ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

Feb 9 2026 7:20 AM | Updated on Feb 9 2026 7:20 AM

ప్రశా

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

కొత్తకోట రూరల్‌: మున్సిపాలిటీ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి తెలిపారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయం, కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి పోలింగ్‌ సరళిని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్ల గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఓటు వేసిన వారి వివరాలను ఓటరు జాబితాలో స్పష్టంగా మార్క్‌ చేయాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి ఓటరు చేతి వేలికి తప్పనిసరిగా సిరా చుక్క అంటించాలని, పోలింగ్‌ ప్రక్రియ పారదర్శకంగా జరగాలని, ఇందుకోసం ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా వీడియో రికార్డింగ్‌ చేయాలని ఆదేశించారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం నమోదైన ఓట్ల వివరాలను సంబంధిత అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు తెలియజేయాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ యాదయ్య, ఆయా పురపాలికల కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దారు ఉన్నారు.

11న యథావిధిగా

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

వనపర్తిటౌన్‌: ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు కొన్ని కేంద్రాల్లో పూర్తిగాకపోవడంతో ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు ఈ నెల 11న సెలవు ఉన్నప్పటికీ యధావిధిగా కొనసాగుతాయని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి పురపాలికల పరిధిలో సెలవు ప్రకటించారని.. కాగా పరీక్షలు ఉన్న విద్యార్థులు ఆ రోజు హాజరుకావాలని సూచించారు.

36 మంది విద్యార్థులు గైర్హాజరు..

జిల్లాలోని 15 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు కొనసాగినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు 501 మంది విద్యార్థులకుగాను 486 మంది హాజరుకాగా, 15 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 602 మంది విద్యార్థులకుగాను 581 మంది హాజరుకాగా.. 21 మంది విద్యార్థులు రాలేదని చెప్పారు.

‘రాష్ట్ర పథకాలు కేంద్ర నిధులతోనే అమలు’

వనపర్తి రూరల్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కేంద్రమే నిధులు సమకూరుస్తోందని, వికసిత భారత్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని మహబూబ్‌నగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. పుర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పెబ్బేరులోని సుభాష్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు. పట్టణానికి ప్రధాన ఆదాయ వనరైన సంతను కబ్జా చేసిన వారికి ఓటు వేయొద్దని, సంతకే దక్కాలని పోరాడిన బీజేపీని గెలిపించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఆవాస్‌ యోజన కింద ఇళ్లు మంజూరు చేస్తే ఇందిరమ్మ పేరుతో అమలు చేస్తున్నారని విమర్శించారు. రేషన్‌ బియ్యం నుంచి ఇందిరమ్మ ఇళ్ల వరకు కేంద్ర నిధులతోనే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నిధులతో పట్టణాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల కన్వీనర్‌ పురుషోత్తంరెడ్డి, ఎన్నికల కన్వీనర్‌ నరేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు గౌని వేమారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌, పట్టణ అధ్యక్షుడు క్రాంతినాయుడు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా  పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ 1
1/1

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement