గీత కార్మికుల హక్కులు పరిరక్షించాలి
వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల హక్కులు పరిరక్షించడంలో పూర్తిగా విఫలమైందని రాష్ట్ర గౌడ సంఘం నాయకుడు రామచంద్రయ్యగౌడ్ అన్నారు. హక్కుల పరిరక్షణకు ఈ నెల 17న హైదరాబాద్‌లో చేపట్టే నిరహార దీక్షకు వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దీక్షకు సంబంధించిన కరపత్రాలను స్థానిక సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బస్వరాజుగౌడ్, మోహన్‌గౌడ్, వెంకన్నగౌడ్, బాలగౌడ్, రామన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నల్లమలలో
ఆక్వా కల్చర్ సెంటర్
అచ్చంపేట: నల్లమలలో వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్ల వ్యయంతో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం అచ్చంపేట మండలం చంద్రసాగర్ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి కార్యక్రమం, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రూ.4 కోట్లతో అధునాతన టెక్నాలజీతో చంద్రసాగర్‌లో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసే చేపపిల్లలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు రూ.3 వేల కోట్లతో బడ్జెట్ రూపొందిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో పదేళ్లుగా చేపపిల్లల ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ ఏడాది రూ.123 కోట్లతో 88 కోట్ల చేపపిల్లలు కొనుగోలు చేసి 26 వేల చెరువుల్లో వదిలినట్లు వెల్లడించారు. అంచెలంచెలుగా రాష్ట్రంలో చేపపిల్లల కొనుగోలు తగ్గించి ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. అచ్చంపేట ముదిరాజ్ భవనం నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చేందుకు పోరాటం చేస్తామన్నారు. తనను అణగదొక్కే ప్రయత్నాలు ఎన్ని జరిగినా జంకలేదని.. మక్తల్‌లో చోటుచేసుకున్న బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య ఘటనలో తమ ప్రమేయం లేకపోయినా రాజకీయ రంగుపులిమేలా చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొడతామన్నారు. అంతకు ముందు రూ.18.21 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి వాకిటి శ్రీహరి శంకుస్థాపన చేశారు.
గీత కార్మికుల హక్కులు పరిరక్షించాలి


