నామినేషన్ల స్వీకరణకు 11 కేంద్రాలు
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కేంద్రమైన వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. ప్రతి 3 వార్డులకు ఒక నామినేషన్ స్వీకరణ కేంద్రం చొప్పున మొత్తం 11 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం మున్సిపల్ కమిషనర్ ఎన్.వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు యూనుస్, శ్రీనివాసులు, ఉమామహేశ్వర్‌రెడ్డి, బాలరాజుతో కలిసి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖరారు చేశారు. అదే విధంగా 99 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేయగా.. అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లను ఎంపీడీఓ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. మొత్తం 139 బ్యాలెట్ బాక్స్‌లు సిద్ధంగా ఉన్నాయని కమిషనర్ తెలిపారు.


