కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి ఊసే లేదు
వనపర్తిటౌన్: కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 25 నెలలు అవుతున్నా అభివృద్ధి ఊసే లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలో పట్టణ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 420 హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు, బీఆర్‌ఎస్ పాలన మధ్య భేదం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ అంటే అభివృద్ధి.. అభివృద్ధి బీఆర్‌ఎస్ అనే స్థాయిలో జిల్లాను అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధి ఊసెత్తని కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనుమరుగు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ను ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పట్టణ ప్రజల దశాబ్దాల కల రోడ్ల విస్తరణ, జిల్లాకేంద్రంగా ఏర్పాటు, పార్కుల సుందరీకరణ, చెరువుల ఆధునీకరణతో అన్నివిధాలా అభివృద్ధి చేశామన్నారు. ప్రస్తుత పాలకులు గాలి మాటలు మాట్లాడకుండా, గద్దెనెక్కేందుకు ఇచ్చిన హమీలను అమలుచేసి చూపించాలన్నారు. మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి స్వామిగౌడ్ జిల్లా కేంద్రానికి వస్తున్నారని.. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


