పారదర్శకంగా నామినేషన్ల ప్రక్రియ
కొత్తకోట రూరల్/వనపర్తి రూరల్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోటలోని ఎంపీడీఓ కార్యాలయం, పెబ్బేరులోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను ఆయన సందర్శించి ఏర్పాట్లు, రిటర్నింగ్ అధికారులు పబ్లిష్ చేసిన ఎన్నికల నోటీస్ ఫారం–1ను పరిశీలించారు. అభ్యర్థులకు కావాల్సిన సమాచారాన్ని హెల్ప్‌డెస్క్‌లో అందించాలని, ఓటరు జాబితాను సైతం అందుబాటులో ఉంచాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, వివరాలను ఎప్పటికప్పుడు టీపోల్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. స్వతంత్రులకు గుర్తులు చూపించాలని కోరారు.
కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్‌రూం పరిశీలన..
కొత్తకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల, పెబ్బేరులోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న ఎన్నికల సామగ్రి పంపిణీ, సేకరణ, ఓట్ల లెక్కింపు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విశాలమైన ప్రాంతంలో సులువుగా అర్థమయ్యేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఓట్ల లెక్కింపు కేంద్రంలో అవసరమైన అన్ని వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్ట్రాంగ్‌రూమ్‌ను స్వయంగా పరిశీలించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, సీఐ రాంబాబు, కొత్తకోట ఎంపీడీఓ వినిత్, పుర కమిషనర్ సైదయ్య, పెబ్బేరు తహసీల్దార్ మురళీగౌడ్, పుర కమిషనర్ ఖాజా ఆరీఫోద్దీన్ రెవెన్యూ అధికారులు ఉన్నారు.


