రోడ్డెక్కిన అన్నదాతలు
● భూ పరిహారం చెల్లించాలంటూ
నిరసన
● విరమించకపోవడంతో పక్కకు
లాగేసిన పోలీసులు
ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న అన్నదాతలకు నేటికీ పరిహారం అందకపోవడంతో ఆగ్రహించి శుక్రవారం ముంపు రైతుల కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వీరికి బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, నాయకులు ఆంజనేయులుగౌడ్, నల్లమద్ది రవీందర్‌రెడ్డి, బీజేపీ నాయకులు సాయినాథ్, బుచ్చిబాబుగౌడ్ మద్దతు తెలిపి మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణానికిగాను సుమారు 600 ఎకరాల భూ సేకరణకు ప్రభుత్వం నిర్ణయించగా.. ఇప్పటి వరకు 388 ఎకరాలకు అవార్డు ప్రకటించారు. 7 నెలలు గడుస్తున్నా నేటికీ పరిహారం చెల్లించడం లేదని.. సాగు నీరున్నా భూములు లేకపోవడంతో రైతులంతా వీధిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే పరిహారం చెల్లించడంతో పాటు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే మున్ముందు పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పరిహారం చెల్లించాలని నినాదాలు చేశారు. చాలా సమయం కావడంతో నిరసన విరమించాలని పోలీసులు కోరినా వినలేదు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గట్టుకాడిపల్లి లక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణానికి హాజరై తిరిగి వనపర్తికి వెళ్లే సమయం ఆసన్నం కావడంతో చేసేది లేక పోలీసులు వారిని పక్కకు లాగేశారు. కార్యక్రమంలో రైతులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


