నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

వనపర్తి: ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు, స్కానింగ్‌ కేంద్రాలు క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌–2010 ప్రకారం ధరల చార్ట్‌లను ప్రదర్శించడంతో పాటు నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రైవేట్‌ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించి పలు దరఖాస్తులను సమీక్షించారు. 3 ఆస్పత్రులు, 3 క్లినిక్‌లు, ఒక డయాగ్నొస్టిక్‌ సెంటర్‌, 4 స్కానింగ్‌ కేంద్రాలకు దరఖాస్తులురాగా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని, సకాలంలో పునరుద్ధరించుకోవాలని సూచించారు. స్కానింగ్‌ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయొద్దన్నారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. శ్రీనివాసులు, డా. బాబు, ఆర్డీఎస్‌ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి పోలీస్‌

యాక్ట్‌ అమలు : ఎస్పీ

వనపర్తి: జిల్లాలో ఈ నెల 30 వరకు పోలీస్‌ యాక్ట్‌–1861 అమలులో ఉంటుందని ఎస్పీ సునీతరెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ సమావేశాలు నిర్వహించడం నిషేధమని పేర్కొన్నారు. ప్రజా జీవనానికి అంతరాయం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యకై నా చోటు లేదన్నారు. ‘30 పోలీస్‌ యాక్ట్‌‘ ఉల్లంఘనలకు చట్టంలో స్పష్టమైన శిక్షలు ఉన్నాయని, అనుమతి లేకుండా కార్యక్రమాలు చేపట్టిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందుగానే దరఖాస్తు చేసుకొని అనుమతి పొందాలని, ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలు నిలుస్తాయని, పోలీసుల చర్యలు ప్రజల రక్షణ కోసమేనని వివరించారు.

చట్టాలపై

అవగాహన అవసరం

వనపర్తిటౌన్‌: కాబోయే ఉపాధ్యాయులు చట్టాలపై అవగాహన కలిగి ఉండటంతో విద్యార్థులను సక్రమమైన మార్గంలో నడపగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వి.రజని అన్నారు. బుధవారం స్థానిక గాయత్రి బీఈడీ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు పాఠశాల దశ నుంచి చట్టాలపై అవగాహన పెంచుకుంటే భవిష్యత్‌లో ఎలాంటి తప్పులు చేయకుండా సమాజాభివృద్ధికి పాటుపడతారని వివరించారు. పోక్సో, ఎన్‌డీపీఎస్‌, బాల్య వివాహాలు, వినియోగదారుల రక్షణ చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రఘు, కళాశాల అధ్యాపకులు మల్లికార్జున్‌, మోహన్‌, సురేష్‌, వీరభద్రయ్య, నిరంజన్‌ వలి, నాగేంద్రం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ విజేత

పల్నాడు జట్టు

ఆత్మకూర్‌: మండలంలోని మూలమళ్లలో దివంగత దేశాయి సరళాదేవి జ్ఞాపకార్థం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల ఇన్విటేషన్‌ కబడ్డీ పోటీలు నిర్వహించారు. రెండ్రోజుల పాటు జరిగిన పోటీల్లో మొత్తం 10 జట్లు తలపడ్డాయి. చివరిరోజు మంగళవారం రాత్రి జరిగిన తుది పోరులో పల్నాడు జట్టు, హైదరాబాద్‌ జట్టు తలపడగా పల్నాడు జట్టు విజేతగా నిలిచింది. జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ దేశాయి పద్మజారెడ్డి విజేత జట్టుకు రూ.50 వేలు, హైదరాబాద్‌ జట్టుకు రూ. 40 వేలు నగదుతో పాటు జ్ఞాపిక అందజేశారు. మూడోస్థానంలో నిలిచిన మహబూబ్‌నగర్‌ జట్టుకు రూ.30 వేలు, నాలుగో బహుమతిగా బాపట్ల జట్టుకు రూ.20 వేలు, ఐదో బహుమతి కర్ణాటకకు రూ.15 వేలు, ఆరో బహుమతి మూలమళ్ల జట్టుకు రూ.10 వేలు, ఏడో బహుమతి గద్వాలకు రూ.6 వేలు, 8వ బహుమతి రంగారెడ్డి జిల్లా జట్టుకు రూ.5 వేలు, జ్ఞాపిక అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement