పుర ఎన్నికల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు
వనపర్తి: పురపాలిక ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీకి ముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్‌రెడ్డి హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్, ఎస్పీ సునీతారెడ్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని 80 వార్డులకుగాను 6 ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాలను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. పోలీస్‌శాఖ సహకారంతో ఈసీ నిబంధనల మేరకు అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
ఎన్నికల నియమావళి అమలులోకి..
పుర ఎన్నికల ప్రకటన వెలువడటంతో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని, అధికారులు నిష్పాక్షికంగా నిబంధనలకు లోబడి పని చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. పుర ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై మంగళవారం పుర కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సిబ్బందితో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురపాలికల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు, సిబ్బంది ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకుల ఫొటోలు, ఫ్లెక్సీలు, ఇతర రాజకీయ చిహ్నాలను 24 గంటల్లోగా, బహిరంగ ప్రదేశాల్లోని రాజకీయ పోస్టర్లు, కటౌట్లను 48 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. తదుపరి 24 గంటల్లో ప్రైవేట్ ప్రదేశాల్లోని రాజకీయ సంబంధిత ఫ్లెక్సీలు తీసివేయాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రిటర్నింగ్ అధికారులు బుధవారం ఉదయం 10.30 లోగా తమ వార్డులకు సంబంధించి ఫారం–1 ఎన్నికల నోటీస్, ఓటరు జాబితాను పబ్లిష్ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఓటరు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించొద్దని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన రిపోర్టులను వేగంగా టీ–పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేసేలా ఆపరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. రోజువారీ నివేదికలను ఎప్పటికప్పుడు పంపించేలా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ ఉమాదేవి, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎల్పీఓ రఘునాథ్, డిప్యూటీ సీఈఓ రామమహేశ్వర్‌రెడ్డి, సీపీఓ తదితరులు పాల్గొన్నారు.


