రాష్ట్రానికి కేంద్రం మొండి చెయ్యి
● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి
వాకిటి శ్రీహరి
ఆత్మకూర్: బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యారని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం రాత్రి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో సమావేశమయ్యారు. అనంతరం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రతి బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపుతోందని, రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తున్నది ఎంత? వస్తున్నది ఎంత అనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆత్మకూర్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని.. ఇప్పటికే రూ.400 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. ఆత్మకూర్ రెవెన్యూ డివిజన్ సాధించడమే లక్ష్యమని.. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి చేసి చూపామని వెల్లడించారు. హైలెవల్ వంతెన నిర్మాణంతో మహర్దశ రానుందని ప్రకటించారు. పుర ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి మరింత అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఎన్నికల ఇన్‌చార్జ్ జగ్గారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేష్, తులసీరాజ్, నల్గొండ శ్రీను, చెన్నయ్యసాగర్ పాల్గొన్నారు.


