. అవసరమైన చోట తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, నిమజ్జన కార్యక్రమం సజావుగా జరిగేలా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నిమజ్జనం రోజున మద్యం దుకాణాలు మూసి వేయించనున్నట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నిర్వాహకులు, ప్రజలు అధికారులకు సహకరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో పుర చైర్పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీస్, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, పారిశు ద్ధ్య తదితర శాఖల అధికారులు, మసీద్ కమిటీ సభ్యులు, శాంతికమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
వేగవంతం చేస్తున్నాం.. నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ మధ్య ఓపెన్ కాల్వలో కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద ఉన్న రాయిని తొలిగింపు పనులు వేగవంతం చేశాం. డిసెంబర్ చివరిలోగా తొలిగింపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. రాయి బ్లాస్టింగ్ చేసి లోతు నుంచి బయటకు రాళ్లు తీసుకెళ్లడం కొంత ఇబ్బందిగా ఉంది. కాల్వలో హార్డ్ రాక్ తొలిగిస్తే నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్‌కు నీళ్లు తరలించవచ్చు. ఏదుల నుంచి వట్టెం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి కర్వెనకు ఎత్తిపోయడానికి పంపుసెట్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. అన్ని పనులు పూర్తయ్యి.. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీళ్లు ఉంటే రిజర్వాయర్‌లోకి తరలించవచ్చు. – పార్థసారధి, ఇరిగేషన్ ఎస్ఈ నాగర్‌కర్నూల్: బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పనులు కొనసా..గుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. గతేడాది మే నెలలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి 2025 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించినా.. ఇంకా చాలా వరకు పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో ఈ ఏడాది రెండు పంపుసెట్లు ప్రారంభించినా.. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసి నిలిపివేశారు. ఏదుల రిజర్వాయర్‌కు నీటిని సరఫరా చేయడానికి ఓపెన్ కాల్వ పనులు అసంపూర్తిగా ఉండటమే ఇందుకు కారణం. కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల గట్టి రాయి ఉండటంతో నీరు వదలడానికి వీలు కాలేదని, ప్రస్తుతం రాయి తొలగింపు పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అసంపూర్తిగా ప్రధాన కాల్వ.. నార్లాపూర్ నుంచి ఏదుల మధ్యలో 6.4 కి.మీ., ప్రధాన కాల్వ ఉంది. దాదాపు 40– 25 మీటర్ల వెడల్పు, లోతు ఉంటుంది. కాల్వ తవ్వకాలు జరిగినా కుడికిళ్ల, తిర్నాంపల్లి వద్ద హార్డ్ రాక్ ఉండటంతో పనుల్లో వేగం తగ్గింది. దాదాపు ఆ రెండు చోట్ల 8 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి, మట్టి ఉందని అధికారుల అంచనా. గతేడాది మే నెలలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పర్యటించి కాల్వ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గతేడాది డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తే ఈ ఏడాది వానాకాలం సీజన్లో నీళ్లు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినా.. పనులు కాలేదు. ఇంకా ఓపెన్ కాల్వలో కుడికిళ్ల వద్ద హార్డ్ రాక్తో కాల్వ తవ్వకాలు నెమ్మదించాయి. ఇందుకు ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని విమర్శలున్నాయి. తాజాగా పనులు డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించినా.. ప్రస్తుత పరిస్థితి చూస్తే వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్‌ల సమీక్షకు వచ్చిన తర్వాత పనుల్లో కొంత వేగిరం పెరిగిందనే చెప్పవచ్చు. ఏదేమైనా రిజర్వాయర్లలోకి నీళ్లు వచ్చేది 2027 వానాకాలం సీజన్లోనే. అప్పటి వరకు పాలమూరు– రంగారెడ్డి వినియోగంలోకి రాదు. కేవలం నార్లాపూర్ రిజర్వాయర్ నుంచి మిషన్ భగీరథ కోసం ఉపయోగించుకునే విధంగా పనులు జరుగుతున్నాయి. ఇక నార్లాపూర్– ఏదుల మధ్య ఓపెన్ కాల్వతోపాటు 16 కి.మీ., పొడవు సొరంగం ఉంది. సొరంగం పని దా దాపుగా పూర్తి కాగా.. ముందు భాగంలో 50 మీటర్ల పొడవు పని చేయాల్సి ఉంది. నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న వడ్డెర గుడిసెలు, సున్నపుతండా వాసులను ఇటీవల ఖాళీ చేయించారు. వచ్చే ఏడాది నాలుగు రిజర్వాయర్లకు నీళ్లు తరలనున్నాయి. నార్లాపూర్– ఏదుల రిజర్వాయర్ల మధ్యలో ఓపెన్ కాల్వలో కొనసాగుతున్న రాయి తొలగింపు పనులు ‘పాలమూరు–రంగారెడ్డి’ నీటికోసం తప్పని నిరీక్షణ నార్లాపూర్– ఏదుల మధ్య పూర్తి కాని కాల్వ పనులు దాదాపు 8 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపునకు చర్యలు డిసెంబర్ నాటికి లక్ష్యం నిర్దేశం.. మార్చి వరకు కొనసాగే అవకాశం ఆ మట్టి తొలిగిస్తేనే ఏదుల రిజర్వాయర్‌కు సాఫీగా నీరు 2015లో శంకుస్థాపన.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 2015లో రూ.35,200 కోట్ల అంచనాలతో అప్పటి సీఎం కేసీఆర్ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద నార్లాపూర్ నుంచి ఏదుల, ఏదుల నుంచి వట్టెం, మరోవైపు ఏదుల నుంచి కర్వెన, అక్కడి నుంచి ఉదండాపూర్ రిజర్వాయర్లకు నీళ్లు తరలిస్తారు. ప్రస్తుతం నార్లాపూర్, ఏదుల, కర్వెన, వట్టెం రిజర్వాయర్లు దాదాపుగా పూర్తవగా.. ఉదండాపూర్ పనులు కొనసాగుతున్నాయి. పంపుహౌస్‌ల్లో మోటార్లు బిగింపు సైతం పూర్తి అయ్యింది. నీళ్లు వస్తే చాలు ఉదండాపూర్ రిజర్వాయర్ మినహాయిస్తే మిగతా రిజర్వాయర్లు ఏదుల, వట్టెం, కర్వెన నీటితో కళకళలాడుతూ.. భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతాయి. -
పకడ్బందీగా భూ రీ–సర్వే
ఖిల్లాఘనపుర: ప్రభుత్వ నిబంధనల ప్రకారం పకడ్బందీగా భూ రీసర్వే చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం మండలంలోని మల్కాపురం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ–సర్వేను రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి పరిశీలించారు. రోవర్ల వినియోగం, ఆధునిక సాంకేతికతో సర్వేయర్లు భూములు కొలుస్తున్న విధానాన్ని క్షేత్రస్థాయిలో చూశారు. భూములు కొలిచే సమయంలో ఎదురవుతున్న సమస్యలను అడిగి పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపడుతున్న భూ రీ సర్వేకు మల్కాపురం పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై ందన్నారు. గ్రామ శివారులోని భూములకు సంబంధించి రికార్డులు సమగ్రంగా, పారదర్శకంగా నవీకరించడంతో పాటు సర్వేనంబర్ల వారీగా హద్దులు గుర్తించి వివాదాలను పరిష్కరిస్తారని తెలిపారు. డిజిటల్ భూ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయడం ప్రాజెక్టు ఉద్దేశమని.. రైతులు, సర్పంచ్, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు సర్వే అఽధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. రైతుల సందేహాలు, అభ్యంతరాలను నివృత్తి చేసి నిబందనల ప్రకారం సర్వే చేపట్టాలని సూచించారు. అక్కడికి వచ్చిన రైతులతో మాట్లాడి సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో సర్వే ఏడీ శ్రీనివాసులు, తహసీల్దార్ సుగుణ, ఎంపీడీఓ విజయసింహారెడ్డి, సర్పంచ్ రవీందర్, రెవెన్యూ అఽధికారులు, సర్వేయర్లు పాల్గొన్నారు. జ్వరంతో వచ్చే రోగికి డెంగీ పరీక్షలు.. జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి కచ్చితంగా డెంగీ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం మండలకేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివిధ విభాగాల్లో తిరిగి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. డెంగీ పరీక్షలు చేయడంతో సకాలంలో గుర్తించి వైద్యం అందించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. క్షయ అనుమానితులను గుర్తించి అవసరమైన వారికి ఎక్స్‌రే తీసేందుకు ప్రభుత్వం ఇచ్చిన యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రి ఆవరణలో శుభ్రత పాటించాలని సూచించారు. ● మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ శిథిలావస్థకు చేరిందని.. నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శుక్రవారం ఆయన హాస్టల్ గదులను పరిశీలించగా.. పైకప్పు పెచ్చులూడి కనిపించడంతో స్పందించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్, ఎస్సీ సంక్షేమశాఖ అఽధికారి రాంజీరావు, వైద్యులు, సిబ్బంది, వివిధ శాఖల అఽధికారులు ఉన్నారు. -
ప్రాచీన చేతిరాతల డిజిటలైజేషన్
వనపర్తి: ఆధ్యాత్మిక, ఆయుర్వేద, ప్రాచీన చరిత్రకు సంబంధించిన చేతిరాతలు సేకరించి వాటిని డిజిటలైజేషన్ చేసేందుకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అధ్యక్షతన జిల్లా కమిటీ ఏర్పాటైంది. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజలు తమ ఇళ్లలో భద్రపర్చుకున్న ప్రాచీన చేతిరాతలు, ఆలయాలు, మఠాలు, దర్గాల్లోని వారసత్వ గ్రంథాలు, ఆయుర్వేద గ్రంథాలు తదితర చేతిరాతలను గుర్తించి వాటిని డిజిటలైజేషన్ చేసి తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సభ్యులకు సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్థుల ద్వారా చేతిరాతల వివరాలు సేకరించి నిర్ణీత ప్రొఫార్మాలో వివరాలను ముందుగా సేకరించాలన్నారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి నరేందర్‌కుమార్, ఎఫ్–సెక్షన్ సూపరింటెండెంట్ సునీత, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శక ఓటరు జాబితా లక్ష్యం
● 88,727 మంది ఓటర్లకు ‘సర్’ నోటీసులు ● సరైన ఆధారాలు చూపిస్తే ఓటుహక్కు కల్పిస్తాం ● జిల్లాలో 2.35 లక్షల ఓటర్లు ● గ్రామాలకు వెళ్లి విచారణ.. ఆధారాల సేకరణలో సిబ్బంది ● ‘సాక్షి’ ఫోన్–ఇన్‌లో అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ ప్రశ్న : కొత్త ఓటరు నమోదుకు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? – నవీన్, గోపాల్పేట అదనపు కలెక్టర్ : ఏడాదికి రెండు అంతకంటే ఎక్కువ సార్లు అర్హులకు ఓటు హక్కు కల్పించేందుకు సీఈఓ ఫారం–6 స్వీకరిస్తుంది. ఆ సమయంలో దరఖాస్తును తహసీల్దార్ కార్యాలయం ఎన్నికల విభాగంలోగాని, ఆన్‌లైన్‌లోగాని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 12, 13 తేదీల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ఈ అవకాశాన్ని 18 ఏళ్లు నిండిన వారు ఉపయోగించుకోవాలి. ప్రశ్న : వయసు 45 ఏళ్లు పైబడి ఉంటుంది. ఎక్కడా ఓటుహక్కు లేదు. ఓటరు నమోదుకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? – రాములు, పాన్‌గల్ అదనపు కలెక్టర్ : వయస్సు ఎక్కువగా ఉండి ఓటరు నమోదుకు దరఖాస్తు చేసినట్లయితే.. సంబంధిత డాక్యుమెంట్లతో పాటు దేశంలో మరెక్కడా ఓటుహక్కు లేదని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో సదరు వ్యక్తికి ఇతర ప్రాంతంలో ఓటుహక్కు ఉన్నట్లు నిర్థారణ అయితే భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం శిక్షార్హులవుతారు. పేర్లు, వయసు, ఇంటిపేరులో వ్యత్యాలుంటే.. మునుపటి ఓటరు జాబితాలో ఒకలా.. ప్రస్తుత ఓటరు జాబితాలో మరోలా పేరు ఇద్దరూ ఒక్కరే అని ధ్రువీకరించేందుకు సీఈఓ జారీ చేసిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒకటి బీఎల్వోలకు సమర్పిస్తే అప్పటికప్పుడే ఆన్లైన్లో నమోదు చేస్తారు. 2026, నవంబర్ 9న చేసే తుది ఓటరు జాబితాలో వారికి ఓటుహక్కు కల్పించబడుతుంది. ప్రశ్న : సర్ నోటీసులు జారీ చేయడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. గ్రామసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదా..? – అంజద్ అలీ, రామన్‌పాడ్, మదనాపురం అదనపు కలెక్టర్ : పాత, ప్రస్తుత ముసాయిదా ఓటరు జాబితాలో పేరు, ఇంటిపేరు, వయస్సులో వ్యత్యాసాలుంటే నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు జాబితాల్లో పేర్కొన్న వ్యక్తి ఒక్కరేనని నిర్ధారించేందుకు సీఈఓ నిర్దేశించిన ధ్రువపత్రాల్లో ఏదైన ఒకటి బీఎల్వోకు అందజేస్తే సమస్య వెంటనే పరిష్కారమవుతుంది. విచారణ అధికారులు గ్రామాలకు వచ్చి గ్రామసభలు నిర్వహిస్తూ అక్కడే సమస్యలను పరిష్కారం చేస్తున్నారు. వనపర్తి నియోజకవర్గంలోని పది మండలాల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఆవాస ప్రాంతాలకు 20 బృందాలను ఏర్పాటు చేశాం. వనపర్తి: నోటీసులు వచ్చాయని ఓటర్లు ఆందోళన చెందాల్సిన పనిలేదు.. కేవలం వివరాలను సరిచేసేందుకు కావాల్సిన డాక్యుమెంట్లు సమర్పించాలనే నోటీసులు జారీ చేశాం.. ఓట్లు గల్లంతవుతాయనే అపోహలు వదిలేయండి.. సరైన ధ్రువపత్రాలు బీఎల్వోలకు సమర్పించి ఓటుహక్కు పొందాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ సూచించారు. ‘సర్’ ప్రక్రియపై ఓటర్లకు ఉన్న అపోహలు తొలగించి సందేహాలను నివృత్తి చేసేందుకు శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వివరాలు వెల్లడించటంతో పాటు పలువురు ఓటర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. జిల్లాలో ఎస్ఐఆర్కు ముందు 2.75 లక్షల ఓట్లు ఉండేవని.. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన లెక్కల ప్రకారం పబ్లిష్ చేసిన ఓటరు జాబితాల్లో 2.35 లక్షలు ఉండగా, వారిలో 88,727 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇందులో నో మ్యాపింగ్ ఓటర్లు 12,087 మంది.. పేర్లు, ఇంటిపేర్లు, వయసు వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు 76,640 మంది ఉన్నట్లు గుర్తించామన్నారు. నో మ్యాపింగ్ జాబితాలో ఉన్న వారు 1987కు ముందు జన్మించిన వారైతే స్థానికులనే ధ్రువపత్రం ఏదైనా ఒక్కటి సమర్పిస్తే సరిపోతుందని తెలిపారు. 1987–2004 మధ్య కాలంలో జన్మించిన వారైతే తన ధ్రువపత్రంతో పాటు ఈ ప్రాంతంలో తన తండ్రి ఓటు వేసినట్లుగా ఓటరు జాబితాలో ఉన్న ఎపిక్ నంబర్, ఓటరు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ 2004 –2025 మధ్య కాలంలో జన్మించిన వారైతే వారి స్థానిక ధ్రువపత్రంతో పాటు కుటుంబ సభ్యుల్లో కనీసం ఇద్దరి ఓటర్లు జాబితాలోని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడే సదరు వ్యక్తి ఓటుహక్కును బీఎల్వోలు జాబితాలో చేర్చేందుకు సిఫారస్ చేస్తూ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రశ్న : కొన్ని ఇంటినంబర్లపై 20కి పైబడి ఓట్లు ఉండటం ఎలా సాధ్యం? – శ్రీనివాసులు, మదనాపురం అదనపు కలెక్టర్ : అద్దెకు ఉన్న ఇళ్లలో ఎక్కువ ఓటర్లు ఉన్నట్లు గుర్తించాం. ఇందులో చాలావరకు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించినప్పుడే తగ్గిపోయాయి. స్థానికంగా ఉంటున్నారు.. ఇదివరకు ఇక్కడి ఓటరు జాబితా ప్రకారం వారి కుటుంబ సభ్యులు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా ఆధారాలు సమర్పించిన వారికే జాబితాలో పేర్లు నమోదవుతాయి. ప్రశ్న : పెళ్లి చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి మన ప్రాంతానికి వచ్చిన వారు ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి. – విజయ్‌కుమార్, పెబ్బేరు అదనపు కలెక్టర్ : దేశంలో ఏ రాష్ట్రం, ఏ ప్రాంతం నుంచి అయినా ఇక్కడికి పెళ్లి చేసుకుని వచ్చిన మహిళలైనా వారి తల్లిదండ్రుల ఓటుహక్కు ఎక్కడ ఉంటే అక్కడి వివరాలను ఓటరు జాబితా ఆధారంగా సేక రించి సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సిందే. భర్త వివరాలను పేర్కొనాలనుకోవడం సరికాదు. ప్రశ్న : మా అమ్మ ఇంటిపేరు లేకుండా ఓటరుగా నమోదు చేశారు. ఆమె చదువుకోలేదు. ఏ ధ్రువపత్రాలు సమర్పించాలి. – నర్సింహ, గోపల్‌దిన్నె, వీపనగండ్ల అదనపు కలెక్టర్ : పట్టాదారు పాసు పుస్తకం, ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణపత్రం, పింఛన్‌కార్డు, ఆధార్‌కార్డు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఓటుహక్కు కల్పిస్తాం. -
గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలి
వనపర్తి రూరల్: గర్భిణుల్లో రక్తహీనతను గుర్తించి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం మండలంలోని కడుకుంట్ల పీహెచ్‌సీని ఆయన సందర్శించి రోగులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి పాముకాటు బాధితులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అందుబాటులో ఉన్న మందులు, యాంటీ స్నేక్ వీనం (ఏఎస్వీ) నిల్వలు, వాటి వినియోగం, పాము కాటు కేసులు వచ్చినప్పుడు చేపడుతున్న వైద్య ప్రక్రియ తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పాముకాటు బాధితులకు పీహెచ్సీ స్థాయిలోనే తక్షణ వైద్యం అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందుకు అవసరమైన మందులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పీహెచ్సీ పరిధిలో గర్భిణుల వివరాలు, వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న సేవలపై చర్చించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, భౌతికశాస్త్రం, గణితం, ఆంగ్లం సబ్జెక్టులో ప్రత్యేకంగా రూపొందించిన సామగ్రి ఆధారంగా వెనుకబడిన విద్యార్థులకు బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడా మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్, వైద్యాధికారి రాకేష్‌రెడ్డి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
‘సర్’పై ‘సాక్షి’ ఫోన్–ఇన్
వనపర్తి: జిల్లాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఓటర్ల సందేహాల నివృత్తికి శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌తో ‘ఫోన్–ఇన్’ నిర్వహిస్తున్నాం. జిల్లాలోని ఓటర్లు తమ సందేహాలు, సమస్యలను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు తెలియజేయాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరిష్కారం పొందాలి. సమయం : ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 వరకు సెల్‌నంబర్లు : 91009 04724, 95539 55698 -
సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి
పాన్‌గల్: రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే కృషి విజ్ఞాన శాస్త్రవేత్త డా. భవాని సూచించారు. గురువారం మండలంలోని దావాజిపల్లిలో యూత్ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో యాజమాన్య పద్ధతులు, వరి సాగు, ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, నానో ఎరువుల వినియోగం, పప్పుధాన్యాలు, ఆయిల్‌పాం, కూరగాయల సాగు గురించి వివరించారు. చీడపీడల నివారణకు అధికారుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిప్పేస్వామి, సర్పంచ్ సూగురమ్మ, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు. 13న జిల్లా కబడ్డీ జట్టు ఎంపికలు వనపర్తి రూరల్: పెబ్బేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13న ఉదయం 8 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఽఆధ్వర్యంలో జూనియర్ బాలురు, సబ్ జూనియర్స్ బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య గురవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురు 05.11.2006 తర్వాత జన్మించి 75 కిలోల బరువు.. బాలికలు 10.12.2010 తర్వాత జన్మించి 55 కిలోల బరువున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు పదోతరగతి ఒరిజినల్ మార్కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రం, బోనాఫైడ్ తీసుకురావాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 70130 50502, 85001 65900 సంప్రదించాలని సూచించారు. ఆయిల్‌పాం తోటలపరిశీలన కొత్తకోట రూరల్: మండల కేంద్రానికి చెందిన రైతు వేముల హరీశ్‌రెడ్డి ఆయిల్‌పాం తోటలను గురువారం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. వీణాజ్యోషి, అసోసియేట్ ప్రొఫెసర్ డా. శంకరస్వామి పరిశీలించారు. ఎల్‌నినో నేపథ్యంలో తోటల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీరు, పోషకాహార నిర్వహణ, మొక్కల సంరక్షణకు పలు సూచనలు చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని, పంటను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. అధిక దిగుబడులు సాధించేందుకు ఉద్యాన అధికారుల సలహాలు పాటించాలన్నారు. -
చాకలి ఐలమ్మ జీవితం ఆదర్శం
వనపర్తి: ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు చాకలి ఐలమ్మ చూపిన తెగువను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని.. ఆమె పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతికి ఆయనతో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్‌తో ముఖ్యఅతిథులుగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికసంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాటంలో ధైర్యంగా నిలిచి భూస్వామ్య దోపిడీ, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత అని కొనియాడారు. ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం ఆమె చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. మహిళలు తమ హక్కులపై అవగాహన కలిగి, ఆత్మవిశ్వాసంతో అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు ఐలమ్మ జీవితం స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణకు ఆమె చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. అంతకుముందు రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ సమాజంలోని ప్రతి ఒక్కరికీ ఆదర్శమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తూ హక్కుల కోసం పోరాడిన ఐలమ్మ సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలిపారు. ఈ సందర్భంగా సామాజికవేత్తలు రాజారాం ప్రకాష్, గంధం నాగరాజు చాకలి ఐలమ్మ జీవితంపై పాడిన పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీసీ సంక్షేమశాఖ అధికారి ప్రమీల, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం
వనపర్తిటౌన్: కనుమరుగవుతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు భక్తిభావాన్ని పెంపొందించేందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దోహదపడతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో 15 రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగంలో గురువారం నిరంజన్‌రెడ్డి, వాసంతి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశ్వశాంతి కోసం ఇంతటి మహాయాగాన్ని నిర్వహించడం వనపర్తికి ప్రత్యేకతను తీసుకొస్తుందని పేర్కొన్నారు. ప్రజలు సుభిక్షంగా, సౌభాగ్యంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పూర్ణాహుతి అనంతరం వేదపండితులు నిరంజన్‌రెడ్డి దంపతులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలుస రమేష్‌గౌడ్, వాకిటి శ్రీధర్, గట్టుయాదవ్, వనం రాములు, దిలీప్‌రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఊరి పేరు.. తకరారు!
●ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మల్రెడ్డి నర్సింహారెడ్డి. ఈయన తన సొంత పొలం 5 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో తమ గ్రామం పేరు అమరచింత మండలంలో చూపిస్తుండడంతో ఎరువులు అక్కడ బుకింగ్ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తా రూ.300 ఉంటే అక్కడి నుంచి తమ గ్రామానికి రవాణాకు రూ.200 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లక్ష్మణ్‌గౌడ్. 4 ఎకరాల్లోవరి సాగు చేశాడు. గతంలో ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా ఒక్కటే బుకింగ్ చేసుకునే వారమని, ఇప్పుడు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు ఆన్లైన్లోనే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. రెండు, మూడు బస్తాల ఎరువులు అవసరమైనా 45 కిలోమీటర్ల దూరంలోని అమరచింత మండలంలోనే చూపిస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు, మూడు బస్తాల కోసమైనా ఆటో తీసుకొని వెళ్తే కిరాయి రూ.1,500 నుంచి 2 వేలు చెల్లించాల్సి వస్తోందంటున్నారు. సమస్య పరిష్కారంపై దృష్టి పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రైతులు ఇబ్బందులు పడుతున్న వాస్తవం. సమస్య మా దృష్టిలో ఉంది. ప్రస్తుతం ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో వారికి అమరచింత మండలంలోని పామిరెడ్డిపల్లిలో ఫర్టిలైజర్స్ వివరాలు చూపెడుతుంది. సమస్యను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల వ్యవధిలో పూర్తిగా పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతలోపు కొత్తకోట నుంచి రెండు లారీల యూరియా తీసుకెళ్లా స్థానిక రైతువేదిక వద్ద అందుబాటులో ఉంచుతాం. – సైదులు యాదవ్, ఏఓ, పెద్దమందడి అమరచింత: వనపర్తి జిల్లాలోని అమరచింత మండలంలో ఒక పాంరెడ్డిపల్లి, పెద్దమందడి మండలంలో మరో పామిరెడ్డిపల్లి ఉండడంతో ఫార్మర్ రిజిస్ట్రీలో ఇ బ్బందులు తలెత్తున్నాయి. పెద్దమందడి మండలంలో ని పామిరెడ్డిపల్లికి చెందిన రెవెన్యూ భూములను అమరచింత పాంరెడ్డిపల్లిలో రెవెన్యూ రికార్డులో చూపుతుండడంతో ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో ఎరువుల బుకింగ్‌కు అవస్థలు తప్పడం లేదు. కానీ సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా వ్యవసాయ అధికారులు నెలల తరబడి చోద్యం చూస్తున్నారు. రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. కాలం వెళ్లదీస్తున్నారే తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదు. 45 కి.మీ. వెళ్లాల్సిందే.. పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రెవెన్యూలో ముందరితండా, చీకరుచెట్టుతండా, దొడగుంటపల్లి, అంకూరు, బలిజపల్లికి చెందిన కొంత పొలాలు కలిపి సుమారు 1600 మంది రైతులు 2,800 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 1,850 ఎకరాల్లో వరి, వేరుశనగ 400 నుంచి 500 ఎకరాల్లో, 250 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఫార్మర్ రిజిస్ట్రీలో అధికారులు చేసిన తప్పుకు రైతులు ఎరువులు తెచ్చుకోవాలంటే సుమారు 45 కి.మీ దూరంలో ఉన్న అమరచింత మండలానికి వెళ్లాల్సిన దుస్థితి వస్తోంది. దీంతో రైతులకు రవాణా భారం తడిసి మోపెడవుతోంది. పెద్ద రైతులు ట్రాక్టర్లు, ఆటోలు కిరాయికి తీసుకొని వెళ్తున్నా.. రెండు, మూడు బస్తాల ఎరువులు కావాల్సిన సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వనపర్తి రూరల్: విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదంటూ గురువారం మండలంలోని కడుకుంట్ల శివారు సబ్‌స్టేషన్ ఎదుట కడుకుంట్ల సర్పంచ్ తిరుపతయ్య ఆధ్వర్యంలో కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్ కోతలతో బోర్లుమోటార్లు తరచూ కాలిపోతున్నాయని, పంటలకు సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్ పెరిగి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీఈ రైతులకు వివరించారు. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్, మాధవరెడ్డి, డేగా మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, లక్ష్మీకాంత్, బాలకృష్ణ, కొండయ్య, కృష్ణానాయక్, మనీష్, గ్రామ అధ్యక్షుడు వెంకటేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. రైతుల ఆందోళన పామిరెడ్డిపల్లి రైతులు గురువారం ప్రధాన రాహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో పెద్దమందడి ఎస్ఐ జలంధర్‌రెడ్డి రైతుల సమస్య గురించి ఫోన్లో తహసీల్దార్, ఏఓ చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీనిపై వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రీ చేసేటప్పుడు పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి భూముల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా అమరచింత మండలంలోని పాంరెడ్డిపల్లి క్లస్టర్ చూపుతుందన్నారు. ఢిల్లీలోని వ్యవసాయ ప్రధాన కార్యాలయం నుంచే సమస్యను పరిష్కరించే వీలుంటుందని, సమయం పడుతుందని తెలిపారు. జిల్లాలో రెండు పామిరెడ్డిపల్లి గ్రామాలు ఎఫ్ఎఫ్ఎస్ యాప్‌లో బుకింగ్‌కు ఇబ్బందులు రైతులకు తప్పని అవస్థలు -
వదంతులు సృష్టిస్తే కటకటాలకే.. : ఎస్పీ
మదనాపురం: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ సామాజిక మాధ్యమాలు వేధికగా వదంతులు, అసత్య ప్రచారాలు వ్యాప్తిచేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని.. సైబర్ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతారెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా రిసెప్షన్ కేంద్రాన్ని సందర్శించి బాధితులతో సిబ్బంది ప్రవర్తిస్తున్న తీరుపై ఆరా తీశారు. రికార్డులు, సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్టేషన్‌కు వచ్చే వారికి పోలీస్ వ్యవస్థపై విశ్వాసం పెరిగేలా పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల పురోగతిని సమీక్షించి పాత నేరస్తులు, సమస్యాత్మక వ్యక్తుల వివరాలు సేకరించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచి ఈవ్‌టీజింగ్, చోరీలు, గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అనంతరం వినాయక నిమజ్జన ప్రధాన ప్రదేశాలైన సరళాసాగర్, రామన్‌పాడ్, కొత్తపల్లి వంతెన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిశాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. మండపాల నుంచి నిమజ్జన ప్రదేశాల వరకు నిరంతర నిఘా కొనసాగాలని.. మద్యం తాగి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్, ఆకతాయి పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. ఆమె వెంట డీఎస్పీ గిరిబాబు, ఆత్మకూరు, కొత్తకోట, వనపర్తి సీఐలు శివకుమార్, ఓడీ రమేష్, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు అప్పలనాయుడు, శ్రీనివాస్, ఎస్ఐ జగదీశ్వర్ పాల్గొన్నారు. -
సమన్వయంతోనే ’ఉల్లాస్’ విజయవంతం
● స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ వనపర్తి: సమన్వయంతో ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో కార్యక్రమం అమలు, శిక్షణ, రాత పరీక్ష నిర్వహణ, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రతి ఒక్కరికీ అక్షరాస్యత, విద్యా అవకాశాలు అందించడమే ఉల్లాస్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. తమ రోజువారీ జీవితంలో చదవడం, రాయడం, లెక్కలు చేయడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ సేవలు, ఆరోగ్యం, విద్య తదితర అంశాలపై అవగాహన పెంచుకోవడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. అక్షరాస్యత వ్యక్తిగత అభివృద్ధితో పాటు కుటుంబం, సమాజ అభివృద్ధికి కూడా దోహదపడుతుందని.. ముఖ్యంగా మహిళల అక్షరాస్యత పెంపొందించడంతో ఆర్థిక, సామాజికంగా మరింత సాధికారత సాధించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లాస్ కార్యక్రమం కింద జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు చెందిన 20,992 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులు, పట్టణ ప్రాంతాలకు చెందిన 1,200 మంది సభ్యులు శిక్షణ పొందుతున్నారని.. వీరంతా 20వ తేదీన నిర్వహించే రాత పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. జిల్లాలో కార్యక్రమం సజావుగా, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలయ్యేలా జిల్లా పంచాయతీ అధికారి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. శిక్షణ పొందుతున్న ప్రతి ఒక్కరూ రాత పరీక్షకు తప్పనిసరిగా హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అంగనన్‌వాడీ కేంద్రాల ద్వారా కార్యక్రమానికి అవసరమైన సహకారం, సమన్వయం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ శిక్షణ నుంచి పరీక్షల వరకు ప్రతి దశను సమర్థవంతంగా పర్యవేక్షించి జిల్లాను ముందంజలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ రామమహేశ్వర్, డీపీఓ రఘునాథ్, డీడబ్ల్యూఓ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
తప్పిదాలతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
వనపర్తి టౌన్: విద్యార్థులు చదువుతో పాటు భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దీప సూచించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని చాణక్య పాఠశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు హాజరై పాఠశాల రేడియో స్టేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, తెలియక చేసే తప్పిదాలు భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. సోషల్ మీడియా, ఆన్లైన్ వేధికలను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. పోక్సో చట్టంపై అవగాహన లేకుండా చేసే తప్పులు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉందన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని కోరారు. అనంతరం విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ప్రత్యేక ఓటరు శిభిరాలు వినియోగించుకోవాలి
వనపర్తి: ప్రత్యేక ఓటరు నమోదు శిభిరాలను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించనున్నామని.. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతి, ప్రత్యేక ఓటరు నమోదు శిభిరాల నిర్వహణపై పలు సూచనలు చేశారు. జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆయా తేదీల్లో బూత్‌స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని చెప్పారు. 2026, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఫారం–6, ఓటరు వివరాల్లో సవరణల కోసం ఫారం–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక శిభిరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. కొత్త ఓటరు నమోదుకు వయస్సు, చిరునామా ధ్రువీకరణ పత్రం, డిక్లరేషన్‌తో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు సమర్పించాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి వ్యక్తిగతంగా రావడం సాధ్యం కానివారు ఆనన్లైనన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్ల నోటీసుల పరిష్కారంపై బీఎల్వోలు, ఏఈఆర్వోలు చురుగ్గా పనిచేస్తున్నారని చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏవైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబర్ 1950ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, ఇతర అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్ డబుల్.. స్పీడ్ డబుల్..
● చురుగ్గా సాగుతున్న రెండోట్రాక్ పనులు ● మహబూబ్‌నగర్–మన్యంకొండ మధ్య పనులు పూర్తి.. ● 90 కి.మీ. వేగానికి అనుమతి స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైల్వే రంగానికి మహర్దశ రానుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్–సికింద్రాబాద్ మధ్య డబ్లింగ్ లైన్ అందుబాటులోకి రాగా.. తాజాగా మహబూబ్‌నగర్–డోన్ (ద్రోణాచలం) మధ్య రెండో రైల్వే లైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 185 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులు పూర్తయితే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రాకపోకలకు మరింత వెసులుబాటు కలగనుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రైళ్ల సంఖ్య పెంచేందుకు అవకాశం ఏర్పడనుంది. మన్యంకొండ వరకు పూర్తి మహబూబ్‌నగర్–మన్యంకొండ స్టేషన్ల మధ్య రెండో ట్రాక్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 18న రైల్వే సేఫ్టీ కమిషనర్ మాధవి ఈ మార్గాన్ని సమగ్రంగా తనిఖీ చేసి స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. ప్రత్యేక మోటార్ ట్రాలీపై అధికారులతో కలిసి ప్రయాణిస్తూ ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, వంతెనలు తదితరాలను పరిశీలించారు. కొత్త లైన్‌పై రైళ్ల స్థిరత్వం, భద్రత, సాఫీ ప్రయాణాన్ని పరీక్షించారు. అనంతరం ఈ సెక్షన్లో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. దేవరకద్ర వైపు పనులు మన్యంకొండ–దేవరకద్ర మధ్య రెండో ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. దశల వారీగా డబ్లింగ్ పనులను పూర్తి చేసేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపడుతున్నారు. మహబూబ్‌నగర్ నుంచి డోన్ వరకు మొత్తం మార్గం పూర్తయితే ఈ ప్రాంత రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. మహబూబ్‌నగర్–డోన్ డబ్లింగ్ లైన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే హైదరాబాద్–డోన్ మార్గంలో రైళ్ల రద్దీ తగ్గే అవకాశం ఉంది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్ల రాకపోకల కారణంగా ఎదురయ్యే ఆలస్యాలు తగ్గడంతో పాటు అదనపు రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గే వీలుండటంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. సరుకు రవాణా వేగవంతమై.. ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వాణిజ్య రవాణా కూడా మెరుగుపడే అవకాశం ఉంది. మేడ్చల్–ముద్ఖేడ్, మహబూబ్‌నగర్–డోన్ సెక్షన్లలో విద్యుత్ ట్రాక్షన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతోంది. ముద్ఖేడ్ నుంచి డోన్ వరకు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఉన్న 12.5 వాట్ల సామర్థ్యాన్ని 25 వాట్లకు పెంచేందుకు ఆమోదం లభించింది. దీంతో విద్యుత్ వ్యవస్థలో లోపాలను అధిగమించి నిరంతర విద్యుత్ సరఫరాతో రైళ్లను మరింత సమర్థవంతంగా నడిపేందుకు వీలవుతుంది. ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి. -
వసతిగృహాల్లో మెరుగైన సౌకర్యాలు
వనపర్తి: ప్రభుత్వ వసతిగృహాల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 30వ వార్డులో ఉన్న షెడ్యూల్డ్ కులాల బాలుర వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహంలో కొత్తగా నిర్మించిన వంటగది (కిచెన్), స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. పనుల నాణ్యత, వినియోగంలో ఉన్న సామగ్రి తదితర అంశాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణాలు నిర్దేశించిన అంచనాల ప్రకారమే చేపట్టాలని, అదనపు పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మరో నెలలో భవనాన్ని పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం వసతిగృహంలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వసతి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, నాణ్యమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వసతిగృహాల్లో శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని.. వంటగది, భోజనశాల, మరుగుదొడ్లు తదితర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యాభ్యాసానికి అనుకూలమైన వాతావరణం కల్పించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రాంజీరావు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. -
మరక పడితే వేటే..!
వనపర్తి: అవినీతి, అక్రమాలు, విధుల్లో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం, శాఖాపరమైన అవకతవకల ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులు, ఉద్యోగులు వరుసగా చర్యలకు గురవుతున్నారు. తాజాగా మంగళవారం మరో ఇద్దరి ఉద్యోగుల సస్పెన్షన్ జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. రెండేళ్ల కాలంలో సస్పెండ్ అయిన వారి లెక్క తీస్తే.. సుమారు 17 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. ఇందులో నలుగురు జిల్లాస్థాయి అధికారులు, ఎనిమిది మంది పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు వార్డెన్లు, ఒక ఎస్ఐ, ఒక ఏఎస్ఐ, జిల్లా పౌరసరఫరాలశాఖలో పనిచేసే ఉద్యోగి ఒకరు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. ఇటు కలెక్టర్, అటు రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు సైతం తప్పు చేసినట్లు విచారణలో వెల్లడైతే చర్యలకు వెనకాడటం లేదనేందుకు మంగళవారం కలెక్టర్ ఆదర్శ్ సురభి ఇద్దరిపై వేటు వేయడంతో స్పష్టమవుతోంది. వసతి గృహానికి చేరాల్సిన 15 క్వింటాళ్ల బియ్యం లెక్క విషయంలో జిల్లాకేంద్రంలోని బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్ నరేందర్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖలో పనిచేసే ఉద్యోగి మహేష్‌పై వేటు పడింది. ఈ ఘటన జిల్లాలో ఉద్యోగ లోకానికి షాక్ తగిలినట్లయింది. దీంతో రెండేళ్ల కాలంలో చర్యలకు గురైన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల విషయంపై చర్చ వినిపిస్తోంది. రెండేళ్లలో 17 మందికిపైగా.. ఇందులో నలుగురు జిల్లాస్థాయి అధికారులు ఇద్దరు వార్డెన్లు, ఎనిమిది మంది కార్యదర్శులు, ఎస్ఐ, ఏఎస్ఐ... అక్రమాలపై ఫిర్యాదులు వచ్చినా.. అక్రమార్జనకు పాల్పడినట్లు ఆధారాలతో వెల్లడైనా.. ప్రతి ఘటనలో చర్యలకు వెనకాడకపోవటం జిల్లా అధికార యంత్రాంగంలో భయాందోళన నెలకొన్నట్లు తెలుస్తోంది. హాస్టల్లో ఉంటూ.. చదువుకునే పేదవారి కడుపుకొట్టి బియ్యాన్ని విక్రయించుకునే వారిపై కలెక్టర్ సీరియస్‌గా స్పందించినట్లు తాజా చర్యలతో వెల్లడవుతోంది. -
శ్రీరంగాపురంలో దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్
పెబ్బేరు రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయాన్ని బుధవారం రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ కమిషనర్ హన్మంతరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు ఆయనకు స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. అలాగే ఆలయ ఆవరణలోని తంజాపూర్ చిత్రపటాలు, స్వామివారి వెండి వాహనాలను తిలకించారు. రంగసముద్రం జలాశయం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఈఓ శేఖర్‌గౌడ్, అర్చకులు, సిబ్బంది ఉన్నారు. సమగ్ర సస్యరక్షణతో అధిక దిగుబడులు ఖిల్లాఘనపురం: రైతులు వరి సాగులో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడంతో అధిక దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, టీకేవీకే శాస్త్రవేత్త నవత, డీపీడీ హైమావతి అన్నారు. బుధవారం మండలంలోని అంతాయపల్లిలో వ్యవసాయశాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్తంగా పొలంబడి, వరి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు సమగ్ర నేల సంరక్షణ కచ్చితంగా పాటించాలన్నారు. నెలలో పంటకు కావాల్సిన ఎరువులు, పోషకాలు, పచ్చి రొట్ట ఎరువులు మాత్రమే వినియోగించాలని సూచించారు. భాస్వరం ఎరువులు అధికంగా వినియోగిస్తే భూమిలో చౌడు తేలి పోషకాల లభ్యత తగ్గుతుందన్నారు. నానో యూరియా ఉపయోగించాలని, చీడపీడల నివారణకు వ్యవసాయ అధికారులు సూచించిన పురుగు మందులు వాడాలని కోరారు. పలువురు రైతుల సందేహాలను నివృత్తి చేశారు. సర్పంచ్ తోక నర్సింహగౌడ్, ఏఓ మల్లయ్య, ఏఈఓ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటరమణ రైస్‌మిల్ సీజ్ పాన్‌గల్: సీఎంఆర్ బకాయిలున్న మండల కేంద్రంలోని శ్రీ వెంకటరమణ రైస్‌మిల్లును అధికారులు బుధవారం సీజ్ చేశారు. ఆర్ఐ మహేష్ కథనం మేరకు.. రైస్‌మిల్లుకు 2023–24 సంవత్సరంలో వరి ధాన్యం కేటాయించగా ఇందుకు సంబంధించిన సీఎంఆర్ ప్రభుత్వానికి అందించకుండా బకాయి పడ్డారు. బకాయిపడ్డ ధాన్యం విలువ రూ.6.93 కోట్లని.. చెల్లించకపోవడంతో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం మిల్లును తహసీల్దార్ కార్తీక్‌రావు, ఎస్ఐ కుర్మయ్య పర్యవేక్షణలో సీజ్ చేసినట్లు ఆర్ఐ వివరించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్‌గౌడ్, జీపీఓ రాధ, మల్లేష్ పాల్గొన్నారు. ఎన్ఎస్యూఐకు కొత్త సారథులు స్టేషన్ మహబూబ్‌నగర్: నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి ఈ మేరకు బుధవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఽఅధ్యక్షుడిగా ఎ.శేఖర్, నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడిగా నల్లవెల్లి యశ్వంత్, వనపర్తి జిల్లా అధ్యక్షుడిగా బి.శ్రీకాంత్, గద్వాల జిల్లా అధ్యక్షుడిగా అవినాష్ యాదవ్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా ఎండీ అఫ్రోజ్‌ను నియమించారు. ఎన్ఎస్యూఐను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడుసూచించారు. -
ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలి
వనపర్తి: సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ప్రజావాణిలో దాఖలు చేసిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు సిఫారస్ చేశారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు నిర్వహించిన ప్రజావాణికి వచ్చిన అర్జీల్లో ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోరుతూ దాఖలైనట్లు ఆయన వెల్లడించారు. ఫిర్యాదులకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలోనిది కాదంటే.. వెంటనే సంబంధిత శాఖకు బదిలీ చేయాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారుడికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ అర్జీలను తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోరాదని తెలిపారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన ప్రజావాణి అర్జీలను సైతం సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజావాణి ముగిసే వరకు 34 అర్జీలు దాఖలయ్యాయి. -
12న జాతీయ లోక్ అదాలత్
వనపర్తి టౌన్: కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ సువర్ణ అవకాశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాకరాజు శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని. సివిల్, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద క్లెయిమ్స్, చెక్ బౌన్స్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. రాజీతో సమయం, డబ్బు ఆదా అవుతుందని.. ఇప్పటికే చెల్లించిన కోర్టు ఫీజు తిరిగి చెల్లిస్తారని, లోక్ అదాలత్ తీర్పుపై అప్పీల్ ఉండదని వివరించారు. 4 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. సోమవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 102.277 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 88.880 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 191.157 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. విద్యారంగంలో మొదటి స్థానంలో నిలపాలి వనపర్తిటౌన్: విద్యాశాఖ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందువరుసలో నిలపాలని ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్న్హాల్లో విద్యాశాఖ కార్యక్రమాల అమలుపై సమగ్ర శిక్ష విభాగం సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండలాల సీఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు, ప్రత్యేక అవసరాల పిల్లల విద్యాసిబ్బంది, సమాచార సాంకేతిక బోధకులు పాల్గొన్నారు. డిజిటల్ విద్యాబోధన, ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్య తదితర అంశాల గురించి వివరించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాల గురించి బాలల రక్షణ అధికారి రాంబాబు, మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై ఈగల్ బృందం సబ్ ఇన్స్పెక్టర్ అంజద్ అవగాహన కల్పించారు. విద్యాశాఖ కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని కార్యక్రమ పర్యవేక్షణ అధికారి ప్రతాప్‌రెడ్డి సూచించారు. -
రూ.6 కోట్ల విలువైన ధాన్యం మాయం
ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామవాసి శేఖర్‌రెడ్డికి చెందిన మూడు రైస్‌మిల్లులో సోమవారం ఉదయం నుంచి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోపాల్పేట మండలం చెన్నారంలోని నవ్య రైస్‌మిల్లుతో పాటు సోళీపురంలోని సింధు రైస్‌మిల్లు, సింధు ఆగ్రో ఇండస్ట్రీస్ (బాయిల్డ్ మిల్లు)లో విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ సీఐ గణేష్, కమర్షియల్ టాక్స్ అధికారి సురేష్, తహసీల్దార్ రాజశేఖర్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ దుబ్బాక పరమేష్, ఆయా శాఖల సిబ్బందితో కలిసి రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. సింధు ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లులో సుమారు రూ.6 కోట్ల విలువైన 51 వేల వరి ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు వారు తెలిపారు. తదుపరి చర్యలు మంగళవారం చేపట్టనున్నట్లు డీటీ పరమేష్ చెప్పారు. -
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు : ఎస్పీ
వనపర్తి: రానున్న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో పకడ్బందీ భద్రతా చర్యలకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఎస్పీ సునీతారెడ్డి వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ నుంచి డీజీపీ సీవీ ఆనంద్ అన్ని జిల్లాల ఎస్పీలు, పుర కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి ఎస్పీ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఉత్సవాల సందర్భంగా జిల్లాలో గణేష్ మండపాల ఏర్పాటు, ఊరేగింపులు, నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, సున్నిత ప్రాంతాలను ముందుగానే గుర్తించి తగినస్థాయిలో పోలీసు బందోబస్తు కల్పించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల సమయంలో చిన్నపాటి ఘటనలు సైతం పెద్ద సమస్యలకు దారితీయకుండా స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందస్తు చర్యలు చేపట్టేలా అధికారులకు సూచనలు చేశామని చెప్పారు. నిమజ్జనాలపై దృష్టి సారించి ఆయా మార్గాలు, చెరువులు, జలాశయాల వద్ద భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీ గిరిబాబు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, వనపర్తి, ఆత్మకూర్, కొత్తకోట సీఐలు సుగంధ రత్నం, శివకుమార్, ఓడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా చేస్తాం..
మహిళా సంఘాల్లో చదువు రాని సభ్యులకు.. అదే సంఘాల్లో చదువుకున్న మహిళలతో బోధన అందించేలా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, వయోజన విద్య, ఉమ్మడి జిల్లా అధికారి తరగతులు బోధిస్తున్నారు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మాకు అక్షరాస్యత పెంచేందుకు గ్రామంలోని విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు తరగతులు బోధిస్తున్నారు. దీంతో అవసరమైన చోట సంతకాలు చేయడం, మహిళా సంఘం పుస్తకాల్లో లెక్కలు చూసుకోవడం నేర్చుకుంటున్నాం. ఈ తరగతులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. – పద్మ, మన్యంకొండ, మహబూబ్‌నగర్ మాకు ఎంతో మేలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం వేళల్లో చదువులు బోధిస్తున్నారు. చదవడం, రాయడం నేర్చుకోవడంతో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. బ్యాంకు, మహిళా సంఘాలకు సంబంధించిన పనులను సొంతంగా చేసుకునే అవకాశం కలుగుతోంది. ఈ కార్యక్రమం వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది. – సుమంగళ, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్ ● -
అమ్మకే అక్షరమాల.. నాన్నకు?
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: చదువు వ్యక్తి జీవితాన్ని మార్చే శక్తివంతమైన సాధనం. అక్షరాస్యతతో సమాజంపై అవగాహన పెరగడంతో పాటు హక్కులు, బాధ్యతలపై చైతన్యం వస్తుంది. అయినా ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిరక్షరాస్యత సమస్య పూర్తిగా తొలగలేదు. వయోజనులను అక్షరాస్యులుగా మార్చేందుకు గతంలో ‘సాక్షర భారత్’ వంటి కార్యక్రమాలు అమలు చేసినా.. ప్రస్తుతం అవి అంతగా కనిపించడం లేదు. ‘అమ్మకు అక్షరమాల’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. ప్రధానంగా మహిళా సంఘాల సభ్యులకే అక్షరాలు నేర్పించడంపై దృష్టి సారిస్తోంది. దీంతో నిరక్షరాస్యులుగా ఉన్న పురుషుల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఉమ్మడి జిల్లాలో పూర్తిగా తొలగని నిరక్షరాస్యత ‘సాక్షర భారత్’కు బదులు ‘అమ్మకు అక్షరమాల’ మహిళా సంఘాల సభ్యులకే పరిమితమైన అక్షరాస్యత కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో 7.78 లక్షల మంది నిరక్షరాస్యులు.. ఇందులో 2.99 లక్షల మంది పురుషులు నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం -
61,116 మందికి నోటీసులు : కలెక్టర్
వనపర్తి: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – 2026లో భాగంగా 88,727 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 61,116 మందికి అందజేసినట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అనామలీస్, అన్‌మ్యాపింగ్ జాబితాలో నోటీసులు ఇవ్వాల్సిన అంశంపై సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లతో విచారణ చేసి సమర్పించిన డాక్యుమెంట్లను బీఎల్వోలతో అప్లోడ్ చేసిన అనంతరం డాటా ఎంట్రీ చేయించే ప్రక్రియ సైతం వేగవంతం చేసేలా ప్రణాళికతో అధికారులను సమాయత్తం చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 4,757 మంది ఓటర్లు సమర్పించిన డాక్యుమెంట్లపై విచారణ పూర్తి చేశామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు విచారణ చేపడుతున్నట్లు కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌తో పాటు రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పబ్లిక్ స్కూల్స్‌కు నిధుల వరద
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు.. నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎంపిక చేసిన వాటిని పబ్లిక్ స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. తొలిదశలో 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు ప్రభుత్వం రూ.87 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేస్తూ జీఓ నంబర్ 164ను విడుదల చేసింది. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌లో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్య అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఒకే క్యాంపస్‌లో అన్ని తరగతులకు బోధన కొనసాగనుంది. ఇందుకోసం ఆధునిక తరగతి గదులతో పాటు సైన్స్, కంప్యూటర్ ల్యాబ్స్, క్రీడా మైదానం, మరుగుదొడ్లు తదితర వసతులను కల్పించనున్నారు. అవసరమైన చోట్ల రవాణా సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యా బోర్డులో విలీనం చేసే ప్రక్రియ నేపథ్యంలో పబ్లిక్ స్కూల్స్‌లో ఇంటర్ వరకు విద్య కొనసాగించేలా ఏ ర్పాట్లు చేస్తున్నారు. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుతో కొత్తగా భారీగా సిబ్బందిని నియమించాల్సిన అవస రం లేకుండా.. ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందినే వినియోగించే అవకాశముంది. పాఠశాలల అభివృద్ధికి అవసరమైన అదనపు వసతులను మాత్రం ప్రభుత్వం కల్పించనుంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉమ్మడి జిల్లాలో 8 పాఠశాలలకు రూ.87 కోట్ల నిధులు నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్‌లో విద్య తరగతి గదులు, ల్యాబ్స్, గ్రౌండ్, మరుగుదొడ్లతో ఆధునిక వసతులు స్థలం ఉన్న బడులకే ప్రాధాన్యం ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా.. ప్రస్తుతం 8 నియోజకవర్గాల్లోని పాఠశాలలకు మాత్రమే నిధులు విడుదలయ్యాయి. మరో ఆరు నియోజకవర్గాలకు నిధులు మంజూరు కావాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో పాఠశాల లేదా స్థలం ఎంపిక ప్రక్రియ పూర్తికాకపోవడంతో నిధుల విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు ప్రధానంగా ఇప్పటికే స్థలం, భవనాలు అందుబాటులో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలను ఎంపిక చేస్తున్నారు. అయితే మహబూబ్‌నగర్‌లో మాత్రం మార్కెట్ రోడ్డులోని బాలికల పాఠశాలకు సొంత భవనం లేకపోవడంతో ప్రత్యేక ప్రతిపాదన చేశారు. ఈ పాఠశాలను ఎంవీఎస్ జూనియర్ కళాశాల ప్రాంగణానికి తరలించి.. అక్కడ పబ్లిక్ స్కూల్ భవనం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. -
7.78 లక్షల మంది నిరక్షరాస్యులు
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 7,78,142 మంది నిరక్షరాస్యులు ఉన్నారు. ఇందులో 2,99,907 మంది పురుషులు, 4,78,235 మంది మహిళలు ఉన్నారు. అంటే పురుషుల కంటే మహిళా నిరక్షరాస్యుల సంఖ్య 1,78,328 అధికం. జిల్లా వారీగా చూస్తే గద్వాల జిల్లాలో అత్యధికంగా 70,619 మంది పురుషులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నారాయణపేటలో అత్యల్పంగా 37,461 మంది ఉన్నారు. అయితే ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం మహిళా సంఘాల సభ్యులకే పరిమితం కావడంతో.. నిరక్షరాస్యులుగా ఉన్న పురుషులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ లేకపోవడం గమనార్హం. సమాజంలో నిరక్షరాస్యత పూర్తిగా నిర్మూలించాలంటే మహిళలతో పాటు పురుషులపైనా సమానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. -
కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతల ఆందోళన
వనపర్తి: శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అమానుషంగా అరెస్టు చేశారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధుల పట్ల వారు వ్యవహరించిన తీరు సరికాదని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, సంక్షేమాన్ని గాలికొదిలేశారంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు అర్జీ దాఖలు చేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని.. లేనిపక్షంలో ప్రజా ఉద్యమంతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయంలో సమృద్ధిగా నీరున్నా ఎల్‌నినో పేరిట పంటలకు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్‌గౌడ్, నాయకులు నందిమళ్ల అశోక్, గంధం పరంజ్యోతి, కౌన్సిలర్ శ్రీకర్‌గౌడ్, మహిళా నాయకులు కవిత, షమీంబేగం, ప్రేమనాథ్‌రెడ్డి, బండారు కృష్ణ, నాగన్నయాదవ్, రఘువర్ధన్‌రెడ్డి, నర్సింహ, మహేశ్వర్‌రెడ్డి, గులాం ఖాదర్‌ఖాన్, జోహెబ్, రాము పాల్గొన్నారు. -
రెండు యూనిట్లలో విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. ఆదివారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 102.058 మి.యూ., దిగువన ఒక యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 88.010 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో 190.068 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు చెప్పారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యవర్గం ఎన్నిక అమరచింత: డీవైఎఫ్ఐ జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం మండల కేంద్రంలో జరిగిన సంఘం జిల్లా మహాసభల్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనగంటి వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడి మహేష్, ఉపాధ్యక్షులుగా ఆది, హరీశ్, కార్యదర్శిగా రాఘవేంద్ర, సహాయ కార్యదర్శులుగా రామకృష్ణ, సురేష్, సభ్యులుగా చంటి, షారుఖ్, శ్రీకాంత్, కళ్యాణ్, మొగిలి, దశరథ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. నిరుద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయడానికి ప్రణాళికతో ముందుకు సాగుతామని తెలిపారు. -
సారంపల్లి మల్లారెడ్డి ఆశయ సాధనకు కృషి
వనపర్తి రూరల్: విద్యుత్, వ్యవసాయం, ప్రాజెక్టులు, నదీజలాలు, వివిధ రంగాలపై అపార అనుభవం కలిగిన సారంపల్లి మల్లారెడ్డి దేశానికి ఒక విజ్ఞాన గని అని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ కొనియాడారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని లిటిల్‌బర్డ్స్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరాడంబర జీవితం గడిపిన మల్లారెడ్డి మరణం ఉద్యమాలకు తీరని లోటని, అసమానతలు లేని సమాజ స్థాపన కోసం కృషి చేయడమే ఆయనకు మనమర్పించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిట్ల పురణాలకు వేధిక కాకుండా ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా సమగ్ర చర్చ జరగాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్య, వైద్యరంగాల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు. అలాగే 22ఏ భూ సమస్యలు పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పుట్టా ఆంజనేయులు, నాయకులు బాల్‌రెడ్డి, ఎండి జబ్బార్, గోపి, మేకల ఆంజనేయులు, రాజు, వెంకట్రాములు, మహబూబ్‌పాషా, బాల్యానాయక్, పరమేశ్వరాచారి, కాకం అంజన్న తదితరులు పాల్గొన్నారు. -
ఎల్‌నినో పేరిట సాగునీటిపై ఆంక్షలు
● రైతుబీమాను తుంగలో తొక్కి కాంగ్రెస్ వెయ్యిరోజుల సంబరాలు ● మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అమరచింత: బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ రైతులతో కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పురవీధుల మీదుగా భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ కూడలిలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎల్‌నినో పేరిట రైతులకు సాగునీరు సరఫరా చేయకుండా ఆంక్షలు విధిస్తున్నారని.. వరి సాగు వద్దని చెబుతున్న ప్రభుత్వం ఇకపై ఆరుతడి పంటల సాగు కూడా చేయవద్దని చెప్పడం ఖాయమన్నారు. ఎన్నికల సమయంలో 420 హామీలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కూడా అమలు చేయలేని స్థితిలో ఉందని తెలిపారు. తమ పాలనలో వ్యవసాయానికి నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ను అందించామని.. ప్రస్తుత ప్రభుత్వం రోజుకు 9 గంటల విద్యుత్‌ను కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు. రైతుబీమా పథకాన్ని అమలు చేయలేక మంగళం పాడిందని తెలిపారు. అమాయక ప్రజలకు ఆశ చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో సాధించామని వెయ్యి రోజుల పండుగ చేసుకోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని వెల్లడించారు. -
రింగ్‌లో పంచ్.. మెడలో మెడల్స్!
● బాక్సింగ్‌లో సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ● పంచ్ పవర్‌తో పతకాలు సాధిస్తున్న నలుగురు బాక్సర్లు బాక్సింగ్ రింగ్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా క్రీడాకారులు పంచ్ పవర్ చూపించారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో నలుగురు క్రీడాకారులు సత్తాచాటి పతకాలు సాధించారు. పెబ్బేర్ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ స్వర్ణ పతకం సాధించి దక్షిణ భారత చాంపియన్‌షిప్‌కు ఎంపిక కాగా.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఎం.రాజు, నాగర్‌కర్నూల్ జిల్లా శశికాంత్ రజత పతకాలు, గండేడ్‌కు చెందిన జె.రాకేష్ కాంస్య పతకం సాధించారు. వరుస విజయాలతో జిల్లాలో బాక్సింగ్‌పై ఆసక్తి పెరుగుతోంది. శ్రీలేఖ.. స్వర్ణ పంచ్ వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం శాగాపూర్‌కు చెందిన శ్రీలేఖ ఏడేళ్లుగా బాక్సింగ్‌లో శిక్షణ పొందుతూ అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇప్పటికే ఐదుసార్లు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. తొమ్మిదిసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఏడు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు సాధించింది. జిల్లాస్థాయిలో మూడు స్వర్ణాలు, ఒక రజతం ఆమె ఖాతాలో ఉన్నాయి. హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 48–51 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించిన శ్రీలేఖ.. ఈనెల 16 నుంచి 19 వరకు బెంగళూరులో జరిగే ఎలైట్ పురుషుల, మహిళల సౌత్ ఇండియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌కు ఎంపికై ంది. భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడమే తన లక్ష్యమని చెబుతోంది. – మహబూబ్‌నగర్ క్రీడలు -
వంట గ్యాస్ తంటాలు!
నిబంధనలు మార్చాలి.. మా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉండటంతో సిలిండర్ త్వరగా అయిపోతుంది. 21 రోజు ల వరకు కొత్త సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి వస్తోంది. కొన్నిసార్లు వంట చేయడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు ఈ నిబంధనపై పునరాలోచించి అవసరమైన వారికి ముందుగానే సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం కల్పించాలి. – ఇందిర, గృహిణి, కొత్తకోట పాత పద్ధతిలోనే ఇవ్వాలి.. గ్రామాల్లో 45 రోజుల తర్వాతే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పండుగలు, శుభకార్యాల సమయంలో గ్యాస్ వినియోగం పెరిగి త్వరగా అయిపోతోంది. గడువు పూర్తయ్యే వరకు సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం లేకపోవడంతో కట్టెల పొయ్యి వినియోగించాల్సి వస్తోంది. ప్ర భుత్వం ప్రత్యేక దృష్టి సారించి పాత పద్ధతిలో నే సిలిండర్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించాలి. – సురేంద్రాచారి, అమడబాకుల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. జిల్లాలో గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ విధానం స్థానికంగా రూపొందించిన నిబంధన కాదు. చమురు సంస్థలు (ఓఎంసీలు) అమలు చేస్తున్న విధానాలకు అనుగుణంగానే గ్యాస్ పంపిణీ జరుగుతోంది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే కొత్త గ్యాస్ కనెక్షన్లు, రీఫిల్ బుకింగ్‌లు, సరఫరా సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ఆదేశాలు ఎలా వస్తే అలా నడుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. – ఆంజనేయులు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కొత్తకోట రూరల్: జిల్లాలో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరు నిలిచిపోవడంతో దరఖాస్తులుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది మార్చి నుంచి గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు కొత్త కనెక్షన్లు ఇవ్వడం లేదు. దీంతో ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేని వారు, కొత్తగా పెళ్లయిన జంటలు, వేరు కాపురాలు పెట్టినవారు, జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎల్పీజీ వినియోగం పెరగడంతో కొత్త కనెక్షన్ల అవసరం అంతకంతకూ పెరుగుతోంది. కొత్త కనెక్షన్లు పునః ప్రారంభించే తేదీని చమురు సంస్థలు అధికారికంగా ప్రకటించకపోవడంతో దరఖాస్తుదారుల్లో అయోమయం నెలకొంది. అనధికారిక నిషేధమా..? ఇటీవల అమెరికా, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధంతో హర్మూజ్ జలసంధి మూతబడి గ్యాస్ దిగుమతికి ఆటంకం కలగడంతో దేశవ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఏజెన్సీల ఎదుట బారులు తీరుతున్న పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఇంధన దిగుమతి సరిగా లేకపోవడంతో కొత్త గ్యాస్ కనెక్షన్ల మంజూరును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తే సంక్షోభం మరింత పెరుగుతోందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గ్యాస్ ఏజెన్సీలు వెబ్సైట్లలో కొత్త కనెక్షన్ల దరఖాస్తు ఆప్షన్‌ను మూసివేసినట్లు డీలర్లు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సిలిండర్ ఉన్న వారు ఇతర మార్గాల ద్వారా గ్యాస్ వినియోగించుకుంటున్న వారంతా కొత్త కనెక్షన్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం చల్లారినా దాని ప్రభావం వీడటం లేదు. మార్చిలో వంట గ్యాస్ కొరత ఏర్పడగా.. అప్పటికి నుంచి ఏజెన్సీల పరిధిలో కొత్త కనెక్షన్లు, రెండో సిలిండర్ మంజూరు నిలిచిపోయింది. మరోవైపు గ్యాస్ బుకింగ్‌కు 45 రోజుల నిబంధన విధించడంతో రెండో సిలిండర్ లేని గ్రామీణ ప్రాంత వినియోగదారులు కట్టెల పొయ్యిని వినియోగించాల్సిన పరిస్థితి తలెత్తింది. జిల్లాలో నిలిచిన కొత్త కనెక్షన్ల మంజూరు పేరుకుపోతున్న దరఖాస్తులు వినియోగదారులకు తప్పని తిప్పలు సరఫరాలో ఇబ్బందులే కారణమా? -
ముమ్మరంగా ఎలివేటెడ్ కారిడార్
జాతర మైదానంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి గుట్టపై ఉన్న ప్రధాన ఆలయం వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఇందుకోసం 20 పిల్లర్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 10 పిల్లర్లకు ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. పిల్లర్ల నిర్మాణానికి కాంక్రీట్ పనులు కొనసాగుతున్నాయి. అమ్మాపురం సమీపం నుంచి కురుమూర్తి గుట్ట వెనుక భాగం మీదుగా ప్రధాన ఆలయం వరకు చేపడుతున్న ఘాట్‌రోడ్డు పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. రహదారిని చదును చేసి కంకర పరచారు. బీటీ వేసేందుకు సిద్ధం చేస్తున్నారు. -
కిటకిటలాడిన తిరుమలయ్య గుట్ట
వనపర్తి రూరల్: శ్రావణమాసం చివరి శనివారం కావడంతో మండలంలోని పెద్దగూడెం శివారు తిరుమలయ్య గుట్టపై వెలిసిన శ్రీ తిరుమలనాఽథస్వామి దర్శనానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ అర్చకుడు కురుమూర్తి ఉదయం అభిషేకం, అలంకరణ తదితర ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు వరుస క్రమంలో స్వామివారికి దర్శించుకోగా అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర స్పోర్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు వేదాశీర్వచనం చేయగా.. నిర్వాహకులు శాలువాతో సన్మానించారు. దాతలు గుట్ట కింద అన్నప్రసాద వితరణ చేపట్టారు. వాహనాల రద్దీ పెరగడంతో ఘాట్ రోడ్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వనపర్తి రూరల్ ఎస్ఐ హృశికేష్ సిబ్భందితో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. ఆలయ కార్యనిర్వాహకుడు కిష్టగిరి వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్’ వనపర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హేమంత్ ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ శనివారం జిల్లాకేంద్రంలో విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఆంక్షలను అధిగమిస్తూ విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రకటించిన రెండు లక్షల ఉద్యోగాలు, రూ.4 వేల నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు స్కూటీలు, రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, యూత్ కమిషన్, రూ.10 లక్షల వడ్డీలేని రుణ హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్లను తక్షణం విడుదల చేయాలన్నారు. విదేశీ విద్యకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.25 లక్షల ఆర్థిక సాయం అందించాలని, విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రభావితం చేసే జీఓనంబర్ 97ను రద్దు చేయాలని, యూత్ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వనపర్తి ఇన్చార్జ్ సూర్యవంశం గిరి, బీఆర్ఎస్వీ సోషల్ మీడియా ఇన్‌న్‌చార్జి సునీల్ వాల్మీకి, శివగౌడ్, సిరివాటి శంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి వనపర్తి రూరల్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని జిల్లా వైద్యాధికారి డా. భాస్కర్‌నాయక్ సూచించారు. శనివారం పెబ్బేరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ఓపీ, ప్రసవాలు, ఇన్‌పేషెంట్ల రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీ, చికున్‌గున్యా ప్రబలుతున్నాయని, నియంత్రణకు ప్రతి శుక్ర, మంగళవారం పట్టణంతో పాటు గ్రామాల్లో డ్రై డే నిర్వహించి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యసిబ్బందికి సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్ అధికారుల కొరత ఉన్నందున ఇద్దరిని నియమించామని, త్వరలోనే వైద్యులను నియమిస్తామని తెలిపారు. ఆయన వెంట వైద్యురాలు సుధారాణి, విస్తరణ అఽధికారి దామోదర్, నర్సింగరావు, హెల్త్ సూపర్వైజర్ పార్వతి, హెల్త్ అసిస్టెంట్ రాజశేఖర్, ఫార్మసీస్ట్ కుమారి, నర్సింగ్ అధికారి లక్ష్మి, విక్టర్ రాజు, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు. -
ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివి
వనపర్తిటౌన్: విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని.. సమాజం ఎల్లప్పుడూ గురువుల పట్ల కృతజ్ఞతతో ఉండాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌తో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ తొలి గురువు, తర్వాత సరైన దిశను చూపించేది ఉపాధ్యాయులేనని తెలిపారు. తల్లి ప్రేమతో పిల్లలకు తొలి జీవిత పాఠాలు నేర్పితే.. ఉపాధ్యాయులు విద్యాబుద్ధులతో పాటు సమాజాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని అందిస్తారన్నారు. కేవలం పాఠ్యాంశాలను బోధించేవారు మాత్రమే కాదని.. మంచి చెడులను గుర్తించే విచక్షణ, క్రమశిక్షణ, బాధ్యత, మానవత్వం వంటి విలువలను పెంపొందిస్తారని పేర్కొన్నారు. విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచంలో ఏ రంగంలో రాణించాలన్నా విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అవసరమని.. గురువుల ప్రోత్సాహం, మార్గనిర్దేశంతోనే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగగలరన్నారు. తల్లిదండ్రుల కష్టాలు, త్యాగాలను విద్యార్థులకు తెలియజేసి వారిలో గౌరవభావాన్ని పెంపొందించడంలో కూడా ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇంట్లో అమ్మ, నాన్న జీవితానికి పునాది వేస్తే.. పాఠశాలలో గురువులు ఆ పునాదిపై విద్యార్థుల భవిష్యత్‌ను నిర్మిస్తారని పేర్కొన్నారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త డా. సర్వేపల్లి రాధాకృష్ణనన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గురువుల గొప్పతనానికి నిదర్శనమన్నారు. అంతకుముందు జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 55 మందిని సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి యాదయ్య, పుర వైస్ చైర్మనన్ మధుసూదన్‌గౌడ్, సీఎంఓ ప్రతాప్‌రెడ్డి, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఉపాధ్యాయుడి రూటే సపరేటు..
అమరచింత: ఆత్మకూర్‌కు చెందిన సంతోష్‌కుమార్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరిన నాటి నుంచి సాంకేతికతపై పట్టు సాధించారు. తన పాఠశాల విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించాలనే దృఢ సంకల్పంతో సాంకేతికతను ముందస్తుగా నేర్చుకుంటూ తరగతి గదిలో విద్యార్థులకు డిజిటల్ బోధన చేస్తున్నారు. ఓ గదిని ఆంగ్ల అక్షరాలతో పాటు ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి విద్యార్థులకు ఆంగ్లంలో మెళకువలు నేర్పిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. 1996 నుంచి విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా ఆంగ్ల పదాలు నేర్పించే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. గతంలో జిల్లాలో విధులు నిర్వర్తించిన కలెక్టర్లు సైతం ఆయనను సత్కరించారు. ఆయన ఉమ్మడి ఆత్మకూర్ మండలంలో 31 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
మెరుగైన బోధన.. పరిశోధనకు పట్టం!
ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడపాల్సిన వయసులోనూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేస్తూ తన సేవలను కొనసాగిస్తున్నారు. 38 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మంగళగిరి నర్సోజి.. నేటికీ వారంలో రెండు రోజులు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో పనిచేసిన నర్సోజి విద్యార్థుల్లో సైన్స్, గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. లోకాస్ట్, నోకాస్ట్ మెటీరియల్‌తో వివిధ ఉపకరణాలు తయారు చేసి చంద్రయాన్–3పై అవగాహన కల్పించారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, దక్షిణ భారత సైన్స్ ఫెయిర్లలో వీటిని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొర ప్రాముఖ్యతపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత ఖర్చులతో బహుమతులు, అభ్యసన సామగ్రి ని అందిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన 2026 సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో చంద్రయాన్–3 మోడల్‌ను ప్రదర్శించి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. బోధనతో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ.. పరిశోధనతో కొత్త ఆలోచనలకు బాటలు వేస్తున్న పాలమూరు యూనివర్సిటీ కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు వివిధ అంశాల పై పరిశోధనలు, జాతీయ–అంతర్జాతీయ సెమినార్ల నిర్వహణలో ఆయన చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల్లో కామర్స్‌పై ఆసక్తి పెంచేందుకు పోటీలు, అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పరిశోధన పట్ల కూడా ప్రోత్స హించారు. ఆయన పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. అధ్యాపక బాధ్యతలతో పాటు యూనివర్సిటీ పరిపాలనలోనూ కీలకంగా వ్యవహరించిన రాజ్‌కుమార్.. ప్రిన్సిపా ల్, అదనపు కంట్రోలర్, కంట్రోలర్, ఐక్యూఏసీ డైరెక్టర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. బోధన, పరిశోధన, పరిపాలన లో అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది. -
దారిచూపే గురువులు.. వెలుగునిచ్చే దీపాలు
– మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/రాజాపూర్సొంత ల్యాబ్.. విద్యార్థులకు ఉచిత ప్రయోగాలు! ● బడిని బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా.. విజ్ఞానం, విలువలు నేర్పుతున్న టీచర్లు ● వినూత్న బోధనతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు ● రూ.12 లక్షలతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. పుస్తకంలోని అక్షరాలను పరిచయం చేయడమే కాదు.. ఆ అక్షరాల వెనుక ఉన్న ప్రపంచాన్ని విద్యార్థులకు చూపిస్తారు. చీకటిలో దారి తప్పినవారికి దీపంలా.. సందిగ్ధంలో ఉన్నవారికి దిక్సూచిలా నిలిచి, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు. అందుకే గురువు తరగతి గదిలో కనిపించే ఓ వ్యక్తి మాత్రమే కాదు.. రేపటి సమాజాన్ని నిర్మించే శిల్పి. పదవీ విరమణ చేసినా బోధనకు దూరం కాకుండా బడిబాట పడుతున్నవారు కొందరైతే.. గణితం అంటే భయపడే విద్యార్థుల్లో ఆసక్తిని నింపుతున్న వారు మరికొందరు. గిరిజన తండాల పిల్లలను బడికి రప్పించి చదువుతో పాటు సేంద్రియ సాగు నేర్పుతున్నవారు.. చాక్లెట్‌కు బదులు మొక్కను అందించి ప్రకృతిపై ప్రేమను పెంచుతున్నవారు.. సొంత ఖర్చుతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రయోగాల ప్రపంచాన్ని విద్యార్థుల ముందుకు తీసుకొస్తున్నవారు ఇంకొందరు. వారి చేతిలో ఉన్నది సుద్ద ముక్కే.. కానీ ఆ సుద్దతో రాసేది కేవలం పాఠం కాదు.. ఓ విద్యార్థి భవిష్యత్. వారి బోధనలో అక్షరాలే కాదు.. ఆలోచనలు ఉన్నాయి. వారి అడుగుల్లో ఉద్యోగ బాధ్యత కాదు.. రేపటి తరంపై బాధ్యత ఉంది. ఇలా వీరి ప్రతి అడుగు విద్యార్థుల భవిష్యత్ కోసమే. శనివారం (నేడు) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థి జీవితాల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న గురువులపై ప్రత్యేక కథనం.. చాక్లెట్‌కు బదులు.. మొక్క! వినూత్న బోధనతో విద్యార్థుల్లో కొత్త అలవాట్లు -
‘బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి శూన్యం’
మదనాపురం/కొత్తకోట రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ శ్రేణులు మదనాపురం, కొత్తకోట మండలాల్లో భారీ బైక్ ర్యాలీ, సంబరాలు నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మొదట మదనాపురం మండలంలోని దుప్పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భారీ బైక్ ర్యాలీతో కొత్తపల్లి, మదనాపురం, దంతనూరు మీదుగా కొత్తకోటకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలను మోసం చేయడం తప్ప సాధించిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని.. మదనాపురం–ఆత్మకూరు మార్గంలో రూ.6 కోట్లతో వంతెన పనులు పూర్తి చేశామని త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. శంకరంపేట, దంతనూర్ ప్రాంతాల ప్రజల రాకపోకల సౌకర్యార్థం మరో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూ మదనాపురం మండలంలోని మూడు ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు రూ.5 కోట్లు కేటాయించామన్నారు. -
విద్యార్థుల సంఖ్య పెంపునకు..
వనపర్తిటౌన్: పెబ్బేరు చెంచువాడ ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు దాసరి చిన్న రాములు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2024, జూలై 1న బదిలీపై పాఠశాలకు వచ్చిన ఆయన విద్యార్థుల సంఖ్య పెంపునకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న విద్యను తల్లిదండ్రులకు వివరిస్తూ చేర్పించేలా ప్రోత్సహించారు. ఫలితంగా ప్రారంభంలో 40 ఉన్న విద్యార్థుల సంఖ్యను 2025–26లో 96కు, 2026–27లో 136కు చేరింది. ఆయన పాఠశాలకు వచ్చిన సమయంలో దట్టమైన ముళ్లపొదలు, మట్టి దిబ్బలతో ఉన్న ఆవరణను స్థానిక నాయకులు, దాతల సహకారంతో శుభ్రం చేసి చదును చేయించారు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో తరగతి గదుల కొరత ఏర్పడగా.. రేకుల షెడ్డు ఏర్పాటుకు రూ.50 వేలు సొంతంగా ఖర్చు చేశారు. మిగతా పనులను దాతలను ఒప్పించి వారి సహకారంతో పూర్తి చేయించారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక బోధన అందిస్తున్నారు. సొంత ఖర్చుతో టీచింగ్, లర్నింగ్ కిట్స్ సమకూర్చి పాఠాలను సులభంగా, ఆసక్తికరంగా బోధిస్తున్నారు. చదువుతో పాటు ఆటలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల్లోని ప్రతిభను వెలికితీస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తుండగా.. చిన్న రాములు ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ● చిన్న రాములు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తిచేశారు. బీఏ, బీఈడీ పూర్తి చేసి 2010లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన ఆయనను తల్లి టీ కొట్టు నిర్వహిస్తూ చదివించారు. తాను ఎదుర్కొన్న కష్టాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. పాఠశాలపై తల్లిదండ్రుల్లో నమ్మకం పెంచి.. విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన ఆయన కృషికి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు దక్కడం విశేషం. -
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట
కోస్గి/కోస్గి రూరల్: అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ జాప్యం చేయకుండా వేగవంతంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని చెప్పారు. శుక్రవారం సీఎం తన సొంత నియోజకవర్గంలో పర్యటించి.. అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లా మద్దూరుకు మధ్యాహ్నం 2.53 గంటలకు చేరుకున్న ముఖ్యమంత్రికి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక పట్టణ శివారులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో దోరెపల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో బయలుదేరిన సీఎం ముందుగా రూ.6.10 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ నమూనా చిత్రపటాన్ని పరిశీలించడంతోపాటు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలం, నిర్మాణ విస్తీర్ణం, తరగతి గదులు, ప్రయోగశాలల వివరాలతోపాటు 4 ఎకరాల స్థలంలో 13,670 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్థుల భవనం నిర్మిస్తున్నట్లు ఈడబ్ల్యూఐడీసీ ఎండీ గణపతిరెడ్డి సీఎంకు వివరించారు. కళాశాల భవనం పక్కన ప్రధాన రహదారి వైపు ఉన్న అదనపు భూమిని సర్వే చేయించాలని, అది పట్టా భూమి అయితే కొనుగోలు చేసి కళాశాలకు విశాలమైన ప్రాంగణం, ప్రహరీ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రియాంకకు సూచించారు. రానున్న మార్చిలోగా కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తిచేసి.. వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుంచి చింతల్‌దిండి రోడ్డులో రూ.30 కోట్ల నిధులతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గురుకుల పాఠశాల, కళాశాలలకు స్థలం ఇచ్చిన దాతలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి మద్దూరు పర్యటన సందర్భంగా పట్టణంలో అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి సెక్రెటరీ శ్రీధర్, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీను, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, డీఆర్ఓ రాజేశ్వరి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్‌కుమార్, మద్దూర్ మున్సిపల్ చైర్పర్సన్ సరస్వతి, వైస్ చైర్పర్సన్ భాగ్యశ్రీ, కోస్గి మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు, పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సింహులు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు బాలయ్య, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివాదం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డిపర్యటన సాగింది ఇలా.. 2.53 గంటలకు మద్దూరు మున్సిపల్ శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర సీఎం రేవంత్‌రెడ్డితో పాటు తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి వచ్చారు. 2.56 గంటలకు పేట కలెక్టర్ ప్రియాంక ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. 3.00 గంటలకు సీఎం కాన్వాయ్‌లో డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ ఎస్పీ డాక్టర్ వినీత్ ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం సీఎం భవన నిర్మాణ పనులను పరీశీలించారు. 3.25 గంటలకు స్థానిక పాత బస్టాండ్ ఆంజనేయస్వామి ఆలయం మీదుగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలకు చేరుకున్నారు. అక్కడ సమీప కాలనీలోని మహిళలతో మాట్లాడారు. 3.45 గంటలకు గురుకుల కళాశాల నుంచి బయలుదేరి.. నారాయణపేట– కోస్గి ప్రధాన రహదారిపై ఇరువైపులా నిల్చున్న ప్రజలకు కారు డోర్లో నిలబడి అభివాదం చేస్తూ హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. 4.00 గంటలకు సీఎం, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, కడా చైర్మన్ వెంకట్‌రెడ్డి హెలిక్యాప్టర్‌లో కూర్చున్నారు. 4.08 గంటలకు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని గోకఫసల్బాద్కు హెలిక్యాప్టర్ బయలుదేరి వెళ్లింది. నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు డిగ్రీ కళాశాల భవనాన్ని మార్చిలోగా పూర్తిచేయాలి మద్దూరులో అభివృద్ధి పనులు పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంలో 1.15 గంటలు ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు -
సంకల్పసభ విజయవంతం చేయాలి
కొత్తకోట: ఈ నెల 6న నిర్వహించనున్న చలో హైదరాబాద్ ఉద్యోగుల సంకల్పసభను విజయవంతం చేయాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి వేముల అమరేందర్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఎమ్మార్సీలో సభకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను పట్టించుకోని ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కృష్ణయ్య, తపస్ మండల అధ్యక్షుడు రాఘవేంద్రాచారి, ప్రధానకార్యదర్శి అరవింద్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు బాలకొండయ్య, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, ఈశ్వరయ్య, కురుమూర్తి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాటి రాజసం వచ్చేనా?
18వ శతాబ్దంలో శత్రుదుర్భేద్యంగా చంద్రగఢ్కోటను నిర్మించిన చంద్రగిరి మహారాజు ●శత్రువుల బారి నుంచి రక్షించుకునేందుకు కోటను దుర్భేద్యంగా కట్టారు. అంతెత్తు ప్రహరీని దాటుకుని శత్రు మూకలు లోపలికి వచ్చే అవకాశం లేదు. కోట ప్రధాన ద్వారం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇరువైపులా అరుగులు, ఎత్తయిన తలుపులు, కోటపై భాగంలో ఫిరంగుల అరలు.. గత ఘన వైభవాన్ని చాటుతాయి. కోటపై భాగంలో కాపలా ఉండే సై నికులు శత్రుదేశాల రాజులు ఎవరైనా దండెత్తడానికి వస్తే వారిని సుమారు పది కిలోమీటర్ల దూరం నుంచే పసిగట్టి ఫిరంగులతో దాడి చేయడానికి వీలుగా కోట గోడ భాగంలో భారీ రంధ్రాలు ఏర్పాటు చేశారు. వీటి నుంచి శత్రువుల కదలికలను గుర్తించి ఎదుర్కొనే అవకాశం ఉంది. చంద్రగఢ్ కోటను పర్యాటక శాఖ గుర్తించి ఆధునీకరిస్తే ఉమ్మడి జిల్లాకే ఇది గర్వ కారణంగా మారుతుంది. పక్కనే ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వస్తున్న సందర్శకులు, పర్యాటకులు ప్రాజెక్టుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగఢ్ కోటను సందర్శించేందుకు వస్తున్నారు. కానీ వారికి సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. – నాగేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, చంద్రగఢ్ అమరచింత మండలంలో అతి ప్రాచీనమైన చంద్రగఢ్ కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేలా మంత్రి వాకిటి శ్రీహరి చొరవ చూపాలి. పర్యాటకంగా గుర్తిస్తే ఇక్కడి ప్రజలకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. – వెంకటేష్ అమరచింత అమరచింత: నాడు ఉమ్మడి జిల్లాలోని అన్ని సంస్థానాధీశుల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఆర్థికంగా, రాజసంగా వెలుగొందిన కోట నేడు పాలకుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా, శిథిలావస్థకు గోడలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. అత్యంత పురాతన కట్టడాల్లో ఒకటైన చంద్రగఢ్ కోట అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచింది. ఈ కోటను 18వ శతాబ్దంలో నాటి చంద్రగిరి మహారాజు చంద్రసేనుడు శత్రుదుర్భేద్యంగా నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. అలాంటి వారసత్వ సంపదను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాల్సిన ప్రభుత్వాలు కోట పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి సైతం కోటను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అడుగులు పడకపోవడంపై స్థానికులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఇలాగే కొన్నాళ్లు గడిస్తే చంద్రగఢ్ కోట చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితులు దాపరిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలమవుతున్న కోట గోడలు.. సరైన నిర్వహణ లేక చంద్రగఢ్ కోట లోపల గల రాతి గోడలు ఒకొక్కటిగా శిథిలమవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌యాదవ్ కోటను సందర్శించి వాటిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని, పర్యాటకంగా గుర్తింపు తీసుకొస్తామని ప్రకటించారు. అప్పట్లో కేవలం కోటపైకి వెళ్లడానికి వీలుగా సీసీ రహదారిని నిర్మించి వదిలేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కోటను పట్టించుకోనే వారే కరువయ్యారు. జిల్లా మంత్రులు దయచూపేనా? ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు చంద్రగఢ్ కోటను పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి కోటను సందర్శించిన ఆయన రూ.20 లక్షలు సీసీ రహదారి కోసం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా.. ఇప్పటి వరకు నిధులు మంజూరు కాకపోవడంతో సీసీ రహదారికి నోచుకోలేదు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు చొరవ చూపి చంద్రగఢ్‌కు పర్యాటక శోభ తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. చుట్టూ ఆహ్లాదకరమే.. 18వ శతాబ్దంలో మరాఠి రాజుల కాలంలో బాజీరావు పీష్వా ఆత్మకూర్ శంస్థానానికి సంబంధించిన పన్నులు వసూలు చేయడానికి చంద్రసేనుడిని నియమించగా.. ఆయన ధర్మాపురంలో గ్రామానికి ఉత్తర దిశగా చుట్టూ పచ్చని పొలాలు, ఆహ్లాదకరంగా ఉండేలా ఎత్తైన కొండపై కోటను నిర్మించాడు. నాటి నుంచి ఇక్కడి నుంచే చంద్రసేనుడు వివిధ శంస్థానధీశుల నుంచి పన్నులు వసూలు చేస్తూ మరాఠాకు పంపుతుండేవారు. చంద్రసేనుడు నిర్మించిన కోట కావడంతో కాలక్రమంలో దీన్ని చంద్రగఢ్ కోటగా నామకరణం చేశారు. కోట మధ్యలో రామలింగేశ్వర ఆలయంతో పాటు రాతిపొరల మధ్య తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఎనిమిది కొలనుల్లో ఏడాది పొడవునా నీరు ఉండడం మరో విశేషం. సాక్షాత్తు పరమశివుడు కొలువైన గుట్ట కావడంతోనే గంగమ్మ తల్లి ఇక్కడ కొలువైందని భక్తులు విశ్వసిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జాతరతో పాటు నిత్యపూజలు నిర్వహిస్తూ వచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి సందర్శనకు వస్తున్న పర్యాటకులు వసతులు లేక ఇబ్బందులు మంత్రుల హామీతోనైనా ముందడుగు పడుతుందని స్థానికుల ఆశ పన్నుల వసూళ్లతో నాడు కళకళ -
ప్రతిభకు ప్రోత్సాహం అవసరం
వనపర్తి: ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల్లో (సీడబ్ల్యూఎస్ఎన్) అపారమైన జ్ఞానం, ప్రతిభ దాగి ఉంటుందని.. గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంపై ఉందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్ఎల్వీ గ్రాండ్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు, సంరక్షకుల జిల్లాస్థాయి అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావించాలని.. తల్లిదండ్రులు తమ పిల్లలను చూసి గర్వపడాలని సూచించారు. పిల్లల సామర్థ్యాలను గుర్తించి వారు లక్ష్యాలు సాధించేలా నిరంతరం ప్రోత్సహించాలన్నారు. ప్రత్యేక అవసరాల వ్యక్తుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని.. దివ్యాంగులకు నెలకు రూ.4 వేలు పింఛన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తోందని తెలిపారు. భవిత కేంద్రాల ద్వారా అవసరమైన శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఐఆర్పీ(ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్‌పర్సన్స్) నిరంతరం పిల్లలకు సహకరిస్తూ అవసరమైన శిక్షణ అందిస్తున్నారన్నారు. దివ్యాంగుల పింఛన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోందని.. 16వ తేదీ చివరి గడువని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ప్రదర్శించిన వివిధ ప్రతిభా కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. పిల్లల్లోని సృజనాత్మకత, ప్రతి భను చూసి తల్లిదండ్రులు, అధికారులు, కార్యక్రమానికి హాజరైన వారు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, ఇత ర జిల్లా విద్యాశాఖ అధికారులు, భవిత కేంద్రాల సిబ్బంది, ఐఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
‘సర్’ సందేహాలు నివృత్తి చేయాలి
వనపర్తిటౌన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులు, బీఎల్వోలు సంప్రదించి నివృత్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న హియరింగ్‌లను వేగవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ హియరింగ్ ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు, దరఖాస్తుదారుల పత్రాలను తనిఖీ చేసి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రధాన లక్ష్యమన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కేసును వాస్తవ ప్రాతిపదికన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట పుర కమిషనర్ నిరంజన్, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
పీఆర్సీ సాధిస్తాం : ఎమ్మెల్సీ
ఆత్మకూర్: పీఆర్సీ సాధిస్తామని.. త్వరలోనే ఉత్తర్వులు రానున్నాయని ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో కొత్తగా నిర్మించిన పీఆర్టీయూ టీఎస్ సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయిస్తామని, ఉద్యోగుల హెల్త్‌కార్డుల సేవలు మరింత మెరుగుపరుస్తామని, బకాయిలు విడుదల కానున్నాయని వివరించారు. పీఆర్టీయూ సంఘానికి ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లోనే పక్కా భవనాలుండగా.. ప్రస్తుతం ఆత్మకూర్‌లో సొంత భవనం నిర్మించుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, మాజీ ఎంపీపీలు శ్రీధర్‌గౌడ్, వీరేశ లింగం, నాయకులు నాగేష్, శ్రీను, రవియాదవ్, కోటేష్, రామకృష్ణ, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు బౌద్దారెడ్డి, ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్, రవీందర్‌గౌడ్, వర్కటం శ్రీనివాస్‌రెడ్డి, వగ్గు రాఘవేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అధికారుల తనిఖీ వనపర్తి రూరల్: వినియోగదారుల ఫిర్యాదు మేరకు గురువారం జిల్లాకేంద్రంలోని శ్రీనివాస థియేటర్‌ను లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో డిజిటల్ ఎలక్ట్రానిక్ యంత్రం వినియోగించాలని సూచించారు. వాటర్ బాటిల్, కూల్‌డింక్స్, పాప్‌కార్న్‌లు ఎంఆర్పీ కంటే ఎక్కువ వసూలు చేయరాదన్నారు. ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్ చట్టవిరుద్ధంగా ఉన్నందున కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు. వేంకటేశ్వర, శ్రీరామ థియేటర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అలాగే గాంధీచౌక్‌లోని బంగారు దుకాణంలో కూడా తనిఖీలు చేసి ముద్రలు లేని రెండు తూకపు యంత్రాలను గుర్తించి కేసు నమోదు చేశామని వివరించారు. కార్మికుల శ్రేయస్సే ధ్యేయం కొల్లాపూర్/ అచ్చంపేట రూరల్: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల శ్రేయస్సే తెలంగాణ మజ్దూర్ యూనియన్ ధ్యేయం అని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి అన్నారు. ఆర్టీసీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన కొల్లాపూర్ డిపో వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగి సంక్షేమం కోసం టీఎంయూ కృషిచేస్తోందన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఎంత వరకై నా పోరాడుతామన్నారు. త్వరలో జరగబోయే ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఎంయూ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అంతకు ముందు అశ్వత్థామరెడ్డితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు శంకర్‌తో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించి డిపో వరకు వెళ్లారు. అచ్చంపేట ఆర్టీసీ డిపో సమీపంలో టీఎంయూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నారాయణ, మధు, ఎన్నికల పర్యవేక్షకులు వహీదొద్దీన్, అచ్చంపేట డిపో అధ్యక్షుడు జంగిరెడ్డి, కార్యదర్శి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వనపర్తి డిపోకు 137 శాతం ఓఆర్
వనపర్తిటౌన్: రాఖీపండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా సర్వీసులు నిర్వహించడంతో పాటు అదనపు ట్రిప్పులు నడిపి ఏకంగా 137 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) సాధించి అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశారని డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని డిపో ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక గేట్ మీటింగ్‌లో రాఖీ పండుగ వేళ మెరుగైన సేవలందించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ సిబ్బంది, సూపర్వైజర్లను అభినందించి మిఠాయిలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఉద్యోగులు చూపిన సమష్టి కృషినే ఘనతకు కారణమన్నారు. ఆగస్టు మొత్తంలోనూ డిపో 100 శాతం ఓఆర్ సాధించి సంస్థ పురోగతిలో ముందువరసలో నిలిచిందని తెలిపారు. ఉద్యోగులందరి ఐక్యత, బాధ్యతాయుతమైన పనితీరుతోనే సాధ్యమైందని.. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ డిపోకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు జయకృష్ణ, కృష్ణ, ఎస్డీఐ కృష్ణ, కంట్రోలర్లు, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పాలనలో సాగు విధ్వంసం
వనపర్తి రూరల్/ఖిల్లాఘనపురం: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని.. రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా.. నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ గురువారం పెబ్బేరు, ఖిల్లాఘనపురంలో నిర్వహించిన రైతు నిరసన సభలకు ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ హయంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేస్తే.. నేడు రేవంత్‌రెడ్డి పాలనలో విధ్వంసానికి గురైందని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని.. 33 నెలల కాలంలో రాష్ట్రంలో సుమారు వెయ్యి మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. 20 లక్షల మందికి కూడా పూర్తిస్థాయిలో చేయకుండా మోసం చేశారన్నారు. నేడు సాగునీరు, యూరియా కోసం రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. రైతుబీమా ప్రీమియం చెల్లించి అన్నదాతలను ఆదుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసురావడం లేదన్నారు. గణప సముద్రం, బుద్దారం చెరువులను రిజర్వాయర్లుగా మార్చి పరిహారం వచ్చేలా చేసింది కేసీఆర్ అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. రూ.4.50 లక్షల కోట్ల అప్పుచేసి రికార్డు సృష్టించారని, సీఎంపై ఆయన మంత్రివర్గానికే విశ్వాసం లేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి మూటలు.. మనకు ఉట్టి మాటలు అన్న చందంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని అబద్ధాలు చెప్పినా.. అభివృద్ధి ఎవరు చేశారనేది మున్ముందు ప్రజలు గుర్తిస్తారన్నారు. పెబ్బేరులో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు వనం రాములు, దిలీప్‌కుమార్‌రెడ్డి, నాయకులు కర్రెస్వామి, ఎద్దుల కరుణశ్రీ, పలుస శంకర్‌గౌడ్, రాజశేఖర్, హరిశంకర్‌నాయుడు, ఖిల్లాఘనపురంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సామ్యానాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి -
వేటు.. దారెటు!
–8లో uసాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆయనపై వేటు పడింది. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పిస్తూ.. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన సైతం వెలువడింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న సీనియర్ నేతపై ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం సృష్టిస్తుండగా.. ఆయన దారెటు అనేది హాట్‌టాపిక్‌గా మారింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం.. చిన్నారెడ్డి 1980 నుంచి 1983 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 1989 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999–2004, 2004–2009, 2014–2018 కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2007 నుంచి 2009 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2018లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టికెట్ చేజారడం నుంచి మొదలు.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం మొదట ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేఘారెడ్డికి టికెట్ కేటాయించడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలుపొందగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2024లో చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అయితే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారడంతో మనస్థాపానికి గురైన ఆయన పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు. అనివార్యత పరిస్థితుల్లోనేనా.. సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కొండా సురేఖ సైతం విమర్శలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమైపె వేటు వేసే క్రమంలో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చిన్నారెడ్డి వర్గీయుల్లో అయోమయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించిన క్రమంలో ఆయన అనుచర వర్గంలో నిరాశ అలుముకుంది. ఆయన మాట్లాడింది పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కావని, దశాబ్దాలుగా జెండా మోసిన పాత కార్యకర్తల ఆవేదననే వెళ్లగక్కా రని వారు చెబుతున్నారు. 48ఏళ్ల క్రమశిక్షణకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తమ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన, అ యోమయం వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది. ముదిరిన విభేదాలు.. వనపర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పరంగా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పలుమార్లు చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు. కేబినెట్ హోదాలో తనకు కేటాయించిన గన్మెన్లు, ప్రభుత్వ వాహనాన్ని ఉపసంహరించుకున్నారు. తన అనుచరులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేఘారెడ్డి సైతం ఆయనపై ప్రతి విమర్శలు చేయడం.. ఇలా ఇద్దరి మధ్య క్రమక్రమంగా విభేదాలు మరింత ముదిరాయి. ఘాటు విమర్శలతో.. ఇటీవల గోపాల్‌పేటలో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, వాటిని భరిస్తూ వస్తున్నానని, లేకుంటే తాను మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ తనకు సీటు ఇచ్చినా ఇక్కడ డబ్బులకు లొంగి తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్ని అనుభవించిన వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చి మళ్లీ తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఈ వ్యాఖ్యలు నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. అధిష్టానానికి ఫిర్యాదుతో.. చిన్నారెడ్డి వ్యాఖ్యలను మేఘారెడ్డి ఖండించడంతోపాటు తాను డబ్బులు ఎవరికిచ్చి సీటు తెచ్చుకున్నానో చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. దీనిపై టీపీసీసీ, క్రమశిక్షణ కమిటీ, సీఎం, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి, ఏఐసీసీకి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. క్రమశిక్షణ కమిటీ సైతం చర్యలకు సిఫార్సు చేయడం.. సీరియస్‌గా పరిగణించిన పార్టీ అధిష్టానం సుమారు రెండు రోజులుగా ముఖ్య నేతలతో చర్చించి చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గురువారం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి తొలగింపు సీనియర్ నేతపై కాంగ్రెస్ అధిష్టానం ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరువ్యాప్తంగాహస్తం శ్రేణుల్లో కలకలం భవిష్యత్‌పై జిల్లెల అనుచరుల్లో అయోమయం -
చదుతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు
వనపర్తి: ఎస్ఐఆర్ ప్రక్రియలో అన్మ్యాప్డ్, అనామలీస్ ఓటర్ల నోటీసుల పరిష్కారానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) టి.వినోద్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అన్మ్యాప్డ్ (నో మ్యాపింగ్), అనామలీస్ (వివరాల్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు) కేటగిరీల వారికి జారీ చేసిన నోటీసుల పరిష్కారం, తదుపరి చర్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం సూచించిన విధంగా నోటీసులు అందుకున్న ప్రతి ఓటరు అర్హతను నిర్ధారించే అవసరమైన పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించారు. ఎన్నికల సంఘం పేర్కొన్న 11 రకాల పత్రాల కేటగిరీలలో సంబంధిత పత్రాలను నిర్దేశించిన తేదీలలో ఓటర్లు సమర్పించవచ్చన్నారు. 18 ఏళ్లు పూర్తైన వారు సెప్టెంబర్ 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాల్లో ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు సహకరించాలి కొత్తకోట: చదువే మానవ అభ్యున్నతికి మూలమని, ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్ అన్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీపీ మండల్ లైబ్రరీ, స్టడీ హాల్‌ను బుధవారం అదనపు కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. అదేవిధంగా స్వశక్తితో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన సుతారి విజయ్‌కుమార్, ముంత శివశంకర్ యాదవ్, గౌనికాడి రాములుయాదవ్, సత్తి సుధాకర్, మహారాజ్లను రెవెన్యూ అదనపు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సైదయ్య, మదనాపురం మార్కెట్ చైర్మన్ ప్రశాంత్, వార్డు కౌన్సిలర్ బోయేజ్, శ్రీనివాస్, పెంటన్న యాదవ్, సుభాష్, కృష్ణారెడ్డి, హోటల్ కురుమూర్తి, భాస్కర్, వెంకటేష్, నాగరాజు, మాజీ ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి ధరలకు రెక్కలు
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. సీజన్లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు దాటని ధరలు సీజన్ ముగిసిన తర్వాత పెరగడం ప్రారంభమైంది. మే వరకు నిలకడగా ఉన్నా.. జూన్ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. జూలైలో రూ.3 వేల పైచిలుకు ధరలు నమోదు కాగా.. తాజాగా మరింత పెరిగి.. రూ.5,200 వరకు ఎగబాకింది. బుధవారం ఉల్లి వేలం వేయగా క్వింటాల్ ఉల్లి రూ.5,200, కనిష్టంగా రూ.3,500 వరకు పలికింది. దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. 50 కిలోల బస్తా ధర గరిష్టంగా రూ.2,600, కనిష్టంగా రూ.1,800 వరకు అమ్మకాలు సాగాయి. చిల్లరగా రూ.40 నుంచి రూ.60 వరకు అమ్మారు. ● క్వింటాల్ గరిష్టంగా రూ.5,200.. కనిష్టంగా రూ.3,500 -
పీహెచ్సీలో ప్రసవాల సంఖ్య పెంచాలి
పాన్‌గల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచడంతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ సర్కార్ వైద్యంపై ప్రజలకు నమ్మకం పెంచాలని జిల్లా వైద్యాధికారి డా.భాస్కర్‌నాయక్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని అన్నారం పల్లె దవాఖాన, మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రోగులకు అందుతున్న సేవల తీరు, పీహెచ్సీలో మందుల స్టాక్ వివరాలను ఆయన పరిశీలించారు. జ్వర పీడితుల సర్వే, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, గర్భిణు నమోదు, వారికి అందుతున్న సేవలు, ప్రసవాల సంఖ్య, టీ–హబ్ నమూనా రిజిస్టర్లు, వ్యాక్సిన్ డ్యూ జాబితాపై ఆరా తీశారు. ముఖ్యంగా గర్భిణులకు ప్రసవ సమయం వరకు మెరుగైన వైద్యం అందిస్తూ పౌష్టికాహారం, వైద్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. మండలంలో డెంగీ జ్వరాలు పెరగకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గ్రామస్తులకు నివారణ చర్యలపై అవగాహన పెంచుతూ పారిశుద్ధ్య నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. జ్వర పీడితులు ముందుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకునేలా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలన్నారు. విధులల్లో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ పరిమళ, పల్లె దవాఖాన వైద్యులు మైథిలీ, నిహరిక, నాగరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీని నమ్మితే ఆగమే..
వనపర్తి: ఎన్నికల హామీలను నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని మరోసారి నమ్మితే ఆగం కావడం ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక రాజీవ్ చౌక్‌లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కేసీఅర్ పాలన మళ్లీ రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావటం రావడం తథ్యమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, ఒక డిక్లరేషన్ గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. ఉద్యోగస్తులు సీఎం రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారని, కాంగ్రెస్ పాలకులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రైతులు నమ్మి హరిగోస పడుతున్నారని, కరెంట్ కోతలు ఎప్పటిలాగే మారాయన్నారు. యూరియా కోసం రోడ్లపై పడిగాపులు పడాల్సివస్తుంది, నికర జలాలు ఆంధ్రావాళ్లు దోచుకుపోతుంటే రేవంత్ మొద్దు నిద్రలో ఉన్నారని ఆరోపించారు. చంద్రబాబు మెప్పు కోసం రైతులను దగా చేస్తున్న సీఎంకు పుట్టగతులు ఉండవని ధ్వజమెత్తారు. లక్ష అబద్ధాలతో.. కాంగ్రెస్ పాలన 1000 రోజుల్లో లక్ష అబద్ధాలతో కొనసాగుతుందని, వైఎస్సార్ రూపొందించిన ఫీజురియింబర్స్మెంటును కేసీఅర్ కొనసాగిస్తే.. రేవంత్‌రెడ్డి అబాసుపాలు చేశారని మండిపడ్డారు. 100 రోజుల్లో 2లక్షల ఉద్యోగాలు అని చెప్పి గద్దెనెక్కి నేడు నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ పాలనలో 2.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. చివరికి అవ్వాతాతలను మోసం చేసిన ఘనత కూడా కాంగ్రెస్ మూటగట్టుకుందన్నారు. సభాస్థలిలో ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ మోసపు హామీలను వివరిస్తూ 420 ఫీట్లు భారీ ఫ్లెక్సీ ప్రజలను ఆకర్షించింది. -
ఎకై ్సజ్ శాఖలో భారీగా బదిలీలు
● కమిషనర్ ఆమోదంతో సీఐలు, ఎస్ఐలకు స్థానచలనం నారాయణపేట: తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖలో భారీస్థాయిలో బదిలీలు చోటుచేసుకున్నాయి. సీఐ, ఎస్ఐ కేడర్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ బుధవారం సాయంత్రం నుంచి వరుసగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కమిషనర్ ఆమోదంతో గ్రేటర్ హైదరాబాద్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ (ఇన్చార్జి) హరికృష్ణ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. బదిలీ అయిన అధికారులు ప్రస్తుత పోస్టు నుంచి వెంటనే రిలీవ్ అయి, కొత్తగా కేటాయించిన స్థానాల్లో తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ● ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎకై ్సజ్ పరిధిలోనూ పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది. నారాయణపేట ఎకై ్సజ్ సీఐ అనంతయ్య శేరిలింగంపల్లికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నల్లగొండ డీటీఎఫ్ సీఐ సైదులు వస్తున్నారు. ● నారాయణపేట ఎకై ్సజ్ సర్కిల్ ఎస్ఐలు గురువయ్య దేవరకొండకు, రమేష్ కోదాడ చెక్‌పోస్టు, శిరీష తుంగతుర్తికి బదిలీ అయ్యారు. కోస్గి సీఐ బాలకృష్ణ మల్కాజ్‌గిరికి బదిలీ కాగా.. నారాయణపేట బీఎంపీపీలో పనిచేస్తున్న శ్రావణ్‌కుమార్ సైబరాబాద్ పరిధిలోని పటాన్‌చెరువుకు బదిలీ అయ్యారు. -
రాజకీయం.. రసవత్తరం!
వనపర్తిఅభివృద్ధిపై చర్చకు సిద్ధమా..? ● సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ ● వెయ్యి రోజుల పాలనపై పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు ● చేసిన అభివృద్ధి, సంక్షేమంపై కాంగ్రెస్ నేతల ప్రెస్మీట్లు ● పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ● దగా పాలన అంటూ రోడ్డెక్కిన బీఆర్ఎస్ నేతలు ● ఆసక్తి రేపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మద్దూరు పర్యటన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రి ఇలాకాలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బచిన్నంబావి: మంత్రి జూపల్లి స్వగ్రామమైన పెద్దదగడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని, ఆయన పతనం సొంతగడ్డ నుంచే ప్రారంభమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దదగడ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరగా.. వారికి బీరం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం బీరం మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి తన సొంత గ్రామం పెద్దదగడ అభివృద్ధికి వందరోజుల్లో అద్భుతమైన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా గ్రామాభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. చేరిన వారిలో కంచి జ్ఞానేశ్వరి, కరుణాకర్, మాజీ ఎంపీటీసీ గోద వెంకటేశ్వర్లు, రమేష్, పురేందర్గౌడ్, వెంకటేష్‌గౌడ్, మునిశ్వర్లు, శివశంకర్, రాముడు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణమ్మ, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు శరత్ రెడ్డి, ఈదన్నయాదవ్, రంజిత్‌కుమార్, రామకృష్ణ, నిరంజన్ రెడ్డి, పాండురంగయ్య, మహిచంద్ర, రమేష్, శేఖర్‌గౌడ్, నరసింహ పాల్గొన్నారు. 3 యూనిట్లలో విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. బుధవారం మూడు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ జూరాలలో రెండు యూనిట్ల ద్వారా 78 మెగావాట్ల సామర్థ్యంతో, ఇప్పటివరకు 98.518 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. దిగువ జూరాలలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్ల సామర్థ్యంతో, 84.304 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదైందన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో ఇప్పటివరకు మొత్తం 182.822 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు ఎస్ఈ తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం గద్వాల: జిల్లాలో వెన్నెముక సమస్య, కండరాల క్షీణిత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో మంచానికుకే పరిమితమైన వారికి అత్యవసర వైద్యసహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జౌషధాల కొనుగోలు, ఎ స్కార్ట్ అటెండర్ సహాయం కోసం దరఖాస్తులను కలెక్టరెట్లోని మహిళా శిశుసంక్షేమం, ది వ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ పత్రాలు, ఆధార్‌తో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, సహాయం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు, మరోవైపు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఊపందుకున్న పోటాపోటీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే.. దగా పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. వారం రోజుల ఆందోళనలో భాగంగా తొలి రోజు బుధవారం ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. ఈ రాజకీయ వేడి రాజుకున్న క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పర్యటన ఖరారు కావడం పాలమూరు వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ దూకుడు మంత్రంతో.. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా పాలన కాదు.. ఇది దగా పాలన అంటూ వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు బుధవారం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాకేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు భగ్గుమన్నారు. వారం పాటు ఆందోళన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా దూకుడుగా వ్యవహరించాలని మండలాల వారీగా నాయకులు, అనుచరులతో భేటీ అయిన సందర్భంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. వనపర్తి: సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ స్వీకరించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో చేపట్టింది కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమేనని, అందులో కాళేశ్వరం పూర్తి చేయగా.. పాలమూరు–రంగారెడ్డిని ఎండగట్టారని ఎద్దేవాచేశారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, సాగునీటి కాల్వలకు గండ్లు కొట్టి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మార్పులు, వెలిగొండ టన్నెల్ పనులు, నల్లమల్ల ప్రాజెక్టుల విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చితే.. కాంగ్రెస్ వాటికి వడ్డీలు కడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పనులను కొనసాగిస్తుందన్నారు. వెయ్యి రోజుల్లో వనపర్తి నియోజకవర్గంలో సుమారు రూ. రూ.2,389 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా అందుకు సంబంధించిన వివరాలతో ముద్రించిన పత్రాలను ఎమ్మెల్యే విడుదల చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో మాజీ మంత్రి పనులపై కమీషన్లు తీసుకోలేదని గుడి ఎక్కేందుకు సిద్ధమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం సంక్షేమం, అభివృద్ధి పనులపై చర్చకు తాము ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ విపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్ఎస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తుందని డీసీసీ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి మండిపడ్డారు. ప్రజల్లోకి విష సంస్కృతిని తీసుకువెళ్తుందని, వారే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అడ్డగోలు నిర్ణయాలతో చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కడుతూ.. ఎన్నో సదాలోచనలతో వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుకున్న పనులు సకాలంలో చేపట్టలేకపోతుందన్నారు. మిగులు బడ్జెట్ చేతికి వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ది కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షడు సాయిచరణ్‌రెడ్డి, లక్కాకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల నాలుగో తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఎమ్మెల్యే మేఘారెడ్డి సవాల్ –9లో uవనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది. అయితే చిన్నారెడ్డి గోపాల్పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్‌గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి సురేఖ ఎపిసోడ్ నడుస్తుండగా.. ఆ తర్వాత చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనపై చర్యలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు నడుస్తున్నాయి. -
మహిళలు పారిశ్రామికంగా రాణించాలి
వనపర్తి: మహిళలు పారిశ్రామిక రంగంలో ఎదిగేందుకు ’వీ హబ్’ ‘ర్యాంప్–ఉమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం’ చక్కటి అవకాశమని, అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.ఖీమ్యానాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శాఖ ఆధ్వర్యంలోని వీ–హబ్ సౌజన్యంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అందిస్తున్న శిక్షణ, రుణ సదుపాయాలు, మార్కెటింగ్ సహకారం, ఇతర ప్రోత్సాహకాలను మహిళలు వినియోగించుకొని తమ ఉత్పత్తులకు మంచి మార్కెట్ అవకాశాలను సృష్టించుకోవాలన్నారు. కార్యక్రమంలో వీ హబ్ సీనియర్ డైరెక్టర్ జాహీద్ అక్తర్ షేక్, డైరెక్టర్ ఊహ, డీఆర్డీఓ రామమహేశ్వర్, ఆర్సెటీ డైరెక్టర్ అనిల్, అడిషనల్ డీఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించాలి గోపాల్పేట: వీబీజీరాంజీ పథకంలో భాగంగా కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించాలని, నీటి వనరుల అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంతో పాటు మున్ననూరులో పర్యటించి ఫార్మ్ఫాండ్ పనులను పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఇప్పటివరకు చేపట్టిన పనులు, పురోగతి, కూలీల హాజరు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో మంజూరైన వీబీజీ రాంజీ పనులకు త్వరితరగతిన గ్రౌండింగ్ పూర్తి చేసి, లేబర్ మొబిలైజేషన్‌ను మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా పనులను చేపట్టడంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎంపీడీఓ అయేషాఅంజుం, ఏపీఓ నరేందర్, వీబీజీ రాంజీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
రెండు డెంగీ కేసులు నమోదు
పాన్‌గల్: మండలంలోని దావాజిపల్లి, నిజామాబాద్‌లో ఒక్కో డెంగీ కేసు నమోదైనట్లు పీహెచ్సీ వైద్యురాలు డా. మైథిలీ సోమవారం తెలిపారు. ఆయా గ్రామాల్లో బాధితుల ఇళ్ల పరిసరాల్లోని వారి నుంచి వైద్యసిబ్బంది రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సోమవారం దావాజిపల్లిలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేసి రక్త నమూనాలను సేకరించి అవసరం ఉన్న వారికి మందులు పంపిణీ చేశామన్నారు. గ్రామంలో పర్యటించి పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వైద్యసిబ్బంది రాంచందర్, కమల, ఆశ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పోలీసు సేవలు మరింత చేరువ : ఎస్పీ వనపర్తి: ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడంతో పాటు శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించడమే పోలీసుశాఖ ప్రధాన లక్ష్యమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఆమె హాజరై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 13 మంది ఫిర్యాదుదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, ఎలాంటి పైరవీలు చేయకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజల సమస్యలు, వినతులను నేరుగా స్వీకరించి పరిష్కారం చూపేందుకు ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నామని తెలిపారు. 22(ఏ) భూములను గుర్తించాలి వనపర్తి: జిల్లాలో 22(ఏ) కింద నమోదైన మొత్తం భూమి ఎంత ఉందో సర్వేనంబర్ల వారీగా గుర్తించి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ ఆదేశించారు. సోమవారం కలెక్టరెట్లోని తన చాంబర్లో తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించి మాట్లాడారు. 22ఏ కింద 2025, డిసెంబర్ కంటే ము ందు నమోదైన భూమి ఎంత? తదుపరి ఇప్ప టి వరకు భూ భారతి ద్వారా సరిచేయగా మిగిలిన భూమి ఎంత ఉందో సర్వేనంబర్ వారీగా వివరాలు ఇవ్వాలన్నారు. సమావేశంలో డి– సెక్షన్ సూపరింటెండెంట్ సునీత పాల్గొన్నారు. -
జల చౌర్యం ప్రభుత్వానికి పట్టదా.. : మాజీ మంత్రి
వనపర్తి: యథేచ్ఛగా నికర జలాల చౌర్యానికి పాల్పడుతున్న ఏపీ ప్రభుత్వాన్ని నిలదీయడంలో తెలంగాణ సర్కారు విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం స్థానిక బీఆర్ఎస్పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొన్నిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని గ్రావిటీ పద్ధతిన బాహాటంగా తరలించుకుపోతున్నా.. కేంద్ర జలవనరుల శాఖకు ఫిర్యాదు చేయాలన్న సోయి లేకపోవడం శోచనీయమన్నారు. కృష్ణానదిలో తెలంగాణకు దక్కాల్సిన నీటివాటాకు గండికొట్టి నికర జలాలను దోచుకుంటే.. నిమ్మకుండటం ఏపీ సర్కారుకు తాపేదారుగా రాష్ట్ర పాలకులు వ్యవహరిస్తున్నట్లేనని తెలిపారు. 2015లో శంకుస్థాపన చేసిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం చేయకపోవడానికి కొందరు అక్కసుతో కోర్టులో కేసులు వేయడమే ప్రధాన కారణమన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్లామని తెలిపారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లు, టన్నెళ్ల నిర్మాణంలో కీలక పనులు పూర్తి చేశామని చెప్పారు. 2023 నాటికే దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయని.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో ఆశించిన పురోగతి లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు ఆలస్యం చేస్తే తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఏపీ వినియోగించుకునేందుకు అవకాశాలిచ్చినట్లేనన్నారు. జూరాలకు వరద వచ్చిన సమయంలో కూడా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ పనులను పూర్తి చేయడంలోనూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీ ప్రభుత్వం వెలుగొండలో 19 కిలోమీటర్ల టన్నెల్ పనులు పూర్తి చేయగలిగినప్పుడు.. తెలంగాణలో ప్రాజెక్టుల పనులను ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఏ చర్యనూ చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అవగాహన లేకుండా, నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోమని.. రాజకీయంగా గట్టి సమాధానం ఇస్తామన్నారు. 14 ఏళ్ల పాటు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడామని, పాలమూరు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ నీటి హక్కుల కోసం అవసరమైతే మరోసారి గట్టిగా పోరాడతామని స్పష్టం చేశారు. -
అమలయ్యేనా?
విద్యార్థులపై పుస్తకాల బ్యాగుల భారాన్ని తగ్గించేందుకు నో బ్యాగ్ డే నిర్వహించాలనే మార్గదర్శకాలు ఉన్నాయి. పాఠశాలల్లో కచ్చితంగా అమలు చేయాలి. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులు పాఠశాలలను పర్యవేక్షించి అమలు తీరును పరిశీలిస్తారు. – యాదయ్య, ఇన్చార్జ్ జిల్లా విద్యాధికారి నో బ్యాగ్ డే అంటే పుస్తక జ్ఞానానికి బదులుగా అనుభవాత్మక అభ్యసనానికి ప్రాధాన్యం ఇచ్చే రోజని అర్థం. పాఠ్య పుస్తకాల్లోని అంశాలను నిజ జీవితానికి అనుసంధానం చేయడంతో విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు సమస్య పరిష్కార సామర్థ్యం, సృజనాత్మకత, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులపై పుస్తకాల బ్యాగుల బరువును తగ్గించడం ఒక కోణం కాగా.. విద్యను తరగతి గది గోడలకే పరిమితం చేయకుండా జీవితానికి అనుసంధానం చేయడమే నో బ్యాగ్ డే అసలు లక్ష్యం. ప్రతి నెల మూడో శనివారం ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించి విద్యార్థులను వివిధ కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తే ఆచరణాత్మక విద్యకు ఇది మంచి వేధికగా మారుతుంది. అయితే లక్ష్యాలు, మార్గదర్శకాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలయ్యేలా విద్యాశాఖ పర్యవేక్షణ, పాఠశాలల చొరవ, ఉపాధ్యాయుల భాగస్వామ్యం తప్పనిసరి. వనపర్తి టౌన్: విద్యార్థులకు పుస్తకాల బ్యాగుల భారాన్ని తగ్గించడంతో పాటు వారిలో సృజనాత్మకత, ఆలోచనా శక్తి, నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతి నెల మూడో శనివారం ‘నో బ్యాగ్ డే’ను అన్ని పాఠశాలల్లో అమలు చేయాల్సి ఉంది. ఆ రోజున విద్యార్థులు పుస్తకాల బ్యాగులు లేకుండా పాఠశాలకు హాజరై తరగతి గదికి పరిమితం కాని విధంగా వివిధ ఆచరణాత్మక, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉపాధ్యాయులు చూడాల్సి ఉంది. సాధారణ రోజుల్లో పుస్తకాలు, రాత పుస్తకాల ఆధారంగా జరిగే బోధనకు భిన్నంగా ఆ రోజు విద్యార్థులు వివిధ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేలా పాఠశాలలు ప్రణాళిక రూపొందించాలి. చిత్రలేఖనం, కథలు చెప్పడం, క్విజ్, సైన్స్ ప్రయోగాలు, పాత్రధారణ, నాటికలు, బాలసభలు, సృజనాత్మక రచనలు, స్థానిక వృత్తులు–కళలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వారి కుటుంబం, పరిసరాలు, గ్రామం, పట్టణం, వివిధ వృత్తులపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలి. ఉన్నత తరగతుల విద్యార్థులకు పోస్టాఫీసు, బ్యాంకు, మార్కెట్, రేషన్ దుకాణం, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, వృత్తి నిపుణుల వద్దకు తీసుకెళ్లి ఆయా రంగాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించే కార్యక్రమాలు రూపొందించాలి. మాదిరి అసెంబ్లీ, మాదిరి ఎన్నికలు, ఆర్థిక నిర్వహణ, కుటుంబ బడ్జెట్, సామాజిక అంశాలపై చర్చలు వంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, సామాజిక బాధ్యతను పెంచే అవకాశం ఉంటుంది. కానీ జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలుకు నోచుకోవడం లేదు. ● నో బ్యాగ్ డేలో విద్యార్థులందరూ చురుగ్గా పాల్గొనేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రతిభావంతులైన విద్యార్థులతో పాటు చదువులో వెనుకబడిన వారు, ప్రత్యేక అవసరాలున్న పిల్లలు కూడా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేలా చూడాలి. క్షేత్ర పర్యటనలు నిర్వహించే సందర్భంలో విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. కార్యక్రమం పూర్తయిన అనంతరం విద్యార్థులు ఏం నేర్చుకున్నారు.. ఏ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకున్నారనే అంశాలను కూడా పరిశీలిస్తే కార్యక్రమానికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. నో బ్యాగ్ డే అమలులో పాఠశాలల పర్యవేక్షణ కూడా కీలకమే. విద్యాశాఖ అధికారులు, మండలస్థాయి అధికారులు, ప్రధానోపాధ్యాయులు కార్యక్రమం సక్రమంగా కొనసాగుతుందా లేదా అన్నది పరిశీలించాలి. పాఠశాలలకు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేయడంతో పాటు ప్రతి నెల మూడో శనివారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలను నమోదు చేసుకునే విధానం ఉంటే అమలు తీరును అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఆదేశాలు జారీ చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో అవి అమలవుతున్నాయా లేదా అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ అవసరం. విద్యార్థులకు దొరకని ఆటవిడుపు కాగితాలకే పరిమితమైన వైనం ఈ ఏడాదైనా ప్రాధాన్యత లభించేనా..? పాఠశాలలు ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా.. ఈ కార్యక్రమం అమలుకు నోచుకోకపోవడంతో కేంద్ర ప్రభుత్వ లక్ష్యం, రాష్ట్ర అధికారుల ఆదేశాలు నీరుగారుతున్నాయి. ఇప్పటికీ జిల్లాలో 10 పాఠశాలలకు మించి ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించకపోవడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా 165 ప్రైవేట్ పాఠశాలల్లో 36,144 మంది, 498 ప్రభుత్వ పాఠశాలల్లో 33,057 మంది విద్యార్థులు చదువుతున్నారు. మొత్తంగా 69,201 మంది విద్యార్థులు నో బ్యాగ్ డేకు దూరంగానే ఉన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల ధర్నా
వనపర్తిటౌన్: రోస్టర్ పాయింట్ల అమలుపై స్పష్టత వచ్చే వరకు పదోన్నతి ప్రక్రియ నిలిపివేయాలని జిల్లా విద్యుత్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పూల్యానాయక్, ప్రధానకార్యదర్శి ఆర్.దయానందం డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాకేంద్రంలోని విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట జిల్లా విద్యుత్ డివిజన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోస్టర్ పాయింట్ల అంశంపై నాలుగు నెలల కిందటే డీఈకి సంఘం తరఫున లేఖ అందజేసినా ఇప్పటి వరకు స్పష్టమైన వివరణ ఇవ్వలేదన్నారు. రోస్టర్ పాయింట్లను పరిగణలోకి తీసుకోకుండా పదోన్నతులు కల్పిస్తే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పరిష్కారం లభించకపోవడంతోనే ధర్నా చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు అనుగుణంగా రోస్టర్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. -
ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు
వీపనగండ్ల: ప్రజల ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని.. నిర్లక్ష్యం సరికాదని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మండలంలో నెలకొన్న సమస్యలపై ఉన్నతస్థాయి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. భూ సర్వే కోసం దరఖాస్తు చేసినా.. పట్టించుకోని మండల సర్వేయర్ శివపై తక్షణ చర్యలు తీసుకొని ఇంక్రిమెంట్ నిలిపివేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్‌ను ఆదేశించారు. కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పించుకోవడంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని.. వాట్సప్‌లో ఫిర్యాదు చేసినా సత్వరమే పరిష్కరించాలని కోరారు. మండల కేంద్రంతో పాటు కల్వరాల, గోపల్‌దిన్నెలో నెలకొన్న భూ సమస్యలతో పాటు భీమా కాల్వకు తక్షణ మరమ్మతు చేపట్టి ఆయకట్టుకు సాగునీరు అందేలా చూడాలన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు అధికారులు చొరవ చూపి ప్రైవేట్ సంస్థల ద్వారా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు. ఓటు హక్కు కోల్పోతే సంక్షేమ పథకాలకు అర్హత కోల్పోతారని.. గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేవిధంగా చూడాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్‌కుమార్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, స్థానిక సర్పంచ్ మీసాల పార్వతమ్మ, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు -
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యం
కొత్తకోట రూరల్: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అప్పరాలలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మూడేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ మాసన్న, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు రావుల కరుణాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్‌రెడ్డి, బీచుపల్లి యాదవ్, శివరాములు తదితరులు పాల్గొన్నారు. -
సర్.. అయోమయం!
