‘పోస్టల్’ పోలింగ్‌కు సర్వం సిద్ధం
● జిల్లాలో 422 మంది దరఖాస్తుదారులు
● ఉదయం 10.30 నుంచి సాయంత్రం
5 వరకు
అమరచింత: పుర ఎన్నికల నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 5 పురపాలికల్లో 422 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగానికి ముందుస్తుగా దరఖాస్తు చేసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఆయా పురపాలికల్లో ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులకు సైతం..
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారు, దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నవారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం ఉంది. ఈసారి ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు తమ ఓటు హక్కుకోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు తహసీల్దార్లు ఇచ్చిన నివేదిక ప్రకారం ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారు సర్వీస్ ఓటు వినియోగించుకునేందుకు పోస్టాపీస్ ద్వారా ఇది వరకే పంపించారు.


