పదిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం
ఖిల్లాఘనపురం: పదోతరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను నంబర్‌వన్ స్థానంలో నిలపాలని జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ కోరారు. గురువారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో మండల విద్యాధికారి జయశంకర్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల కోసం ‘లక్ష్య సాధన.. ప్రేరణ’ అనే అంశంపై ప్రముఖ సైకాలజిస్ట్ అడ్డిగ శ్రీనివాస్‌తో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మండల, జిల్లాస్థాయిల్లో పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించడంతో వారికి చదువుపై ఆసక్తి పెంపొందుతుందన్నారు. అనంతరం సైకాలజిస్ట్ అడ్డిగ శ్రీనివాసులు మాట్లాడుతూ.. విద్యార్థులు ఈ వయస్సులో వచ్చే మార్పులను కట్టడి చేసుకొని ఉపాధ్యాయులు చెప్పే ప్రతి విషయాన్ని విని అర్థం చేసుకోవాలన్నారు. వార్షిక పరీక్షలకు కేవలం 37 రోజులు మాత్రమే సమయం ఉందని.. సెల్‌ఫోన్, టీవీ, అనవసర ముచ్చట్లకు సమయం కేటాయించడంతో తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. చదువు అనేది జీవితాల్లో మార్పు తీసుకొస్తుందని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన విషయాలు విన్నవారు మాత్రమే భవిష్యత్‌లో ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అనంతరం శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ వారు విద్యార్థులతో కలిసి ‘చదువుకో తెలంగాణ’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాలల ప్రత్యేక అధికారులు లలిత, ప్రశాంతి, ఉపాధ్యాయులు, ఎంఆర్‌సీ సిబ్బంది, శ్రీరామ్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఏజీఎం సతీష్, బ్రాంచ్ మేనేజర్ రాజేష్‌కుమార్‌రెడ్డి మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.


