రెండోరోజు 239 నామినేషన్లు దాఖలు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు గురువారం ఊపందుకుంది. జిల్లాలోని ఐదు పురపాలికల్లో మొత్తం 239 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా వనపర్తి పురపాలికలో 108 నామినేషన్ పత్రాలను వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. అభ్యర్థులు ఆయా వార్డుల నుంచి భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్లు పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ 38, బీజేపీ 19, బీఆర్‌ఎస్ 31, సీపీఎం 2, సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థులు 17 మంది నామినేషన్లు వేశారు.
పెబ్బేరులో..
వనపర్తి రూరల్: పెబ్బేరులోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో గురువారం 33 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో బీజేపి నుంచి 9, కాంగ్రెస్‌పార్టీ పార్టీ 11, బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 7, బీఎస్పీ నుంచి ఒకరు, టీజీఎస్‌ఈసీ నుంచి 3, ఇండిపెండెంట్‌గా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారని పుర కమిషనర్ ఖాజా ఆరీఫుద్దీన్ వివరించారు.
ఆత్మకూర్‌లో 36 మంది..
ఆత్మకూర్: పుర పరిధిలోని 10 వార్డులకుగాను గురువారం కాంగ్రెస్‌పార్టీ తరుఫున 16 మంది, బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ఏడుగురు, స్వతంత్రులు ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇదివరకు 36 నామినేషన్లు దాఖలైనట్లు పుర కమిషనర్ చికినె శశిధర్ తెలిపారు.
అమరచింతలో 32..
అమరచింత: పుర ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ రెండోరోజు గురువారం జోరందుకుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రాత్రి 7.30 వరకు కొనసాగింది. సాయంత్రం 5 వరకు క్యూలో నిల్చున్న అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించడానికి సమయం పట్టిందని పుర కమిషనర్ తెలిపారు. కాగా గురువారం బీజేపీ నుంచి 9 మంది, సీపీఐ(ఎం) నుండి 4, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి ఆరుగురు, సీపీఐ నుంచి ఐదుగురు, స్వత్రంత్రులు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు.
కొత్తకోటలో..
కొత్తకోట రూరల్: కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో గురువారం 35 నామినేషన్లు దాఖలైనట్లు పుర కమిషనర్ సైదయ్య తెలిపారు. కాంగ్రెస్ నుంచి 12, బీఆర్‌ఎస్ నుంచి 13, బీజేపీ నుంచి 3, బీఎస్పీ నుంచి 2, టీఆర్‌పీ నుంచి ఒకరు, స్వతంత్రులు నలుగురు నామినేషన్లు వేశారు.