అమరచింత: ఓటరు జాబితాలో తమ పేరు ఉంటుందో లేదోనన్న గుబులు నో మ్యాచింగ్ నోటీసులు అందుకున్న వారిలో నెలకొంది. అప్పట్లోనే బీఎల్వోలు ఏది అడిగినా ఇచ్చామని.. మళ్లీ ఎందుకు నోటీసులు ఇస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. 2002 ఓటరు జాబితాలోని పేర్లకు.. ఇప్పటి ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లలో స్వల్ప మార్పులున్న వారు జిల్లావ్యాప్తంగా 88 వేల మందికిపైగా ఉండటంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు ఓటర్లకు బీఎల్వోలు నో మ్యాపింగ్ నోటీసులు అందించడం, అక్కడే సరైన ఆధారాలు అందిస్తే వెంటనే ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేయడం వంటి పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. వారం రోజులుగా కొనసాగుతున్న కార్యక్రమం ద్వారా పలువురు నోటీసులు అందుకున్న ఓటర్లు పూర్తి సమాచారంతో మరోమారు ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకునేందుకు బీఎల్వోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొన్ని మండలాల్లో తహసీల్దార్ల సమక్షంలో నోటీసులు అందిస్తుండగా.. మరికొన్ని మండలాల్లో ఎంపీడీఓల ద్వారా పంపిణీ చేస్తున్నారు. మండలాల్లో రోజుకో గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడే సాయంత్రం వరకు ఉండి ఆధారాల పత్రాలతో వచ్చి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికై నా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో తమ పేర్లు ఉండాయో లేదోననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లే.. నోటీసులు అందుకున్న వారిలో అత్యధికంగా చిన్న చిన్న పొరపాట్లే ఉన్నాయని అధికారులు తెలిపారు. తండ్రి, తల్లి, ఇంటి పేరు, కాలనీల పేరు ఇలా చిన్న చిన్న తప్పులే అధికంగా ఉండటంతో వాటికి సంబంధించి రుజువుతో కూడిన పత్రాలతో గ్రామపంచాయతీలకు వెళ్తున్నారు. అందజేయాల్సిన పత్రాలివే.. పదోతరగతి మెమో, ఆధార్‌కార్డు, పాస్‌పోర్ట్, కుల ధ్రువీకరణ పత్రం, 2002 ఓటరు జాబితాలో పేరుకు సంబంధించిన జిరాక్స్, పట్టాదారు పాసు పుస్తకం, డ్రైవింగ్ లైసెన్స్. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు పెద్ద నాగమ్మ పోతుల, అమరచింత మండలంలోని నాగల్ కడ్మూర్ స్వగ్రామం. అయితే ఓటరు జాబితాలో పెద్దనాగమ్మ పోతుల అని ఉండగా ఆధార్‌కార్డులో మాత్రం పోతుల పెద్ద నాగమ్మ అని ఉంది. దీంతో నో మ్యాపింగ్ కింద సరైన ఆధారాలు సమర్పించాలని నోటీసు అందించారు. దీంతో ఆమె అయోమయానికి గురై ఆధార్ కార్డును తీసుకొని బీఎల్వోకు ఇచ్చింది. తన పేరు ఓటరు జాబితాలో ఉంటుందా.. లేదా అని అధికారులను ప్రశ్నిస్తుంది. జిల్లాలో 88 వేల మందికిపైగా నో మ్యాపింగ్ నోటీసులు తండ్రి, భర్త, ఇంటి పేర్లే ప్రధాన సమస్య సరైన ఆధారాలతో మళ్లీ ఆన్లైన్ చేయాలని సూచన ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లున్నా.. తప్పని తిప్పలు వలస వెళ్లిన వారి కష్టాలు.. నో మ్యాపింగ్ జాబితాలో పేర్లున్న ఓటర్లలో చాలామంది బతుకుదెరువు కోసం ఇతర పట్టణాలకు వలస వెళ్లడం ప్రధాన సమస్యగా మారింది. గ్రామాల్లో నో మ్యాపింగ్ నోటీసులు అందించడానికి సదరు కుటుంబ సభ్యులు లేకపోవడంతో వారి బంధువులకు సమాచారమిచ్చి అందజేస్తున్నారు. వలసవెళ్లిన వారు తమ ఆధార్‌కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్స్ ప్రతులను తమ బంధువులకు పంపించి అధికారులు అందిస్తున్న పరిస్థితులు దాపురించాయి. మరికొన్ని గ్రామాల్లో ఇదే సమస్య తీవ్రంగా ఉండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
అలంపూర్ ఆలయాల అభివృద్ధికి కృషి
అలంపూర్ రూరల్: ప్రసాద్ స్కీంలో భాగంగా అలంపూర్ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని.. భవిష్యత్‌లో కూడా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి 8 జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి.. జోగుళాంబదేవి సన్నిధిలో మల్టీ మీడియా సౌండ్, లైట్ షోను ప్రారంభించారు. అంతకు ముందు ఎంపీలు మల్లు రవి డీకే అరుణ, ఎమ్మెల్యే విజయుడు, టూరిజంశాఖ అధికారులు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత కలిగిన అలంపూర్ ఆలయాలను పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకుంటారని, భక్తులు ప్రతిరోజు సాయంత్రం 25 నిమిషాల పాటు ఆలయ చరిత్రను తెలియజేసేలా మల్టీ మీడియా సౌండ్, లైట్‌షోను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదివరకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని సుమారు 15 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.700 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో దర్శనీయ స్థలాలను అభివృద్ధి చేసేందుకు పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తున్నామన్నారు. గోల్కొండ కోట, ఉస్మానియా కళాశాల వద్ద సౌండ్, లైట్ షో ఏర్పాటు చేశామన్నారు. అమృత్ భారత్ పథకంలో భాగంగా జోగుళాంబ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, పురాతన ఆలయాల పరిరక్షణకు స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజలు కలిసిరావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. -
నేటి ధర్నాను విజయవంతం చేయాలి : సీపీఎం
కొత్తకోట: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులైన చక్కెర, ఉల్లిగడ్డ, మంచి నూనె, ఉప్పు, గోధుమలు, పిండి తదితర వాటిని వినియోగదారులకు రాయితీపై ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదని.. నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు లేవని, మరుగుదొడ్లు లేవని, దుర్వాసన వెదజల్లుతుందన్నారు. పట్టణంలోని ప్రతి సమస్యను పరిష్కరించే వరకు పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎండీ జబ్బార్, బాల్‌రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మండ్ల రాజు, మండల కార్యదర్శి బొబ్బిలి నిక్సన్ తదితరులు పాల్గొన్నారు. పునరావాస కేంద్రంలో పనుల అడ్డగింత కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి పునరావాస కేంద్రంలో నిర్మాణాలు నాసిరకంగా చేపడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కలెక్టర్ ఆదర్శ్ సురభి పునరావాస కేంద్రాన్ని సందర్శించి పనులు నాణ్యతగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్‌కు సూచించినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్నారు. సర్వం కోల్పోయి పునరావాస కేంద్రానికి వచ్చిన తమకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు ఎంతో ముఖ్యమని, అలాంటి నిర్మాణాలను నాణ్యతతో పూర్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని తెలిపారు. ఒకవైపు అధికారులు గ్రామాభివృద్ధికి చర్యలు చేపడుతుండగా.. మరోవైపు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికై నా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టి పనులు నాణ్యతగా పూర్తి చేయించాలని కోరారు. గ్రామస్తుల నిరసనతో కొంతసేపు పనులు నిలిచిపోయాయి. కార్యక్రమంలో గ్రామస్తులు భీమన్ననాయుడు, కావలి రవి, మొగులయ్య, గాంధీ, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
పనుల వేగవంతానికి చర్యలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసింది. మొదటి విడత ఎంపికై న కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు కంప్యూటర్ ల్యాబ్ గదుల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. గ్రామీణప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది. – సుదర్శన్‌రావు, జిల్లా ఇంటర్ విద్యాధికారి, నారాయణపేట ● -
సాంకేతిక విద్యకు శ్రీకారం
కోస్గి: పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంస్కరణలను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే కళాశాలలు, సైన్స్ ల్యాబ్‌ల నిర్వహణకు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కంప్యూటర్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని నేర్పించాలనే లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కో కళాశాలకు రూ.25 లక్షలు.. అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో దశల వారీగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలుండగా.. మొదటి విడతలో 19 కళాశాలలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన ఒక్కో కళాశాలకు సమగ్ర శిక్షా ద్వారా రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.4.75 కోట్లు మంజూరు చేస్తూ ప్రాజెక్టు డైరెక్టర్ డా. నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులతో ఆయా కళాశాలల్లో ప్రత్యేక గదులు నిర్మించి కంప్యూటర్ ల్యాబ్‌గా వినియోగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాంకేతిక విద్యపై పట్టుకు.. ప్రభుత్వం చేపట్టిన పలు సర్వేల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం లేని కారణంగా నైపుణ్యాలకు దూరమవుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ కళాశాలల్లో ఫిజిక్స్‌వాలా ద్వారా ఐఐటీ, జేఈఈ, ఖాన్ అకాడమీ ద్వారా క్లాట్‌లో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. మరోవైపు గతేడాది ప్లాట్ ప్యానల్ బోర్డులను సైతం ప్రభుత్వం అందించడంతో కళాశాలల్లో డిజిటల్ బోధన జరుగుతుంది. ఈ క్రమంలో విద్యార్థులకు కంప్యూటర్ బోధన అందించి విద్యార్థులు పరిజ్ఞానంపై మరింత పట్టు సాధించాలనే లక్ష్యంతో కళాశాలల్లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విద్యా సంవత్సరం నుంచే కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రారంభించాలని, త్వరితగతిన నిర్మాణాలు చేసేందుకు ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దశల వారీగా అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేయాలని అధ్యాపకులతోపాటు విద్యార్థులు కోరుతున్నారు. ‘జూనియర్’ విద్యార్థులకు కంప్యూటర్ బోధన మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలో 19 కళాశాలలు ఎంపిక ల్యాబ్ కోసం ప్రత్యేక గది నిర్మాణం.. నిధులు మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు ఆదేశాలు దశల వారీగా అన్ని కళాశాలల్లో అమలు జిల్లాల వారీగా ఎంపికై న ప్రభుత్వ కళాశాలలు.. మహబూబ్‌నగర్ : జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్, బాలికల జూనియర్, జడ్చర్లలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, దేవరకద్ర, బాలానగర్, కోయిల్‌కొండ జూనియర్ కళాశాలు. నారాయణపేట : మక్తల్, నారాయణపేట జూనియర్ కళాశాలలు నాగర్‌కర్నూల్ : కల్వకుర్తి, బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ బాలుర కళాశాలలు వనపర్తి : ఆత్మకూర్, వనపర్తి బాలికల జూనియర్ కళాశాల. జోగుళాంబ గద్వాల : గట్టు, అయిజ, ధరూర్, గద్వాల బాలుర, గద్వాల బాలికల కళాశాల. -
ఓటరు సమగ్ర సవరణలో అప్రమత్తంగా ఉండాలి
వనపర్తిటౌన్: అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించడంతో పాటు తప్పుడు నమోదులను అడ్డుకోవడంలో కార్యకర్తలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఎస్ఐఆర్ రెండోదశ ప్రత్యేక కార్యశాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలోని 322 పోలింగ్ కేంద్రాల్లో బీజేపీ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఈఆర్వోల నుంచి నోటీసులు అందుకున్న ఓటర్లు తమ సరైన ధ్రువపత్రాలను అధికారులకు సమర్పించేలా చూడాలన్నారు. జాబితాలో ఉన్న డబుల్ ఓట్లు, తప్పుడు సమాచారంతో నమోదైన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించి అడ్డుకోవాలని మార్గదర్శనం చేశారు. 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా సహకరించాలన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సబిరెడ్డి, వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కేతూరి బుడ్డన్న, న్యాయవాది విజయభాస్కర్, జిల్లా ప్రధానకార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు శివారెడ్డి, బాబురావు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్, బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొమ్ము శ్రీనివాస్, కౌన్సిలర్ విజయ్‌సాగర్, సీనియర్ నాయకులు చిత్తారి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మనివర్ధన్సాగర్, రాయన్న సాగర్, చిన్నరాయుడు, శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వాయిదాల పర్వం..
కొల్లాపూర్: నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి పాలమూరు– రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల (ఎంజీకేఎల్ఐ) పథకం చేపట్టారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 5 మోటార్ల ద్వారా ఏటా కృష్ణానదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి.. కాల్వల ద్వారా రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ సాగు, తాగునీటిని అందించాల్సి ఉంటుంది. ఇంతటి ప్రాధాన్యం గల ఎత్తిపోతల పథకం అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతోంది. గత ఐదేళ్ల క్రితం పాడైన రెండు మోటార్లు నేటికీ మరమ్మతుకు నోచుకోవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వివిధ రకాల కారణాలు చెబుతూ అధికారులు కాలయాపన చేస్తుండటంతో.. మిగతా మూడు మోటార్లతోనే నిరంతరం నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. ఫలితంగా ఎల్లూరు లిఫ్టులో పాడైన మోటార్లకు మరమ్మతు ఈ సీజన్లో కూడా చేపట్టని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజూ ఎత్తిపోసే నీళ్లు (ఒక మోటారు) 800 క్యూసెక్కులు మూడున్నరేళ్ల క్రితం నిధులు.. కొన్ని సంవత్సరాల కాలంగా మోటార్ల మరమ్మతు పనులు వాయిదా పడుతూ వస్తున్నాయి. మోటార్ల మరమ్మతు కోసం మూడున్నరేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.16 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో కేఎల్ఐ ద్వారా నీటి లిఫ్టింగ్‌ను ఆపేసి మోటార్లకు మరమ్మతు చేపట్టేందుకు అప్పట్లో బీహెచ్ఈఎల్ కంపెనీకి చెందిన ఇంజినీర్లు సిద్ధమయ్యారు. అయితే మిషన్ భగీరథ స్కీంకు నీటి ఇబ్బందులు తలెత్తడంతో మరమ్మతు ఆపేసి మళ్లీ యథాతధంగా కేఎల్ఐ ద్వారా నీటి ఎత్తిపోతలు చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కేఎల్ఐ ద్వారా తాగు, సాగునీటి అవసరాల కోసం ఎత్తిపోతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో పాడైన మోటార్లకు మరమ్మతు చేపట్టడం సాధ్యం కావడం లేదు. కేఎల్ఐ మోటార్ల మరమ్మతు ఈ సీజన్ కూడా ఆగాల్సిందే ఎంజీకేఎల్‌ఐలో ఐదేళ్ల క్రితంపాడైన పంపు మోటార్లు మూడేళ్ల క్రితమే రూ.16 కోట్ల నిధులు కేటాయింపు వివిధ రకాల కారణాలతో సమస్య పరిష్కరించని అధికారులు ఎల్లూరు పంప్‌హౌజ్‌లో మూడు పంపులతోనే ఎత్తిపోతలు -
నానో ఎరువులు వినియోగించాలి : డీఏఓ
పాన్‌గల్: రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి నానో ఎరువులు వినియోగించేలా అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు అన్నారు. శనివారం మండలంలోని రేమద్దులలో ఆత్మ శిక్షణ కార్యక్రమంలో ఆయనతో పాటు కేవీకే శాస్త్రవేత్త డా. భవాని పాల్గొని రైతుల పొలాలకు వెళ్లి నానో ఎరువులను పిచికారీ చేసి అవగాహన కల్పించడంతో పాటు ఆయిల్‌పాం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎక్కువగా రసాయన ఎరువులకు అలవాటు పడ్డారని.. వాటి వినియోగం తగ్గించేందుకు నానో యూరి యా, నానో డీఏపీ, నానో జింక్ అందుబాటులోకి వ చ్చినట్లు పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఆరుతడి పంటలు, కూరగాయాలు, పప్పు ధాన్యాలు, ఆయిల్‌పాం సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. సమావేశంలో ఏడీఏ తిప్పేస్వామి, ఇన్చార్జ్ ఏఓ రమేష్‌నాయక్, హెచ్ఓ కృష్ణయ్య, సర్పంచ్ నిరంజన్, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసిక ప్రశాంతత
● మహానీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ కేడీఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం స్ఫూర్తివేధిక రాష్ట్ర చైర్మన్ రాజారాంప్రకాశ్ మాట్లాడుతూ.. గ్రామీణ మూలాలకు సంకేతమైన కబడ్డీ, ఖో–ఖో, జాతీయ క్రీడ హాకీ వంటివి క్రమంగా కనుమరుగవుతున్నాయని, నేటి యువత ఆయా సాంప్రదాయ క్రీడలపై ప్రత్యేక ఆసక్తి పెంచుకొని వాటికి పూర్వవైభవం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో గిరిరాజాచారి, డా. నాయకంటి నర్సింహశర్మ, గంధం నాగరాజు, బాలేమియా, చింతకుంట కురుమయ్య, ఇటిక్యాల బండలయ్య, మహేష్, ప్రముఖ న్యాయవాది ఉత్తరయ్య, డా. విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వనపర్తిటౌన్: నేటి ఆధునిక యుగంలో యువత ఎక్కువగా స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా, వర్చువల్ ప్రపంచానికే పరిమితమవుతున్నారని.. శారీరక శ్రమ పూర్తిగా తగ్గడంతో చిన్న వయసులోనే తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళన, శారీరక రుగ్మతలకు గురవుతున్నారని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.ఈశ్వరయ్య అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని కళాశాల ప్రాంగణంలో స్పోర్ట్స్ కన్వీనర్ జి.యువ రూపలక్ష్మి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ అధ్యక్షతన జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా భారత హాకీ దిగ్గజం, విజార్డ్ ఆఫ్ హాకీ మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ విశేషంగా రాణించినప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందన్నారు. రోజువారీ జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలని.. అభిరుచికి తగ్గట్టుగా ఇండోర్, అవుట్డోర్ గేమ్‌ల్లో ఏదో ఒకదానిని ఎంచుకొని క్రమం తప్పకుండా ఆడటంతో మానసిక ప్రశాంతతతో పాటు ఏకాగ్రత, నిర్ణయాత్మక శక్తి పెరుగుతాయని వివరించారు. క్రీడలు కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా ఓటమిని తట్టుకునే సహనాన్ని, గెలుపు వైపు నడిపించే నాయకత్వ లక్షణాలను, సమష్టి సమన్వయాన్ని నేర్పుతాయన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీరామరాజు యాదవ్, స్పోర్ట్స్ కో–కన్వీనర్ డాక్టర్ కె.విజయలక్ష్మి, అధ్యాపకులు డాక్టర్ పోతురాజు శ్రీనివాస్, డాక్టర్ జి.సుష్మ, స్రవంతి, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిభకు ప్రోత్సాహం
సద్వినియోగం చేసుకోవాలి.. విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు చేసుకోవాలి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ ఉపకార వేతనం ఎంతో అవసరం. ప్రణాళికతో చదివితే విజయం సాధించవచ్చు. గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఎంపికయ్యేటట్లు కృషి చేస్తాం. – డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి పేద విద్యార్థులకు ఉపయోగకరం.. ఆర్థికంగా వెనకబడ్డ మాలాంటి పేద విద్యార్థులకు స్కాలర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతోంది. ఉపాధ్యాయుల సహకారంతో చక్కగా చదివి ఎన్ఎంఎంఎస్ ఉత్తీర్ణత సాధించా. ఏటా ప్రభుత్వం ఇచ్చే పారితోషికం నా చదువుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటి మిత్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని స్కాలర్షిప్ అందుకోవాలని కోరుకుంటున్నా. – అజయ్, కోటకొండ పీఎంశ్రీ స్కూల్ ●నారాయణపేట ఎడ్యుకేషన్: పేద విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్నిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రతిభ ఉపకార వేతనం (ఎన్ఎంఎంఎస్) అందిస్తోంది. 2026–27 విద్యాసంవత్సరానికిగాను అర్హత పరీక్ష ప్రకటన ఇప్పటికే విడుదల కాగా.. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 1వ తేదీతో ముగియనుంది. నవంబర్ 1న జిల్లాకేంద్రంలో ఎంపిక పరీక్ష విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఎంపికై న విద్యార్థులకు తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే నాలుగేళ్ల పాటు ఏటా రూ.12 వేల చొప్పున మొత్తం రూ.48 వేలు వారి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. అర్హతలు.. ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థలు, హాస్టల్ సౌకర్యం లేని ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. 2025–26 విద్యా సంవత్సరంలో 7వ తరగతిలో 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలైతే 50 శాతం మార్కులున్నా సరిపోతుంది. 2026–27 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థి అయి ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలలోపు ఉండాలి. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులు రూ.50 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు ధ్రువీకరిస్తూ బోనాఫైడ్ ఇవ్వాలి. గురుకులాలు, రెసిడెన్షియల్, నవోదయ, కేంద్రీయ, ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అనర్హులు. ఎంపిక విధానం.. రాష్ట్రస్థాయి పరీక్ష ఆధారంగా మెరిట్ సాధించిన విద్యార్థులను స్కాలర్షిప్కు ఎంపిక చేస్తారు. మొత్తం రెండు పేపర్లు నిర్వహిస్తారు. మొదటిది మెంటలబిలిటీకి సంబంధించినది.. ఇందులో మొత్తం 90 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు. రెండోది స్కాలాస్టిక్ అప్టిట్యూట్ టెస్ట్. 7, 8వ తరగతి గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 90 మార్కులు. రెండు విభాగాల్లో కలిపి మొత్తం 180 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు. ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు. నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ ఎంపిక పరీక్ష ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.12 వేల ఉపకార వేతనం దరఖాస్తునకు సెప్టెంబర్ 1 వరకు అవకాశం దరఖాస్తు విధానం.. విద్యార్థులు స్వయంగా కాకుండా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ప్రింట్, అవసరమైనా ధ్రువీకరణ పత్రాలు, సంబంధిత జిల్లా విద్యాధికారికి సమర్పించాలి. మరింత సమాచారం కోసం httpr://www. bre.teanfana.gov.in/ NMM .arpx వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. -
జిల్లా ఆస్పత్రి ఎదుట కార్మికుల ఆందోళన
వనపర్తి రూరల్: ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తూ మృతిచెందిన ఇందిర కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పి.సురేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఎంసీహెచ్ ఆస్పత్రిలో మధ్యాహ్నం షిఫ్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఇందిర మరుగుదొడ్లు శుభ్రం చేస్తూ అపస్మారక స్థితిలోకి చేరి అక్కడే తుది శ్వాస విడిచారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలంటూ శనివారం జిల్లా జనరల్ ఆస్పత్రి ఎదుట పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, ఇతర అధికారుల సమక్షంలో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులతో చర్చలు జరిపి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ, ఏజెన్సీ పరంగా కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం కార్మికులతో కలిసి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి, ఏఐటీయూసీ నేతలు శ్రీరాములు, గోపాలకృష్ణ, భాస్కర్, సీపీఐ కార్యదర్శి రమేష్, మాజీ కౌన్సిలర్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పాంకు ఆసక్తి
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న సాగు విస్తీర్ణం ● అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు ● రాయితీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందజేత నా పేరు హరీశ్‌రెడ్డి.. మాది కొత్తకోట. నేను గతంలో ఐదెకరాల్లో వరి వేసేవాడిని. వరికి పెట్టుబడి ఎక్కువ.. కూలీల కొరత, ఆదాయం తక్కువ ఉండటంతో ఉద్యానశాఖ అధికారులు, స్థానిక వ్యవసాయ అధికారుల సూచన మేరకు నాలుగేళ్ల కిందట ఆయిల్‌పాం సాగు చేశా. ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంది. రైతులు సాంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఆదాయానిచ్చే వాణిజ్య పంటల సాగుపై దృష్టి సారిస్తే బాగుంటుంది. కొత్తకోట రూరల్: జిల్లా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునేందుకు ఆయిల్‌పాం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి వరకు వాణిజ్య పంట అయిన పత్తికే అధిక ప్రాధాన్యతనిచ్చిన రైతులు ప్రస్తుతం ఆయిల్‌పాం సాగు వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యాన అధికారులు సాగుపై కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయి. దీంతో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. మండలాల వారీగా సాగు వివరాలు (ఎకరాల్లో..) -
సాగునీటి సరఫరా ప్రభుత్వ లక్ష్యం
అమరచింత: రైతులకు సాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ వైస్ చైర్మన్ కేశం నాగరాజ్‌గౌడ్ అన్నారు. మండలంలోని ధర్మాపురం శివారులోని భూత్పూరు కాల్వలను శనివారం గ్రామ రైతులతో కలిసి పరిశీలించారు. కాల్వలో జమ్ము, ముళ్లపొదలు పెరిగాయని.. సాగునీరు సరఫరా కావడం లేదని చెప్పడంతో సమస్యను వెంటనే మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్లో వివరించారు. ముళ్లపొదల తొలగింపునకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో వెంటనే అధికారులతో మాట్లాడి చెత్తతో పాటు జమ్మును తొలగించాలన్నారు. భూత్పూర్ కాల్వలతో పాటు ఎత్తిపోతల ద్వారా రైతులకు నిరంతరం సాగునీరు అందించేందుకు మంత్రి కృషి చేస్తున్నారని వెల్లడించారు. అన్నదాతలను ఆదుకోవడమే తమప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి రమేష్, అమరచింత పట్టణ కార్యదర్శి రవికాంత్, జింక రవి తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పాంతో అధిక లాభాలు..
ఇతర పంటల సాగుతో పోలిస్తే ఆయిల్‌పాం సాగుతో రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్ల వరకు కాపునిస్తోంది. అంతర పంటలు సైతం సాగు చేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు మరింత కలిసి వస్తుంది. ప్రస్తుతం టన్నుకు రూ.23,488 ధర పలుకుతోంది. జిల్లా రైతులు సాగుకు మక్కువ కనబరుస్తున్నారు. ఎల్‌నినో కారణంగా రైతులు వరి వేయకుండా ఇలాంటి పంటల సాగుపై దృష్టి సారిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీని సద్వినియోగం చేసుకుంటూ లాభాలు పొందవచ్చు. – విజయభాస్కర్, జిల్లా ఉద్యాన అధికారి -
ప్రభుత్వ ప్రోత్సాహం..
ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం మొక్క నుంచి డ్రిప్ పరికరాల వరకు రాయితీలు అందిస్తోంది. ఒక మొక్క ఖరీదు రూ.193 కాగా ఎకరానికి 57 మొక్కలు నాటాల్సి ఉంటుంది. అయితే రైతులు ఒక్కో మొక్కకు రూ.20 చెల్లిస్తే సరిపోతుంది. మిగతా మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. అలాగే డ్రిప్ పరికరాలను సైతం 90 శాతం రాయితీపై అందిస్తున్నారు. మొక్కలు నాటిన నాటి నుంచి నాలుగేళ్ల పాటు ఏడాదికి ఎకరాకు రూ.4,200 చొప్పున అందజేస్తుంది. ఇందులో మొక్కల సంరక్షణకు రూ.2,100.. అంతర పంటల సాగుకు మరో రూ.2,100 చెల్లిస్తున్నారు. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ఆత్మకూర్: పట్టణంలోని మున్సి్ఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తి శిరీష కోరారు. శనివారం కోర్టు భవనంలో కొత్తకోట, ఆత్మకూర్, మదనాపురం, అమరచింత మండలాల పోలీస్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతో ఉపయోగపడుతుందన్న విషయాన్ని కక్షిదారులకు వివరించాలన్నారు. ఎంతోమంది క్షణికావేశంలో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారని.. రాజీయే రాజమార్గమని పేర్కొన్నారు. సమావేశంలో సీఐలు శివకుమార్, రమేష్, ఎస్సైలు జయన్న, స్వాతి, విక్రమ్, ఏఎస్ఐలు హరిచంద్రగౌడ్, లోక్‌అదాలత్ సభ్యులు, న్యాయవాదులు, లోక్‌అదాలత్ సిబ్బంది, ఆయా మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రేపు అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష
వీపనగండ్ల: మండలంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులపై సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటకశాఖ అధికారి నర్సింహ, సర్పంచ్ పార్వతమ్మ, ఉపసర్పంచ్ బాలపీరు శనివారం తెలిపారు. జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులు సమావేశంలో పాల్గొంటారని.. మండలంలో నెలకొన్న సమస్యలను వాట్సప్ నంబర్ 81858 85127లో తెలియజేయాలని పేర్కొన్నారు. సమీక్ష సమావేశంలో అధికారులతో మంత్రి ఆయా సమస్యలపై చర్చిస్తారని చెప్పారు. మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. రెండు యూనిట్లల్లోవిద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. శనివారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 94.123 మి.యూ., దిగువన 1 యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 79.015 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్టు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 173.138 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. గోపల్‌దిన్నెలో డెంగీ కేసు నమోదు వీపనగండ్ల: మండలంలోని గోపల్‌దిన్నెలో కుర్మయ్య అనే వ్యక్తికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో శనివారం వైద్యులు బాధితుడి ఇంటి పరిసరాల్లోని ఇళ్ల వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని.. దోమల నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల వైద్యాధికారి రాజశేఖర్, సర్పంచ్ కవిత గ్రామస్తులకు వివరించారు. జ్వరంతో బాధపడుతున్న 20 మంది నుంచి రక్త నమూనాలు సేకరించినట్లు తెలిపారు. ఆయుష్ వైద్యురాలు డా. శ్వేత, వైద్యసిబ్బంది రవీందర్, రవికుమార్, పలువురు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. భీమా కాల్వలోపూడిక తొలగింపు పాన్‌గల్: మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామం బొల్లిగట్టు సమీపంలోని డిస్ట్రిబ్యూటరీ 23లో పేరుకుపోయిన పూడిక, జమ్ము తొలగింపు పనులను శనివారం యంత్రాలతో చేపట్టారు. శుక్రవారం మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్వహించిన సమీక్షలో గ్రామానికి చెందిన పలువురు రైతులు సమస్యను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాల్వలో పేరుకపోయిన పూడిక తొలగింపు పనులు వెంటనే చేపట్టాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో శనివారం అధికారులు పనులు ప్రారంభించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శనేశ్వరుడికి ప్రత్యేక పూజలు కందనూలు: నందివడ్డేమాన్ జ్యేష్ఠాదేవి సమేత శనేశ్వరుడికి శనివారం ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ శనిదోష నివారణార్థం ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథ శాసీ్త్ర వేద మంత్రోచ్ఛరణల మధ్య శనేశ్వరుడికి తిల, తైలాభిషేకాలు నిర్వహించారు. ప్రతి ఒక్కరు జన్మరీత్యా, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ పాల్గొన్నారు. -
కొత్తకోట, నాగపూర్‌లో డెంగీ కలకలం
కొత్తకోట రూరల్/గోపాల్పేట: కొత్తకోటతో పాటు రేవల్లి మండలం నాగపూర్‌లో శుక్రవారం డెంగీ కేసులు నమోదయ్యాయి. కొత్తకోట 11వ వార్డు కాజియా మసీద్ ప్రాంతానికి చెందిన మునీబ్ (6), అబుబాకర్ (5) అన్నదమ్ములు, 13వ వార్దులోని వాగ్ధేవి (4)కి ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ కావడంతో టి–హబ్‌కు నమూనాలు పంపించినట్లు మెడికల్ ఆఫీసర్ డా. ఆసియాబేగం తెలిపారు. చిన్నారులను మెరుగైన చికిత్స నిమిత్తం వారి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పుర అధికారులను అప్రమత్తం చేయడంతో ఇంటి పరిసరాలతో పాటు మసీద్ ప్రాంతంలో స్వచ్ఛ చర్యలు చేపట్టాలని పుర సిబ్బందిని ఆదేశించారు. ప్రజలు డెంగీ, వైరల్ జ్వరాల బారిన పడకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ అరుణ శ్రీనివాస్ సూచించారు. ● రేవల్లి మండలం నాగపూర్‌కు చెందిన అక్షితకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు రేవల్లి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించగా శుక్రవారం డెంగీగా నిర్ధారణ కావడంతో వైద్యులు అప్రమత్తమయ్యరు. డా. చాంద్‌పాషా స్థానిక అధికారులతో కలిసి గ్రామానికి చేరుకొని బాలికను పరీక్షించడంతో పాటు ఇంటి పరిసరాల్లోని 17 మంది రక్త నమూనాలు సేకరించారు. -
పాఠశాలల నిర్వహణకు నిధులు
● ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేల చొప్పున.. ● గతేడాది కంటే రూ.10 వేలు అదనం ● పర్యవేక్షణ మరింత పటిష్టం చేస్తామంటున్న విద్యాశాఖ అధికారులు నర్వ: ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన బోధన, మౌలిక వసతుల కల్పన, అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు సక్రమంగా అందేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పాఠశాలల పర్యవేక్షణ పూర్తి బాధ్యతలను ఎంఈఓలు, క్లస్టర్ జీహెచ్ఎంలకు అప్పగించి బాధ్యతలను మరింత పెంచింది. వీటి నిరంతర పర్యవేక్షణకు అవసరమైన నిధులను అంచనా వేసి అందుకు అనుగణంగా మంజూరు చేసింది. కొన్ని రోజులుగా నిధుల మంజూరు లేకపోవడంతో పర్యవేక్షణ కాస్తా తగ్గిందన్న ఆరోపణల నేపథ్యంలో ఎట్టకేలకు 2026–27 వార్షిక సంవత్సరానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రూ.1.59 కోట్లు మంజూరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంఈలు, క్లస్టర్ జీహెచ్‌ఎంల పర్యవేక్షణ.. పాఠశాలల పర్యవేక్షణ ఎమ్మార్సీల ద్వారా చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి ఎంఈఓ నెలలో 20 పాఠశాలలని పర్యవేక్షించాలి. ఇందుకోసం ఒక్కో ఎమ్మార్సీకి రూ.90 వేలు ఖర్చు చేయాల్సి ఉంది. ఇందుకుగాను ఉమ్మడి జిల్లాకు రూ.70.20 లక్షలు మంజూరయ్యాయి. టీఎల్ఎం నిర్వహణ, పుస్తకాలు, దినపత్రికలకు రూ.20 వేలు.. స్టేషనరీ, నెట్ సౌకర్యం, ఆజదార్కిట్ వినియోగానికి రూ.25 వేలు, విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్ల నిర్వహణ, కంప్యూటర్ మరమ్మతులకు రూ.20 వేలు వెచ్చించాల్సి ఉంది. ఖర్చులు పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 207 సీఆర్సీలు, 78 ఎంఆర్సీలు ఉన్నా యి. వీటి నిర్వహణకుగాను ప్రభుత్వం గతేడాది ఒక్కో సీఆర్సీకి రూ.33 వేలు అందించగా.. ఈ ఏడాది రూ.10 వేలు పెంచి రూ.43 వేల చొప్పున రూ.89.01 లక్షలు మంజూరు చేసింది. నిధుల వినియోగం ఇలా.. రోజు పాఠశాలల పరిశీలన, రిపోర్టుల తయారీ, రిజిస్టర్లు, సమావేశాల నిర్వహణ, నెట్ సౌకర్యం, స్టేషనరీ, దినపత్రికల ఖర్చులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. నిర్వహణకు రూ.20 వేలు, టీఎల్‌ఎంకు రూ.10 వేలు, సమావేశాలకు రూ.3 వేలు, స్టేషనరీ, నెట్చార్జీల కోసం రూ.10 వేలు వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లాలో పాఠశాలల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎంఆర్సీలు, సీఆర్సీలకు మంజూరైన నిధులతో మరింత బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేలా చర్యలు తీసుకుంటాం. ఒక్కో సీఆర్సీకి గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు మంజూరయ్యాయి. క్లస్టర్ల వారీగా నిర్వహిస్తున్న కాంప్లెక్స్ సమావేశాలను పరిశీలించి బోధన నైపుణ్యాలు పెంచేలా సూచనలు అందిస్తున్నాం. – విద్యాసాగర్, ఏఎంఓ, నారాయణపేట -
రైతులకేది ధీమా..!
మదనాపురం: రైతు మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో 2018, ఆగస్టు 15న నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చింది. 59 ఏళ్లలోపు రైతు ఎలా మరణించినా నామినీకి రూ.5 లక్షల ఆర్థికసాయం అందేది. రైతు కుటుంబాలకు భద్రతా కవచంగా నిలిచే బీమా పథకం పునరుద్ధరణ ప్రక్రియపై జిల్లాలో తీవ్రమైన సందిగ్ధత నెలకొంది. ఈ నెల 13తో గతేడాది చేసిన బీమా గడువు ముగియగా.. పునరుద్ధరణపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన వెలువడకపోవడంతో రైతు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ పథకం కొనసాగుతుందా? పునరుద్ధరిస్తారా? ఎప్పుడు చేస్తారు? రైతు మరణానికి గురైతే బీమా వర్తిస్తుందా? అన్న ప్రశ్నలు రైతు కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సంవత్సరం రైతుల సంఖ్య లబ్ధిదారులు అందిన సాయం (రూ.కోట్లలో..) 2018–19 83,924 484 24.20 2019–20 85,466 521 26.05 2020–21 86,079 737 36.85 2021–22 97,264 648 32.40 2022–23 1,05,831 705 35.25 2023–24 1,13,191 825 41.25 2024–25 1,18,227 808 40.40 2025–26 1,17,023 679 33.95 (22.08.2026 నాటికి) ప్రభుత్వ నిబంధనల మేరకే.. అన్నదాతల కుటుంబాలకు రైతుబీమా అత్యంత భరోసానిస్తోంది. జిల్లాలో ఏటా అర్హులైన రైతుల నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. బీమా పునరుద్ధరణ, కొత్త దరఖాస్తులకు సంబంధించి ప్రభుత్వస్థాయిలో విధివిధానాలు రాగానే క్షేత్రస్థాయిలో ప్రక్రియ వేగవంతంగా అమలు చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. – ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి ఏడాది వారీగా అందిన సాయం.. బీమాతో మేలు.. రైతు సంక్షేమానికి ప్రస్తుత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. రైతుబీమా పునరుద్ధరణ విషయమై రైతుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించాలి. ప్రతి రైతుకు సంక్షేమ ఫలాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలి. బీమా పథకం కొనసాగించాలని కోరుతున్నా. – వంగూరు రామకృష్ణారెడ్డి, అజ్జకొల్లు రైతు కుటుంబాలకు భరోసా.. గత ప్రభుత్వం ప్రారంభించిన రైతుబీమా పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కూడా కొనసాగించాలి. అనుకోని సంఘటనలతో కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబానికి ఈ బీమా ఆర్థిక భరోసానిస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించి పునరుద్ధరణ ప్రక్రియ పూర్తి చేయాలి. – సత్యనారాయణచారి నర్సింగాపురం ముగిసిన రైతుబీమా గడువు.. పునరుద్ధరణపై స్పష్టత కరువు జిల్లాలో 1.85 లక్షల మంది రైతులు ఏటా పెరుగుతున్న అర్హుల సంఖ్య ఈ నెల 13తో ముగిసిన గడువు -
నేల ఆరోగ్యాన్ని కాపాడుదాం : డీఏఓ
మదనాపురం: రైతులు విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడకుండా నేల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేధికలో కేవీకే సహకారంతో నిర్వహించిన ఆర్పీఎల్ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వ్యవసాయంలో వస్తున్న మార్పులు, రైతులు పాటించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన కల్పించారు. కేవీకే శాస్త్రవేత్త రాజేందర్‌రెడ్డి సూచించిన విధంగా పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించడంతోనే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. యాప్ ద్వారా రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ఎరువులు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఏడీఏ ఆధ్వర్యంలో యాప్ పనితీరును రైతులు, సిబ్బందికి క్షుణ్ణంగా వివరించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మ డీపీడీ హై మావతి, కొత్తకోట ఏడీఏ షేక్ మున్నా, మదనాపూర్, కొత్తకోట మండల వ్యవసాయ అధికారులు గాయత్రి, జాస్మిన్, వ్యవసాయ విస్తరణ అధికారులు, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు. నేడు హాకీ పోటీలు వనపర్తిటౌన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లాకేంద్రంలో హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్వైఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి.కుమార్, అధ్యక్షుడు మన్యం యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధ్యాన్న్చంద్ జయంతి సందర్భంగా యువజన, క్రీడలశాఖ, విద్యాశాఖ, జిల్లా హాకీ అసోసియేషన్‌న్ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలోని హాకీ క్రీడాకారులతో పాటు పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొనాలని కోరారు. రూ.5 లక్షల ఎల్వోసీ అందజేత వనపర్తిటౌన్: వెన్నెముక సమస్యతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న నారాయణపేట జిల్లా మద్దూరు మండలం పెదిరిపాడుకు చెందిన పద్మమ్మకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షల ఎల్వోసీ మంజూరైంది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన లేఖను సీఎం ప్రజావాణి స్టేట్ ఇన్చార్జి డా. జి.చిన్నారెడ్డి శుక్రవారం ఆమె కుమారుడు రాజశేఖర్‌రెడ్డికి అందజేశారు. చికిత్సకు సంబంధించిన వైద్యుల నివేదిక ఆధారంగా ఎల్వోసీ మంజూరైనట్లు తెలిపారు. సకాలంలో స్పందించి సాయం అందించిన చిన్నారెడ్డికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
రాఖీ సందడి..
వనపర్తిటౌన్: జిల్లా ప్రజలు శుక్రవారం రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకొన్నారు. ప్రతి ఇంట్లో అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరిశాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు వేడుకల్లో పాల్గొని అక్కలు తమ తమ్ముళ్లకు, చెల్లెళ్లు తమ అన్నలకు రాఖీలు కట్టి తమ అనుబంధాలను చాటారు. పౌర్ణమి సందర్భంగా పలువురు మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించి నైవేద్యాలు సమర్పించారు. ప్రముఖుల ఇళ్లలో.. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మేఘారెడ్డికి నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు రాఖీలు కట్టగా.. ఆయన వారికి చీరలను బహూకరించారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి సోదరీమణులు సుదర్శనమ్మ, బాలకిష్టమ్మ రాఖీలు కట్టారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డికి ఆయన చెల్లెలు విజయలక్ష్మి పద్మనాభరెడ్డి రాఖీ కట్టి రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ డిపోలోని మహిళా ఉద్యోగులు, కండక్టర్లు విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లకు రాఖీలు కట్టారు. అదేవిధంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి
● సామాజిక మాధ్యమాల్లో పంపిన సమస్యలపై అధికారులు స్పందించాలి ● మండలస్థాయి సమీక్షలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాన్‌గల్: ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి వాట్సప్, మెయిల్ ద్వారా సమస్యలు తెలియజేసినా అధికారులు పరిష్కరించాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మండలంలోని గ్రామస్తులు కార్యాలయాల్లో సమర్పించిన ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు పరిష్కారమైనవి, పెండింగ్‌లో ఉన్న వాటిపై సమీక్షించారు. రెవెన్యూ సమస్యలపై ముందుగా సమీక్షించి భూ సమస్యల ఫిర్యాదులపై గ్రామాల వారీగా పరిశీలించి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. బుసిరెడ్డిపల్లికి చెందిన సంగనమోని రాముడు 37 గుంటల పొలం కాల్వ తవ్వకంలో పోకముందే పోయినట్లు అధికారులు ఖాతా నుంచి తొలగించారని.. అధికారుల తప్పిదానికి రైతులను బాధ్యులను చేయడం సరికాదని, ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఎలాంటి ఆర్డర్ కాపీలు లేకున్నా కోర్టు కేసుల పేరుతో భూ సమస్యలు పరిష్కారం కాకుండా జాప్యం చేయడం సరికాదన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి కార్యాలయాలకు నెలల తరబడి పనులు వదిలి తిరగాల్సిన అవసరం ఉండొద్దని, అధికారుల్లో మార్పు రావాలని వచ్చిన దరఖాస్తులను గరిష్టంగా వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. విద్యార్థుల ధ్రువపత్రాలు రెండు, మూడురోజుల్లో అందించాలని రెవెన్యూ అధికారులను కోరారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలన్నారు. అప్పులపాలు కావద్దు.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణాల పేరిట అప్పుల పాలు కావద్దని.. ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇళ్లు మంజూరైన 65 మంది లబ్ధిదారులు నిర్మించుకోలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి వారికి బ్యాంకులు, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులు, నాయకులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. విద్యుత్ సామగ్రి పేరుతో రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో కొందరు తమ సమస్యలను రాతపూర్వకంగా మంత్రికి అందజేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ మండలస్థాయి అధికారులు తమ పరిఽధిలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. తమ పరిధిలో పరిష్కారం కాని వాటిని మాత్రమే జిల్లాకు సిఫారస్ చేయాలన్నారు. కునుకుతీసిన సీఐ.. సెల్ఫోన్లో అధికారులు బిజీ... -
పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి
వనపర్తి: డెంగీ, మలేరియా నివారణకు ప్రతి ఒక్కరూ పరిసరాల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక పుర పరిధిలోని 8, 19, 20 వార్డుల్లో నిర్వహించిన డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆరోగ్య సిబ్బంది చేపడుతున్న అవగాహన కార్యక్రమాలను పరిశీలించి, ప్రజలకు అందిస్తున్న సూచనలపై ఆరా తీశారు. అదేవిధంగా దోమల వృద్ధికి కారణమయ్యే ప్రదేశాలను గుర్తించి చేపడుతున్న యాంటీ లార్వా ఆపరేషన్‌ను పరిశీలించి అధికారులు, పుర సిబ్బందికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పాటిస్తూ డెంగీ, మలేరియా నివారణలో అధికారులకు సహకరించాలని కోరారు. ఆయన వెంట జిల్లా విద్యాధికారి భాస్కర్‌నాయక్, పుర కమిషనర్ నిరంజన్, వైద్య, పుర సిబ్బంది, వార్డు ప్రతినిధులు పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షిద్దాం.. ఆత్మకూర్: దోమల నివారణకు చర్యలు చేపడుతున్నామని.. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. శుక్రవారం పుర కేంద్రంలో జరిగిన డ్రై డే కార్యక్రమంలో పాల్గొని పుర చైర్పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీను, కమిషనర్ నరేష్కుమార్, 8వ వార్డు కౌన్సిలర్ జిందె జ్యోతితో కలిసి మొక్కలు నాటారు. వర్షాల కారణంగా నివాసాల పరిసరాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని డ్రమ్ములు, పాత టైర్లలో నీరు నిల్వకుండా చూడాలని సూచించారు. ఆయన వెంట మేనేజర్ సీత్యానాయక్, వార్డుల అధికారులు, పుర సిబ్బంది ఉన్నారు. -
ముగిసిన పోలీసు సంఘం ఎన్నికలు
ఆత్మకూర్: స్థానిక సీఐ కార్యాయంలో గురువారం తెలంగాణ పోలీస్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సీఐ శివకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఆత్మకూర్ సర్కిల్ పరిధిలోని మదనాపురం, అమరచింత, ఆత్మకూర్ పోలీస్టేషన్ల పరిధిలో 55 మంది కానిస్టేబుళ్ల ఓట్లు ఉండగా.. 54 ఓట్లు పోలయ్యాయని వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఓటింగ్, సాయంత్రం 4 గంటలకు లెక్కింపు అనంతరం విజేతలను ప్రకటించారు. కానిస్టేబుళ్లు బాలయ్య (ఆత్మకూర్)కు 41, అశోక్ (ఆత్మకూర్)కు 38 ఓట్లతో విజేతలుగా నిలిచారు. ఎస్ఐల విభాగంలో ఆత్మకూర్ ఎస్ఐ జయన్న, మహిళా కానిస్టేబుళ్ల విభాగంలో నాగలక్ష్మి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను సీఐ పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కొత్తకోట రూరల్: కొత్తకోట సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లకు చెందిన 100 మంది సిబ్బంది గురువారం జరిగిన పోలీసు సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల్లో కురుమయ్యగౌడ్, వెంకటస్వామి, మధు, నరేష్ బరిలో నిలవగా.. ఓట్ల లెక్కింపు అనంతరం కానిస్టేబుళ్లు నరేష్ (పెద్దమందడి), మధు (శ్రీరంగాపురం) విజయం సాధించారు. ఇద్దరు ప్రతినిధులు జిల్లాకేంద్రంలో శుక్రవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. -
పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక దృష్టి
వనపర్తి: జిల్లాలో డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో పారిశుద్ధ్యం నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ఎంపీడీఓలు, పుర కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి ఫ్రై డే.. డ్రై డే నిర్వహణ, పారిశుద్ధ్యం, డెంగీ నియంత్రణ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నీరు నిల్వ ఉండే ప్రదేశాలు గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లను విస్తృతంగా చేపట్టాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని.. ఇళ్ల పరిసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్న్వాడీ కేంద్రాలు, ఖాళీ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ వ్యాప్తికి కారణమయ్యే దోమల నివారణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని.. స్వచ్ఛతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుద్ధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమ నిర్వహణ, యాంటీ లార్వా చర్యలు, పారిశుద్ధ్య పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. -
నిర్వాసితులకు అండగా ఉంటాం
వనపర్తి: ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన గ్రామాల నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బండరావిపాకుల నిర్వాసితులు 125 మందికి రూ.8.33 కోట్ల విలువైన పరిహారం చెక్కులను కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు.సాగునీటి ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయడం తమ తొలి ప్రాధాన్యత అన్నారు. బండరావిపాకుల నిర్వాసితులకు పరిహారం అందజేయడం సంతోషంగా ఉందని.. తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వం స్పందించిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బండరావిపాకుల, కొంకలపల్లి నిర్వాసితుల కోసం ప్రభుత్వం మొత్తం రూ.67 కోట్ల పరిహారం విడుదల చేసిందని వెల్లడించారు. పరిహారం విడుదల ప్రక్రియకు కృషి చేసిన కలెక్టర్, ఆర్డీఓ, రెవెన్యూ అధికారులు, ఇతర శాఖల అధికారులను ఎమ్మెల్యే అభినందించారు. మొత్తం 175 మందికి పరిహారం ఉందాల్సి ఉండగా, చనిపోయిన వారు, బ్యాంకు ఖాతాల సమస్యలతో కొందరికి చెక్కులు రాలేదని, వారికి కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుందన్నారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ.. ముంపు బాధితులకు పరిహారం అందజేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. అధికారులు, ఎమ్మెల్యే చొరవతో బండరావిపాకుల ముంపు బాధితులకు ప్రభుత్వం పరిహారం త్వరగా విడుదల చేసిందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, గోపాల్పేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్, వైస్ చైర్మన్ సత్యశీలారెడ్డి, ఆర్అండ్ఆర్ కమిటీ సభ్యులు, రెవెన్యూ అధికారులు, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
అనుబంధాల రాఖీ..
● జిల్లాకేంద్రంలో 30కి పైగా ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు ● మహిళలతో కిటకిట.. రూ.5 నుంచి రూ.600 వరకువనపర్తిటౌన్: రాఖీపౌర్ణమిని పురస్కరించుకొని జిల్లాకేంద్రంలో బుధవారం రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. పట్టణంలోని గాంధీచౌక్, కమాన్ చౌరస్తా, పాత బస్టాండ్, రాజీవ్ చౌక్, బస్సు డిపో రోడ్, బస్టాండ్, ప్రజా వైద్యశాల రోడ్, పొట్టి శ్రీరాములు చౌరస్తా తదితర ప్రాంతాల్లో 30కి పైగా ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇవేగాక పలు దుకాణాల ఎదుట ప్రత్యేకంగా రాఖీ విక్రయాలు జరుపుతున్నారు. వెండి, సిల్వర్ కోటెడ్, బిగ్‌బాస్ ఐకాన్, సలార్ మూవీ ఐకాన్, అన్నయ్య తదితర వివిధ రకాల రాఖీలు విక్రయిస్తున్నారు. రూ.5 నుంచి రూ.600 వరకు రాఖీలు అందుబాటులో ఉండగా.. జిల్లాకేంద్రంతో పాటు పరిసరాల నుంచి మహిళలు, యువతులు తరలిరావడంతో స్టాళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ కనిపించాయి. అదేవిధంగా పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూర్ తదితర పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోనూ రాఖీల కొనుగోలు సందడి కనిపించింది. విభిన్న ఆకృతుల్లో.. ఈసారి రంగురంగుల డిజైన్లతో పాటు విభిన్న ఆకృతులు, ప్రత్యేక నమూనాల రాఖీలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువతులు తమ సోదరులకు నచ్చేలా ఆకర్షణీయ డిజైన్లను పరిశీలిస్తూ రాఖీలను ఎంపిక చేసుకుంటున్నారు. చిన్నారులు, యువత కోసం కార్టూన్ బొమ్మలు, సినిమా, టీవీ కార్యక్రమాలకు సంబంధించిన ఆకృతులతో కూడిన రాఖీలను కూడా విక్రయానికి ఉంచారు. సాధారణ రాఖీల నుంచి ఖరీదైన సిల్వర్, సిల్వర్ కోటెడ్ రాఖీల వరకు ధరల్లో తేడా ఉండటంతో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ఎంపిక చేసుకుంటున్నారు. పుర కేంద్రానికి చెందిన కడియాల వెంకటన్నకు 93 ఏళ్లు. ఈయనకు ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్లు. అక్క, రెండో చెల్లెలు మృతిచెందగా.. చిన్న చెల్లెలు కళావతమ్మకు ప్రస్తుతం 84 ఏళ్లు. ఆమె 76 ఏళ్లుగా ప్రతి రాఖీపండుగకు వచ్చి తన అన్నకు రాఖీ కడుతోంది. అన్నకు ఆమె ఆప్యాయంగా మిఠాయి తినిపిస్తే.. అందుకు అన్న చెల్లికి కానుక ఇస్తారు. కళావతమ్మకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉండగా.. ఇద్దరు కుమారులు మృతిచెందారు. ప్రస్తుతం ఆత్మకూర్‌లోని పెద్దకుమార్తె తేజవతమ్మ వద్ద ఉంటోంది. వెంకటన్నకు ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె మృతిచెందగా ఆత్మకూర్‌లోని చిన్న కుమార్తె వద్ద ఉంటున్నారు. – ఆత్మకూర్ అన్నాచెల్లెలి అనుబంధానికి 76 ఏళ్లు.. -
విద్య, వైద్యరంగాల్లో సమస్యలు పరిష్కరించాలి
అమరచింత: రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైన విద్య, వైద్యరంగాలను పూర్తిస్థాయిలో విస్మరించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండల కేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 31న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిపై ఇప్పటికే అన్ని జిల్లాల కార్యదర్శులకు సమాచారం అందించామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చే యాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, పాఠశాలల్లో కనీస వసతులను ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. వైద్యరంగంలో ఖాళీ పోస్టులను భర్తీ చేయడంతోపాటు అన్నిరకాల సేవలను అందించాలన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా వసూలు చేస్తున్న ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలని ప్రభుత్వానికి సూచించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జీఎస్.గోపి, మండల కార్యదర్శివర్గ సభ్యులు వెంకటేష్, అజయ్, శంకర్ పాల్గొన్నారు. -
తగ్గిన విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. గురువారం ఎగువన 1 యూనిట్ నుంచి 39 మెగావాట్లు, 93.898 మి.యూ., దిగువన 1 యూనిట్ నుంచి 40 మెగావాట్లు, 78.750 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 172.648 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం 3,510 క్యూసెక్కుల నీటిని విద్యుదుత్పత్తికి వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు. నానో యూరియా వినియోగించాలి ఖిల్లాఘనపురం: రైతులు వరి సాగులో నానో యూరియా వినియోగించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, ఆత్మ డీపీడీ హైమావతి సూచించారు. గురువారం జిల్లా వ్యవసాయశాఖ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సంయుక్తంగా మండలంలోని మానాజీపేట, సోళీపురం గ్రామాల్లో రైతులకు క్షేత్రస్థాయిలో నానో యూరియాను ఎలా వినియోగించాలో చూపించడంతో పాటు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వరి పంటకు పాస్పరస్ సాలిబుల్ బ్యాక్టీరియా ఎకరాకు రెండు కిలోల చొప్పున పశువుల ఎరువులో కలిపి పంటలో చల్లితే నిల్వ ఉన్న భాస్వరం ఎరువులు కరిగి పంటకు ఉపయోగపడుతుందన్నారు. నానో యూరియా పని చేస్తుందా లేదా అనే అనుమానాలు చాలామంది రైతులకు ఉన్నాయని.. కచ్చితంగా పంటకు మేలు కలుగుతుందని వివరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఏఈఓల ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లయ్య, ఏఈఓలు, రైతులు బాషానాయక్, బాల్‌రెడ్డి, రాము, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత వనపర్తి: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా రవాణాశాఖ అధికారి జె.సురేష్‌కుమార్ కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో గురువారం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీఓ కార్యాలయం, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్, తదితర ప్రదేశాల్లో ఆయన సిబ్బందితో కలిసి వివిధ రకాల మొక్కలు నాటి మాట్లాడారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో చెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, పచ్చదనం పెంపొందించడంతో భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చన్నారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు అధికారులు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవీఐలు ఎం.శ్రీకాంత్, జె.సైదులు కానిస్టేబుల్ సంతోష్‌కుమార్, హోంగార్డులు, రవాణాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి శుక్రవారం డ్రై డే పటిష్టంగా నిర్వహించాలి..
వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు పరిసరాల శుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణ, దోమల నియంత్రణపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఇళ్లు, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు దోమల లార్వా వృద్ధి చెందే ప్రాంతాలను గుర్తించి యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్యశాఖతో పాటు మున్సిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేసి జిల్లాను డెంగీ, ఇతర సీజనల్ వ్యాధుల నుంచి రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. భాస్కర్‌నాయక్, ఐఎంఏ అధ్యక్షుడు డా. బాబు, ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యాధికారులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ఆందోళన
వనపర్తిటౌన్: సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్ డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 6 కరువు భత్యాలను ప్రకటించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలోని లోపాలను సరిచేసి పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం సంఘం నాయకుడు జి.వరప్రసాద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఉద్యోగుల దీక్ష శిభిరాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డెంగీ అనుమానితులకు వైద్య పరీక్షలు
వనపర్తి: ప్రభుత్వ, పైవ్రేట్ ఆస్పత్రుల వైద్యులు సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని.. జిల్లాలో ఇకపై డెంగీతో ఒక్క మరణం కూడా నమోదు కాకుండా తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించి జిల్లాలో డెంగీ కేసుల పరిస్థితి, వ్యాధి నియంత్రణకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలో డెంగీతో బాలిక మృతిచెందిన ఘటన గురించి సంబంధిత అధికారులతో వివరాలు, కారణాలు ఆరా తీశారు. డెంగీ కేసును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నోడల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. జ్వరంతో ఆస్పత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన పరీక్షలు నిర్వహించాలని, డెంగీ అనుమానం ఉన్న వారికి ర్యాపిడ్, ఎలిసా పరీక్షలు చేయాలని ఆదేశించారు. పరీక్షల్లో డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వెంటనే రోగి పేరు, చిరునామా తదితర వివరాలను ఆరోగ్యశాఖ అధికారులకు అందించాలన్నారు. ఈ సమాచారం ఆధారంగా వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది సంబంధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు పరీక్షలు నిర్వహించడంతో పాటు దోమల నివారణకు యాంటీ లార్వా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. -
రేపు మంత్రి జూపల్లి సమీక్ష
పాన్‌గల్: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ నెల 28న మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో జిల్లా, డివిజన్, మండలస్థాయి అధికారులు పాల్గొంటారని.. మండల ప్రజలు తమ సమస్యలను తెల్ల కాగితంపై రాసి వాట్సప్ నంబర్ 81858 85127కు పంపించాలని పేర్కొన్నారు. మండల ప్రజలు అధికసంఖ్యలో పాల్గొని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. నేడు పోలీస్ సంఘం ఎన్నికలు కొత్తకోట రూరల్: కొత్తకోట సర్కిల్ పరిధిలోని ఐదు పోలీస్స్టేషన్లకు చెందిన 100 మంది పోలీసు సిబ్బంది గురువారం జరగనున్న పోలీస్ సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో కురుమయ్య గౌడ్, వెంకటస్వామి, మధు, నరేష్ బరిలో నిలిచారు. 30 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 70 మంది కానిస్టేబుళ్లు ఓటు వేయనున్నారు. ఎన్నికల అధికారిగా కొత్తకోట సీఐ ఓడి రమేష్ వ్యవహరించనుండగా, పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కొత్తకోట ఎస్ఐ ఎం.విక్రమ్ తెలిపారు. 170.477 మి.యూ. విద్యుదుత్పత్తి ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. బుధవారం ఎగువన 2 యూనిట్ల నుంచి 78 మెగావాట్లు, 92.876 మి.యూ., దిగువన 2 యూనిట్ల నుంచి 80 మెగావాట్లు, 77.601 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 170.477 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసినట్లు వివరించారు. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి 14 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువ శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని తెలిపారు. -
మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు
ర్యాలీలో పాల్గొన్న ముస్లింలు మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం జిల్లాకేంద్రంలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ఊరేగింపు గాంధీచౌక్, కమాన్ చౌరస్తా, అంబేడ్కర్ చౌక్, రాజీవ్ చౌక్, బస్టాండ్, పాత బస్టాండ్ తదితర ప్రధాన ప్రాంతాల మీదుగా కొనసాగింది. కార్లు, జీపులు, ఆటోలు, ఇతర వాహనాలను ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించడంతో సందడి వాతావరణం నెలకొంది. ఊరేగింపులో ముస్లింలు అధికసంఖ్యలో పాల్గొనగా.. ఓ యువకుడు తెల్ల గుర్రంతో చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – వనపర్తి టౌన్ -
మదనాపురం మార్కెట్ పీఠం ఎవరికో?
మదనాపురం: మదనాపురం మార్కెట్ పాలకవర్గ పదవీకాలం జులై 18 నాటికి ముగిసింది. ఈసారి చైర్మన్ పీఠం జనరల్ కేటగిరికి కేటాయించడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. అయితే పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా శ్రమించిన నిజమైన నాయకుడికే ఈ పదవిని కట్టబెట్టాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి స్పష్టమైన నిర్ణయంతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. రేసులో ముగ్గురు సీనియర్లు.. మండల రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్‌పార్టీ జెండాను మోసిన ముగ్గురు సీనియర్ నాయకులు చైర్మన్ రేసులో ఉన్నట్లు సమాచారం. కేవలం పదవి ఆశించే వారి కంటే పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న వారికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యే ఆలోచిస్తున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో నాటి పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన, సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే ధ్యేయంగా అహర్నిశలు శ్రమించిన, మొదటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ఎలాంటి వివాదాలకు తావులేకుండా పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అనుకున్న నిజమైన నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం చెమటోడ్చిన నిజమైన కార్యకర్తకే ఈ పదవిని కేటాయించడంతో పార్టీలో కొత్త జోష్ నింపాలనే వ్యూహాత్మకంగా జీఎంఆర్ అడుగులు వేస్తున్నారు. చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందనే విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. రైతుల ఆర్థిక జీవనాడి.. మార్కెట్‌యార్డు కేవలం ఒక వ్యాపార కేంద్రం మాత్రమే కాదు.. ఈ ప్రాంత రైతులకు అండగా నిలిచే ఒక ఆర్థిక జీవనాడి. స్థానిక రైతులు తమ కష్టార్జితాన్ని దళారుల చేతిలో పెట్టి మోసపోకుండా విక్రయించుకోవడానికి ఈ మార్కెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉమ్మడి జిల్లాలోనే కీలక వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొంది ఈ ప్రాంతంలోని వేలాది మంది రైతులు, స్థానిక వ్యాపారులకు ఉపాధి కల్పిస్తూ ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. నూతన పాలకవర్గం మార్కెట్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేయాల్సి ఉంటుంది. -
ఏటి నీరు ఏడపాయె..!
రాజోళి: జిల్లాలో తుంగభద్ర నది తీరంలో, ఆర్డీఎస్ కెనాల్ కింద వేల ఎకరాలు సాగు చేస్తారు. కానీ ఈ రెండు వనరుల కింద సాగు చేయాలంటే ప్రధానంగా తుంగభద్ర నదిలో నీరు ఉండాలి. గతంలో నదిలో నీరున్నా ఎగువ నుంచి ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు అందేది కాదు. ప్రస్తుతం తుమ్మిళ్ల ఎత్తిపోతల అందుబాటులో ఉండటంతో నదికి నీరు వస్తే ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు తీసుకునే వెసలుబాటు ఉంది. తుంగభద్రకు నీరు వస్తే అటు నది తీరంలో వేసిన పంటలకు, ఇటు ఆర్డీఎస్ కెనాల్ కింద సాగు చేసిన పంటలకు నీటికి కొదవ ఉండదు. కానీ తుంగభద్ర నది ప్రస్తుతం నీరు లేక వెలవెలబోవడంతో జిల్లాలోని వేల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. వానాకాలంలో వేసిన పత్తి, మిరప తదితర పంటలకు ఆర్డీఎస్ కెనాల్ కింద నీరు అందాల్సి ఉండగా.. ఆరంభంలో 20 రోజుల పాటు తుమ్మిళ్ల లిఫ్టు ద్వారా అందించారు. అనంతరం నదిలో నీరు లేకపోవడంతో మోటార్లు ఆఫ్ చేశారు. నది తీరంలో ఎక్కువగా వరి నాట్లు వేయడంతో నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కోసం అధికారులకు, నాయకులకు ఫోన్ చేస్తూ ప్రస్తుతం నీరు ఎక్కడి దాకా వచ్చింది.. మన దగ్గరకు వచ్చేందుకు ఎన్ని రోజులు పడుతుందని లెక్కలు వేసుకుంటూ, నీటి రాక కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా ఉండగా.. కర్ణాటక పరిధిలో ఉన్న ఆర్డీఎస్ డిస్ట్రిబ్యూటరీ 12 ఎగువన పంటలకు సాగునీరు అందిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతులకు కూడా సమాచారం అందడంతో, తమకు కూడా నీరు వస్తుందనే ఆశలు రెట్టింపు చేసుకుని ఎదురుచూస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద సోమవారం రాత్రి సమయానికే 3.5 ఫీట్ల మేర నీరు ఉన్నట్లు సమాచారం. కానీ అధికారులు మాత్రం ధ్రువీకరించడం లేదు. కర్ణాటకలోని సిరిగుప్ప, బళ్లారి తదితర జిల్లా పరిధిలో అధికార పార్టీకి చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం గత వారంలో ఆర్డీఎస్ నీరు వదలాలని నిరసన తెలపడంతో తాగునీటి పేరుతో ఆయకట్టుకు సాగునీరు వదిలినట్లు సమాచారం. కానీ జిల్లాలోని అధికారులు దీనిపై నోరు మెదపడం లేదు. 94.817 టీఎంసీల నిల్వ ప్రస్తుతం తుంగభద్ర డ్యాంలో 94.817 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇది ఇలాగే కొనసాగుతూ.. 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటేనే దిగువకు నీరు వదులుతారు. కానీ డ్యాంకు కేవలం 8,760 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 8,500 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారని సమాచారం. ఒకవేళ అదే స్థాయి నీరు వదిలినా ఆశించిన స్థాయిలో జిల్లాకు వరద చేరకపోచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఎగువన ఉన్న రైతులు ఎప్పటికప్పుడు మోటార్లతో నీటిని తోడేస్తుండడంతో వచ్చే కొద్దిపాటి నీరు సైతం జిల్లా అందేలా లేదు. రైతులు జిల్లా కేంద్రానికి వెళ్లి అధికారులను కలిసినా సాగునీటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదని వాపోతున్నారు. నది నీరు వస్తేనే.. సోమవారం రాత్రి ఆర్డీఎస్ ఆనకట్ట వరకు వరద వచ్చిందని అధికారులు అంటున్నారు. ఎగువ ప్రాంతంలో తెలిసిన వారిని అడిగితే మాధవరం దగ్గరలో కొద్దిపాటి వరద నీరు వస్తుందని, మా దాకా వచ్చేందుకు మరో నాలుగు రోజులు పట్టొచ్చన్నారు. మిరప, వరి సాగు చేశాను. నదికి నీరు వస్తేనే పంటలు బతుకుతాయి. – విక్రమ్‌సింహారెడ్డి, రైతు, చిన్న ధన్వాడ తుమ్మిళ్ల సమాచారం కోసం.. తుమ్మిళ్లలో మోటార్ ఆన్ చేస్తేనే ఆర్డీఎస్ కెనాల్‌కు నీరు అందుతుంది. దాని కోసం రోజూ విలేకరులు, నాయకులకు ఫోన్ చేస్తున్నాం. ప్రస్తుతం తడులు అందకుంటే పంటకు ఉన్న కొద్ది ప్రాణం కూడా పోతుంది. నదికి నీరు వచ్చి తుమ్మిళ్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారనే సమాచారం కోసం ఎదురుచూస్తున్నాం. – గోపాల్, గోకులపాడు, మానవపాడు మండలం ఎలాంటి సమాచారం లేదు ఎగువ నుంచి నీరు వస్తున్నట్లు మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం నదిలో నీరు అడుగంటింది. తుమ్మిళ్ల మోటార్‌కు కూడా అందవు. టీబీ డ్యాంలో నిల్వలు తప్ప మిగతా ఎలాంటి సమాచారం లేదు. ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే రైతులకు తెలియచేస్తాం. – రామదాసు, ఆర్డీఎస్ అధికారి తుంగభద్ర నది నీటికి జిల్లా రైతుల ఎదురుచూపులు సమాచారం కోసం అధికారులు, మీడియాకు ఫోన్లు ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద 3.5 ఫీట్ల మేర నీరు? కర్ణాటక పరిధిలో తాగునీటి పేరుతో సాగునీరు విడుదల తుమ్మిళ్ల లిఫ్టు నిలిచి నెల దాటింది -
నేడు గ్రామ, వార్డుసభలు
వనపర్తి: ఎస్ఐఆర్–2026 కార్యక్రమంలో భాగంగా గురువారం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 10 నుంచి గ్రామసభలు, వార్డు సభలు నిర్వహించనున్నట్లు ఈఆర్వో, రెవెన్యూ డివిజనల్ అధికారి సుబ్రమణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామ, వార్డుసభల్లో బీఎల్వోలు ముసాయిదా ఓటరు జాబితాలోని పేర్లను బహిరంగంగా చదివి వినిపిస్తారని.. జాబితాలో పేరు లేకపోయినా అర్హులైన భారతీయ పౌరులను గుర్తించి నమోదుకు అవసరమైన చర్యలు చేపడతారన్నారు. 2026, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకునే భారతీయ పౌరులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుకునేందుకు అవసరమైన ధ్రువపత్రాలతో పాటు ఫారమ్–6 సమర్పించవచ్చని తెలిపారు. జాబితాలో నమోదైన వివరాల్లో తప్పులు లేదా మార్పులు అవసరమైతే ఫారమ్–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అలాగే ఓటర్ల జాబితాలో అర్హత లేని వ్యక్తుల పేర్లు ఉన్నట్లయితే, అదే నియోజకవర్గానికి చెందిన ఓటరు ఫారమ్–7 ద్వారా అభ్యంతరం నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం, ఎన్నికల సంఘం మార్గదర్శకాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచి ంచారు. సంబంధిత గ్రామాలు, వార్డులకు చెందిన ఓటర్లు అధికసంఖ్యలో హాజరై ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి తమ సందేహాలు, అభ్యంతరాలు, సూచనలను తెలియజేయాలని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులతో పాటు అన్నివర్గాల ప్రజలు సమావేశాల్లో పాల్గొనాలన్నారు. -
బంజారాల ఐక్యతకు ప్రతీక తీజ్
వనపర్తిటౌన్: గిరిజనుల ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు అన్నిరంగాల్లో వారిని ముందంజలో నిలుపడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని మార్కెట్‌యార్డులో జిల్లా బంజారా సేవాసంఘం నిర్వహించిన తీజ్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గిరిజన ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజన యువతులు తీజ్ మొలకలను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీజ్ వేడుకలు బంజారా సమాజ ఐక్యతకు, భక్తిశ్రద్ధలకు ప్రతీక అని కొనియాడారు. పాడిపంటలు బాగా పండాలని, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మహిళలు, యువతులు పూజలు చేయడం వారి గొప్ప సంస్కృతిని తెలియజేస్తుందన్నారు. తరతరాల ఆచారాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ స్ఫూర్తితో ప్రభుత్వం ప్రతి తండాలో సేవాలాల్ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడుతోందన్నారు. రూ.200 కోట్లతో సేవాలాల్ మహరాజ్ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గిరిజనుల సంక్షేమంపై ఉన్న నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు. జిల్లాకేంద్రంలో సేవాలాల్ మహరాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బంజారా సేవా సంఘం సభ్యులు కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో బంజారా సేవాసంఘం బాధ్యులు, గిరిజన పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. -
శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో ‘విజిలెన్స్’ తనిఖీ
● రూ.24 విలువైన వరి ధాన్యం మాయం ఖిల్లాఘనపురం: మండలంలోని శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో రూ.24 కోట్ల ఽవిలువైన వరి ధాన్యం పక్కదారి పట్టిందని ఇన్చార్జ్ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, డీఎం ఆంజనేయులు తెలిపారు. మంగళవారం రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యూనిట్–2 బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ సంయుక్తంగా మండలంలోని పర్వతాపురం శివారులో ఉన్న శ్రీ గురుదత్త ఇండస్ట్రీస్‌లో తనిఖీలు నిర్వహించిందన్నారు. ఈ మిల్లుకు ప్రభుత్వం 2022–23, 2023–24 యాసంగి, 2023–24 వానాకాలం మొత్తం మూడు సీజన్లలో 2,40,189.40 క్వింటాళ్ల వరి ధాన్యం కేటాయించిందని తెలిపారు. ఇప్పటి వరకు సీఎంఆర్‌కు అప్పగించిందిపోను 2,02,731 బ్యాగులకుగాను ప్రస్తుతం మిల్లులో కేవలం 14,692 బ్యాగులు మాత్రమే ఉన్నాయని వివరించారు. 1,88,034 బ్యాగులు లేవని.. వీటి విలువ సుమారు రూ.24 కోట్ల చెప్పారు. మొక్కల సంరక్షణఅందరి బాధ్యత కొత్తకోట రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ కోరారు. వన మహోత్సవంలో భాగంగా మంగళవారం పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం నర్సరీని పరిశీలించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున వివిధ ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన లక్ష్యం మేర మొక్కలు నాటాలని.. వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీపీఓ రఘునాథ్‌రెడ్డి, ఎంపీడీఓ పరిణత, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జెన్కో వద్ద కార్మికుల ఆందోళన ఆత్మకూర్: దిగువ జూరాల జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కార్మికులను అకారణంగా తొలగించడాన్ని నిరసిస్తూ మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో కా ర్మికులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జీఎస్ గోపి, మండల కార్యదర్శి రాజు పాల్గొని మాట్లాడుతూ.. 16 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న కార్మికులను విధుల నుంచి తొలగించడం బాధాకరమన్నారు. తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ విషయమై అధికారులు, కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పోలీసులు కలుగజేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. కార్యక్రమంలో నాయకులు కురుమూర్తి, సత్యం, పాండు, భాస్కర్, ప్రమోద్, రవి, కుర్మన్న, రాజు, సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
వనపర్తి: పర్యాటకులను ఆకర్శించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి తగిన చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వర్షాభావ పరిస్థితులు, నీట్–పీజీ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక అభివృద్ధి తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, అదనపు కలెక్టర్లు ఎన్.ఖీమ్యానాయక్, వినోద్‌కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమై మాట్లాడుతూ.. పర్యాటకులను ఆకర్శించే విధంగా జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల ప్రభావాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ, వ్యవసాయం, సాగు, తాగునీటి లభ్యతపై సంబంధిత శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనిస్తూ రైతులు సాగుచేసే విధంగా వ్యవసాయశాఖ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరి కాకుండా మినుములు, వేరుశనగ తదిర ఆరుతడి పంటలను సాగు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, జిల్లా పర్యాటకశాఖ అధికారి సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత
అమరచింత: ప్రజలకు మెరుగైన సేవలు, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీసుల కర్తవ్యమని ఎస్పీ సునీతారెడ్డి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. ఠాణా పరిధిలో గంజాయి, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని సూచించారు. సాయంత్రం వేళ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి అవసరమైన చోట సైన్ బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఎస్ఐని ఆదేశించారు. జాతీయ రహదారిని అనుసరించి ఉన్న గ్రామాల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూరాల ప్రాజెక్టుకు వచ్చే సందర్శకుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రద్దీ సమయాల్లో పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అంకిత భావంతో విధులు నిర్వహించాలని, పోలీస్‌శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎస్పీ వెంట డీఎస్పీ గిరిబాబు, సీఐ శివకుమార్, ఎస్ఐ స్వాతి, డీసీఆర్బీ ఎస్ఐ తిరుపతిరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
గిరిజనేతరులు సై.. చెంచులు నై!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పులుల సంరక్షణ, వాటి సహజ ఆవాసాలను విస్తరించాలనే లక్ష్యంతో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) కోర్ ప్రాంతంలోని చెంచు పెంటలు, గ్రామాలను మైదాన ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ నిర్ణయం, పునరావాస ప్యాకేజీలతో తరలిపోయేందుకు గిరిజనేతర కుటుంబాల నుంచి సానుకూలత కనిపిస్తుండగా.. చెంచుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా నల్లమలలో పులుల సంరక్షణ, చెంచుల హక్కులు, జీవన విధానం మధ్య సమతుల్యత సాధన మళ్లీ చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్.. తొలి దశలో 4 గ్రామాలు.. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల పరిధిలో విస్తరించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దేశంలో రెండో అతిపెద్ద పులుల అభయారణ్యం. 2,611.39 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ రిజర్వ్ కోర్ ఏరియాలో ఆదివాసీ చెంచులు బొడ్డు గుడిసెల్లో ఉంటూ అటవీ ఉత్పత్తుల సేకరణ, చిన్నపాటి వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారు. కొన్ని చోట్ల గిరిజనేతరులు (బీసీ, ఎస్టీ, ఓసీ) స్థిరపడ్డారు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) అనుమతితో తొలి దశలో సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లంపెంటకు చెందిన కుటుంబాలను తరలిస్తున్నారు. రెండో దశలో వట్వర్లపల్లిని తరలించనున్నారు. వెళ్లేది లేదు.. వెళ్లడమే సరైన మార్గం.. గ్రామసభల అంగీకారం లేకుండానే రీలొకేషన్ ప్రక్రియ ముందుకు సాగుతోందని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులే తమ జీవనోపాధి అని, జంతువులను దేవుళ్లుగా భావించే తమకు వాటితో ఎలాంటి ఘర్షణ లేదని, అడవిని విడిచి వెళ్లడమంటే తమ ఉనికిని కోల్పోవడమేనని, ఏజెన్సీ హక్కులకు దూరమవుతామని వాపోతున్నారు. బలవంతంగా తరలిస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తున్నారు. మరో వైపు అడవిలో భూములకు హక్కు పత్రాలు లేక రుణాలు పొందలేకపోతున్నామని, పిల్లలకు మెరుగైన విద్య, వైద్యం, ఉపాధి కోసం మైదాన ప్రాంతాలకు వెళ్లడమే సరైన మార్గమని గిరిజనేతరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంగీకారం తెలపని 166 కుటుంబాలు.. నల్లమల కోర్ ఏరియా నుంచి తరలిపోయే వారికి పెద్దకొత్తపల్లి మండలం బాచారం వద్ద ఎన్‌హెచ్–167కే పక్కన పునరావాస కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయం, గృహాలు, రోడ్లకు మొత్తం రూ.187.95 కోట్లు కానుండగా.. మొదటి విడతలో 417 కుటుంబాలకు రెండు ఆప్షన్లు కలిపి రూ.62.55 కోట్లు ఖర్చుచేస్తున్నారు. 257 ఇళ్లకు ప్లాట్లు చేసి రాళ్లు పాతారు. ఈ నెల 18న డిప్ ద్వారా రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మందికి ఇంటి స్థలాల పట్టాలు అందజేశారు. తొలిదశలో ఇంకా 166 కుటుంబాలు తరలిపోవడానికి అంగీకారం తెలపలేదు. ఇందులో 85 వరకు చెంచు, మిగిలినవి గిరిజనేతర కుటుంబాలు ఉన్నట్లు సమాచారం. నల్లమలలో అడవిబిడ్డల ‘అరణ్య’ రోదన మైదాన ప్రాంతాలకు తరలింపుపై మిశ్రమ స్పందన ఉనికినే కోల్పోతామని ససేమిరా అంటున్న చెంచులు అడవితల్లి నుంచి విడదీస్తే బతకలేమని ఆవేదన -
బోనమెత్తిన పల్లెలు
జిల్లాలోని పలు గ్రామాల్లో మంగళవారం బోనాల ఉత్సవాన్ని ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకొన్నారు. మహిళలు, యువతులు పసుపు, కుంకుమ, పూలు, వేపాకులు, గంధం తదితర వాటితో అందంగా అలంకరించిన బోనపు కుండల్లో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని తీసుకొని ఊరేగింపుగా అమ్మవారి ఆలయాలకు చేరుకున్నారు. అక్కడ నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కొందరు భక్తులు ఆలయాల ఎదుట కోడిపుంజులు, గొర్రెపొటేళ్లను బలిచ్చారు. ఊరేగింపులో కొందరు మహిళలు పునకాలతో ఊగిపోయారు. యువత డప్పుచప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలు చేశారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – పాన్‌గల్, ఖిల్లా ఘనపురం -
పూత రావడం లేదు..
వానాకాలంలో వర్షంపై ఆధారపడి పంటలు సాగుచేసుకుంటున్నా. ఏడాదికి ఒకపంట సాగుచేసి కుటుంబాన్ని పోషించుకునేవాడిని. ఈసారి మూడు ఎకరాల్లో పత్తి సాగుచేయడానికి రూ.60 వేలు ఖర్చుచేశా. మొదట్లో వర్షాలు కురిసినా.. తర్వాత లేకపోవడంతో పంట ఎదుగుదల ఆశించిన మేర లేక సత్తువ కోల్పోయింది. అక్కడక్కడ పచ్చగా ఉన్నా.. పూత రావడం లేదు. – పోసిరిగారి వెంకటన్న, రైతు, అమరచింత కంది వేసినా ఫలితం శూన్యం ఐదెకరాల్లో పత్తి సాగు చేయడానికి రూ.లక్ష పెట్టుబడి పెట్టా. నీటి వసతి లేకపోవడంతో వర్షాల కోసం ఎదురుచూసినా ఆశించిన మేర కురవక మొక్కలు ఎండుముఖం పట్టాయి. దీంతో చేసేది లేక దుక్కిదున్ని కంది విత్తనాలు నాటాను. సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఆ కంది మొక్కలు కూడా సరిగా పెరగక పెట్టుబడి కూడా చేతికందే పరిస్థితి లేదు. – పుట్టపల్లి రామలు, రైతు, అమరచింత అప్పులే మిగిలాయి.. వర్షంపై ఆధారపడి ఆరు ఎకరాల్లో పత్తి సాగుచేశా. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి అయింది. వర్షాలులేక గింజలు వాడుముఖం పట్టాయి. చేసేది లేక మరోమారు పొలాన్ని దున్ని పత్తి విత్తనాలు వేసినా ఆశించిన మేర ఫలితం కనిపించడం లేదు. – రాములు, రైతు, అమరచింత -
పూర్తిగా పరిహారం అందాకే నిర్ణయం..
మాకు చెప్పినట్లుగా పూర్తి పరిహారం ఇవ్వా లి. బాచారం దగ్గర స్థలం చూపించారు. ఇళ్లు, భూమి, పునరావాస కేంద్రంలో అన్ని వసతులు, ఉపాధి కల్పించిన తర్వాతే బయటకు వెళ్తాం. కొంతమందికి పరిహార చెక్కులు అందాయి. అందరికీ అందిన వెంటనే నిర్ణ యం తీసుకుంటాం. – కంపల్లి అంజనేయులు, గిరిజనేతరుడు, సార్లపల్లి కొందరు ఇబ్బంది పెడుతున్నారు సార్లపల్లి నుంచి 5 చెంచు కుటుంబాలే వెళ్తున్నాయి. 80 కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. అందరు వెళ్తే మీరెలా ఉంటారని కొందరు ఇబ్బంది పెడుతున్నారు. దశాబ్దాలుగా వేదన అనుభవిస్తూ పోరాడుతున్నాం. గిరిజనుల పేరిట చెంచులను ఇబ్బంది పెడితే ఊరుకోం. – జల్లా గురవమ్మ, అటవీ హక్కుల కమిటీ అధ్యక్షురాలు, సార్లపల్లి చెంచుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు అమ్రాబాద్ ఫారెస్ట్‌లో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. భవిష్యత్‌లో మానవ, వన్యప్రాణుల మధ్య ఘర్షణ పెరిగే అవకాశముంటుంది. పెంటలు, గ్రామాల తరలింపు స్వచ్ఛంద పునరావాస కార్యక్రమం. అంగీకరించే కుటుంబాలకు మెరుగైన వసతులు, స్థిరమైన జీవనోపాధి కల్పిస్తాం. – రేవంత్ చంద్ర, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ ● -
పాముకాటు మరణాలు నియంత్రించాలి
వనపర్తి: జిల్లాలో పాముకాటు కారణంగా ఎలాంటి మరణాలు సంభవించకుండా వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్‌సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాముకాటు కేసులు, గర్భిణుల ఆరోగ్య పరిస్థితులు, హిమోగ్లోబిన్ పరీక్షల నిర్వహణపై వైద్యాధికారులకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాముకాటు బాధితులకు పీహెచ్సీ స్థాయిలోనే యాంటీ స్నేక్ వెనం అందించి, అవసరమైన ప్రాథమిక చికిత్సను వెంటనే ప్రారంభించాలన్నారు. భవిష్యత్‌లో జిల్లాలో పాముకాటు కారణంగా ఒక్క మరణం కూడా సంభవించకూడదనే లక్ష్యంతో వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు. హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాలి ప్రతి పీహెచ్సీలో గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన యంత్రాలు, పరికరాలు పనిచేసే స్థితిలో ఉండేలా వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఏ పీహెచ్సీకై నా అదనపు సదుపాయాలు లేదా పరికరాలు అవసరమైతే వాటిని సమకూర్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. నవంబర్ 1 నాటికి జిల్లాలోని ప్రతి గర్భిణికి హిమోగ్లోబిన్ పరీక్ష పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. -
4,946 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయం
వనపర్తిరూరల్: రైసుమిలుపై రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, జిల్లా పౌరసరఫరాల అధికారుల బృందం సోమవారం పెబ్బేరు పట్టణంలోని సాయిగణేష్ రైసు మిల్లులో తనిఖీలు నిర్వహించారు. 2022–23 రబీ సీజన్లో మిల్లు ధాన్యం కేటాయించిన ధాన్యం మిల్లులో నిల్వ ఉన్న బస్తాలను అధికారులు లెక్కించారు. కేటాయించిన ధాన్యంలో 4,946 మెట్రిక్ టన్నుల బస్తాలు తేడా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. విలువ 18.35 కోట్లు ఉంటుదని మేనేజర్ ఆంజనేయులు తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. -
4,235 ఎకరాలకు నీరు
వనపర్తి/ఖిల్లాఘనపురం/పాన్‌గల్/వీపనగండ్ల/చిన్నంబావి: జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎకై ్సజ్, పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం ఖిల్లాఘనపురం మండలంలోని కర్నెతండా ఎత్తిపోతల పథకాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డితో కలిసి మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రూ.87.53 కోట్లతో ఏర్పాటు చేసిన కర్నెతండా లిఫ్టు ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని గిరిజన తండాల్లో 851 ఎకరాలకు, వనపర్తి జిల్లాలోని ఖిల్లాఘనపురం, పెద్దమందడి, వనపర్తి మండలాల్లోని గ్రామాలు, గిరిజన తండాల్లోని 3,384 ఎకరాలకు సాగునీరు అందించే వెసులుబాటు ఉంటుందన్నారు. గిరిజనుల ఆకాంక్ష మేరకు ఈ లిఫ్టుకు శ్రీసంత్ సేవాలాల్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు మార్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చుతామని పేర్కొన్నారు. 3.35 కోట్ల మందికి సన్న బియ్యం, 7 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, 70 వేల ఉద్యోగాలు, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తండాలో నెట్వర్క్ సమస్యను అధిగమించేందుకు కర్నెతండా ప్రాంతంలో సెల్‌టవర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత పాలకులు అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామని ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంటూ ప్రజలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. రూ.41.75 కోట్లతో.. పాన్‌గల్ మండలంలోని దావాజిపల్లిలో వనపర్తి–2 ప్యాకేజీ కింద రూ.41.75 కోట్ల నిధులతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆర్అండ్బీ పాన్‌గల్ నుంచి దావాజిపల్లి, ఖానాపూర్ మీదుగా పుల్గచెర్ల వరకు ఉన్న రహదారిని రెండు లైన్లుగా మార్చనున్నట్లు వెల్లడించారు. అనంతరం 2.14 కోట్లతో గ్రామంలో ఏర్పాటు చేసిన 33/11 కేవి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. వీపనగండ్ల నుంచి కేతేపల్లి వరకు రూ.30 కోట్లతో నిర్మించనున్న డబుల్ బీటీ రోడ్డుకు భూమిపూజ చేశారు. చిన్నంబావి మండలంలోని పెద్దదగడ నుంచి వెలగొండ వరకు.రూ.45.60 కోట్లతో, చిన్నంబావి నుంచి చెల్లపాడు వరకు రూ.39 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కర్నెతండా లిఫ్టును ప్రారంభించిన మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి రూ.87.53 కోట్లతో పనులు పూర్తి దావాజిపల్లిలో 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం -
ఆ ఠాణాలో షరా‘మామూలే’!
● ఫిర్యాదు తీసుకోవాలంటే ముడుపులేనా? ● హెడ్‌కానిస్టేబుల్ తీరుపై ఆరోపణలు.. సీఐ కార్యాలయానికి అటాచ్ ● గతంలో ఇదే స్టేషన్లో ఎస్ఐ, ఏఎస్ఐ సస్పెన్షన్.. ● మళ్లీ చర్చనీయాంశంగా వసూళ్ల వ్యవహారం అమరచింత: అమరచింత పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్ తీరుపై ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మహిళలతో అసభ్యంగా మాట్లాడినట్లు ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హెడ్‌కానిస్టేబుల్ శాంతయ్యను సీఐ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సీఐ శివకుమార్ తెలిపారు. మరోవైపు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసేవారని, డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చేవారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారుల విచారణతో అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆడియో వైరల్.. అటాచ్ అమరచింత పోలీస్‌స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శాంతయ్య.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళతో ఫోన్లో మాట్లాడుతూ ఆశా కార్యకర్త, ఏఎన్ఎంలపై అసభ్యకరంగా మాట్లాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై సీఐ శివకుమార్‌ను సంప్రదించగా.. సదరు హెడ్‌కానిస్టేబుల్‌ను సర్కిల్ కార్యాలయానికి అటాచ్ చేసి, విచారణ చేపట్టామని పేర్కొన్నారు. హెడ్‌కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుల నుంచి డబ్బుల వసూళ్ల ఆరోపణలు స్టేషన్‌కు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఫిర్యాదుదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేసేవారని పలువురు ఆరోపిస్తున్నారు. మహిళా ఎస్ఐ ఉన్నప్పటికీ ఫిర్యాదుదారులను నేరుగా ఆమె వద్దకు పంపకుండా.. డబ్బులు ఇచ్చిన వారికే ప్రాధాన్యం కల్పించేవారని చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉంది. అమరచింత పోలీస్‌స్టేషన్ గతంలోనూ ఇదే స్టేషన్లో.. గతేడాది జూలైలో నాగల్‌కడ్మూర్, ధర్మాపురం గ్రామాలకు చెందిన యువకులు క్రికెట్ ఆడుతున్న సమయంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ కేసులో డబ్బులు తీసుకుని కొందరిని కేసు నుంచి తప్పిస్తామని అప్పటి ఎస్ఐ సురేష్ బేరసారాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. యువకులు ఎస్ఐ ఫోన్‌పేకు డబ్బులు పంపి, స్క్రీన్షాట్లను ఉన్నతాధికారులకు పంపినట్లు అప్పట్లో వెల్లడైంది. దీంతో ఎస్ఐ సురేష్‌తో పాటు ఏఎస్ఐ జమీరుద్దీన్‌ను సస్పెండ్ చేశారు. మళ్లీ అదే స్టేషన్లో చర్చ.. గత ఘటన మరువకముందే తాజాగా హెడ్‌కానిస్టేబుల్ వ్యవహారం వెలుగులోకి రావడంతో అమరచింత పోలీస్‌స్టేషన్ మరోసారి చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని స్థానికులు కోరుతున్నారు. -
వన మహోత్సవ లక్ష్యం చేరుకోవాలి
వనపర్తి: వన మహోత్సవంలో భాగంగా సెప్టెంబర్ చివరి నాటికి జిల్లాకు నిర్ధేశించిన మేరకు మొక్కలు నాటాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్ ఖీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించగా.. కలెక్టరేట్లోని వీసీ నుంచి అదనపు కలెక్టర్ అటవీ శాఖ అధికారి రేవంత్‌తో కలిసి హాజరయ్యారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ స్థాయిలో సామూహిక మొక్కల నాటే కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇటీవల కురుస్తున్న వర్షాలు, రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అనుకూల వాతావరణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు, యువత, ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ, మనుగడపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వనపర్తి జిల్లాకు వన మహోత్సవం కింద 17 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటివరకు 70 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. -
సారుసారుకో కొత్త కారు..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)లో విద్యార్థుల భవిష్యత్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దశాబ్దాలు గడిచినా నిధుల లేమితో అల్లాడుతున్న ఈ విశ్వవిద్యాలయం.. ఇప్పుడిప్పుడే వనరులు సమకూర్చుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. అయితే నిధులు లేవనే సాకుతో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతోపాటు కనీస వసతులు కల్పించకుండా పక్కనబెడుతున్న యూనివర్సిటీ పాలకులు.. తమ సొంత లగ్జరీ సౌకర్యాలకు మాత్రం నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. యూనివర్సిటీలో పలు కోర్సుల్లో సీటు వచ్చినా.. వసతి గృహాలు, మౌలిక సదుపాయాలు లేక వందలాది మంది విద్యార్థులు రద్దు చేసుకుని వెళ్లిపోతుంటే.. ఇవేమీ పట్టని పాలనా యంత్రాంగం రూ.లక్షలు వెచ్చించి కొత్త లగ్జరీ కార్లు కొనుగోలు చేయడం వివాదాస్పదంగా మారింది. వీసీ మారినప్పుడల్లా.. యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వైస్ చాన్స్‌లర్ మూడేళ్లు, రిజిస్ట్రార్లు రెండేళ్ల పదవీ కాలానికి నియమితులవుతారు. పాలమూరు యూనివర్సిటీలో వీసీలు మారిన ప్రతిసారి కొత్త లగ్జరీ కారు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. 2019కి ముందు వీసీ భాగ్యనారాయణ కాలంలో ఇన్నోవా వాహనం ఉండేది. ఆ తర్వాత వీసీగా వచ్చిన రాజారత్నం ఈ వాహనాన్ని రిజిస్ట్రార్‌కు కేటాయించి.. రూ.30 లక్షల వ్యయంతో ఇన్నోవా హై 2.5జెడ్ కొనుగోలు చేశారు. ఈ కారు ఉండగానే.. 2023లో వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ రూ.20 లక్షల వ్యయంతో కొత్తగా మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీ వాహనం కొనుగోలు చేశారు. ఈ రెండు వాహనాలను వినియోగించుకునే అవకాశం ఉన్నా.. తాజాగా వీసీ శ్రీనివాస్ ఇటీవల సుమారు రూ.32 లక్షల వ్యయంతో మహీంద్రా ఈవీ (లేటెస్ట్ మోడల్) కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఇద్దరు ఉన్నతాధికారులు వినియోగించుకునేందుకు వర్సిటీలో ఏకంగా నాలుగు కార్లు అందుబాటులో ఉండడం గమనార్హం. ఒకటి రోడ్డెక్కితే.. మరొకటి షెడ్డుకే పరిమితం ప్రస్తుతం వీసీ శ్రీనివాస్ ఇన్నోవా హై 2.5జెడ్, మహీంద్రా ఈవీ కారును వాడుతుండగా, రిజిస్ట్రార్ రమేష్‌బాబు పాత ఇన్నోవాను పక్కనబెట్టి లక్ష్మీకాంత్ రాథోడ్ కొనుగోలు చేసిన మహీంద్రా ఎక్స్‌యూవీ 400 ఈవీని వినియోగిస్తున్నారు. కేవలం ఇద్దరు అధికారులు తిరిగేందుకు నాలుగు వాహనాలు ఉండగా.. ఒకటి రోడ్డెక్కితే ఇంకోటి షెడ్డుకే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. పాలమూరు యూనివర్సిటీలో లగ్జరీ పాలన వీసీలు మారిన ప్రతీసారి నూతన వాహనం కొనుగోలు సరిపోను వసతి లేక సీట్లు రద్దు చేసుకుని వెళ్తున్న విద్యార్థులు ఇవేమీ పట్టకుండా యథేచ్ఛగా నిధుల దుర్వినియోగం మూడేళ్లు, ఆరేళ్లకే మరమ్మతులట..! విద్యార్థులకు వసతులు కల్పించకుండా, అవసరానికి మించి లగ్జరీ కార్లు కొనుగోలు చేయడంపై పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబును ‘సాక్షి’ సంప్రదించగా.. ‘గతంలో కొనుగోలు చేసిన పాత కార్లు తరచుగా మరమ్మతుకు రావడంతో కొత్త కారు కొన్నాం. ప్రతి నెలా పెట్రోల్ కార్లు వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో ఖర్చవుతోంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేశాం. వీటి వల్ల ఇంధన ఖర్చులు తగ్గి దీర్ఘకాలంలో యూనివర్సిటీకి నిధులు ఆదా అవుతాయి.’ అని సమాధానం ఇచ్చారు. మూడేళ్లకు, ఆరేళ్ల్లకే మరమ్మతులు రావడం ఏమిటని ప్రశ్నిస్తే సమాధానం కరువైంది. -
శ్రీశైలంలో తగ్గిన నీటిమట్టం
అచ్చంపేట/ ఆత్మకూర్: ఎగువనున్న జూరాల జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం జలాశయానికి 7,134 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జలాశయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 875.70 అడుగుల వద్ద 166.7052 టీఎంసీల నీటిమట్టం ఉంది. అయితే ఆదివారం 168.2670 టీఎంసీల నీటి నిల్వ ఉండగా.. విద్యుదుత్పత్తి, సాగు, తాగునీటి అవసరాలకు వదులుతుండటంతో 2 టీఎంసీల మేర తగ్గింది. కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిశ్పాచ్ ఆదేశాల మేరకు ఐదురోజుల నుంచి విద్యుదుత్పత్తి నిలిపివేయగా.. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి అవసరాల కోసం హంద్రీ– నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కులు ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రబుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. తగ్గిన విద్యుదుత్పత్తి... ఎగువ నుంచి జూరాలకు వరద ప్రవాహం నిలిచిపోవడంతో సోమవారం కేవలం 2 యూనిట్ల ద్వా రా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ, దిగువలో ఒక్కొక్క యూనిట్ ద్వా రా విద్యుదుత్పత్తి చేపడుతూ 7,134 క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. నేటినుంచి పవిత్రోత్సవాలు ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం నుంచి శుక్రవారం వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విశ్వక్సేన ఆరాదన, పుణ్యాహవచనం, అంకురార్పణ, తీర్థగోష్టి, బుధవారం మంగళవాయిద్యాల నడుమ పవిత్ర గ్రామ ప్రదక్షిణ, వేద ప్రబంధ పారాయణం, యాగశాల ఆరాదన, హోమం, తీర్థ గోష్టి, గురువారం వేద పారాయణం, యాగశాల ఆరాదన, పవిత్ర సమర్పనం, లఘు పూర్ణాహుతి, శుక్రవారం వేద పారాయణం, యాగశాల ఆరాధన, మూలమంత్ర హోమాలు ఉత్సవాలు ముగియనున్నట్లు వెల్లడించారు. -
చిన్నారెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలే.. : ఎమ్మెల్యే
వనపర్తి: నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీలో రేగిన కొత్త.. పాత చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. గోపాల్‌పేటలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ క్రమశిక్షణా కమిటీ నోటీసులు ఇవ్వగా.. ఇచ్చిన వివరణపై ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గాంధీభవన్ వద్ద మీడియా ఎదుట స్పందించారు. నోటీసులో పేర్కొన్న అంశాలను వదిలేసి సంబంధం లేని అంశాలతో వివరణ ఇచ్చారని, అన్నీ అబద్ధాలేనని తెలిపారు. చిన్నారెడ్డి మాట్లాడిన వీడియో, ఆడియోలు తన వద్ద ఉన్నాయని.. ఇచ్చిన వివరణ తమకు ఏ మాత్రం సంతృప్తిగా లేదని తెలిపారు. ఈ విషయంపై కమిటీ తనను పిలిస్తే పూర్తి ఆధారాలు సమర్పించడంతో పాటు తన ఆవేదనను వ్యక్తం చేస్తానని చెప్పారు. పీఏసీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఆదివారం గాంధీభవన్‌లో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా నాయకులు, కేడర్‌ను క్రమశిక్షణతో మెలిగేలా సూచనలు ఇవ్వాలని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ సచిన్ సావత్‌ను కోరారు. నేతల అనుచిత వ్యాఖ్యలతో పార్టీలో నెలకొన్న గందరగోళంపై కమిటీ చర్చించినట్లు తెలిపారు. -
కోటిలింగేశ్వరస్వామి సన్నిధిలో న్యాయమూర్తులు
కొత్తకోట రూరల్: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో ఉన్న కోటిలింగేశ్వర దత్తక్షేత్రాన్ని ఆదివారం జిల్లా న్యాయమూర్తులు బాకరాజు శ్రీనివాసరావు, లావణ్య బాలరెడ్డి, కళార్చన, కవిత, కార్తీక్‌రెడ్డి, శ్రీలత, అశ్విని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న న్యాయమూర్తులకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. శ్రావణమాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వారిని అర్చకులు శేష వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. శ్రావణమాసంలో శ్రీ కోటిలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. -
సాగునీటి కల సాకారం
ఖిల్లాఘనపురం: ఏళ్లుగా సాగునీరు లేక అల్లాడుతున్న అన్నదాతల ఆశలు ఎట్టకేలకు నెరవేరనున్నాయి. ఎత్తైన ప్రాంతంలోని అన్నదాతలకు సాగునీరు అందించి మోడువారిన బతుకులను చిగురింప జేసేందుకు నిర్మించిన కర్నెతండా లిఫ్ట్‌ను సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, నాగర్‌కర్నూల్ ఎంపీ డా. మల్లు రవితో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, రాజేష్‌రెడ్డి ప్రారంభించనున్నారు. 2022, మార్చి 8న శంకుస్థాపన.. 2022, మార్చి 8న కర్నెతండా లిఫ్ట్‌కు నాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. మొదట్లో కర్నెతండాలోనే పైలాన్‌ను ఇరిగేషన్ అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ గుట్టల మధ్యన ఉండటంతో భద్రత సమస్యలు తలెత్తుతాయని వనపర్తిలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి శంకుస్థాపన చేశారు. 3 మినీ కాల్వలతో.. కర్నెతండా నుంచి మూడు మినీ కాల్వల ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు గ్రామాలు, గిరిజన తండాల్లోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించనున్నారు. కర్నెతండా కాల్వ నుంచి 5 కిలోమీటర్ల పొడవున 1,465 ఎకరాలకు సాగునీరు అందనుంది. జంగమాయపల్లి కాల్వ నుంచి 2.5 కిలోమీటర్ల పొడవున 1,105 ఎకరాలకు, మామిడిమాడ కాల్వ నుంచి 6.5 కిలోమీటర్ల పొడవున 1,665 ఎకరాలకు మొత్తం 4,235 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రభుత్వం లిఫ్ట్ నిర్మాణం చేపట్టింది. 63 మీటర్ల ఎత్తుకు.. కర్నెతండా లిఫ్ట్‌ను ప్రభుత్వం రూ.87.53 కోట్లతో పూర్తి చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ఖిల్లాఘనపురం బ్రాంచ్ కెనాల్‌కు 7వ కిలోమీటర్ శ్రీ ఆంజనేయస్వామి ఆలయం దగ్గర బిజినేపల్లి మండలం భీమునితండా మధ్యలో పంపుహౌస్ నిర్మాణం చేపట్టారు. ఒక మెగావాట్ పంపులు రెండింటితో 2.5 కిలోమీటర్ల పొడవు 63 మీటర్ల ఎత్తుకు పైపుల ద్వార సాగునీటిని తరలించనున్నారు. కర్నెతండా దగ్గర నీటిని నిల్వచేసి మూడు కాల్వల ద్వారా పలు గ్రామాల వ్యవసాయ పొలాలకు నీటిన తరలించనున్నారు.కర్నెతండా లిఫ్ట్ ద్వారా నాగర్‌కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, జిల్లాలోని ఖిల్లాఘనపురం, వనపర్తి, పెద్దమందడి మండలాల్లోని మామిడిమాడ, షాపురం, పర్వతాపురం, ఖిల్లాఘనపురం, మానాజీపేట, సోళీపురం, జంగమాయపల్లి, బలిజపల్లి, వీరాయిపల్లి, పామిరెడ్డిపల్లి, వెంకటాపూర్, లట్టుపల్లి, రుక్కన్నపల్లి గ్రామాలతో పాటు హన్మ్యాతండా, చిన్నపీర్తండా, పుల్సింగ్తండా, మిఠ్యాతండా, డాకుతండా, భీమునితండా, ఎర్రగడ్డతండా, కర్నెతండా, ఆముదంబండతండా, కోతులకుంటతండా, గార్లబండతండా, కుంటముందలితండా, మీదిగడ్డతండా, ముందలితండా, వెనికితండా, మేడిబాయితండా, దొంతికుంటతండా, ఎర్రగుట్టతండా మొత్తం 12 గ్రామాలు, 18 గిరిజన తండాల రైతులకు మేలు జరగనుంది. నేడు కర్నెతండా ఎత్తిపోతలను ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రులు 4,235 ఎకరాలకు అందనున్న సాగునీరు రూ.87.53 కోట్లతో నిర్మాణం 12 గ్రామాలు, 18 గిరిజన తండాల రైతులకు మేలు -
జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద
గద్వాల/ఆత్మకూర్ / అచ్చంపేట: ఎగువ ప్రాంతం నుంచి ఆదివారం జూరాలకు 31 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో హైడల్ విద్యుత్ కేంద్రానికి 23,531 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్టు–1కు 1,300, లిఫ్టు–2 872, కోయిల్‌సాగర్‌కు 930, ప్రధాన ఎడమ కాల్వకు 820, కుడి కాల్వకు 550, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా.. నెట్టెంపాడు ప్రాజెక్టుకు నిలిపివేశారు. మొత్తంగా ప్రాజెక్టు నుంచి దిగువకు 54,865 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318.30 మీటర్ల వద్ద 9.214 టీఎంసీల నీరు ఉంది. 153.052 మి.యూ. విద్యుదుత్పత్తి.. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోందని ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఆదివారం ఎగువన 4 యూనిట్ల నుంచి 156 మెగావాట్లు, 86.912 మి.యూ., దిగువన 4 యూనిట్ల నుంచి 160 మెగావాట్లు, 66.140 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో 153.052 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి పూర్తి చేసినట్లు చెప్పారు. విద్యుదుత్పత్తికి 24 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువన శ్రీశైలం జలాశయానికి వదులుతున్నామని వివరించారు. శ్రీశైలంలో స్పల్పంగా పెరిగిన నీటిమట్టం శ్రీశైలం జలాశయంలోకి నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో స్వల్పంగా నీటిమట్టం పెరిగింది. జూరాల జల విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలానికి 23,531 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో కుడిగట్టు కేంద్రంలో లోడ్ డిస్పాచ్ ఆదేశాల మేరకు గురువారం నుంచి విద్యుదుత్పత్తి తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్‌కు 7,063 క్యూసెక్కులు వదిలారు. అలాగే శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి రాయలసీమ తాగు, సాగునీటి పథకాల కోసం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాల్వ ద్వారా 3,050, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని ఏపీ ప్రభుత్వం తరలిస్తోంది. అలాగే కేఎల్ఐ ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2,400 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తోంది. ప్రస్తుతం జలాశయంలో 876 అడుగుల వద్ద 168.2670 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికిగాను అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. బి.ఈశ్వరయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ సైనన్స్, వాణిజ్య శాస్త్రం (బీఎస్ఎఫ్ఐ), తెలుగు, ఆంగ్లం ఒక్కో పోస్ట్ చొప్పున ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలని, పీహెచ్డీ, నెట్, సెట్, గత విద్యాసంవత్సరం వరకు పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. అర్హులైన ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యార్హత ధ్రువపత్రాలతో దరఖాస్తును 25వ తేదీ సాయంత్రం 4లోగా కళాశాలలో సమర్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 27న ఇంటర్వ్యూకు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒకకాపీ జిరాక్స్ పత్రాలతో ఉదయం 10 గంటల వరకు కళాశాలలో హాజరవ్వాలని సూచించారు. కొత్తకోట సీఐగా ఓడీ రమేష్ కొత్తకోట రూరల్: కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఓడీ రమేష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ విధులు నిర్వర్తించిన సీఐ రాంబాబు హైదరాబాద్ ఐజీ కార్యాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో డీఐజీ కార్యాలయం నుంచి ఓడీ రమేష్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని.. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. వైఎస్సార్ కృషి ఫలితమే కేఎల్ఐ ప్రాజెక్టు కొల్లాపూర్ రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగానే కేఎల్ఐ ప్రాజెక్టు నిర్మితమైందని వైఎస్సార్సీపీ నందికొట్కూర్ సమన్వయకర్త డాక్టర్ ధార సుధీర్ అన్నారు. ఆదివారం ఆయన కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ శివారులో ఉన్న కేఎల్ఐ ప్రాజెక్టును పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు కేఎల్ఐ ప్రాజెక్టు వరప్రదాయిని అని పేర్కొన్నారు. ఐదేళ్ల వ్యవధిలోనే కేఎల్ఐ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేశారని గుర్తు చేశారు. కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 3 లక్షలపైగా ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్‌యాదవ్, నాయకులు మధు, రాజు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘సోలార్’తో ఆర్టీసీకి ఆదా
వాస్తవానికి ట్రాన్స్‌కో ద్వారా విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.8.50 పడుతుండగా.. సోలార్కు మాత్రం రూ.5.50 చొప్పున బిల్లులు చెల్లిస్తున్నారు. ఇలా ఒక్కో యూనిట్‌కు రూ.3 ఆదా అవుతోంది. ప్రతినెలా సరాసరి నాగర్‌కర్నూల్‌లో రూ.24 వేల పైచిలుకు, షాద్‌నగర్ లో రూ.21 వేలు, కొల్లాపూర్‌లో రూ.14 వేలు, మహబూబ్‌నగర్, గద్వాల లో రూ.11 వేల చొప్పున, నారాయణపేటలో రూ.7 వేలు, కల్వకుర్తిలో రూ.4 వేలు, వనపర్తిలో రూ.3 వేల పైచిలుకు చొప్పున ఆర్టీసీకి ఆదా అవుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా గత ఆరు నెలల క్రితం నిర్వహణ బాధ్యతల నుంచి కార్వీ తప్పుకొంది. దీని స్థానంలో మరో సంస్థకు బాధ్యతలు అప్పగించినా ఇంతవరకు బిల్లుల చెల్లింపులకు సంబంధించి లెక్కలు తేల్చకపోవడం గమనార్హం. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: సోలార్ పవర్ ప్లాంట్లతో టీజీఎస్ఆర్టీసీ మహబూబ్‌నగర్ రీజియన్ ఏడేళ్లుగా ఎంతో ఆదా పొందుతోంది. ట్రాన్స్‌కో కంటే సోలార్ విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటంతో ప్రతినెలా సంస్థకు భారం తగ్గింది. 2019 ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎస్ రెడ్కో) ఆధ్వరంలో ఎనిమిది చోట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. గద్వాల డిపో, బస్టాండులో 44 కిలోవాట్లు, నారాయణపేటలో 40 (25+15) కిలోవాట్లు, కొల్లాపూర్‌లో 30 (20+10), మహబూబ్‌నగర్‌లో 30 (20+10), వనపర్తిలో 25 (15+10) కిలోవాట్లు, నాగర్‌కర్నూల్‌లో 20 , షాద్‌నగర్‌లో 20 (10+10), కల్వకుర్తిలో 15 కిలోవాట్లు సామర్థ్యం కలిగినవి ఉన్నాయి. ఎక్కడికక్కడ సూర్యరశ్మి బాగానే పడేందుకు వీలుగా ఆయా బస్టాండ్లు, అలాగే డిపో గ్యారేజీలపైన పలకలను ఏర్పాటు చేశారు. అనంతరం ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను మెయిన్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఏ రోజుకారోజు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతుందో.. ఎంత వాడుకుంటున్నారనేది తెలియడానికి టు వే మీటర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతలను కార్వీ సంస్థకు అప్పగించారు. ఈ ప్లాంట్లు 25 ఏళ్ల పాటు కొనసాగేందుకు అప్పట్లోనే ఆర్టీసీ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక మహబూబ్‌నగర్ బస్టాండు పైన ఉన్న సోలార్ పవర్ ప్లాంటు ద్వారా ప్రతి రోజూ 50 నుంచి 80 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. అలాగే డిపో గ్యారేజీపైన ఉన్న ప్లాంటు ద్వారా 80 నుంచి 150 యూనిట్ల వరకు విద్యుదుత్పత్తి అవుతోంది. రీజియన్ పరిధిలో ఒకప్పుడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చేది. దీనిని అధిగమించడానికి రాష్ట్ర ఉన్నతాధికారులు ఏడేళ్ల క్రితమే ఆయా బస్టాండ్లు, డిపోలలో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్‌కో కంటే సోలార్కు తక్కువ విద్యుత్ చార్జీలు ఉండటమే గాక నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆర్టీసీ సంస్థకు బాగానే కలిసొచ్చింది. – సంతోష్‌కుమార్, ఆర్ఎం, టీజీఎస్ఆర్టీసీ, మహబూబ్‌నగర్ కాల్వ ఇలా.. నీరు పారేదెలా? 10 నుంచి 44 కిలోవాట్ల వరకు సామర్థ్యం 2019లోనే కేంద్ర ప్రభుత్వం, రెడ్కో సౌజన్యంతో ఏర్పాటు అప్పట్లోనే విద్యుదుత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం ప్రతినెలా సంస్థకు విద్యుత్ బిల్లులలో రాయితీ వస్తున్న వైనం -
వారాబందీ!
వానాకాలం.. ●అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఏర్పడినప్పటి నుంచి ఏటా వానాకాలంలో వరి సాగు కోసం పూర్తిస్థాయిలో సాగునీటిని విడుదల చేసే అధికారులు.. ఈ ఏడాది మాత్రం వారాబందీ విధానం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉన్నా.. వానాకాలంలో వారాబందీ ఏమిటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సమృద్ధిగా కురవని కారణంగా ఈసారి ఆరుతడి పంటలకే సాగునీరు వదులుతామని అధికారులు ఐడీబీ సమావేశంలో నిర్ణయించారు. వరి నారుమడులు సిద్ధం చేసుకున్న అన్నదాతలు ఎలాగైనా తమ పంటలకు పూర్తిస్థాయిలో సాగునీరు వదలాలని వేడుకుంటున్నారు. జలాశయాలు, ఎత్తిపోతల ఆయకట్టులో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని.. తక్కువ నీటిని వినియోగించాలంటూ గ్రామాల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాసంగి సీజన్లో వారాబందీ పద్ధతిన సాగునీటిని అందించిన అధికారులు.. వానాకాలం సీజన్లో కూడా అదే విధానాన్ని అమలు చేస్తున్నారు. జూరాల ఎడమ కాల్వ ఆయకట్టు పరిదిలో ఈసారి రబీ పంట సాగుకోసం ప్రాజెక్టు సమీపంలోని రామన్‌పాడ్ రిజర్వాయర్‌తో పాటు శంకర సముద్రం, గోపల్‌దిన్నె వరకు అమరచింత ఎత్తిపోతలు, కురుమూర్తి ఎత్తిపోతల ద్వారా వారంలో 4 రోజులు మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. జూరాల ప్రధాన ఎడమ కాల్వ జిల్లా పరిధిలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల వరకు ఉండగా ఆరుతడి పంటలకు మాత్రమే సాగునీటిని ఇవ్వనున్నామని ప్రాజెక్టు అధికారులు వెల్లడిస్తున్నారు. వానాకాలం విస్తీర్ణం ఖరారు.. జూరాల ఎడమ కాల్వ కింద ప్రస్తుత వానాకాలం సీజన్లో 85 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.629 టీఎంసీల నీటి నిల్వ ఉంది. వీటిని వానాకాలం పంటల సాగుతో పాటు తాగునీటి అవసరాలకు వినియోగించనున్న నేపథ్యంలో ముందస్తుగా వారాబందీ అమలు చేశారు. ఆరుతడి పంటలకే ప్రాధాన్యమంటున్న అధికారులు వరి సాగుకే ఆసక్తి చూపుతున్న అన్నదాతలు ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాలు.. -
ప్రతి ఇంట్లో ఇది భాగమే..
మా ఊరిలో జరిగే ప్రతి పెళ్లిలో ఈ చెట్టు పాత్ర ఉంటుంది. పందిరి వేసేందుకు ఆకులు మొదలుకొని ప్రత్యేక పూజలు చేసే వరకు ఈ చెట్టుపై ఆధారపడతాం. ఇది నా చిన్నతనం నుంచి మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం. అలాంటి చెట్టు కింద మా జీవితమంతా గడిచింది. ఇంతటి ప్రాధాన్యత గల చెట్టును కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటే వినాశ కాలమే. – కుర్వ చిన్న రాముడు, పెద్దతాండ్రపాడు ఎవరికీ రాసివ్వలేదు.. చెట్టుకు సంబంధించి మా పెద్దలు ప్రస్తుతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారికి పత్రం రాసిచ్చారని చెబుతున్నారు. అలాంటిదేమి జరగలేదు. చెట్టు పరిసర ప్రాంతాల్లో మా పెద్దలు ఉండేవారు. ప్రస్తుతం ఉంటున్న వారు మా పెద్దలు రాసిచ్చారని చెబుతూ కొంత ఆక్రమించగా.. మరికొంత ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే విషయం నేను గ్రామసభలో కూడా చెప్పాను. – మీసాల లక్ష్మన్న, పెద్దతాండ్రపాడు కేసులు నమోదు చేస్తాం.. ఎంతో చరిత్ర ఉన్న రావిచెట్టు గురించి మాకు గ్రామస్తుల వినతిపత్రాల ద్వారా తెలిసింది. దీని కోసం గ్రామంలో విచారణ చేపట్టాం. ప్రకృతిలో భాగమైన చెట్టును నాశనం చేస్తే సహించేది లేదు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమించి చెట్టును నరికినా.. కబ్జా చేసేందుకు ప్రయత్నించినా కేసులు నమోదు చేస్తాం. – పర్వేజ్ అహ్మద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జోగుళాంబ గద్వాల -
పూర్తిస్థాయిలో నీరివ్వాలి..
అమరచింత ఎత్తిపోతల పథకం కింద ఈ ఏడాది వానాకాలంలో 4 ఎకరాలు వరి సాగుచేశాను. వారాబందీ విధానంలో నీరు వదిలితే పంటకు సరిపడా అందక ఆశించిన స్థాయిలో దిగుబడి రాదేయోనన్న భయం ఉంది. జూరాల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలి. – మోహన్‌రెడ్డి, సింగంపేట యాసంగి సీజన్లో కేవలం రామన్‌పాడు వరకే నీటిని అందించిన అధికారులు వానాకాలంలో కూడా వారాబందీ అమలు చేయాలని నిర్ణయించడం శోచనీయం. కేవలం ఆరుతడి పంటల సాగుకే నీరందిస్తామని చెప్పడం సరికాదు. మండలంలో జూరాల నీటిపై ఆధారపడి సుమారు 6 వేల ఎకరాల్లో రైతులు మామిడి సాగు చేస్తున్నారు. అధికారులు స్పందించి ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందించాలి. – ఎండీ నడిపి ఖాజా, మామిడి రైతు, గోవర్ధనగిరి (వీపనగండ్ల) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు వానాకాలం సీజన్లో వారాబందీ విధానంలో సాగునీరు అందిస్తున్నాం. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆరుతడి పంటలకుగాను వారంలో 4 రోజుల పాటు నీటిని అందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా వేసవిలో కాల్వల్లో పూడికతీత చేపట్టాం. వరి కాకుండా ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. – షమీ ఉల్లా, డీఈ, పీజేపీ నందిమళ్ల డివిజన్ -
రూ.52 కోట్ల వరి ధాన్యం మాయం
ఖిల్లాఘనపురం: మండలంలోని హన్పాడ్ శివారులో ఉన్న శ్రీలక్ష్మీ వేంకటేశ్వర బాయిలర్ రైస్‌మిల్, శ్రీలక్ష్మీ వేంకటేశ్వర రా రైస్‌మిల్‌లో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.52 కోట్ల విలువైన వరి ధాన్యం మాయమైనట్లు జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు తెలిపారు. రెండు మిల్లులకు 2022–23, 2024–25 యాసంగి, 2025–26 వానాకాలం, యాసంగి సీజన్ల వరి ధాన్యం ఆయా మిల్లులకు కేటాయించామని.. ఆ ధాన్యం పక్కదారి పట్టినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని వివరించారు. బాయిలర్ రైస్‌మిల్లులో 1,49,198 బస్తాలు వీటి విలువ రూ.31 కోట్లు, రా రైస్‌మిల్లులో 2,01,985 బస్తాలు విలువ రూ.21 కోట్ల వ్యత్యాసం ఉందన్నారు. మొత్తం 3,51,183 బస్తాలు.. విలువ రూ.52 ఽకోట్లని డీఎస్ఓ చెప్పారు. ఆయా మిల్లుల యజమానురాలు ఎస్.శ్రీదేవిపై శనివారం సాయంత్రం ఖిల్లాఘనపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. రైసుమిల్లు యజమానురాలిపై కేసునమోదు.. వనపర్తి రూరల్: జిల్లా పౌరసరఫరాలశాఖ డీఎం ఆంజనేయులు ఫిర్యాదు మేరకు మండలంలోని పెద్దగూడెం శివారులో ఉన్న భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ రైసుమిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై కేసు నమోదు చేశామని రూరల్ ఎస్ఐ హృశికేష్ తెలిపారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కథనం మేరకు.. భాగ్యలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీ (రైసుమిల్లు)కు 2022–23 యాసంగి, 2023–24 వానాకాలం, 2024–25 వానాకాలం, యాసంగి సీజన్లో ప్రభుత్వం వరి ధాన్యం కేటాయించింది. శుక్రవారం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా 1,03722 సంచుల ధాన్యం తక్కువగా ఉందని గుర్తించారు. ఈ ధాన్యం విలువ సుమారు రూ.14 కోట్లకుపైగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. శనివారం మిల్లు యజమానురాలు దీపికారెడ్డిపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.


