రోడ్డు భద్రత.. మహిళా సంఘాల బాధ్యత
కొత్తకోట రూరల్: గ్రామస్థాయిలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని.. తమ కుటుంబాలతో పాటు సమాజాన్ని కూడా ప్రమాదాల నుంచి రక్షించాలని ఎస్పీ సునీతరెడ్డి కోరారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలైవ్.. అరైవ్’ కార్యక్రమంలో భాగంగా 10వ రోజు మంగళవారం ఉదయం పెద్దమందడిలోని రైతువేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలు, విలేకర్లకు ‘అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కుటుంబంలోని భర్త, పిల్లలు, అన్నాదమ్ములు సురక్షితంగా ఇంటికి చేరాలంటే మహిళలు వారికి హెల్మెట్ వినియోగంపై నిరంతరం గుర్తుచేయాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, అది చట్టపరమైన నిబంధన మాత్రమే కాకుండా కుటుంబ ప్రాణాలను కాపాడే భద్రతా కవచమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణలో మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలిపారు. అనంతరం అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ సహకారంతో 65 హెల్మెట్లను పాత్రికేయులు, పోలీసు సిబ్బంది, మహిళలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంవీఐ సైదులు, కొత్తకోట సీఐ రాంబాబు, పెద్దమందడి ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, అయ్యపురెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ నిర్వాహకులు, సర్పంచ్ గంగమ్మ, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


