కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైంది | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైంది

Jan 30 2026 6:05 AM | Updated on Jan 30 2026 6:05 AM

కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైంది

కాంగ్రెస్‌పై తిరుగుబాటు మొదలైంది

వనపర్తిటౌన్‌: కాంగ్రెస్‌పార్టీ అబద్ధాల వైపు కాకుండా నిజమైన అభివృద్ధి చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ వైపు ప్రజలు నిలబడాలని శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌ కోరారు. గురువారం జిల్లాకేంద్రంలోని మాజీ నిరంజన్‌రెడ్డి నివాసంలో ఆయనతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు పునాదులు, అసత్య ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు ప్రజల నుంచి తిరుగుబాటు మొదలైందని తెలిపారు. మహిళ నుంచి మొదలు అన్నివర్గాల ప్రజలు పుర ఎన్నికల వేధికగా నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిరంజన్‌రెడ్డి హయంలో జరిగిన అభివృద్ధి.. కాంగ్రెస్‌ పాలనలో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకొని ప్రజలు తీర్పునివ్వాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు విడతల వారీగా అమలు చేస్తామని చెప్పి నేటికీ నెరవేర్చడం లేదన్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అభిప్రాయాపడ్డారు.

పుర ఎన్నికల్లో లబ్ధికే సిట్‌ నోటీసులు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చి డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెర లేపిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ది భయపడే నైజం కాదని.. బరి గీసి కొట్లాడేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబులాంటి నాయకులే తెలంగాణవాదాన్ని అణిచివేసేందుకు, ఉద్యమస్ఫూర్తిని దెబ్బతీసేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొన్నారని వివరించారు. ఆయన కంటే సీఎం రేవంత్‌రెడ్డి మించినోడు కాదని.. కేసీఆర్‌ స్థాయిని పలుచన చేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న చిల్లర రాజకీయాలు చూసి ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి సానుకూలత ఉందని, కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఉందని తెలిపారు. ప్రజలు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని, వారి నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement