చెల్లని ఓట్లతో చిక్కులు..
ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో అధిక సంఖ్యలో ఓట్ల తిరస్కరణ
సాక్షి, నాగర్‌కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌తో పాటు మిగతా మున్సిపాలిటీల్లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల పెద్దసంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడం ఆశ్చర్యం కలిగించింది. అతి తక్కువ మెజార్టీతో పరాభావం పొందిన అభ్యర్థులు తమ ఓటమిలో చెల్లని ఓట్లు కూడా కారణంగా ఉన్నాయని అంచనా వేసుకుంటున్నారు. అలాగే చాలాచోట్ల అభ్యర్థుల కన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవికంగానే అభ్యర్థులు ఎవరూ నచ్చక నోటాకు ఓటేశారా, లేక గుర్తులపై అయోమయంతో నోటాపై ఓటు ముద్ర వేశారా? అన్న దానిపై అభ్యర్థులు చర్చించుకున్నారు.
గుర్తులు తెలియక తికమక..
ఈవీఎం ద్వారా నిర్వహించే ఎన్నికల్లో ఓట్ల తిరస్కరణకు అవకాశం ఉండదు. ఈవీఎం బ్యాలెట్‌పై నోటాకు మాత్రమే ఓట్లు పడే అవకాశం ఉంటుంది. కానీ బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించిన ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు తిరస్కరణకు గురికావడంతో అభ్యర్థులు ఆందోళన చెందారు. బ్యాలెట్‌పై సరైన గుర్తును ఎంచుకుని అదే గుర్తుపై ఓటు వేయడంలో చాలామంది ఓటర్లు పొరపాట్లు చేశారు. అయోమయంలో రెండు గుర్తులపై ముద్ర వేయడం, గుర్తులపై బొటనవేలితో ముద్ర వేయడం, బ్యాలెట్ పేపర్‌పై ఓటు వేయకుండా ఖాళీగా బాక్స్‌లో వేయడం కనిపించింది. అలాగే బ్యాలెట్ పేపర్‌లో ఒక గుర్తుపై వేసిన ఇంక్ ముద్ర మరో గుర్తుపై పడకుండా ఉండేందుకు పేపర్‌ను నిలువుగా మడత పెట్టాల్సి ఉంటుంది. కానీ కొందరు నిలువుగా కాక అడ్డంగా మడిచి బ్యాలెట్ వేయడంతో ఇంకు ముద్ర మరో గుర్తుపై కూడా పడి చాలా ఓట్లు చెల్లకుండా పోయాయి. తక్కువ మెజార్టీతో పోటాపోటీగా ఉన్న వార్డుల్లో చెల్లని ఓట్ల ప్రభావంతో అభ్యర్థులు ఆవేదనకు లోనయ్యారు.
పోలైనవి...1012, చెల్లనివి 216
మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు మొదటిసారిగా జరిగిన ఎన్నికలు చరిత్రాత్మకంగా నిలువనున్నాయి. ఈ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్‌లలో 58వ డివిజన్ ఏకగ్రీవం కావడంతో మిగిలిన 59 డివిజన్‌లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం 1012 ఓట్లు పోలవ్వగా.. అందులో 216 ఓట్లు చెల్లనివి నమోదు కావడం గమనార్హం. ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవడంలో ఎంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శించరనేది దీన్ని బట్టి తెలుస్తోంది. అత్యధికంగా 10, 25వ డివిజన్‌లలో 16 చొప్పున చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్‌పై పూర్తిస్థాయి అవగాహన ఉన్న ఉద్యోగులే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకుంటారు. పైగా వీరంతా ఎన్నికల విధుల్లో పాల్గొంటూ ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా నిర్వహిస్తారు. అలాంటి పోలింగ్ సిబ్బంది ఓటు వేసే పోస్టల్ బ్యాలెట్ ఓట్లలోనూ పెద్ద సంఖ్యలో చెల్లని ఓట్లు ఉండటం చర్చనీయాంశమైంది.
మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాలలో చెల్లని ఓట్లతో పాటు నోటాకు అధికంగా ఓట్లు
వీటి ప్రభావంతో అభ్యర్థుల భవితవ్యం తలకిందులు అయినట్టుగా అంచనాలు
పొరపాట్లు, తప్పిదాలతోనే అధికంగా చెల్లని ఓట్లు
మహబూబ్‌నగర్‌లో పోస్టల్ బ్యాలెట్‌లోనూ చెల్లని ఓట్లు
చెల్లని ఓట్లతో చిక్కులు..


