ఓటు హక్కు విధిగా వినియోగించుకోవాలి
కొత్తకోట రూరల్: పుర ఓటర్లు ఎన్నికల్లో తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సందర్శించి బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సిబ్బంది తదితర వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి పోలీసు బందోబస్తు కల్పించామన్నారు. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలో ఉన్న ప్రతి ఓటరు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డు తీసుకురాని ఓటర్లకు ఓటు వేసే అవకాశం ఉండదనే విషయాన్ని ప్రతి ఓటరు గుర్తించాలని సూచించారు. ఆయన వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్, పుర కమిషనర్ సైదయ్య, ఇతర సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఓటు హక్కు ఉన్న ఉద్యోగులకు సెలవు..
వనపర్తి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పురపాలికల్లో ఓటరుగా నమోదై ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వారికి బుధవారం ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సంఘం సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని.. అర్హత ఉన్న ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.


