జోగుళాంబ జోన్ ప్రతిష్ట నిలబెట్టాలి
● స్పోర్ట్స్ నోడల్ అధికారి,
జిల్లా ఎస్పీ సునీతరెడ్డి
వనపర్తి: రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో జోగుళాంబ జోన్–7 క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చాలని జోనల్ నోడల్ అధికారి, ఎస్పీ సునీతరెడ్డి కోరారు. డీఐజీ ఎల్‌ఎస్ చౌహాన్ ఆదేశాల మేరకు జనవరిలో జోన్–7లోని పోలీసులకు క్రీడాపోటీలు నిర్వహించారు. ఫిబ్రవరి 17 నుంచి హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి ఎంపికై న ఐదుగురికి శనివారం ఎస్పీ స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్, బూట్లు అందజేసి మాట్లాడారు. క్రీడాపోటీలు పోలీస్ వ్యవస్థలోని క్రమశిక్షణ, సహనశక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు వ్యక్తిగత విజయానికే కాకుండా జోన్ గౌరవానికి కృషి చేయాలని, గెలుపు లక్ష్యం కావాలని కోరారు. నిరంతర సాధన, క్రమశిక్షణ, మానసిక దృఢత్వం విజయానికి మూల స్తంభాలని.. క్రీడా స్ఫూర్తి, పూర్తి నిబద్ధతతో పోటీల్లో పాల్గొనాలన్నారు. రాష్ట్రస్థాయి వేదికపై మెరుగైన ఫలితాలు సాధించి జోన్‌కు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, రిజర్వ్ సీఐలు శ్రీనివాస్, అప్పలనాయుడు, రిజర్వ్ ఎస్‌ఐలు వినోద్, మొగ్దుంబారీ, పోలీస్ క్రీడాకారులు, సిబ్బంది పాల్గొన్నారు.


