బాల్య వివాహాల నియంత్రణ అందరి బాధ్యత
వనపర్తి: బాల్య వివాహాలు జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ (గ్రామీణాభివృద్ధి సంఘం) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బాల్య వివాహాల నిర్మూలన ప్రచార వాహనాన్ని ఎస్పీ డి.సునీతరెడ్డితో కలిసి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రచార వాహనం వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాలో పర్యటిస్తుందని, ప్రతి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 రోజుల పాటు తిరుగుతూ బాల్య వివాహాలతో కలిగే అనర్థాలు, చట్ట ప్రకారం పడే శిక్షలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తుందన్నారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరించాలని, చట్ట ప్రకారం తీసుకునే కఠిన శిక్ష గురించి వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. అనంతరం ఎస్పీ డి.సునీతరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్ 1098 లేదా డయల్ 100, 112 సమాచారం ఇవ్వాలని సూచించారు. బాల్య వివాహం జరిపించే తల్లిదండ్రులతో పాటు పెళ్లి తంతుకు హాజరైన ప్రతి ఒక్కరిపై కేసు నమోదవుతుందని తెలిపారు. జిల్లాలో ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం బాల్య వివాహాలు అరికట్టేందుకు రూపొందించిన ప్రతిజ్ఞ చేశారు. ఫెక్సీపై సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, ఆర్డీఎస్ కో–ఆర్డినేటర్ చిన్నమ్మ థామస్, ప్రోగ్రాం అధికారి సుచేత, సహాయ ప్రోగ్రాం అధికారి జావేద్ ఖురేషి, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీఆర్డీఓ ఉమాదేవి, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, డీసీపీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి


