వీబీజీ రామ్‌జీ చట్టంతో పేదలకు నష్టం
వనపర్తి రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టంతో పేదలకు నష్టం వాటిల్లుతుందని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కె.శివసేనారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి మండలం పెద్దగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమంటే.. సామాన్య ప్రజలపై బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందన్నారు. గతంలో ఉపాధి హామీ చట్టంలో కాంట్రాక్టర్లపై నిషేదం ఉండేదని.. కేంద్రం తెచ్చిన కొత్త చట్టంలో కన్వర్జేన్స్ పేరిట కాంట్రాక్టర్లకు ప్రవేశం కల్పించి దోపిడీకి తెరతీశారన్నారు. కేవలం కార్పొరేట్ సంస్థల లబ్ధికే బీజేపీ ప్రభుత్వం పరిమితమైందని.. రైతులు, కార్మికులు ,పేదల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. కొత్త చట్టంతో దళిత, ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. గ్రామీణ ప్రజల జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికై నా వీబీజీ రామ్‌జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు పుష్పలత, వాల్యానాయక్, ఉపసర్పంచ్ పోలికమ్మ, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, గుముడాల రాములు, శివకుమార్, రొయ్యల రమేశ్, శేఖర్‌రెడ్డి, బుచ్చిబాబు, శివయ్య, రవికుమార్, రమేశ్, ఇసాక్, నాగన్న, మల్లేష్, రాములు, వెంకటేశ్, ఆంజనేయులు ఉన్నారు.


