సీఎం కప్.. క్రీడాకారులకు గొప్ప వేదిక
గోపాల్‌పేట: గ్రామీణ క్రీడాకారులకు సీఎం కప్ గొప్ప వేదికని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండో ఎడిషన్‌లో భాగంగా గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అసెంబ్లీ నియోజకవర్గస్థాయి క్రీడోత్సవాలను వారు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ ఎంతో దోహదపడతుందన్నారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారిని గుర్తించి తగిన శిక్షణనిచ్చి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని.. మండల కేంద్రంలో త్వరలోనే ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ క్రీడల్లో మన దేశంలో తక్కువ పథకాలు సాధిస్తోందని, ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ గ్రామస్థాయి క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు సీఎం కప్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. గత ప్రభుత్వం బడ్జెట్‌లో క్రీడారంగానికి కేవలం రూ.350 కోట్లు కేటాయిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.850 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాబోయే బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించనుందని చెప్పారు. క్రీడలను గ్రామస్థాయి క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


