పండుగ వాతావరణంలో గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

పండుగ వాతావరణంలో గ్రామసభలు

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం నిర్వహించే గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. గ్రామ, వార్డు సభల నిర్వహణపై బుధవారం కలెక్టరేట్‌ నుంచి మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పుర కమిషనర్లతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామ, పుర వార్డుసభలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో టాం టాం వేయించాలన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఖర్చు చేసిన నిధులు తదితర వివరాలను గ్రామసభల్లో ప్రజలకు వివరించాలని కోరారు. ఆయా గ్రామాల్లో ఇచ్చిన రైతుభరోసా, పంట రుణమాఫీ, ధాన్యం సేకరణ, రైతులకు రూ.500 బోనస్‌, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ పొందిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు, రూ.500 సిలిండర్‌ తదితర వివరాలతో కూడిన కరదీపికలు తయారు చేయించి గ్రామసభకు వచ్చే ప్రతి ఒక్కరికి అందజేసి, లబ్ధిదారుల పేర్లు సైతం చదివి వినిపించాలని ఆదేశించారు. ఎవరైనా అర్జీలు ఇచ్చేవారు ఉంటే తీసుకునేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామసభకు ప్రజలు అత్యధికంగా వచ్చేలా చూడాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీడ, తాగునీటి సౌకర్యం, ముఖ్యమంత్రి సందేశం చూసేందుకు టీవీ తదితర మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ప్రతి గ్రామసభకు ప్రత్యేక అధికారిని నియమించామని.. ఉదయం 10 గంటలకు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని, సభ ఏ విధంగా నిర్వహించాలనే అంశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీపీఓ హరికృష్ణ, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, పుర కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement