పుర పీఠానికి పట్టు.. ! | - | Sakshi
Sakshi News home page

పుర పీఠానికి పట్టు.. !

Feb 15 2026 6:44 AM | Updated on Feb 15 2026 6:44 AM

పుర పీఠానికి పట్టు.. !

పుర పీఠానికి పట్టు.. !

వనపర్తిలో పోటాపోటీ.. సోమవారం ఉత్కంఠకు తెర..

అక్కా, తమ్ముడు ఏకమవుతారా ?

కొత్తకోటలో ఇద్దరి మధ్య పోటీ..

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు ఆఽధిక్యం

హంగ్‌తో ఉత్కంఠ రేపుతున్న

అమరచింత స్థానం

ఇన్‌చార్జి మంత్రి వాకిటితో మంతనాలు

అధిష్టాన నిర్ణయమే అంటున్న

వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి

చేజిక్కించుకునేందుకు ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

వనపర్తి పుర పీఠం దక్కించుకునేందుకు ఎన్‌ఎల్‌ఎన్‌ మాధవి రమేష్‌తో పాటు తమ సతీమణుల కోసం పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్‌, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బి.శ్రీనివాస్‌గౌడ్‌, బి.కృష్ణ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలతో వారికున్న సంబంధాలను ఉపయోగించుకొని చర్చలు జరుపుతున్నట్లు స్థానికంగా కాంగ్రెస్‌ నేతల్లో చర్చ వినిపిస్తోంది. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మద్దతు ఎన్‌ఎల్‌ఎన్‌ రమేష్‌కు ఉన్నట్లు సమాచారం.

వనపర్తి: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ హవా కొనసాగడంతో జిల్లాలోని ఐదు పురపాలికల్లో నాలుగింట స్పష్టమైన మెజార్టీ దక్కిన విషయం పాఠకులకు విధితమే. సోమవారం కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్ల ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అఽధికార పార్టీ కౌన్సిలర్లను క్యాంపునకు తరలించగా.. పుర పీఠం దక్కించుకునేందుకు సీనియర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్‌, ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు మేఘారెడ్డి, జీఎంఆర్‌, డీసీసీ చీఫ్‌ శివసేనారెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. కాగా.. హంగ్‌ ఏర్పడిన అమరచింత మున్సిపల్‌ చైర్మన్‌ పీఠంపై ఉత్కంఠ నెలకొంది.

పెబ్బేరులో బీసీ, ఓసీ..

పెబ్బేరు పుర పీఠం జనరల్‌కు కేటాయించడం.. కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ రావడంతో పార్టీ సీనియర్‌ నేత శ్రీనివాస్‌గౌడ్‌, తన భార్యకు అవకాశం ఇవ్వాలని ఎల్లారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇరువురిని ఎమ్మెల్యే బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఐదు వార్డులను దక్కించుకున్నందున ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఇబ్బంది కలిగే అవకాశం ఉందనే ఆలోచనలో ఎమ్మెల్యే తన ఎక్స్‌ అఫీషియో ఓటును అక్కడే వినియోగించుకునేందుకు దర ఖాస్తు చేసుకోవడం గమనార్హం. శ్రీనివాస్‌గౌడ్‌కు ఎమ్మెల్యే సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

మంత్రి ఇలాకాలో..

మంత్రి వాకిటి శ్రీహరి ఇలాకా అయిన ఆత్మకూరు మున్సిపల్‌ పీఠాన్ని అందరి ఏకాభిప్రాయంతో జుబేదాబేగంకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమెను చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తే మిగతా వారంతా సానుకూలంగా స్పందిచడం గమనార్హం. ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేకుండా చైర్‌పర్సన్‌ ఎంపిక జరిగే అవకాశం ఉంది.

సీల్డ్‌ కవర్లో పేర్లు..

స్థానికంగా ఎన్ని పైరవీలు చేసినా ప్రయోజనం లేదని.. పుర చైర్మన్లు ఎవరనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజునే విలేకర్ల సమావేశంలో స్పష్టం చేశారు. అక్కడి నుంచే సీల్డ్‌ కవర్‌లో పేర్లు వస్తాయని వివరించారు.

అమరచింత మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. బీజేపీ కౌన్సిలర్లను కాంగ్రెస్‌ లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎంపీ డీకే అరుణ ముందస్తుగా వారిని క్యాంపునకు తరలించినట్లు ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లను తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఏకమైతే పూర్తి మెజార్టీ వచ్చి చైర్మన్‌ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది.

బీసీ మహిళకు రిజర్వ్‌ చేసిన కొత్తకోట మున్సిపల్‌ పీఠాన్ని దక్కించుకునేందుకు అరుణ శ్రీనివాసులు, కృష్ణారెడ్డి భార్య పల్లవి ప్రయత్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో బీసీ కమ్యూనిటీగా ఉన్న తన భార్యకు అవకాశం ఇవ్వాలని కృష్ణారెడ్డి పట్టుబట్టినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డితో ఎవరికి వారు పైరవీలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

సోమవారం ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12 గంటలకు చైర్మన్‌, చైర్‌పర్సన్‌ ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆశావహుల పైరవీలు ఏ మేరకు ఫలిస్తాయో.. అదృష్టం ఎవరిని వరిస్తుందనే విషయం తెలియాలంటే అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement