75.56 శాతం పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

75.56 శాతం పోలింగ్‌

Feb 12 2026 1:20 PM | Updated on Feb 12 2026 1:20 PM

75.56 శాతం పోలింగ్‌

75.56 శాతం పోలింగ్‌

జిల్లాకేంద్రంలో

ప్రధాన పార్టీల నేతల మధ్య వాగ్వాదం

11వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి అనుచరుడు డబ్బులు

పంచుతున్నారని వీడియోలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు

పెబ్బేరు 2వ వార్డులోతన ఓటు ఇతరులువేశారని ఓ ఓటరు ఆవేదన

బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తమైన

అభ్యర్థుల భవితవ్యం

వనపర్తి: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ చెదురు మదురు ఘటనలు మినహా.. మిగతా అంతా ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని 11వ వార్డు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి అనుచరుడు పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని బీఆర్‌ఎస్‌ శ్రేణులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అలాగే 18వ వార్డు నందిమళ్లగడ్డలోనూ.. ఇదే తరహాలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 33వ వార్డులో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య చిన్నపాటి ఘర్షణ నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పక్షాలను శాంతింపజేశారు.

● పెబ్బేరులోని 2వ వార్డులో హెచ్‌.చంద్రాయుడు అనే వ్యక్తి ఓటు వేసేందుకు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రాగా అప్పటికే ఆ ఓటు పోలయింది. తన ఓటు వేరొకరు ఎలా వేశారంటూ అధికారులను నిలదీయడంతో పాటు మీడియా ముందుకొచ్చి ఏజెంట్లు, అధికారులు గుర్తింపు కార్డు లేకుండా ఎలా అనుమతించారని ఆవేదన వ్యక్తం చేశారు.

● కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత పురపాలికల్లో పోలింగ్‌ ప్రక్రియ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ప్రశాంతంగా కొనసాగినట్లు అధికారులు వెల్లడించారు.

పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత బ్యాలెట్‌ బాక్సులను ఆయా పుర కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. స్ట్రాంగ్‌ రూముల వద్ద జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు కల్పించారు.

ఓటేసిన 88,738 మంది ఓటర్లు..

జిల్లాలోని ఐదు పురపాలికల్లో 1,17, 441 మంది ఓటర్లు ఉండగా.. 88,738 మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 75.56 శాతం ఓటర్లు ఓటేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధింగా అమరచింత పురపాలికలో అత్యధికంగా 83.58 శాతం.. అత్యల్పంగా వనపర్తిలో 71.51 పోలింగ్‌ అయినట్లు తెలిపారు.

ఓటుహక్కు వినియోగించుకున్న కలెక్టర్‌..

జిల్లాకేంద్రంలోని 9వ వార్డు మర్రికుంటలో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అందరితో పాటు క్యూలైన్‌లో నిలబడి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన 15, 23వ వార్డు, హరిజనవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 19, 21వ వార్డు పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేసి పోలింగ్‌ సరళిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

వెబ్‌కాస్టింగ్‌తో పరిశీలన..

కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్‌ సరళిని జిల్లా ఎన్నికల పరిశీలకురాలు లక్ష్మీబాయి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య తదితరులు పరిశీలించారు.

రేపు తేలనున్న

అభ్యర్థుల భవితవ్యం..

మున్సిపల్‌ ఎన్నికల హడావుడి బుధవారం పోలింగ్‌తో ముగిసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్‌ బాక్సుల్లో ఓటు రూపంలో వేసి నిక్షిప్తం చేశారు. శుక్రవారం ఎవరి భవిష్యత్‌ ఏమిటనేది తేలనుంది. ఓట్ల లెక్కింపునకు ఆయా పుర కేంద్రాల్లోనే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement