ఇంటింటా సంక్షేమం
జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా అడుగులు
● అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యం
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
● ఘనంగా 77వ
గణతంత్ర వేడుకలు
‘‘జిల్లాలో అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కాకుండా.. ప్రతి ఒక్కరికీ మెరుగైన విద్య, వైద్యం అందించడం.. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను అందరూ గౌరవించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలుచేస్తూ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరం పునరంకితమవుదాం.’’ – కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా పాల్గొని ఎస్పీ డి.సునీతారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కొత్తకాపు శివసేనారెడ్డిలతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి.. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించగా.. జిల్లాలో రూ. 126.34కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 85,237 మందికి రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్లు అందిస్తున్నట్లు వివరించారు. ఇందిరా మహిళాశక్తి పథకంతో మండల మహిళా సమాఖ్యల ద్వారా 10 బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వగా.. ప్రతినెలా దాదాపు రూ. 69వేల చొప్పున ఆదాయం లభిస్తుందన్నారు. అమరచింత, వనపర్తి మండలాలకు ‘కుసుమ్ ప్రాజెక్టు‘ ద్వారా 2 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్లు మంజూరైనట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా కొత్తకోట మండలం మిరాసిపల్లిలో పెట్రోల్‌బంక్ ఏర్పాటుకు ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయించిందన్నారు. రూ. 5కోట్లతో చేపట్టిన జిల్లా మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. జిల్లాలోని 1,22,472 మంది మహిళా సంఘ సభ్యులకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో 22,051 మందికి ఉచితంగా చికిత్సలు అందించేందుకు రూ. 57.37 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గృహజ్యోతి పథకంతో 83,882 మందికి జీరో బిల్లులు జారీ చేసి.. రూ.41.7 కోట్ల సబ్సిడీని అందించినట్లు తెలిపారు.
ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతుందన్నారు. జిల్లాలో 6,047 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా.. 73 శాతం నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 51 గృహాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని.. లబ్ధిదారులకు రూ. 81.71 కోట్ల బిల్లులు చెల్లించినట్లు కలెక్టర్ వివరించారు. చేయూత పథకంతో 70,909 మందికి ప్రతినెలా రూ. 17.61 కోట్ల పింఛన్లు అందిస్తున్నామన్నారు.
పంట రుణమాఫీ పథకం కింద జిల్లాలో మొత్తం 60,545 మంది రైతులకు రూ. 480.91 కోట్ల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకంతో 245 మంది నామినీల బ్యాంకు ఖాతాల్లో రూ. 12.25కోట్లు జమ చేసినట్లు వివరించారు. రైతుభరోసా పథకంతో వానాకాలం 2025 సీజన్‌లో 1.75 లక్షల మంది రైతులకు రూ. 205.93 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందన్నారు. 2025–26 సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వరిధాన్యం విక్రయించిన 30వేల మంది రైతులకు రూ.76.18 కోట్ల బోనస్ చెల్లించినట్లు తెలిపారు. వానాకాలంలో 395 కేంద్రాల ద్వారా 2.86 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 1,80,857 రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 10,847 కొత్త రేషన్ కార్డులతో పాటు 66,929 మంది అదనపు కుటుంబ సభ్యులను కూడా ఇదివరకే ఉన్న కార్డుల్లో చేర్చడం జరిగిందన్నారు.
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టెక్నాలజీ ద్వారా 1.70లక్షల టీబీ అనుమానిత కేసులను గుర్తించగా.. వారిలో 339 మందిని నోటిఫై చేయడం జరిగిందన్నారు. వీరికి సీఎస్‌ఆర్ ద్వారా పోషణ కిట్లు, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా మిషన్ మధుమేహ ద్వారా గతేడాది 19,643 మంది బాధితులను గుర్తించడం జరిగిందన్నారు.
ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ. 47.50 కోట్లతో చేపట్టిన వనపర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర), జూనియర్ కళాశాలల భవన నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నా యన్నారు. 2025–26 సంవత్సరానికి గాను పీఎంశ్రీ ర్యాంకింగ్‌లో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించిందన్నారు.
ఇంటింటా సంక్షేమం
ఇంటింటా సంక్షేమం


