విద్యుత్ సమస్యల గుర్తింపునకే పల్లెబాట
పాన్‌గల్: గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించేందుకే పల్లెబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఏడీ శ్రీనివాసులు తెలిపారు. గురువారం మండలంలోని అన్నారం గ్రామంలో ట్రాన్స్‌కో ఏఈ చందన్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. బీసీకాలనీలో మూడో విద్యుత్ తీగ ఏర్పాటు, ఎస్సీకాలనీలో రేషన్ దుకాణం వెనుక ఉన్న విద్యుత్ స్తంభాలకు తీగల బిగింపు, ధర్మరాజుగడ్డలో ఇళ్ల నడుమ ఉన్న విద్యుత్ తీగల తొలగింపు, బస్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పడిన కాలనీలో విద్యుత్ లైన్లు, పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ బోరుబావులకు డీడీలు చెల్లించిన రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయాలనే సమస్యలను సర్పంచ్ వహీద్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.


