గణతంత్ర వేడుకలకు ముస్తాబు
విద్యుత్ దీపాల వెలుగులో కలెక్టరేట్
వనపర్తి: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సోమవారం గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశభక్తి ఉట్టిపేడలా మువ్వన్నెల జెండావిష్కరణ, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన కార్యక్రమాలతో పాటు పోలీస్ కవాతు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఉత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించేందుకు జాబితా సిద్ధంచేశారు. ప్రభుత్వ శాఖల ప్రగతిని వివరించేందుకు ఏర్పాటుచేసే ప్రత్యేక స్టాల్స్, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూర్చొని వేడుకలు తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ ఆదర్శ్ సురభి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పోలీసు కవాతు నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ సందేశం, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, సాంస్కృతిక పదర్శనలు, ప్రభుత్వశాఖల స్టాళ్ల సందర్శన, ప్రశంసా పత్రాల పంపిణీ చేయనున్నారు. కాగా, గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.


