కమనీయం.. లక్ష్మీవేంకటేశ్వరుడి కల్యాణం
● పట్టువస్త్రాలు సమర్పించిన
ఎమ్మెల్యే దంపతులు
● జిల్లా నలుమూలల నుంచి
తరలివచ్చిన భక్తులు
ఖిల్లాఘనపురం: మండలంలోని గట్టుకాడిపల్లి (అంజనగిరి) శ్రీలక్ష్మీ అలవేలుమంగ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణం శుక్రవారం కనులపండువగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా రెండ్రోజుల పాటు స్వామివారికి అభిషేకం, ధ్వజారోహణం, గరుడ వాహనసేవ తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఆయన సతీమణి శారద స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువు జరిపించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను బంగారు ఆభరణాలు, రంగురంగుల పూలమాలలతో అందంగా అలంకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లకు పెళ్లి దుస్తులు తీసుకొచ్చారు. వేదమంత్రోచ్ఛారణల నడుమ బ్రాహ్మణులు కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు లోక నాయకుడి కల్యాణాన్ని తిలకించి భక్తి పారవశ్యంతో తరించారు. వచ్చిన భక్తులకు దాతలు ఆలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


