పుర ఎన్నికల్లో ఆర్‌ఓలదే కీలకపాత్ర
● అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి
● కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి: త్వరలో జరిగే పురపాలక ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో రిటర్నింగ్ అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎన్నికల సంఘం నియమాలు క్షుణ్ణంగా తెలిసి ఉండాలని, ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. పుర ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో ఉంటాయని, చాలా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ ప్రక్రియలో చాలా అనుమానాలు వస్తుంటాయని.. గుర్తులు, క్రమసంఖ్య కేటాయింపుల్లో తప్పులు దొర్లకుండా నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వివరించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థితో పాటు ప్రతిపాదకుడు, మరో వ్యక్తిని మాత్రమే రిటర్నింగ్ అధికారి గదిలోకి అనుమతించాలని.. నామినేషన్ పత్రంలో ఏమైనా తప్పులు, లోపాలు ఉంటే పరిశీలించి నోటీసు ఇవ్వాలన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.2,500 చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రాయితీ ఉంటుందని చెప్పారు. నామినేషన్ దాఖలు నుంచి స్క్రూటినీ, విత్‌డ్రా, గుర్తుల కేటాయింపు, ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, వనపర్తి పుర కమిషనర్ వెంకటేశ్వర్లు, ఆత్మకూర్, అమరచింత, కొత్తకోట, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్లు, శిక్షణ నోడల్ అధికారి రామమహేశ్వర్‌రెడ్డి, ట్రైనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి..
ప్రతి ఓటరు ఎన్నికల్లో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులు, ఐడీఓసీ సిబ్బందితో ఓటరు దినోత్సవంపై కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, పుర కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


