బ్యాలెట్ ముద్రణలో జాగ్రత్తలు పాటించాలి
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణలో అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయమై గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి జిల్లాలోని పుర కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లు, కేటాయించిన గుర్తులను వార్డుల వారీగా సరి చూసుకోవాలన్నారు. బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, నాణ్యత తదితర అన్ని అంశాలను పరిశీలించాలని సూచించారు. అనంతరం వచ్చిన బ్యాలెట్ పేపర్లు స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపర్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పోలీస్ భద్రత కల్పించాలన్నారు. పోలింగ్ సిబ్బంది శుక్రవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. శుక్రవారం అన్ని పురపాలికల పరిధిలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు రెండోదఫా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. శిక్షణను అన్ని వసతులతో పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
8వ తేదీలోగా ఓటర్ స్లిప్పుల పంపిణీ..
బీఎల్వోలు, వార్డు అధికారుల ద్వారా ఓటర్లు స్లిప్పులు అందజేయాలని, పంపిణీ ప్రక్రియ 8వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. అభ్యర్థులకు వాహనాల అనుమతి పుర కమిషనర్ల ద్వారా జరగాలని, పార్టీ సమావేశాలు, ర్యాలీలకు పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. టెలీ కాన్ఫరెన్స్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య పాల్గొన్నారు.


