ఎవరి ధీమా వారిదే..! | - | Sakshi
Sakshi News home page

ఎవరి ధీమా వారిదే..!

Feb 13 2026 3:25 AM | Updated on Feb 13 2026 3:25 AM

ఎవరి ధీమా వారిదే..!

ఎవరి ధీమా వారిదే..!

సర్వేలపై భిన్నాభిప్రాయాలు..

వనపర్తి: పుర ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థులు ఎవరి ధీమాలో వారున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఆయా పుర కేంద్రాల్లోని స్ట్రాంగ్‌రూంల వద్దనే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఫలితాలు అధికారికంగా వెల్లడిస్తేనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అధికార కాంగ్రెస్‌పార్టీ జిల్లాలోని ఐదు పురపాలికలను చేజిక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తుండగా.. కొత్తకోట తమదేనంటూ బీఆర్‌ఎస్‌, ఆత్మకూర్‌లో కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. పుర ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షపార్టీ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లగా.. చైర్మన్‌ పీఠం కోసం బీజేపీతో సయోధ్య కుదుర్చుకునేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. అఽధికార పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, ఇద్దరు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షుడు జిల్లాలోని ఐదు పురపాలికల్లో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను ఎలాగైనా కాంగ్రెస్‌ ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికలు మునుపెన్నడూ చూడని విధంగా డబ్బు, మద్యంతో పాటు అఽధికార బలాన్ని ఉపయోగించినట్లు ప్రచారం సాగుతోంది. దీనికితోడు.. గ్రామీణప్రాంత నాయకులకు పుర వార్డుల ఇన్‌ఛార్జీ బాధ్యతలు అప్పగించి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆయా వార్డుల్లో మఖాం వేయించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు గతంలో ఎన్నడూ ఇవ్వనంత పార్టీ ఫండ్‌, మద్యం సరఫరా చేసినట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.

ఎక్స్‌–అఫీషియో ఓట్లకు ప్రణాళికలు..

పుర చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, బీజేపీ ఎంపీ అవకాశం ఉన్నచోట తమ ఎక్స్‌ అఫీషియో ఓటుహక్కును వినియోగించుకునేందుకు ముందస్తు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆత్మకూర్‌ పురపాలిక బీజేపీ ఖాతాలో వేసుకునేందుకు మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ తను ఓటు వేసేందుకు ఇక్కడికే వస్తానని బీజేపీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్‌పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఇదే తరహాలో ఆయా మున్సిపాలిటీల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. జిల్లాకేంద్రంలో పూర్తి మెజార్టీ కాంగ్రెస్‌ సాధిస్తుందని, పెబ్బేరు మున్సిపాలిటీ ప్రతిపక్షాలకు దక్కకుండా తమ ఖాతాలో వేసుకునేందుకు ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు తమ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గత, ప్రస్తుత పుర ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. గతంలో సర్వేలు, ఎగ్జిట్‌పోల్‌కు అటు ఇటుగా ఫలితాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఇంటలిజెన్స్‌ సైతం కచ్చితమైన అంచనాలు ఇవ్వలేని స్థితిలో ఓటరు నాడి ఉంది. పార్టీల అభ్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా స్వతంత్ర అభ్యర్థులు సైతం భారీ ఎత్తున ఖర్చు చేయడం, ఓటర్లకు తాయిలాలు అందించారు. దీంతో ఓటింగ్‌ ఎటువైపు మళ్లిందనే విషయాన్ని సీనియర్‌ నాయకులు సైతం అంచనా వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

అత్యధిక స్థానాలు

తమవేనంటున్న కాంగ్రెస్‌

ఖాతానైనా తెరుస్తామంటున్న ప్రతిపక్షాలు

నేడు తేలనున్న భవితవ్యం

సర్వేలపై భిన్నాభిప్రాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement