రైతులకు తప్పని యూరియా కష్టాలు
● గంటల తరబడి నిరీక్షించినా నిరాశే
● గోపాల్‌పేటలో రోడ్డెక్కి ఆందోళనకు దిగిన అన్నదాతలు
గోపాల్‌పేట: యూరియా కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కారు. శనివారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా యూరియా రాలేదని.. కనీసం అధికారులు టోకెన్లు కూడా జారీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ గోపాల్‌పేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట వనపర్తి – హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పీఏసీఎస్‌కు వచ్చిన యూరియా శుక్రవారం సాయంత్రం వరకు అయిపోయింది. శనివారం వస్తే ఇస్తామని అధికారులు చెప్పడంతో తెల్లవారుజామునే పీఏసీఎస్ వద్దకు రైతులు చేరుకున్నారు. తమ పట్టాదారు పాస్‌బుక్కులను లైన్‌లో పెట్టి యూరియా కోసం వేచి చూశారు. మధ్యాహ్నం వరకు యూరియా లోడ్ రాలేదు. కనీసం క్యూలో నిరీక్షించిన రైతులకు టోకెన్లు కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళనకు దిగారు. పీఏసీఎస్ సీఈఓ రామ్మోహన్‌రావు రైతులకు నచ్చజెప్పారు. మధ్యాహ్నం 3 గంటల వరకు యూరియా వస్తుందని చెప్పడంతో ధర్నా విరమించారు. కాగా, మధ్యాహ్నం తర్వాత ఈ–పాస్ మిషన్ పనిచేయకపోవడంతో వ్యవసాయాధికారులు 180 మంది రైతులకు టోకెన్లు ఇచ్చారు. వారికి మంగళవారం యూరియా అందిస్తామని తెలిపారు.
గంటల తరబడి పడిగాపులు
ఖిల్లాఘనపురం: మండలంలోని మామిడిమాడ సింగిల్‌విండో కేంద్రానికి శనివారం యూరియా వస్తుందని సమాచారం ఇవ్వడంతో తెల్లవారుజామునే వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం వద్ద భూ పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డు జిరాక్స్ లైన్‌లో పెట్టి గంటల తరబడి పడిగాపులు కాశారు. మధ్యాహ్నం 3 గంటలైనా యూరియా లోడ్ రాకపోవడంతో చాలా మంది రైతులు ఆకలితో అలమటించారు. ఇక చేసేది లేక అక్కడ ఉన్న సిబ్బంది రైతులకు టోకెన్లు ఇచ్చి పంపించారు.
రైతులకు తప్పని యూరియా కష్టాలు


